'బీబీసీ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు-2024' విన్నర్ మిథాలీ రాజ్: భారత మహిళల క్రికెట్‌లో ఒక శిఖరం

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, శార్దా ఉగ్రా
- హోదా, స్పోర్ట్స్ జర్నలిస్ట్
భారత మహిళల క్రికెట్‌ను ఫాలో అయ్యే టీనేజ్ అమ్మాయిలకు, అబ్బాయిలకు మిథాలీ రాజ్ అంటే విమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో గుజరాత్ టైటాన్స్ మెంటార్‌గా తెలుసు.
స్పోర్ట్స్‌ను బాగా చూసేవాళ్లకు మిథాలీ రాజ్ మాజీ క్రికెటర్, కామెంటేటర్, విశ్లేషకురాలుగా తెలుసు.
మిథాలీ రాజ్ భారత మహిళల క్రీడలకు, నేటి తరానికి ఒక వారధి.

కఠినమైన పరిస్థితుల్లో మహిళల క్రికెట్ ఉనికిని కాపాడేందుకు అగ్రశ్రేణి బ్యాటర్‌గా, కెప్టెన్‌గా మిథాలీ రాజ్, బౌలర్‌గా జులన్ గోస్వామి ఎంతో కృషి చేశారు.
కఠినమైన సవాళ్లు అంటే అదేదో మహిళా క్రికెటర్లు సరిగ్గా ఆడలేక కాదు.
స్వతంత్రంగా అడ్మినిస్ట్రేషన్ లేకపోవడం, తక్కువ వనరులు ఉండటం, క్రికెట్ బోర్డు నిర్వహణ పురుషుల చేతుల్లో ఉండటం వల్ల మహిళల క్రికెట్‌లో చీకట్లు అలుముకున్నాయి.
డబ్ల్యూపీఎల్ మూడవ సీజన్ ఫిబ్రవరి 14న మొదలైంది. మహిళల క్రికెట్ గురించి ప్రజలు మాట్లాడుకోవడం, ప్రముఖ టీవీ చానల్ కవరేజ్ ఇస్తున్న ఈ తరుణంలోనూ ప్రపంచం మహిళల క్రికెట్‌పై తక్కువ శ్రద్ధ చూపిస్తోందని ఊహించడానికే కష్టంగా ఉంది.
కానీ, మిథాలీ రాజ్ రెండు దశాబ్దాల కెరియర్‌లో ఇది వాస్తవాన్ని ప్రతిబింబిస్తుంది.
ఆ సమయంలో ఆమె తన బ్యాటింగ్‌తో కేవలం జట్టునే కాదు, భారత్‌లో మహిళల క్రికెట్‌ను కూడా నిలబెట్టారు.

