షేక్ హసీనా బంగ్లాదేశ్‌ను వీడిన 6 నెలల తర్వాత కూడా అక్కడ అనిశ్చితి ఎందుకు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జుగల్ పురోహిత్
- హోదా, బీబీసీ ప్రతినిధి
"డెవిల్ అంటే అర్థమేంటి? చట్టాన్ని ధిక్కరించి, దేశాన్ని అస్థిరపరుస్తున్న దెయ్యమే మా లక్ష్యం. తీవ్రవాదులు, దుష్ట శక్తులే మా లక్ష్యాలు".. ఆపరేషన్ 'డెవిల్ హంట్' గురించి హోంశాఖ అధిపతి, బంగ్లాదేశ్ మాజీ లెఫ్టినెంట్ జనరల్ జహంగీర్ ఆలం చౌదరి ఇటీవలి ప్రకటనలో చేసిన వ్యాఖ్యలివి.
ప్రభుత్వ గణాంకాల ప్రకారం, ఫిబ్రవరి 26 నాటికి.. ఈ ఆపరేషన్ చేపట్టిన 18 రోజుల్లో 9 వేల మందికిపైగా అరెస్టు చేశారు. ఈ అరెస్టులు ఇంకా కొనసాగుతున్నాయి.
అసలు ఈ ఆపరేషన్ డెవిల్ హంట్ కథేంటి? బంగ్లాదేశ్‌లో సామాన్య ప్రజలు తాము భద్రంగా ఉన్నామని భావిస్తున్నారా? చట్టాన్ని ఉల్లంఘిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నారా? మధ్యంతర ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న నోబెల్ శాంతి బహుమతి విజేత యూనస్ ఏమంటున్నారు?


ఫొటో సోర్స్, Getty Images
ఆరు నెలల క్రితం బంగ్లాదేశ్‌లో విద్యార్థుల దేశవ్యాప్త ఉద్యమం తీవ్రతరం కావడంతో, అప్పటి ప్రధాన మంత్రి షేక్ హసీనా నుంచి పారిపోయి భారత్‌లో ఆశ్రయం తీసుకున్నారు. 1971 బంగ్లాదేశ్ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న వారి పిల్లలు, వారసులకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లను విద్యార్థులు వ్యతిరేకించారు.
షేక్ హసీనా దేశ ప్రజలను ఉద్దేశించి ఆన్‌లైన్‌లో ప్రసంగిస్తారని ఫిబ్రవరి 5న ఆమె పార్టీ అవామీ లీగ్, పార్టీ ఫేస్‌బుక్ పేజ్‌లో ప్రకటించింది.
ఈ ప్రకటన తర్వాత, హసీనాను వ్యతిరేకిస్తున్న కొంతమంది విద్యార్ధులు, రాజకీయ నాయకులు 32 ధన్‌మోండీని ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. 32 ధన్‌మోండీ, షేక్ హసీనా తండ్రి ముజిబుర్ రెహమాన్ నివాసం. ప్రస్తుతం ఇదొక మ్యూజియం.
షేక్ హసీనా ప్రసంగం ప్రారంభం కాకముందే ఒక గుంపు ఆ భవనానికి నిప్పుపెట్టి, బుల్డోజర్‌తో ధ్వంసం చేసింది. భద్రతా సిబ్బంది సమక్షంలోనే జరిగిన ఈ దాడి ఫిబ్రవరి 5 సాయంత్రం ప్రారంభమై, మరుసటి రోజు వరకూ కొనసాగింది.
ఆ తర్వాత దేశంలోని వివిధ ప్రాంతాల్లో అవామీలీగ్ నాయకుల ఆస్తులపైనా దాడులు జరిగాయి. ఢాకా నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఘాజీపూర్‌లో ఓ నాయకుడి ఇంటిపై దాడి జరిగినప్పుడు ఆయన కుటుంబ సభ్యులు ప్రతిఘటించారు. ఈ దాడిలో ఒకరు మరణించారు. 17 మందికి గాయాలయ్యాయి.
వేల మంది అరెస్ట్, అయినప్పటికీ ప్రజల్లో భయం
ఘాజీపూర్ సంఘటన తర్వాత, ప్రభుత్వం ఫిబ్రవరి 8న ఆర్మీ, పారా మిలటరీ బలగాలు, పోలీసులతో దేశవ్యాప్తంగా ఉమ్మడి ఆపరేషన్ మొదలు పెట్టింది. ఆపరేషన డెవిల్ హంట్‌లో భాగంగా ఫిబ్రవరి 26 నాటికి 9వేల మందికి పైగా అనుమానితుల్ని అరెస్టు చేసింది.
