శంభాజీ: ఈ మహారాజుకు, సాంబారుకు సంబంధం ఏంటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఓంకార్ కారంబేల్కర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
తాజాగా విడుదలైన ఛావా సినిమాతో శంభాజీ మహారాజు గురించి చర్చ జరుగుతోంది. అయితే శంభాజీ పేరు కేవలం రాజకీయాలతోనే కాక, చరిత్రలో మరో అంశంలో కూడా గట్టిగా వినిపిస్తోంది.
దక్షిణ భారతదేశం మాత్రమే కాకుండా భారతదేశమంతా ఇష్టపడే సాంబారు, ఆయనకు గల సంబంధం గురించి కూడా చరిత్రలో ఉంది.
ఉడికించిన పప్పులో మునగ కాయలు, టమోటా, క్యారట్, గుమ్మడికాయ, కొత్తిమీర, చింతపండు పులుసు వేసి మరిగించి తాలింపు వేసి సాంబారు తయారుచేస్తారు.
ఇప్పుడు సాంబారు విదేశాలకూ వ్యాపించింది. అయితే ఛత్రపతి శివాజీ కొడుకు శంభాజీ మహారాజుకు, సాంబారుకు ఏంటి సంబంధం? అసలు ఈ సాంబారు వంటకం ఎప్పుడు పుట్టింది?


ఫొటో సోర్స్, Getty Images
తంజావూరులో శంభాజీ ఆహారం
నిత్య జీవితంలో భాగమైపోయిన చాలా వంటకాల చరిత్రలు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి.
అయితే సాంబారును మొట్టమొదటిసారిగా ఎక్కడ తయారైంది అంటే.. తంజావూరును పాలించిన మరాఠీ పాలకుల వంటశాలలో తయారుచేశారనే సమాధానం వినిపిస్తుంది. కానీ, ఈ చరిత్రను పరిశీలించాల్సి ఉంది.
ఛత్రపతి శివాజీ సవతి తమ్ముడు వ్యాంకోజీ తంజావూరును పాలించారు. ఆయన 1683లో మరణించారు.
వ్యాంకోజీ కుమారుడు షాహుజీ 1684లో సింహాసనాన్ని అధిష్టించారు. అప్పటికి ఆయనకు పన్నెండేళ్లు. ఆయనకు సాహిత్యం, కళలపై ఆసక్తి ఉండేది.
ఆయన వంట చాలా బాగా చేసేవారని చెప్పేవారు.

ఫొటో సోర్స్, Getty Images
సాంబారు విషయంలో ప్రచారంలో ఉన్న కథనాల్లో ఒకదాని ప్రకారం... ఛత్రపతి శివాజీ ఒకసారి తంజావూరు వెళ్లారు. సాధారణంగా ఆయన కోసం చేసే కూరల్లో రుచి కోసం వాడే రేగు పళ్లు లేకపోవడంతో చింతపండును వాడారు. సాధారణంగా కూరల్లో పులుపు కోసం కొన్ని ప్రాంతాల్లో రేగు పళ్ళు వాడతారు.
ఆ రోజు శివాజీకి వండిన భోజనంలో రేగు పళ్లకు బదులు చింతపండు పులుపుతో వంటకాలు చేశారు.
ఆ తర్వాత ఆ వంటకానికి శివాజి కొడుకైన శంభాజీ మహారాజు గౌరవార్థం- శంభాజీ + ఆహార్ అని కలిసివచ్చేలా సాంబారు అని పేరు పెట్టారు.
అదే వంటకం అనేక మార్పులతో దక్షిణ భారతదేశంలో మాత్రమే కాకుండా భారతదేశమంతా ప్రాముఖ్యం పొందింది. ఇది సాంబారు గురించి వినిపించే ఒక ఒక కథ.
ఈ కథను ప్రముఖ ఫుడ్ హిస్టోరియన్, డైట్ నిపుణులు కేటి ఆచార్య ధ్రువీకరించారు. దాంతో సాంబారు తంజావూరులోనే పుట్టిందనే అందరూ అనుకుంటారు.

