ఈజిప్ట్: బయటపడ్డ మొదటి ఫారో సమాధి, అందులో ఏముందంటే..

ఫొటో సోర్స్, New Kingdom Research Foundation
- రచయిత, ఫ్రాన్సెస్ మావో
- హోదా, బీబీసీ ప్రతినిధి
టుటంకామన్ సమాధిని గుర్తించిన వందేళ్ల తర్వాత పురాతన ఈజిప్ట్ చరిత్రను అధ్యయనం చేస్తున్న బృందం తొలిసారి ఫారో సమాధిని గుర్తించింది.
ఈజిప్షియన్ 18వ రాజవంశంలో రెండో తుట్మోస్ సమాధి ఎక్కడ ఉందో ఇప్పటిదాకా తెలియదు . కానీ లక్సర్ నగరం సమీపంలోని తేబన్ నెక్రోపోలిస్‌లోని పశ్చిమ లోయల్లో రెండో తుట్మోస్ సమాధిని బ్రిటన్- ఈజిప్టులకు చెందిన చరిత్రకారుల బృందం కనుక్కుంది.
నిజానికి 18వ రాజవంశ ఫారోల ఖననవాటిక ( బరియల్ చాంబర్స్) వాలీ ఆఫ్ ది కింగ్స్‌కు రెండు కిలోమీటర్ల ఆవల ఉండవచ్చని పరిశోధకులు భావించారు.
అయితే, రాచరికపు మహిళలు విశ్రాంతి తీసుకునే ప్రాంతంలో సిబ్బంది ఈ సమాధిని గుర్తించారు.
వారు శ్మశాన వాటికలోకి అడుగు పెట్టాక ఫారో సమాధులకు సంబంధించిన అలంకరణలు కనిపించాయి.
"పైకప్పు భాగం ఇప్పటికీ చెక్కు చెదరలేదు. దానికి నీలి రంగు వేసి ఉంది. దానిపై పసుపు రంగులో నక్షత్రాలను చిత్రీకరించారు. ఇలా నీలి రంగు పైకప్పు మీద పసుపు రంగు నక్షత్రాల చిత్రాలు కేవలం రాజుల సమాధుల్లోనే కనిపిస్తాయి" అని ఈ మిషన్ ఫీల్డ్ డైరెక్టర్ డాక్టర్ పియర్స్ లిథర్‌లాండ్ చెప్పారు.

ఆ క్షణంలో తాను ఆనందంతో పొంగిపోయినట్లు బీబీసీ న్యూస్ అవర్ కార్యక్రమంలో డాక్టర్ పియర్స్ లిథర్‌లాండ్ చెప్పారు.
" మనం కనుక్కోగలమా లేదా అని అనుకుంటున్న దాన్ని ప్రత్యక్షంగా చూసిన తర్వాత కలిగే భావోద్వేగం అసాధారణంగా ఉంటుంది." అని ఆయన అన్నారు.
"నేను లోపల నుంచి వచ్చిన తర్వాత, నా భార్య బయట వేచి చూస్తోంది. ఆ సమయంలో నేను కన్నీటితో భావోద్వేగానికి గురయ్యాను" అని లిథర్‌లాండ్ చెప్పారు.
తమ పరిశోధనతో 18వ రాజవంశానికి చెందిన రాజుల సమాధులు ఎక్కడ ఉన్నాయనే గుట్టు వీడిపోయిందని ఆయన అన్నారు.
మమ్మీలాగా మార్చిన రెండో తుట్మోస్ శరీరాన్ని రెండు వందల ఏళ్ల కిందట గుర్తించారు. అయితే, అసలు సమాధి ప్రాంతం ఏదో ఇప్పటి వరకూ గుర్తించలేదు. తాజా పరిశోధనతో రెండో తుట్మోస్ సమాధి ఎక్కడ ఉందో తెలిసిపోయింది.