వేల మందిని అరెస్ట్ చెయ్యడంతో దేశంలో శాంతి భద్రతల పరిస్థితి మెరుగవుతుందని ఆశించారు. అయితే ఢాకాలో ప్రజలతో మాట్లాడినప్పుడు, ప్రస్తుతం జరుగుతున్న ఆందోళనల్ని పరిశీలించిన తర్వాత, ప్రజల్లో భయం గూడుకట్టుకుందని స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకిలా?
"నేను ఈ దేశంలో జీవించాలనుకుంటున్నాను. అయితే ముందు నాకు భద్రత కావాలి. ఇది నా ఒక్కడి అభిప్రాయం మాత్రమే కాదు, ప్రజలందరి ఆలోచన ఇదే. పట్టపగలే దాడులు జరుగుతున్నాయి. ఇది చూస్తుంటే నేరగాళ్లకు అసలు భయం అన్నది లేనట్లుగా కనిపిస్తోంది" అని ఢాకాలో విద్యార్థి నాయకుడు నజిఫా జన్నత్ చెప్పారు.
"మేము గత ప్రభుత్వాన్ని గద్దె దించి మీకు అధికారం అప్పగించాం. మిమ్మల్ని కూడా అధికారంలో నుంచి ఎలా దించివేయాలో మాకు తెలుసు" అని ఢాకా యూనివర్సిటీలో ఇటీవల జరిగిన ఆందోళనలో పాల్గొన్న ఓ విద్యార్ధిని బీబీసీతో అన్నారు.
ఇటీవల విద్యార్థి సంఘాలు న్యాయ వ్యవస్థపై ప్రశ్నల్ని సంధిస్తూ ఢాకాలోని సెక్రటేరియట్, షహీద్ మినార్ వద్ద ఆందోళన చేశాయి. విద్యార్థులతో పాటు కార్మికులు, రైతులు, భద్రతా బలగాలు, వైద్యులు తమ డిమాండ్ల కోసం వీధుల్లోకి వస్తున్నారు.
ఆందోళన చేస్తున్న విద్యార్థుల్లో కొంతమంది హోంశాఖమంత్రి జనరల్ జహంగీర్ చౌదరి రాజీనామా చేయాలని కోరుతున్నారు.
"శాంతి భద్రతలు క్షీణించడం వెనుక కొన్ని కారణాలు ఉన్నాయి. మేము వాటితో పోరాడుతున్నాం" అని ఆపరేషన్ డెవిల్ హంట్ ప్రారంభించిన 15 రోజుల తర్వాత బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ జనరల్ వఖేర్ ఉస్ జమాన్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
పోలీసుల మీద కేసులు ఎందుకు పెట్టారు?
పోలీసులు సరిగ్గా పని చెయ్యడం లేదని ఆర్మీ చీఫ్ అంగీకరించారు.
"ఇప్పుడు, పోలీసులు పని చేయడం లేదు. ఎందుకంటే వారిపై మీద అనేక కేసులు నమోదయ్యాయి. వాళ్లు గందరగోళంలో ఉన్నారు. వారి అధికారాలను తగ్గించడం వల్ల దేశంలో శాంతి నెలకొంటుందని మీరు భావిస్తే, అది సాధ్యం కాదు. మీరు (రాజకీయ నాయకులు) ఒకరినొకరు తిట్టుకోవడం, కొట్టుకోవడం, చంపుకోవడం లాంటివి ఆపకపోతే దేశ స్వాతంత్ర్యం, సార్వభౌమాధికారం ప్రమాదంలో పడుతుంది" అని జనరల్ జమాన్ అన్నారు.
"ప్రజల దృష్టిలో, హసీనా ప్రభుత్వంతో పోలీసు శాఖ అంటకాగింది. (హసీనా పాలనలో తీసుకున్న చర్యల కారణంగా) పోలీసులపై ఇప్పటికీ కోపం ఉంది. అందుకే పోలీసుల్ని వినియోగించుకునే విషయంలో మధ్యంతర ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇలాంటి చర్యలు పోలీసుల సమర్థతను దెబ్బ తీశాయి" అని డైలీ స్టార్ పత్రిక ఎడిటర్ మహుఫుజ్ అనామ్ చెప్పారు.
