బీబీసీ వెరిఫై: జెలియెన్‌స్కీ నియంత, ఆయనకు ప్రజామోదం లేదన్న ట్రంప్ మాటలు నిజమేనా?

ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, మాట్ మర్ఫీ, జేక్ హోర్టన్
    • హోదా, బీబీసీ వెరిఫై

రష్యాతో జరుగుతున్న యుద్ధానికి యుక్రెయినే అసలు కారణమంటూ అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఆరోపించినట్లుగా కనిపిస్తోంది. ఫ్లోరిడాలోని తన నివాసం నుంచి ఆయన యుక్రెయిన్‌పై వరుసగా పదునైన వ్యాఖ్యలు చేశారు.

ట్రంప్ విలేఖరులతో మాట్లాడుతూ, యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమీర్ జెలియెన్‌స్కీ పాపులారిటీ గురించి కూడా వ్యాఖ్యానించారు. యుక్రెయిన్‌లో షెడ్యూల్ చేసిన ఎన్నికలను మార్షల్ లా కారణంగా నిర్వహించలేదన్నారు. ఆ తర్వాత బుధవారం ఆయన మరిన్ని ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

ట్రంప్ చేసిన కొన్ని ఆరోపణలు, యుద్ధం గురించి సాధారణంగా రష్యా మాట్లాడే మాటలను తలపించాయి. దాదాపు మూడేళ్లుగా సాగుతున్న రష్యా-యుక్రెయిన్ సంక్షోభాన్ని ముగించేందుకు రియాద్‌లో రష్యా, అమెరికా అధికారుల బృందం భేటీ అయింది. ఇది జరిగిన కొన్ని గంటల తర్వాత ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.

రష్యా సృష్టించిన ఒక తప్పుడు సమాచార చట్రంలో ట్రంప్ జీవిస్తున్నారంటూ తర్వాత జెలియెన్‌స్కీ ఆరోపించారు.

బీబీసీ వెరిఫై బృందం ట్రంప్ వ్యాఖ్యలను పరిశీలించింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
జెలియెన్‌స్కీ

ఫొటో సోర్స్, Reuters

‘‘జెలియెన్‌స్కీ ఒక నియంత’’

యుక్రెయిన్‌లో 2019 నుంచి అధ్యక్ష ఎన్నికలు జరగలేదనే వాస్తవాన్ని ట్రంప్ తొలుత అందరి దృష్టికి తెచ్చారు. 2019లో జెలియెన్‌స్కీ అధికారంలోకి వచ్చారు. అంతకుముందు కమెడియన్ అయిన జెలియెన్‌స్కీకి ఎలాంటి రాజకీయ పునాది లేదు.

యుక్రెయిన్ లీడర్ జెలియెన్‌స్కీ ఎన్నికలు నిర్వహించకుండా నియంతలా వ్యవహరిస్తున్నారంటూ 'ట్రుత్ సోషల్' వేదికగా ట్రంప్ ఆరోపించారు.

జెలియెన్‌స్కీ అయిదేళ్ల పదవీకాలం 2024 మే నాటికి ముగియాల్సి ఉంది. 2022 ఫిబ్రవరిలో యుక్రెయిన్‌పై రష్యా దండెత్తినప్పటి నుంచి అక్కడ మార్షల్ లా అమలు అవుతోంది. అంటే ఎన్నికలను నిలిపివేశారు.

యుక్రెయిన్‌లో మార్షల్ లాను 2015లో రూపొందించారు. క్రిమియాను రష్యా స్వాధీనం చేసుకున్న కొంతకాలానికే ఈ చట్టం రూపొందింది.

2019 నాటి ఎన్నికలు పోటాపోటీగా జరిగాయని, ఆ ఎన్నికల్లో ప్రాథమిక స్వేచ్ఛలను గౌరవించారని ఓఎస్‌సీఈకు చెందిన స్వతంత్ర పరిశీలకులు అన్నారు.

ఆ ఎన్నికల రెండో రౌండ్ రన్ ఆఫ్‌లో జెలియెన్‌స్కీ 73 శాతం ఓట్లు గెలుచుకున్నారు.

రష్యాతో సంక్షోభం ముగిసిన తర్వాత కొత్త ఎన్నికలను నిర్వహిస్తామని జెలియెన్‌స్కీ హామీ ఇచ్చారు. ఎన్నికల్లో మళ్లీ ఆయన నిలబడతారా లేదా అనే విషయాన్ని ఇంకా ధ్రువీకరించలేదు.