ఫొటో సోర్స్, DR. KAMAL GOKHALE
కానీ, ఇందులో నిజం లేదని ఆహార సంస్కృతిపై పరిశోధన చేసిన డాక్టర్ చిన్మయి దామ్లే అంటారు.
షాహుజీ 1684లో అధికారం చేపట్టినప్పటికి ఆయనకు 12 ఏళ్లు. శివాజీ 1680-1689 వరకు పాలించారు. ఆ సమయంలో ఈ సంఘటన జరిగి ఉండకపోవచ్చు" అని అన్నారు.
అలాగే, శంభాజీ తంజావూరు పర్యటనకు వెళ్లినట్లు ఎక్కడా ఆధారాలు లేవు. 17వ శతాబ్దానికి చెందిన మరాఠా వంటకాల గురించి పెద్దగా చారిత్రక ఆధారాలు లేవు. దాంతో, పైన చెప్పిన సాంబారు కథకు పెద్దగా ఆధారాలు లేవు అంటారు చిన్మయి.
కానీ, శివాజీ మహారాజు తంజావూరు విచ్చేసినప్పుడు పప్పుతో చేసిన సాంబారును వడ్డించినట్లు ఆ వంటకానికి ఆయన గౌరవార్థమే ఆ పేరు పెట్టినట్లు తంజావూరు పాలకుల వారసుడు శివాజీ మహారాజ్ భోంసలే బీబీసీకి చెప్పారు. ఇది మరో వాదన.

ఫొటో సోర్స్, Getty Images
సాంబారు అంటే ఏంటి?
పూర్వకాలంలో ఆహారం రుచి పెంచేందుకు చాలా రకాల పదార్థాలను వాడేవారు. వాటిని సాంబారు అని పిలిచేవారు. సాంబారు అనే పదాన్ని సలాడ్ తరహాలో అన్నిటికీ కలిపి వాడేవారు.
సాంబారు పదానికి సంస్కృతంలో ఉన్న సంభార్ పదానికి దగ్గర సంబంధం ఉందని కొంత మంది నిపుణులు చెబుతారు.
దీని గురించి సంస్కృత పరిశోధకుడు, మహారాష్ట్ర ఎన్‌సైక్లోపీడియా కౌన్సిల్ సభ్యుడు హేమంత్ రాజోపాధ్యే వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
"ఎస్ ఎమ్, భృ అనే అక్షరాలకు సంస్కృతంలో చాలా రకాల పదార్థాల సమ్మేళనం లేదా రకరకాల పదార్థాలతో తయారు చేసిన వస్తువు అని అర్థం ఉంది. కానీ, దీనికి సాంబారుకు సంబంధం ఉందా లేదనేది చెప్పలేం" అని అన్నారు.
"సాంబారు అనే పదానికి ద్రవిడ, ఇండో ఇరాన్‌లో ఉన్న శబ్ద లక్షణాలను పరిశీలిస్తే గాని ఇది సంస్కృత పదం నుంచి పుట్టిందని చెప్పడానికి లేదు" అని అన్నారు. అలాగే, ఈ పదాల గురించి ద్రవిడ నిఘంటువుల్లో ఎక్కడా ప్రస్తావన లేదని అన్నారు.
ఆహారపు రుచిని పెంచే పదార్ధాన్నే సాంబారు అంటారని డాక్టర్ చిన్మయి అన్నారు.
"రుచిని పెంచడానికి సాంబారును వాడతారు. సాంభార్ అనే పదాన్ని మార్చేసి సాంబారు అని పిలుస్తున్నారు అని అన్నారు.
సుగంధ ద్రవ్యాలకు, సాంబారుకు ఒకే అర్థం వస్తుంది అని చెప్పారు.
"లీలా చరిత్రలో సాంబారు అనే పదాన్ని సుగంధ ద్రవ్యాలను సూచించడానికి వాడారు. సంస్కృతంలో సాంభార్ కు సమానమైన చాలా పదాలు ఇతర భాషల్లో కూడా ఉన్నాయి. గుజరాతీలో (సాంభార్), బెంగాలీలో (సంభారా), తెలుగులో (సంబరము) తమిళంలో (సాంబార్) అనే పదాలు ఉన్నాయి. మలయాళంలో మసాలా దినుసులను కలిపి చేసిన మజ్జిగను సంబరం అని అంటారు.