షేక్ హసీనా పాలనా కాలంలో పోలీసుల పని తీరు ఎలా ఉందనే దానిపై ఐక్యరాజ్య సమితి నివేదిక విడుదల చేసింది.
2024 ఆగస్టు 5 నుంచి షేక్ హసీనా భారత్‌లో ఉంటున్నారు. ఆమె మీద బంగ్లాదేశ్‌లో అనేక క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఆమెను బంగ్లాదేశ్ పంపించాలని ఆ దేశ ప్రభుత్వం భారత్‌ను కోరింది. దీన్ని భారతదేశం గుర్తించింది.
షేక్ హసీనా పాలనా కాలంలోని చివరి రోజుల్లో జరిగిన పరిణామాల గురించి ఐక్యరాజ్య సమితి ఒక నివేదిక ప్రచురించింది.
2024 జులై 15 నుంచి ఆగస్టు 5 వరకు జరిగిన విద్యార్థుల ఆందోళనల్లో 1400 మంది ప్రజలు మరణించినట్లు ఐక్యరాజ్య సమితి దర్యాప్తు నివేదిక వెల్లడించింది. భద్రతా బలగాలు ప్రయోగించిన బుల్లెట్ల వల్ల అనేక మంది గాయపడ్డారని తెలిపింది. ఆందోళనలు జరిగిన సమయంలో చెలరేగిన అల్లర్లలో 44 మంది పోలీసు అధికారులు కూడా మరణించారు.
"అప్పటి రాజకీయ నాయకత్వం ఆదేశాల ప్రకారం ఆందోళనలను అణచివేసేందుకు వందల సంఖ్యలో హత్యలు, ఏకపక్ష అరెస్టులు జరిగాయని చెప్పడానికి ఆధారాలు ఉన్నాయి" అని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కార్యాలయం అధిపతి వోకర్ తుర్క్ అన్నారు.
ఆ సమయంలో చెలరేగిన హింస పట్ల ఇప్పటికీ ఆగ్రహం వ్యక్తమవుతోంది. కొంతమంది విద్యార్ధి నాయకులు ఇటీవల 32 ధన్‌మోండీ దగ్గర జరిగిన విధ్వంసానికి తమ ప్రకటనల ద్వారా మద్దతిచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images
విద్యార్థి నాయకులు ఏం చెబుతున్నారు?
స్వాతంత్ర్య ఉద్యమానికి నాయకత్వం వహించిన షేక్ ముజిబుర్ రెహమాన్ నివాసమైన 32 ధన్‌మోండీని కొంతమంది గుంపు ఎలాంటి అడ్డంకులూ లేకుండా, చట్టాన్ని ఉల్లంఘిస్తూ బహిరంగంగా ధ్వంసం చేయడం, పాక్షికంగా కూల్చివేయడం గురించి కొంతమంది విద్యార్థి ఉద్యమ నాయకులను బీబీసీ ప్రశ్నించింది.
"నిజానికి, ఈ విధ్వంసం ఒక ప్రతిఘటన. ప్రజలు 32 ధన్‌మోండీ మీద దాడి చేయాలనుకుంటే ఆరు నెలల క్రితమే చేసి ఉండేవారు. కానీ, అలా జరగలేదు. ప్రజలకు పోలీసుల మీద నమ్మకం పోయింది. అందుకే కొన్నిసార్లు వాళ్లు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారు. ఇదంతా షేక్ హసీనా ప్రకటనల వల్లే జరుగుతోంది" అని వివక్షకు వ్యతిరేకంగా పోరాడుతున్న విద్యార్థి సంఘం నాయకుడు అరిఫుల్ ఇస్లామ్ చెప్పారు
ఈ దాడులపై స్పందించిన మధ్యంతర ప్రభుత్వం నాయకుడు ముహమూద్ యూనస్ షేక్ హసీనా, ఆమె పార్టీ నాయకుల ఇళ్లపై జరుగుతున్న దాడులను ఆపాలని ఫిబ్రవరి 7న కోరారు. అదే సమయంలో షేక్ హసీనా, ఆమె పార్టీ అవామీ లీగ్ నాయకుల పట్ల ప్రజల్లో ఆగ్రహం ఉందని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అరెస్టులపై ప్రశ్నలు, పోలీసుల మెతక వైఖరి
ఘాజీపూర్‌లో ఫిబ్రవరి 7న హసీనా ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన ఏకేఎం మోజమ్మెల్ హక్ ఇంటి మీద దాడి జరిగింది.