యుక్రెయిన్‌లోని చాలా నగరాల్లో రష్యా దాడులు కొనసాగుతున్నందున, లక్షల మంది పౌరులు విదేశాలకు పారిపోవడం, రష్యా ఆక్రమణలో ఉన్నందున ఈ సంక్షోభం ముగియకముందే యుక్రెయిన్‌లో ఎన్నికలను నిర్వహించడం అసాధ్యమని కొంతమంది నిపుణులు అంటున్నారు.

పదవీకాలం ముగిసినందున అధ్యక్షుడిగా జెలియెన్‌స్కీ చట్టబద్ధతను రష్యా ప్రశ్నించింది. ఇది జరిగిన కొన్ని గంటల తర్వాత ట్రంప్ కూడా ఇదే అంశంలో జోక్యం చేసుకున్నారు. గత కొన్ని నెలలుగా రష్యా ఇదే వాదనను చేస్తోంది. జనవరి 28న, రష్యా మీడియాతో ఇంటర్వ్యూ సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ మాట్లాడుతూ జెలియెన్‌స్కీ 'చట్టవిరుద్ధ' అధ్యక్షుడు అని అన్నారు.

జెలియెన్‌స్కీని తక్కువ చేసి మాట్లాడటానికి రష్యా తరచుగా చేసే ఆరోపణ ఇది. ఇదే మాటని ట్రంప్ కూడా ప్రస్తావించారు. ''అది కేవలం రష్యా అనే మాట కాదు. నేను అదే అంటున్నా. ఇతర దేశాలు కూడా అదే అంటాయి'' అని ట్రంప్ అన్నారు.

సంక్షోభం నడుస్తున్న సమయంలో ఈ ఎన్నికల అంశాన్ని తీసుకురావడం పూర్తిగా బాధ్యతారహితమైన చర్య అని గతంలో జెలియెన్‌స్కీ అన్నారు.

వలేరీ జలునీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జెలియెన్‌స్కీ సమీప ప్రత్యర్థి, మాజీ ఆర్మీ చీఫ్ వలేరీ జలునీ

''ఆయనకు ప్రజామోదం 4 శాతమే ఉంది''

జెలియెన్‌స్కీ ప్రజామోదం 4 శాతానికి పడిపోయిందని కూడా ట్రంప్ వ్యాఖ్యానించారు.

ఈ మాటకు ఆధారాలను ఆయన ప్రస్తావించలేదు. కాబట్టి ఆయన ఏ మూలాన్ని ఉదహరిస్తున్నారో చెప్పడం కష్టం. దీనిపై స్పష్టత ఇవ్వాల్సిందిగా మేం వైట్ హౌజ్ వర్గాలను అడిగాం.

యుద్ధ కాలంలో కచ్చితమైన సర్వేలను నిర్వహించడం చాలా కష్టం. లక్షల మంది యుక్రెయిన్ పౌరులు పారిపోయారు. యుక్రెయిన్‌లో దాదాపు అయిదో వంతును రష్యా ఆక్రమించింది.

అయితే, టెలిఫోన్ ద్వారా కొన్ని సర్వేలు చేయడం సాధ్యమే. ఈ నెలలో చేపట్టిన ఒక సర్వేలో 57 శాతం మంది యుక్రెయిన్ ప్రజలు, అధ్యక్షుడిపై తమకు నమ్మకం ఉన్నట్లు పేర్కొన్నారని యుక్రెయిన్‌కు చెందిన కీయెవ్ ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషియాలజీ పేర్కొంది.

2023లో ఇలా చెప్పిన వారి సంఖ్య 77 శాతం కాగా, 2022 మే నెలలో 90 శాతం మంది తాము అధ్యక్షుడిని విశ్వసిస్తున్నట్లు తెలిపారు. దీని ప్రకారం చూస్తే అధ్యక్షుడి ప్రజాదరణ క్షీణించినట్లు తెలుస్తోంది.

మరికొన్ని పోల్స్ ప్రకారం చూస్తే, భవిష్యత్‌లో జరిగే ఏ ఎన్నికల్లోనైనా తొలి రౌండ్‌లో తన సమీప ప్రత్యర్థి, మాజీ ఆర్మీ చీఫ్ వలేరీ జలునీ కంటే జెలియెన్‌స్కీ వెనుకబడతారని, రన్ ఆఫ్‌లో వీరిద్దరూ తలపడతారని సూచిస్తున్నాయి.

ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో యుక్రెయిన్ ఎంపీ, జెలియెన్‌స్కీ విమర్శకుడు ఓలెస్కాండర్ డుబిన్‌స్కై టెలిగ్రామ్‌లో నిర్వహించిన ఒక పోల్‌ను , రష్యాలోని కొన్ని ప్రధాన మీడియా సంస్థలు ఉదహరించాయి. ఈ పోల్ ఫలితాలు ట్రంప్ వ్యాఖ్యలకు మద్దతుగా ఉన్నాయి.

డుబిన్‌స్కై మీద యుక్రెయిన్‌లో రాజద్రోహం అభియోగాలు నమోదయ్యాయి. రష్యా ఇంటెలిజెన్స్ తరఫున పనిచేస్తున్నట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. కానీ, వీటిని ఆయన ఖండించారు.

ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

'‘మీరసలు మొదలు పెట్టే ఉండకూడదు''

మంగళవారం రియాద్‌లో జరిగిన చర్చల్లో తమ ప్రాతినిధ్యం లేకపోవడం పట్ల యుక్రెయిన్ అధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే, యుక్రెయిన్ ఆందోళనను ట్రంప్ తోసిపుచ్చారు. యుద్ధాన్ని ముగించాలనుకుంటే, యుక్రెయిన్‌కు మూడేళ్ల సమయం ఉందని ట్రంప్ అన్నారు.

''అసలు మీరు ఇది మొదలు పెట్టి ఉండకూడదు'' అని ట్రంప్ అన్నారు.

రష్యాపై మొదట యుక్రెయినే యుద్ధానికి దిగిందని గతంలో క్రెమ్లిన్ వ్యాఖ్యానించింది.

''2014లో మొదట యుద్ధాన్ని ప్రారంభించింది వారే. ఆ యుద్ధాన్ని ఆపడమే మా లక్ష్యం. 2022లో కూడా మేం యుద్ధాన్ని మొదలుపెట్టలేదు'' అని 2024 ఫిబ్రవరిలో యూఎస్ టాక్ షో వ్యాఖ్యాత టకర్ కార్ల్‌సన్‌తో రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు.

యుద్ధాన్ని యుక్రెయిన్ ప్రారంభించలేదు. 2014లో క్రిమియాను స్వాధీనం చేసుకున్న తర్వాత, 2022 ఫిబ్రవరిలో యుక్రెయిన్‌పై రష్యా పూర్తి స్థాయి దండయాత్రను ప్రారంభించింది.

రష్యా అనుకూల యుక్రెయిన్ అధ్యక్షుడిని నిరసన ప్రదర్శనల ద్వారా తొలగించాక, క్రిమియాను రష్యా స్వాధీనం చేసుకుంది.

తూర్పు యుక్రెయిన్‌ను స్వాధీనం చేసుకున్న ప్రాక్సీ దళాలకు కూడా రష్యా మద్దతు ఇచ్చింది. కీయెవ్‌లో ఏర్పడిన కొత్త ప్రభుత్వం, రష్యన్ మాట్లాడేవారిపై వివక్ష చూపుతుందని, మారణహోమానికి పాల్పడుతుందని ఆరోపించింది. రష్యా వాదనలను అంతర్జాతీయ న్యాయస్థానం తిరస్కరించింది.

2014 తర్వాత జరిగిన సంఘర్షణను ముగించే లక్ష్యంతో కుదిరిన ఒప్పందాలు విఫలమయ్యాక, రష్యా 2021 తర్వాత యుక్రెయిన్‌తో సరిహద్దుల్లో భారీగా సైన్యాలను మోహరించడం ప్రారంభించింది.

పాశ్చాత్య అనుకూల వొలొదిమీర్ జెలియెన్‌స్కీ ప్రభుత్వ సైన్యాన్ని నశింపచేయడం, నేటోలో ఆ దేశం చేరకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా 2022 ఫిబ్రవరి 24న పుతిన్ దండయాత్రను మొదలుపెట్టారు.

యుక్రెయిన్ గత పార్లమెంటరీ ఎన్నికల్లో ఫార్ రైట్ అభ్యర్థులకు దక్కిన మద్దతు 2 శాతం. ఇక్కడ జెలియెన్‌స్కీ యూదుడు అనే విషయాన్ని గమనించాలి. ఆయన పార్టీని మధ్యేవాద (సెంట్రిస్ట్) పార్టీగా పరిగణిస్తారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)