'థర్డ్ క్లాస్' అని తిడుతూ టీటీడీ ఉద్యోగిపై బోర్డు సభ్యుడి చిందులు, తిరుమల మహాద్వారం వద్ద అసలేం జరిగింది?

తిరుపతి, ఉద్యోగులు
    • రచయిత, తులసీ ప్రసాద్ రెడ్డి నంగా
    • హోదా, బీబీసీ కోసం

తిరుమల శ్రీవారి ఆలయం మహాద్వారంలో టీటీడీ ఉద్యోగిని టీటీడీ బోర్డు సభ్యుడు తీవ్ర పదజాలంతో దూషించారంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయ్యింది.

టీటీడీ బోర్డు సభ్యుడు సదరు ఉద్యోగిని బూతులు ఎలా తిడతారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ కూడా నడుస్తోంది. ఒక బోర్డు సభ్యుడు మహాద్వారం దగ్గర మాట్లాడిన విధానంపై విమర్శలు వినిపించాయి.

టీటీడీ ఉద్యోగ సంఘాలు కూడా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. స్థానిక కార్మిక సంఘాల నేతలు కూడా టీటీడీ బోర్డు సభ్యుడి వైఖరిని తప్పు పడుతున్నారు.

తిరుపతి

అసలేం జరిగింది?

టీటీడీ బోర్డు సభ్యుడు నరేశ్‌ కుమార్‌ ఫిబ్రవరి 18న మంగళవారం ఉదయం వీఐపీ బ్రేక్‌ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం తన బృందంతో కలిసి మహాద్వారం వద్దకు చేరుకున్నారు. అప్పుడే బోర్డు మెంబర్‌ పక్కనే ఉన్న అటెండర్ మహాద్వారం గేట్లు తీయమని గేటు దగ్గర పని చేస్తున్న టీటీడీ ఉద్యోగి బాలాజీకి చెప్పారు.

అయితే ఈవో, అడిషనల్‌ ఈవో ఆదేశాల మేరకు మహాద్వారం గేటు నుంచి ఎవరినీ పంపడం లేదని, ఉన్నతాధికారులు ఆదేశిస్తేనే తలుపులు తీస్తానని బాలాజీ వారికి బదులిచ్చారు.

టీటీడీ ఉద్యోగి బాలాజీ మాటలతో సహనం కోల్పోయిన బోర్డు సభ్యుడు నరేశ్‌ కుమార్, ఆయనను బూతులు తిట్టారు.

అంతేకాకుండా నిన్ను ఇక్కడ పెట్టిందెవరు, ఏమనుకుంటున్నావు? ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలియదా? అంటూ వ్యాఖ్యానించారు.

‘‘థర్డ్ క్లాస్ నా కొ...నాకు చెప్తావా. పో ఇక్కడి నుంచి. పో బయటకు ’’ అంటూ ఆ ఉద్యోగిని తీవ్ర వ్యాఖ్యలతో దూషించినట్లు వైరల్ అయిన వీడియోలో కనిపిస్తోంది.

‘నువ్వు బయటకు పో ముందు’ అంటు టీటీడీ ఉద్యోగి బాలాజీని పదే పదే హెచ్చరించిన నరేశ్ కుమార్, ఒక దశలో బాలాజీ భుజం పట్టుకుని వెనక్కి లాగుతూ, బయటకు పొమ్మని చెప్పే ప్రయత్నం చేశారు.

‘‘వాణ్ని బయటకు పంపించు ముందు. లేకపోతే నేను ఇక్కడే కూర్చుంటాను’’ అంటూ మరో ఉద్యోగితో అన్నారు నరేశ్ కుమార్.

తర్వాత అక్కడికి వచ్చిన టీటీడీ వీజీవో సర్దిచెప్పడంతో ఆ గొడవ సద్దుమణిగింది.

చీర్ల కిరణ్

ఫొటో సోర్స్, FB/CheralaKiran

ఫొటో క్యాప్షన్, బాలాజీకి టీటీడీ బోర్డు సభ్యులు నరేశ్ కుమార్ క్షమాపణ చెప్పాలని తితిదే ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు చీర్ల కిరణ్ డిమాండ్ చేశారు.

'రాజీనామా చేయాలి'

మహాద్వారం వద్ద టీటీడీ బోర్డు సభ్యుడు వ్యవహరించిన తీరుపై టీటీడీ ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తంచేశాయి. దీనిపై ఒక సమావేశం నిర్వహించిన సంఘాలు.. విధి నిర్వహణలో ఉన్న టీటీడీ ఉద్యోగిని బూతు మాటలతో తిట్టిన బోర్డు సభ్యుడు నరేశ్ కుమార్‌ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి.

