స్టాక్ మార్కెట్ల పతనం వేళ ‘సిప్’లో పెట్టుబడులు కొనసాగించాలా, వద్దా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అజిత్ గాధ్వి
- హోదా, బీబీసీ ప్రతినిధి
గతేడాది భారత స్టాక్ మార్కెట్లలో మొదలైన పతనం ఇంకా ఆగలేదు. లక్షలాది మంది పెట్టుబడిదారులు తమ డబ్బు కోల్పోయారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనల్డ్ ట్రంప్ విజయం తర్వాత ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి నెలకొంది. డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి రికార్డు స్థాయిలో కనిష్ట స్థాయికి చేరుకుంది, కంపెనీల త్రైమాసిక ఫలితాలు కూడా ఆందోళనలకు కారణమయ్యాయి.
2024 సెప్టెంబర్‌లో 86,000 పాయింట్లను తాకిన బీఎస్ఈ సెన్సెక్స్ ఇపుడు క్షీణిస్తోంది. ఫిబ్రవరి 18న 75,783 పాయింట్ల వద్ద ట్రేడయింది.
ఇటీవల సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా ప్రతినెలా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్లు కూడా ఆందోళన చెందుతున్నారు. ఇటీవలి నెలల్లో వారి పెట్టుబడుల విలువ కూడా తగ్గుముఖం పడుతుండటం చూసి ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారు. కొందరు రెడ్ కేటగిరీలో కూడా పడిపోయారు.
దీంతో ఇన్వెస్టర్ల కోసం బీబీసీ ఆర్థిక నిపుణులతో మాట్లాడిండి. ఈ పరిస్థితిలో సిప్‌లో పెట్టుబడి పెట్టాలా? వద్దా అని తెలుసుకోవడానికి ప్రయత్నించింది.


ఫొటో సోర్స్, Getty Images
సిప్ కొనసాగించాలా?
ఇన్వెస్టర్లు సిప్‌లను మానుకోవడానికి లేదా మూలధనాన్ని ఉపసంహరించుకోవడానికి ఇది సరైన సమయం కాదని, సాధ్యమైతే ఇంకా ఎక్కువ పెట్టుబడి పెట్టాలని మ్యూచువల్ ఫండ్స్ నిపుణులు సూచిస్తున్నారు.
"రాబోయే 12 నెలలకు సిప్ మొత్తాన్ని రెట్టింపు చేయాలని నా సలహా. 13వ నెల నుంచి పెట్టుబడిని తగ్గించుకున్నా పర్లేదు" అని అహ్మదాబాద్‌కు చెందిన ఆర్థిక సలహాదారు మిథున్ జాతల్ బీబీసీతో అన్నారు.
"స్టాక్ మార్కెట్ పడిపోయినా, సిప్‌ల రాబడి ప్రతికూలంగా ఉన్నా భయపడాల్సిన అవసరం లేదు" అని ఆయన చెప్పారు.
"బంగారం ధరలు తగ్గినప్పుడు, బంగారాన్ని కొనుగోలు చేస్తాం. భూమి లేదా ఇళ్లు చౌకగా మారినప్పుడు రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టాం. స్టాక్ మార్కెట్లు క్రాష్ అయినప్పుడు సిప్‌ని ఎందుకు ఆపాలి?" అని మిథున్ అన్నారు.
"మ్యూచువల్ ఫండ్‌లో సిప్‌ని ప్రారంభిస్తే మొదటి ఐదేళ్లు యూనిట్లు కూడబెట్టుకోవడంపై దృష్టి పెట్టాలి. తరువాత ఫండ్ విలువ గురించి ఆలోచించాలి" అని ఆయన సలహా ఇస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
"షేర్ మార్కెట్ పడిపోయినా, SIPలు ప్రతికూల రాబడిని ఇస్తున్నా, మీరు మీ ఆర్థిక లక్ష్యాలను దృష్టిలో ఉంచుకోవాలి కానీ, మార్కెట్ ట్రెండ్‌లను కాదు" అని జైపూర్‌కు చెందిన సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ వినోద్ ఫోగ్లా చెప్పారు.