ఫొటో సోర్స్, Getty Images
భరతనాట్యం వదిలి, బ్యాటుతో కదిలి..
విమెన్ క్రికెట్‌ను మెయిన్‌స్ట్రీమ్‌లోకి తీసుకురావడంలో కీలకంగా వ్యవహరించిన మిథాలీ రాజ్, క్రికెట్ వైపు అడుగులు వేయడం వెనక ఆమె తండ్రి మద్దతు బలంగా ఉంది.
మిథాలీ రాజ్ తండ్రి ఎయిర్ ఫోర్స్‌లో సార్జెంట్‌గా పని చేశారు.
మిథాలీ రాజ్ ఉదయాన్నే త్వరగా లేచేవారు కాదు. తనకు 8 ఏళ్ల వయసులో ఆ బద్ధకాన్ని పొగొట్టేందుకు ఆమె తండ్రి పొద్దున్నే మిథాలీ సోదరుడితో పాటు ఆమెను కూడా క్రికెట్ కోచింగ్ సెంటర్‌కు తీసుకెళ్లేవారు.
అకాడమీలో మిథాలీ సరదాగా బ్యాటుతో రెండు, మూడు బాల్స్ ఆడింది. దానిని చూసిన కోచ్ జ్యోతి ప్రసాద్ ఆమెలోని ప్రతిభను గుర్తించారు.
తర్వాత మిథాలీ క్రికెట్‌లో కఠినమైన శిక్షణ తీసుకున్నారు. ఆరు గంటల పాటు కోచింగ్ సెషన్స్ ఉండేవి.
బాల్ మిడిల్ బ్యాట్ అయ్యేందుకు, బ్యాట్‌తో కాకుండా స్టంప్‌లతో ప్రాక్టీస్ చేసేవారు. కోన్స్‌తో గ్యాప్స్‌ను గుర్తించడం, రాళ్లతో క్యాచ్ ప్రాక్టీస్ చేయడం వంటి కఠోర శిక్షణ తీసుకున్నారు.
క్రికెట్‌కు పూర్తి సమయాన్ని కేటాయించేందుకు 10 ఏళ్ల వయసులోనే తనకిష్టమైన భరతనాట్యాన్ని వదిలిపెట్టాలని మిథాలీ నిర్ణయం తీసుకున్నారు.
"డ్యాన్స్ అనేది నా వ్యక్తిగత అభిరుచి. కానీ, నేను ఈరోజు క్రికెట్‌లో ఈ స్థాయికి చేరుకున్నాను అంటే నా ప్రాధాన్యతలను నేను అర్థం చేసుకున్నందుకే" అని 2016లో 'ది క్రికెట్ మంత్లీ'తో మిథాలీ చెప్పారు.
తన కష్టానికి, త్యాగాలకు ప్రతిఫలంగా 1999లో కేవలం 16 ఏళ్ల వయసులోనే భారత సీనియర్ మహిళల క్రికెట్ జట్టులోకి అడుగు పెట్టారు.

ఫొటో సోర్స్, Getty Images
'లేడీ సచిన్ టెండూల్కర్'
అంతర్జాతీయ మహిళల క్రికెట్‌లో వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు ఇప్పటికీ మిథాలీ రాజ్ పేరిటే ఉంది.
23 ఏళ్ల క్రికెట్ ప్రస్థానంలో వన్డేల్లో 50కిపైగా యావరేజ్‌తో 7805 పరుగులు చేశారు. అందులో 7 సెంచరీలు, 64 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన రికార్డు కూడా మిథాలీదే.
2002లో ఇంగ్లండ్‌పై 214 పరుగులు సాధించి టెస్టుల్లో డబుల్ సెంచరీ చేసిన తొలి భారత మహిళా క్రికెటర్‌గా నిలిచారు. 2024లో షెఫాలీ వర్మ డబుల్ సెంచరీ కొట్టే వరకు కూడా ఈ రికార్డు ఆమె పేరు మీదే ఉంది.
నిరంతరంగా పరుగులు చేయడం వల్ల మిథాలీని "లేడీ సచిన్", "మహిళా టెండూల్కర్" అని పిలిచేవారు. అయితే, మిథాలీ వాటిని పెద్దగా పట్టించుకునేవారు కాదు.
"నన్ను విమెన్స్ క్రికెట్‌కు చెందిన మిథాలీ రాజ్‌గానే గుర్తించాలనుకుంటున్నాను. క్రీడల్లో నాకంటూ సొంత గుర్తింపు ఉండాలన్నది నా కోరిక" అని మిథాలీ రాజ్ 2018లో అన్నారు.
ఆ క్రమంలోనే విమెన్స్ క్రికెట్‌లో మిథాలీ సాధించిన గుర్తింపు నిజంగా చెక్కు చెదరనిది.

