ఫాల్స్ కిల్లర్‌ వేల్స్‌: ఇవి ఒడ్డుకు ఎందుకు వచ్చాయి, వీటిని కాల్చి చంపాలని ఎందుకనుకుంటున్నారు?

ఫాల్స్ కిల్లర్‌ వేల్స్‌

ఫొటో సోర్స్, Tasmania Department of Environment

    • రచయిత, టిఫనీ టర్న్‌బుల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఆస్ట్రేలియాలోని టాస్మానియా దీవిలో ఓ మారుమూల తీరం వద్ద పెద్ద ఎత్తున చిక్కుకుపోయి అవస్థ పడుతున్న 90 'ఫాల్స్ కిల్లర్‌ వేల్స్‌'కు కారుణ్య మరణం ప్రసాదించాలని అధికారులు నిర్ణయించారు. 'ఫాల్స్ కిల్లర్ వేల్స్' అనేవి డాల్ఫిన్ జాతికి చెందిన జంతువులు.

సంక్లిష్ట పరిస్థితుల కారణంగా వీటిని కాపాడటం అసాధ్యమని అక్కడికి చేరుకున్న నిపుణుల బృందం చెప్పింది.

టాస్మానియా దీవి వాయువ్య మూలన ఉన్న ఆర్థర్ నది ఒడ్డుకు 157 'ఫాల్స్ కిల్లర్‌ వేల్స్‌' కొట్టుకు వచ్చాయి. అక్కడికి చేరిన కొద్దిసేపటికే 67 చనిపోయాయి. దీంతో మిగిలిన 90 'ఫాల్స్ కిల్లర్‌ వేల్స్‌'కు కారుణ్యమరణం ప్రసాదించాలని అధికారులు నిర్ణయించారు.

టాస్మానియాలో ఇటీవల సంవత్సరాలలో తిమింగలాలు కొట్టుకొచ్చిన సంఘటనలు చాలానే చోటుచేసుకున్నాయి. 2020లో ఇక్కడ భారీ సంఖ్యలో తిమింగలాలు కొట్టుకు వచ్చాయి. కానీ, గడిచిన 50 ఏళ్లలో 'ఫాల్స్ కిల్లర్‌ వేల్స్‌' ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడూ కొట్టుకు రాలేదు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
బినాలాంగ్ బే, టాస్మానియా, ఆస్ట్రేలియా

ఫొటో సోర్స్, Getty Images

6 మీటర్లు, 1.5 టన్నుల బరువు

'ఫాల్స్ కిల్లర్ వేల్స్' సాంకేతికంగా ప్రపంచంలోనే అతిపెద్ద డాల్ఫిన్ జాతికి చెందినది. ఓర్కా(కిల్లర్ వేల్)తో దగ్గరి పోలికలు ఉంటాయి. ఇవి 6 మీటర్లు (19 అడుగులు) వరకు పెరుగుతాయి. 1.5 టన్నుల బరువు ఉంటాయి.

ఈ 'ఫాల్స్ కిల్లర్ వేల్స్' ఇప్పటికే తీరం వద్ద 24 నుంచి 48 గంటలుగా ఉన్నాయని, ఇవి తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయని అధికారులు బుధవారం చెప్పారు.

తన కుమారుడు రాత్రి వేళ షార్క్ చేపల వేటకు వెళ్లిన సందర్భంలో ఒడ్డుకు కొట్టుకువచ్చిన ఫాల్స్ కిల్లర్ వేల్స్ గుంపును గమనించి తనకు చెప్పడంతో బుధవారం ఉదయం అక్కడకు వెళ్లినట్టు స్థానిక నివాసి జోసెలిన్ ఫ్లింట్ ఆస్ట్రేలియన్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్‌కు చెప్పారు.

'అక్కడ వాటి కళ్లు సాయం చేయమని అభ్యర్థిస్తున్నట్టుగా కనిపించాయి'' అని చెప్పారు.

''నిజంగా అది చాలా భయంకరమైనది'' అని ఆయన చెప్పారు.

ఎందుకు చంపుతున్నారు?

'ఫాల్స్ కిల్లర్ వేల్స్' చిక్కుకున్న ప్రాంతం లాన్‌సెస్టన్ సిటీకి 300 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రదేశానికి దారీతెన్ను లేదని, సరైన రవాణా సదుపాయాలు లేవని, రక్షణ పరికరాలను తరలించడం సాధ్యమయ్యే పని కాదని సముద్ర జీవశాస్త్రవేత్త క్రిస్ కర్లియన్ మీడియాకు చెప్పారు. ఇది అత్యంత క్లిష్టమైన ప్రాంతమని ఆయన చెప్పారు.