ఫొటో సోర్స్, Getty Images
మహారాష్ట్రలో 13వ శతాబ్దం నుంచే సాంబారు వంటకం
సంబర్ అనే పదాలు మహారాష్ట్రలో కూడా ఎప్పటి నుంచో వాడుకలో ఉన్నాయి.
చక్రధర స్వామి రచించిన లీలా చరిత్రలో 260వ శ్లోకంలో సాంబారును పదార్ధాల రుచిని పెంచే వంటకంగా చెబుతూ ప్రస్తావన ఉంది అని డాక్టర్ చిన్మయి చెప్పారు.
358వ శ్లోకంలో సాంబారివ్ అనే పదం ఉంది. ఇది తథా చనా ఆరోగన్ అనే శీర్షికతో ఉంటుంది.
భై దేవ్ ఒక గ్రామం సందర్శించి అక్కడ పప్పు ధాన్యాలను చూస్తారు. ఆయన చక్రధర స్వామి కోసం నాణ్యమైన పప్పును సేకరించి మిగిలింది ఆయన తినేస్తారు.
ఆయన పట్టుకుని వెళ్లిన పప్పుధాన్యాలు తియ్యగా ఉంటాయి. ఆ ధాన్యాలను తీసుకుని వెళ్లి వంట చేయమని ఆ స్వామిజీ ఇంట్లో ఆడవాళ్లకు చెబుతారు. ఆమె ఢంకనే, సాంబారివ్ అనే వంటకాలు చేస్తారు.
ఈ శ్లోకంలో సాంబారివ్ అంటే సాంబారు అనే అర్థంలోనే వాడారు.
దీనిని బట్టి మహారాష్ట్రలో 13వ శతాబ్దం నుంచి సాంబారు వంటకం ప్రాచుర్యంలో ఉందని తెలుస్తోంది.
ముక్తేశ్వరకు చెందిన ఏకనాథ్ మహారాజు ముని మనుమడు రాజసూయ యాగం గురించి చెబుతూ సాంబారు అనే పదాన్ని వాడారని డాక్టర్ చిన్మయి చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
పీష్వా కాలంలో సాంబారు
పీష్వా కాలానికి సంబంధించిన పత్రాల్లో కూడా సాంబారు ప్రస్తావన ఉంది.
సవాయ్ మాధవ్ రావు పీష్వాకు 1782లో పుణెలో వివాహం జరిగింది. ఆ వివాహానికి నానా ఫడణవిస్ భారీ ఏర్పాట్లు చేశారు.
ఆయన ఆ ఏర్పాట్లకు ఇచ్చిన సూచనల్లో వివాహ విందులో సాంబారు ఉండాలని చెప్పినట్లు ప్రస్తావన ఉంది.
మరాఠాలకు ముందు తంజావూరును నాయక వంశస్థులు పాలించారు.

ఫొటో సోర్స్, Getty Images
‘రఘునాథాభ్యుదయము’ అనే కావ్యంలో రఘునాథ నాయకుని జీవితంలో ఒక రోజు గురించి వర్ణన ఉంది.
అందులో రాజుకు వడ్డించిన వంటకాల గురించి పెద్ద జాబితా ఉంది. అందులో సాంబార్ రొట్టెలు, సాంబారు అన్నం అనే ప్రస్తావన ఉంది.
కానీ, అది నేడు వాడుకలో ఉన్న సాంబారుకు దగ్గరగా ఉన్నట్లు కనిపించటం లేదు. ఇప్పుడు మనం చూస్తున్న సాంబారుకు ప్రాచీన కాలం నాటి అనేక వంటకాలకు సంబంధం లేదు.
"తంజావూరులో షాహుజీ మహారాజు సాంబారును కనిపెట్టినట్లు చెప్పినప్పటికీ, ఆయన రచించిన పుస్తకాల్లో ఎక్కడా సాంబారు ప్రస్తావన లేదు. కానీ, ఆ పుస్తకంలో పోరిచ్చ కులంబు అనే వంటకం గురించి ప్రస్తావన ఉన్నట్లు చెప్పారు. ఆ వంటకంలో కూడా పప్పు, కాయగూరలు, చింతపండు, కరివేపాకు, ఇంగువ, కారం వాడతారు. అందుకే సాంబారుకు, షాహుజీకి ఎటువంటి సంబంధం లేదు" అని డాక్టర్ చిన్మయి అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అయితే,ఈ సాంబారు అనే పదం ఎక్కడ నుంచి పుట్టింది?
20వ శతాబ్దపు మద్రాస్ నగరంలో ఉన్న చిన్న చిన్న ఆహార శాలల్లో కూళంబు అనే వంటకాన్ని వడ్డించేవారు. దానినే సాంబారు అని పిలిచేవారేమో అని డాక్టర్ చిన్మయి అన్నారు.
నెమ్మదిగా కుళంబు అంతరించి సాంబారు వాడుకలోకి వచ్చి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు.
"సాంబారును దక్షిణ భారతదేశంలో ఆహారం రుచిని పెంచేందుకు వాడే వంటకంగా వాడేవారు" అని చెప్పారు.
ఏది ఏమైనప్పటికీ మన జీవితంలో సాంబారుకో ప్రత్యేక స్థానం ఉంది. విదేశాల్లో ఉన్న దక్షిణాది హోటళ్లు కూడా ఈ సాంబారు ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా పెంచడానికి ప్రధాన పాత్ర పోషించాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