ఫొటో సోర్స్, Getty Images
కఠిన సమయాల్లోనూ పట్టు వదలని మిథాలీ
మిథాలీ కెరియర్‌లో ఆమె సాధించిన రికార్డులతో పాటు ఆమె సహనానికి పరీక్ష పెట్టిన సందర్భాలు ఉన్నాయి.
ఆమె కెరియర్ మధ్యలో ఉన్నప్పుడు మహిళల క్రికెట్ గవర్నింగ్ బాడీలో వచ్చిన మార్పుల కారణంగా జట్టుకు తక్కువ అవకాశాలు వచ్చాయి.
1999లో మిథాలీ అరంగేట్రం చేసే సమయంలో మహిళల క్రికెట్‌ను 'విమెన్స్ క్రికెట్ ఆసోసియేషన్ ఆఫ్ ఇండియా' చూసుకునేది.
2006లో 'బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా- బీసీసీఐ' తమ ఆధ్వర్యంలోకి తీసుకునే సమయానికి, మిథాలీ రాజ్ 86 వన్డేలు, 8 టెస్టు మ్యాచులు ఆడారు.
అంటే 'డబ్ల్యూసీఏఐ' ఆధ్వరంలో ఏడాదికి 14 వన్డేలు, ఒక టెస్టు మ్యాచ్ ఆడారు.
దీనికి భిన్నంగా 2007 నుంచి 2015 జూన్ వరకు మిథాలీ 67 వన్డేలు ఆడారు. అంటే ఏడాదికి 8 మాత్రమే. మొత్తంగా కేవలం 2 టెస్టు మ్యాచులే ఆడారు.
2015 మేలో మహిళా క్రికెటర్‌లకు కాంట్రాక్ట్స్ ఇస్తామని, దేశవ్యాప్తంగా మహిళా క్రికెట్‌ను విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.
మహిళల క్రికెట్‌ను తన ఆధ్వర్యంలోకి తీసుకుని, బీసీసీఐ ఈ ప్రకటన చేసే మధ్యలో 8 ఏళ్లపాటు ఒక తరం మహిళా క్రికెటర్లు నష్టపోయారు. నిలకడగా కొనసాగింది ఎవరైనా ఉన్నారా? అంటే అది మిథాలీ, గోస్వామి మాత్రమే.
"అది చాలా కఠినమైన ప్రయాణం" అని మిథాలీ రాజ్ చెప్పారు.
"ఈ సమాజం మహిళా క్రికెటర్లను ఎలా చూస్తోంది అనేది ప్రధానం. కెరియర్ తొలినాళ్లలో అసలు మహిళలకు ప్రత్యేకంగా క్రికెట్ టీమ్ ఉందా? వంటి ప్రశ్నలు ఎదుర్కొన్నాను" అని మిథాలీ తెలిపారు.
మిథాలీ రాజ్ చూపించిన నిబద్ధత, ఓర్పుకు ప్రతిఫలంగా 2017 తరువాత భారత మహిళల క్రికెట్ టీమ్ తన కెప్టెన్సీలో వన్డే, టీ20 వరల్డ్ కప్ పోటీల్లో ఫైనల్స్‌కు చేరింది.

ఫొటో సోర్స్, Getty Images
‘ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నా’
ప్రస్తుతం యువ మహిళా క్రికెటర్లు మిథాలీ రాజ్ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు.
2005 వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్‌లో న్యూజీలాండ్‌పై మిథాలీ చేసిన 91 పరుగుల మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చూసి, తాను కూడా క్రికెట్ వైపు అడుగులు వేస్తానని బ్యాటర్ వేదా కృష్ణమూర్తి తన తల్లిదండ్రులను ఒప్పించారు.
విమెన్స్ క్రికెట్ అనే ప్రస్తావన వస్తే అందరూ మిథాలీ రాజ్‌లా కావాలని కోరుకుంటారని స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన అన్నారు.
అయితే, మిథాలీ రాజ్ మాత్రం సాధించాల్సినవి ఇంకా చాలా ఉందని అంటారు.
"విమెన్స్ క్రికెట్‌లో మరి ముఖ్యంగా భారత్‌లో వస్తున్న మార్పుల్లో నేను భాగమవ్వడం సంతోషంగా ఉంది. పురుషుల, మహిళల క్రికెట్‌ను ప్రజలు సమానంగా చూసే రోజున నేను జీవించే ఉంటాననుకుంటున్నా" అని మిథాలీ రాజ్ 2016లో అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