''ఈ ప్రాంతానికి ఉన్న మార్గం నిటారుగా రాళ్లతో ఉంటుంది. ఆ దారిలో ఒకే వాహనం వెళుతుంది. అక్కడ, నాలుగు చక్రాల వాహనాలు లభిస్తాయి కానీ, పెద్దగా ఉండవు'' అని తెలిపారు.

'ఫాల్స్ కిల్లర్ వేల్స్'‌ను ఒడ్డు నుంచి తిరిగి సముద్రంలోకి పంపేందుకు అనువైన వాతావరణ పరిస్థితులు లేవు. అధికారులు ఓ రెండింటిని సముద్రంలోకి పంపడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.

ఎగసిపడే అలలను దాటి ఇవి ఈత కొట్టలేవు, అందుకే అవి వెనక్కు కొట్టుకువచ్చేస్తున్నా యని టాస్మానియా ఉద్యానవనాలు, వన్యప్రాణి సేవలకు చెందిన షెల్లీ గ్రహం చెప్పారు.

మరో రెండురోజులపాటు వాతావరణం ఇలాగే ఉంటుందనే అంచనాల నడుమ పశువైద్య నిపుణులు వీటికి కారుణ్య మరణం ప్రసాదించాలనే కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నారు.

''ఇవి ఇక్కడ ఎంత ఎక్కువసేపు ఉంటే అంత ఎక్కువ బాధను అనుభవిస్తాయి. ప్రత్యామ్నాయ పద్ధతులన్నీ విఫలమయ్యాయి. కారుణ్యమరణమనేది చివరి ఎంపిక'' అని డాక్టర్ కార్లైన్ చెప్పారు.

వీటిని కాల్చి చంపే పని బుధవారం మొదలై గురువారం కూడా కొనసాగుతుందని భావిస్తున్నారు. అధికారులు ఈ కళేబరాలను ఏం చేయాలనే విషయమై కసరత్తు చేస్తున్నారు. ఈ ప్రదేశం ఆదిమవాసులకు ముఖ్యమైన సాంస్కృతిక వారసత్వం కలిగినది కావడంతో జాగ్రత్తగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. కళేబరాలను తొలగించడానికి ప్రయత్నించకుండా ప్రకృతి తన పని తాను చేసుకుపోయేలా చేయడం ఉత్తమమని ఒక అధికారి సూచించారు.

సమీపంలో పొదలు తగలబడుతుండటం, పరిమిత రహదారి సదుపాయం కారణంగా ప్రజలు ఇక్కడకు రాకుండా ఉండటమే మంచిదని అధికారులు సూచించారు.

పైలట్ వేల్స్

ఫొటో సోర్స్, BILAL RASHID/REUTERS

ఈ ప్రాంతంలోనే ఎక్కువ

ఆస్ట్రేలియాలో టాస్మానియా పశ్చిమ తీరప్రాంతంలోనే ఎక్కువగా వేల్స్ తీర ప్రాంతానికి కొట్టుకొస్తుంటాయి.

టాస్మానియాలోని మాక్వారీ హార్బర్ వద్ద 2020లో సుమారు 470 పైలట్ వేల్స్ బీచ్‌లో చిక్కుకున్నాయి. వాటిని రక్షించేందుకు ప్రయత్నించినా దురదృష్టవశాత్తు అందులో 350 చనిపోయాయి. 2022లోనూ మరో 200 వేల్స్ కూడా ఇక్కడే చిక్కుకుపోయాయి.

వేల్స్ సంఘజీవులు. అవి పెద్ద ఎత్తున గుంపులుగుంపులుగా ప్రయాణిస్తుంటాయి. వాటి మధ్య స్థిరమైన సమాచార ప్రసారం ఉంటుంది.

ఇవి ఒడ్డున ఎందుకు చిక్కుకుపోతాయనే విషయంపై అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. అవి చేపల్లాంటి ఆహారాన్ని వేటాడుతూ ఒడ్డుకు సమీపంలోకి వచ్చాక దిక్కుతోచని స్థితిలోకి చేరడం కావచ్చు. లేదంటే ఒక వేల్ పొరపాటున దారి తప్పితే దాన్ని అనుసురించే మిగతావి కూడా అదే బాటలో ప్రయాణించి ఒడ్డుకు వస్తుంటాయనే వాదనా ఉంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)