దిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణస్వీకారం

ఫొటో సోర్స్, Getty Images
దిల్లీ ముఖ్యమంత్రిగా బీజేపీ ఎమ్మెల్యే రేఖా గుప్తా గురువారం రామ్‌లీలా మైదానంలో ప్రమాణస్వీకారం చేశారు.
అనంతరం ఆమె ఎక్స్‌లో చేసిన పోస్టులో దిల్లీ అభివృద్ధి, స్వయం సమృద్ధి గురించి మాట్లాడారు.
‘‘ప్రధాని నరేంద్రమోదీ మార్గదర్శకత్వంలో దిల్లీని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో నేనీరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశా. ఇది కేవలం బాధ్యత మాత్రమే కాదు, దిల్లీ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే అవకాశం’’ అని పేర్కొన్నారు.
‘‘ ప్రధాని నరేంద్ర మోదీ నినాదమైన సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్' అనే మంత్రాన్ని అనుసరిస్తూ, ఆధునిక మౌలిక సదుపాయాలు, అద్భుతమైన ఆరోగ్య సేవలు, అద్భుతమైన విద్య కొత్త ఉపాధి అవకాశాల ద్వారా దిల్లీని శక్తిమంతంచేస్తాం’’ అని రేఖా గుప్తా పేర్కొన్నారు.
బుధవారంనాడు రేఖాగుప్తాను బీజేపీ శాసనసభా పక్షం తమ నేతగా ఎన్నుకుంది.
ఈ సమావేశానికి పరిశీలకునిగా హాజరైన బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ విలేఖరుల సమావేశంలో రేఖా గుప్తా పేరును ప్రకటించారు.
రేఖా గుప్తా దిల్లీకి నాలుగో మహిళా ముఖ్యమంత్రి. ఆమె కంటే ముందు సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్, అతిషి ఈ పదవిని నిర్వహించారు.
ఇటీవల జరిగిన దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మొత్తం 70 స్థానాలకు గాను 48 స్థానాలను గెలుచుకుని 27 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి అధికారంలోకి వచ్చింది.


ఫొటో సోర్స్, Rekha Gupta
ఎవరీ రేఖా గుప్తా?
భారతీయ జనతా పార్టీ మహిళను ముఖ్యమంత్రిని చేయాలనుకుంటే, రేఖా గుప్తా పోటీలో మొదటి వరుసలో ఉంటారని రాజకీయ విశ్లేషకులు ముందే భావించారు.
షాలిమార్ బాగ్ నుంచి దాదాపు 30 వేల ఓట్ల తేడాతో గెలిచారు రేఖా గుప్తా.
2020 ఎన్నికల్లో ఆమె అదే సీటును స్వల్ప తేడాతో ఓడిపోయారు.
దిల్లీ యూనివర్శిటీలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌తో గుప్తా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1996లో దిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ (డీయూఎస్ యూ) అధ్యక్షురాలిగా నియమితులయ్యారు.
2007లో దిల్లీలోని నార్త్ పితంపురా కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు.
దిల్లీ బీజేపీ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు రేఖా గుప్తా .
2004 నుంచి 2006 వరకు భారతీయ జనతా పార్టీ యువమోర్చా జాతీయ కార్యదర్శిగా ఉన్నారు.
"రేఖా గుప్తా ద్వారా బీజేపీ మహిళలు, వైశ్య సమాజం ఇద్దరికీ ప్రాతినిధ్యం వహించవచ్చు " అని సీనియర్ జర్నలిస్ట్ శరద్ గుప్తా అన్నారు.
రేఖా గుప్తాకు ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, మాజీ ముఖ్యమంత్రి అతిశీ శుభాకాంక్షలు చెప్పారు.
దిల్లీ అభివృద్ధి కోసం తాము రేఖా గుప్తాకు పూర్తి మద్దతు ఇస్తామని తెలిపారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ ఎక్స్‌లో ఒక పోస్టు చేస్తూ దిల్లీ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. దిల్లీ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం రేఖా గుప్తాకు అన్ని విధాలా సహాయసహకారాలు అందిస్తామన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
వ్యక్తిగత జీవితం
1974లో హరియాణాలోని జింద్ జిల్లా జులానాలో రేఖాగుప్తా జన్మించారు.
బాల్యంలోనే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)లో చేరారు.
దిల్లీ యూనివర్సిటీలో బీకాం, ఎల్ఎల్‌బీ చేశారు రేఖాగుప్తా.
1998లో దిల్లీకి చెందిన మనీష్ గుప్తాను ఆమె వివాహం చేసుకున్నారు.
ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆమె మొత్తం ఆదాయం రూ.6,92,050. అదే సమయంలో ఆమె భర్త మనీష్ గుప్తా ఆదాయం రూ.97,33,570గా ఉంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