బాలాజీతో అటెండర్‌ మాట్లాడుతున్న సమయంలో టీటీడీ సభ్యుడు నరేశ్ కుమార్ వచ్చి బూతులు తిట్టారని టీటీడీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు చీర్ల కిరణ్ బీబీసీతో చెప్పారు.

"బోర్డు మెంబర్ పనబాక లక్ష్మిని పుష్కరిణిలోకి అనుమతించలేదని వరాహ స్వామి గుడిలో విధులు నిర్వహిస్తున్న టీటీడీ ఉద్యోగి సూరిని రెండు నెలల కిందట సస్పెండ్ చేశారు. ఇలా టీటీడీ ఉద్యోగులు ఎన్ని అవమానాలు భరించాలి. అసలు టీటీడీ ఉద్యోగులు ఇక్కడకు వచ్చే బోర్డు సభ్యులకు సేవలు చేయాలా లేదా భక్తులకు సేవ చేయాలా అనేది అర్థం కాని పరిస్థితి" అని ఆయన అన్నారు.

బాలాజీకి నరేశ్ కుమార్ క్షమాపణ చెప్పాలని, టీటీడీ బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేయాలని టీటీడీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేస్తోందని, లేదంటే ఉద్యమిస్తామని కిరణ్ హెచ్చరించారు.

అనుచిత ప్రవర్తన వల్లే: నరేశ్ కుమార్

ఘటన చాలా చిన్న విషయమని, టీటీడీ ఉద్యోగి అనుచిత ప్రవర్తన వల్ల అలా తిట్టానని టీటీడీ బోర్డు సభ్యులు నరేశ్ కుమార్ బీబీసీతో చెప్పారు.

''అది చాలా చిన్న విషయం, లోకల్ రాజకీయం. మేం పాలక మండలి సభ్యులుగా ఉండి కచ్చితంగా రూల్స్ ఫాలో అవుతాం. నేను గేటు తీయమని చెప్పలేదు. ప్రతి పాలక మండలి సభ్యులకు అటెండర్ ఉంటారు. అటెండర్ ఎలా తీసుకెళ్తే అలా వెళ్తాం. అతను అటెండర్‌తో "ఎవరెవరినో తోడుకుని వస్తావు" అన్నారు. నన్నే ఇలా అంటే ఇక భక్తులతో ఎలా ప్రవర్తిస్తారు. నేను మెంబర్‌ను అంటే.. ఎవరైతే నాకేంటి అన్నారు. అందుకే రియాక్ట్ అయ్యాను'' అన్నారు నరేశ్ కుమార్.

శ్రీవారి మహాద్వారం దగ్గర ఏం జరిగిందో తెలుసుకోడానికి టీటీడీ ఉద్యోగి బాలాజీతో మాట్లాడటానికి బీబీసీ పలుమార్లు ప్రయత్నించింది. కానీ, ఆయన స్పందించ లేదు.

చర్యలు తీసుకోవాలి: సీఐటీయూ

ఉద్యోగి పట్ల అనుచితంగా ప్రవర్తించిన టీటీడీ బోర్డు సభ్యుడు నరేశ్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని, ఉద్యోగులకు క్షమాపణలు చెప్పించాలని సీఐటీయూ డిమాండ్ చేసింది.

''టీటీడీ ఉద్యోగులు అంటే పాలక మండలిలో లెక్కలేనితనం వ్యక్తమవుతోంది. ఏళ్ల తరబడి భక్తుల సేవలో ఉన్న ఉద్యోగుల పట్ల వారు వ్యవహరించే తీరు ఇలా ఉండకూడదు. పాలకమండలి సభ్యులు, రాజకీయ నేతలు, ప్రభుత్వ అధికారులు ఈ అంశాన్ని గమనించాలి. టీటీడీ ఈవో జోక్యం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో బోర్డు సభ్యుడిపై కఠిన చర్యలు తీసుకోవాలి'' అని సీఐటీయూ తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి అన్నారు.

దీనిపై వివరణ కోసం టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడుతో బీబీసీ మాట్లాడటానికి ప్రయత్నించింది. ఆయన అందుబాటులోకి రాలేదు. చైర్మన్ స్పందించగానే కథనంలో అప్‌డేట్ చేస్తాం.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)