"స్టాక్ మార్కెట్ పతనం కొత్త విషయం కాదు. కోవిడ్ కాలంలో షేర్ మార్కెట్లు 38 శాతం పడిపోయాయి, తరువాత పరిస్థితి మెరుగుపడింది. అందువల్ల క్రమశిక్షణ, స్థిరత్వంతో పెట్టుబడి పెట్టేవారు ఖచ్చితంగా మ్యూచువల్ ఫండ్స్‌లో డబ్బు సంపాదిస్తారు" అని వినోద్ తెలిపారు.
''షేర్ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ అనేది దీర్ఘకాలికం. ఈ భయాందోళనలు స్వల్పకాలికమైనవే. అందుకే ఇన్వెస్టర్లు ఆందోళన చెందే బదులు ఎక్కువగా సిప్‌లు చేయాలి. ప్రస్తుతం సిప్‌లను ఆపివేసినా లేదా యూనిట్లు అమ్మి క్యాపిటల్‌ను విత్‌డ్రా చేసినా తప్పుచేసినట్లే'' అని ఆయన అన్నారు.
వినోద్ ఫోగ్లా కూడా సిప్‌లను క్లోజ్ చేయడానికి లేదా మూలధనాన్ని ఉపసంహరించుకోవడానికి బదులుగా వాటిలో ఎక్కువ పెట్టుబడి పెట్టాలని సలహా ఇస్తున్నారు.
"అంతేకాకుండా, మీ దగ్గర అదనపు డబ్బు ఉన్నా, బోనస్ లేదా ఇన్సెంటివ్ పొందినా దానిని సిప్‌లో పెట్టండి" అని వినోద్ సూచిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎన్ని రోజులు ఉంచాలి?
"దేశంలో సాధారణంగా 100 మంది పెట్టుబడిదారులలో 18 శాతం మంది ఐదు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం సిప్ వేస్తారు. 3 శాతం మంది మాత్రమే పదేళ్ల పాటు సిప్ నిర్వహిస్తారు. మీరు నిజంగా సంపాదించాలనుకుంటే పెట్టుబడిని ఇంకా ఎక్కువ కాలం ఉంచాలి" అని మిథున్ అన్నారు.
"రియల్ ఎస్టేట్‌లో చాలామంది తమ పెట్టుబడిని 40 సంవత్సరాలు ఉంచుతారు. అంతేకాదు, ప్రజలు బంగారాన్ని ఎక్కువగా విక్రయించరు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్)లో పెట్టుబడిని తప్పనిసరిగా 15 సంవత్సరాల పాటు కొనసాగించాలి. ప్రతి ఐదేళ్ల తర్వాత దానిని పొడిగించవచ్చు. కాబట్టి, మంచి రాబడిని పొందడానికి పెట్టుబడి ఎక్కువ రోజులుండటం అవసరం" అని ఆయన సూచించారు.
కాబట్టి సిప్‌లో ఎంతకాలం పెట్టుబడి పెట్టాలి? అని మిథున్ జాతల్‌ను అడిగితే.. 'సాధ్యమైనన్ని ఎక్కువ సంవత్సరాలు' అని బదులిచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images
స్టాక్ మార్కెట్ హెచ్చుతగ్గుల సమయంలో ఏం చేయాలి?
మీరు మ్యూచువల్ ఫండ్‌లో సిప్ చేస్తున్నట్లయితే, మార్కెట్ హెచ్చు తగ్గులతో సంబంధం లేకుండా తక్కువ ధరకు వీలైనంత ఎక్కువ యూనిట్లను కొనుగోలు చేయడంపై దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.