ఫొటో సోర్స్, Alamy
రెండో తుట్మోస్, టుటంకామన్ రాజుకు పూర్వీకుడు. ఆయన పాలనా కాలం క్రీస్తు పూర్వం 1493 నుంచి 1479 మధ్య ఉండి ఉండవచ్చని భావిస్తున్నారు.
1922లో బ్రిటన్‌కు చెందిన ఆర్కియాలజిస్టులు టుటంకామన్ సమాధిని గుర్తించారు.
హత్షెప్సుట్ భర్తగా రెండో తుట్మోస్‌కు మంచి గుర్తింపు ఉంది.
ఈజిప్టును పాలించిన ప్రముఖ రాణులలో హత్షెప్సుట్ ఒకరు.
'పొడవాటి మెట్లు, ఇంకా పొడవాటి కారిడార్‌తో ఉన్న సమాధి చాలా అద్భుతంగా ఉంది" అని లిథర్‌లాండ్ చెప్పారు.
"అదంతా దాటి అక్కడకు చేరుకోవడానికి చాలా సమయం పట్టింది" అని ఆయన అన్నారు. వెళ్లే మార్గంలో వరదల వల్ల కూలిపోయిన శిథిలాలు, అక్కడక్కడా పడిపోయిన పైకప్పు అడ్డుగా ఉన్నాయని ఆయన చెప్పారు.
"పది మీటర్లు పాక్కుంటూ వెళ్లిన తర్వాత పైన 40 సెంటీమీటర్ల ఖాళీ ఉంది. అక్కడ నుంచి శ్మశానంలోకి వెళ్లాం" అని లిథర్‌లాండ్ చెప్పారు.
నీలి రంగులో ఉన్న పైకప్పు, రాజులకు మాత్రమే పరిమితమైన అమ్దౌత్ అనే మతపరమైన వాక్యాలకు సంబంధించిన చిత్రాలను లిథర్‌లాండ్ బృందం అక్కడ చూసింది.
ఆ సమాధి రాజులదే అని చెప్పేందుకు అది మరొక సంకేతమని లిథర్‌లాండ్ అన్నారు.

ఫొటో సోర్స్, New Kingdom Research Foundation
అయితే "సమాధి పూర్తిగా ఖాళీగా ఉంది. ఎందుకంటే దాన్ని దోచుకోవడం వల్ల కాదు. ఎవరో కావాలనే ఆ ప్రాంతం అంతా ఖాళీ చేశారు" అని లిథర్‌లాండ్ చెప్పారు.
సమాధి వరదలకు కొట్టుకుపోయిందా అనే విషయాన్ని లిథర్ లాండ్ బృందం పరిశోధించింది. దాన్ని ఓ జలపాతం కింద నిర్మించారని, రాజు మృతదేహాన్ని ఖననం చేసిన కొన్నేళ్ల తర్వాత అక్కడి వస్తువులను పురాతన కాలానికి చెందిన మరో ప్రాంతానికి తరలించారని వారు గుర్తించారు.
ఆ చాంబర్‌లో కొన్ని టన్నుల సున్నపురాయిని జల్లెడ పట్టాక పాలరాతి పాత్రలను గుర్తించారు. వాటి మీద హత్షెప్సుట్, రెండో తుట్మోస్ పేర్ల మీద శాసనాలు చెక్కి ఉన్నాయి.
"సమాధిని ఇక్కడ నుంచి కదిలించినప్పుడు బహుశా పాలరాతి పాత్రలు పగిలిపోయి ఉండవచ్చు" అని ఆయన అన్నారు.
"వాళ్లు కొన్ని వస్తువులు పగలగొట్టడం మంచిదైంది. దానివల్లే ఈ సమాధి ఎవరిదనేది స్పష్టంగా తెలుసుకునే వీలు కలిగింది" అని ఆయన చెప్పారు.
రెండో సమాధి ఎక్కడ ఉండవచ్చనే దాని గురించి తమ బృందం వద్ద కొంత సమాచారం ఉందని లిథర్‌లాండ్ చెప్పారు. అక్కడ కొంత నిధి కూడా ఉండవచ్చని ఆయన భావిస్తున్నారు.
ఈజిప్టు రాజు సమాధిని కనుక్కునేందుకు డాక్టర్ లిథర్‌లాండ్‌కు చెందిన న్యూ కింగ్‌డమ్ రీసర్చ్ ఫౌండేషన్, ఈజిప్టు పర్యటక, పురావస్తు శాఖ కలిసి 12 ఏళ్ల పాటు శ్రమించాయి.

ఫొటో సోర్స్, New Kingdom Research Foundation
పశ్చిమ లక్సర్‌లోని తెబన్ పర్వతాల్లో ఈ బృందం 54 సమాధులను గుర్తించి వాటిని వెలికి తీసింది. రాజ కుటుంబానికి చెందిన 30 మంది భార్యలు, ఆస్థాన మహిళల గురించిన విశేషాలను ప్రపంచం దృష్టికి తీసుకువచ్చింది.
"1922లో టుటంకామన్ సమాధిని గుర్తించిన తర్వాత రాజ కుటుంబానికి చెందిన సమాధిని గుర్తించడం ఇదే తొలిసారి" అని ఈజిప్టు పర్యటక, పురావస్తు శాఖ మంత్రి షెరీఫ్ ఫతీ చెప్పారు.
"ఈజిప్టు పురావస్తు విభాగానికి, పరిశోధనలకు సంబంధించి, మానవ చరిత్రను విస్తృత కోణంలో అర్థం చేసుకోవడానికి ఇది ప్రత్యేక సందర్భం" అని ఆయన అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