మిథున్ మాట్లాడుతూ "మార్కెట్ ప్రతి ఎనిమిదేళ్లకు ఇటువంటి క్షీణ చక్రంలోంచి వెళుతుంది. 1992లో హర్షద్ మెహతా స్కామ్ సమయంలో మార్కెట్ కుప్పకూలింది. 2000 సంవత్సరంలో Y2K బబుల్ కారణంగా మార్కెట్ పడిపోయింది. 2008లో సబ్-ప్రైమ్ సంక్షోభంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. మరో ఎనిమిదేళ్ల తర్వాత నోట్ల రద్దు, కోవిడ్ కారణంగా మార్కెట్ షేర్లు క్షీణించాయి. పతనమనేది పెద్ద విషయం కాదు, ఇది మంచి కొనుగోలు అవకాశాన్ని అందిస్తుంది" అని అన్నారు.
మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పెట్టుబడి పెట్టినప్పుడు, వారివారి లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని కాలపరిమితిని నిర్ణయించుకోవాలని మిథున్ సూచించారు.
"మీకు మూడేళ్లలో డబ్బు అవసరమైతే డెట్ ఫండ్‌లలో సిప్‌లు చేయండి. మూడు నుంచి ఐదేళ్ల ఆర్థిక లక్ష్యం ఉంటే.. డెట్, ఈక్విటీ ఫండ్‌ల మిశ్రమంగా ఉండే హైబ్రిడ్ ఫండ్‌లలో పెట్టండి. వీటిలో బ్యాలెన్స్‌డ్ హైబ్రిడ్ ఫండ్‌లు, అగ్రెసివ్ ఫండ్‌లు, ఈక్విటీ సేవింగ్స్ ఫండ్ ఉంటాయి'' అని ఆయన అన్నారు.
ఐదు నుంచి ఏడు సంవత్సరాల ఆర్థిక లక్ష్యం ఉంటే, పెద్ద క్యాప్ సిప్‌లలో పెట్టుబడి పెట్టాలని చెప్పారు.
మిథున్ మాట్లాడుతూ "మీరు 7 నుంచి 10 సంవత్సరాల వరకు పెట్టుబడి పెట్టాలనుకుంటే.. ఫ్లెక్సీ-క్యాప్, మల్టీ-క్యాప్, లార్జ్-క్యాప్ ఫండ్‌లలో పెట్టవచ్చు. 10 నుంచి 15 సంవత్సరాల వరకు పెట్టాలనుకుంటే మిడ్-క్యాప్ ఫండ్‌లను ఎంచుకోండి. 15 ఏళ్ల కంటే ఎక్కువ ఆర్థిక లక్ష్యం ఉంటే.. స్మాల్, మైక్రో-క్యాప్ ఫండ్లలో పెట్టుబడి పెట్టండి" అని సూచించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎన్ఎఫ్ఓలో పెట్టుబడి పెట్టొచ్చా?
అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (ఏఎమ్ఎఫ్ఐ) డేటా ప్రకారం.. 2025 జనవరిలో 12 ఎన్‌ఎఫ్‌ఓ(న్యూ ఫండ్ ఆఫర్)లు ప్రారంభమయ్యాయి. ఇవి మొత్తం రూ. 4,544 కోట్లు సేకరించాయి.
ఈ 12 ఎన్‌ఎఫ్‌ఓలలో ఐదు ఈక్విటీ ఫండ్‌లు, రెండు డెట్ ఫండ్‌లు, నాలుగు ఇండెక్స్ ఫండ్‌లు, ఒక ఈటీఎఫ్ ఉన్నాయి.
ఎన్‌ఎఫ్‌ఓల పనితీరుపై ఎలాంటి ట్రాక్ రికార్డ్ లేదు కాబట్టి ఇపుడే వాటిలో ఇన్వెస్ట్ చేయడం తొందరపాటని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడ్డారు.
కనీసం ఎనిమిదేళ్ల ట్రాక్ రికార్డ్‌తో బాగా స్థిరపడిన ఫండ్‌ను ఎంచుకోవాలని, ప్రస్తుతం NFOలకు దూరంగా ఉండాలని మిథున్ సూచించారు.
"మీ పోర్ట్‌ఫోలియోలో విలువ జోడింపు ఉంటే తప్ప ఎన్‌ఎఫ్‌ఓలలో పెట్టుబడులతో ప్రయోజనం ఉండదు. మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటున్న ఎన్ఎఫ్ఓ ఇప్పటికే మీ పోర్ట్‌ఫోలియోలో ఉంటే, అది ఓవర్‌ల్యాప్ అవుతుంది" అని వినోద్ ఫోగ్లా అన్నారు.
"మ్యూచువల్ ఫండ్ కంపెనీలు కొత్త స్కీమ్‌లతో ముందుకు వస్తున్నాయి. వాటిలో చిక్కుకోకుండా బలమైన, విభిన్నమైన పోర్ట్‌ఫోలియోను నిర్మించుకోవాలి" అని ఆయన సూచించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎలాంటి ఫండ్స్ ఎంచుకోవాలి?
థీమాటిక్ ఫండ్స్‌కు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఫార్మా, డిఫెన్స్, ఎఫ్‌ఎంసీజీ మొదలైన థీమ్ ఆధారిత ఫండ్స్‌లో పెట్టుబడి మంచిది కాదని చెబుతున్నారు.
"మీరు సరైన డైవర్సిఫైడ్ ఫండ్‌లో పెట్టుబడి పెడితే దానికి అన్నిరంగాల నుంచి మంచి షేర్లు ఉండాలి. కాబట్టి, థీమాటిక్ ఫండ్స్‌లో పెట్టుబడి అవసరం లేదు. ఆ ఫండ్‌ల ట్రాక్ రికార్డ్ బాగాలేదు" అని వినోద్ అన్నారు.
'ఓల్డ్ బోరింగ్ ఫండ్స్'లో మూలధనాన్ని పెట్టుబడిగా పెట్టాలని, థీమాటిక్ ఫండ్స్‌కు దూరంగా ఉండాలని మిథున్ సూచించారు.

ఫొటో సోర్స్, Getty Images
స్టాక్ మార్కెట్‌ను నిలబెట్టేది..
భారతీయ స్టాక్ మార్కెట్‌ను నిలబెట్టడంలో మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇన్వెస్టర్లు నెలకు కనీసం రూ.500 సిప్‌లలో పెట్టుబడిగా పెడుతుంటారు. అయితే, మార్కెట్ క్షీణత చూసి చాలామంది సిప్‌లను మానివేశారు.
ఏఎమ్ఎఫ్ఐ డేటా ప్రకారం.. 2024 డిసెంబర్‌తో పోలిస్తే జనవరి 2025లో ఈక్విటీ ఫండ్స్‌లోకి ఇన్‌ఫ్లోలు 3.6 శాతం తగ్గాయి. 2024 డిసెంబర్‌లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో రూ.41,155 కోట్లు పెట్టుబడి పెట్టారు.
2025 జనవరిలో సిప్‌లలో రూ.39,687 కోట్లు మాత్రమే పెట్టుబడి పెట్టారు. పెట్టుబడులు, ఉపసంహరణలను పరిశీలించినపుడు.. నికర పెట్టుబడి వరుసగా 47 నెలలు సానుకూలంగా ఉంది.
2025 జనవరిలో మ్యూచువల్ ఫండ్ ఫోలియోల సంఖ్య 22.92 కోట్లకు చేరుకుంది. రిటైల్ ఏయూఎం (నిర్వహణలో ఉన్న ఆస్తులు) పరిమాణం రూ. 39.91 లక్షల కోట్ల నుంచి రూ. 38.77 లక్షల కోట్లకు తగ్గింది.
2025 జనవరిలో మ్యూచువల్ ఫండ్స్ ద్వారా వచ్చిన మొత్తం పెట్టుబడులలో రూ.26,400 కోట్లు సిప్‌ల ద్వారా చేశారు. లార్జ్ క్యాప్ ఫండ్స్‌లో రూ.3,063 కోట్లు, మిడ్-క్యాప్ ఫండ్లలో రూ.5,147 కోట్లు, స్మాల్ క్యాప్ ఫండ్లలో రూ.5,720 కోట్లు పెట్టుబడిగా పెట్టారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