ఇందులో హింస చెలరేగడంతో ఒకరు మరణించారని, 17 మంది గాయపడ్డారని పోలీసులు చెప్పారు. గాయపడిన వారిలో ఎక్కు వమంది విద్యార్ధులు
ఘాజీపూర్‌లో హింసకు అవామీ లీగ్ కారణమని విద్యార్ధులు ఆరోపించారు. తర్వాతి రోజు ఘాజీపూర్ యాత్రకు పిలుపిచ్చారు.
విద్యార్థుల డిమాండ్‌తో మధ్యంతర ప్రభుత్వం ఫిబ్రవరి 8న ఆపరేషన్ 'డెవిల్ హంట్' ప్రకటించింది.
పోలీసుల అదుపులో ఉన్న వారి కుటుంబాలు భయం వల్ల మీడియాతో మాట్లాడేందుకు నిరాకరిస్తున్నాయి
చాలా సమయం వేచి చూసిన తర్వాత, బీబీసీ ప్రతినిధి ఘాజీపూర్‌లోని 24 ఏళ్ల అతికుర్ రహమాన్ కుటుంబాన్ని కలిశారు.
అతికుర్ రహమాన్ సిమ్ కార్డులు అమ్ముతారని, ఆయనకు ఒక దుకాణం ఉందని కుటుంబ సభ్యులు చెప్పారు.
"అతను చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారు. కాక్‌టెయిల్ బాంబులు విసిరారు అని ఆరోపిస్తూ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు మాకు తెలిసింది. ఇవన్నీ తప్పుడు ఆరోపణలు" అని ఆయన భార్య అఫ్రజా అక్తర్ మీమ్ తెలిపారు.
"వాస్తవానికి 2023 సెప్టెంబర్‌లో రెహమాన్ బైక్ ప్రమాదంలో గాయపడ్డారు. ఆయన దవడ పూర్తిగా విరిగిపోయింది. దవడకు సర్జరీ చేసినప్పుడు మెటల్ ప్లేట్స్ అమర్చారు. ఆయన ఆహారం తీసుకోలేకపోతున్నారు. జైలులో ఉండటంతో ఆయనకు సమయానికి మందులు కూడా అందడం లేదు. ప్రభుత్వం మాకు సాయాలి" అని అక్తర్ మీమ్ అభ్యర్థించారు.
తన కుమారుడికి జరిగిన ప్రమాదం, ఆ తర్వాత జరిగిన శస్త్ర చికిత్సల గురించిన పత్రాలను అతికుర్ రెహమాన్ తండ్రి బీబీసీ ప్రతినిధికి చూపించారు. రెహమాన్‌కు అవామీ లీగ్‌తో కానీ మరే ఇతర పార్టీతో కానీ ఎలాంటి సంబంధాలు లేవని అతని కుటుంబం చెప్పింది.
మొహమ్మద్ మోమినుద్దీన్ క్యాన్సర్‌తో బాధ పడుతున్నారు. ఆయన అవామీ లీగ్ పార్టీ సభ్యుడు కావడంతో ఆపరేషన్ 'డెవిల్ హంట్' కింద ఆయనను అరెస్ట్ చేశారు.
"ఐదేళ్లుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన ఎలా హింసాత్మక సంఘటనలు లేదా నేరాలకు పాల్పడగలరు? అర్థరాత్రి ఒకటిన్న సమయంలో మాట్లాడాలని చెబుతూ ఆయనను పోలీసులు తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆయన వెనక్కి రాలేదు. మేము పోలీస్ స్టేషన్‌కు వెళితే ఆయన లాకప్‌లో కనిపించారు" అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని మోమినుద్దీన్ బంధువు ఒకరు చెప్పారు.
అతనికి ఆపరేషన సంగతి ఏమైందని బీబీసీ ప్రతినిధి ఆ మహిళను ప్రశ్నించారు.
"ఇది చాలా బాధాకరం, మీరొక వ్యక్తిని దెయ్యమని ఎలా పిలుస్తారు? ఆయన అవామీ లీగ్ పార్టీ సభ్యుడు. అదే ఆయన చేసిన నేరం" అంటూ ఆమె అగ్రహం వ్యక్తం చేశారు.
అవామీ లీగ్‌పై నిషేధం విధించాలని 2023 ఆగస్టు నుంచి డిమాండ్ ఉంది. అయితే ఇప్పటి వరకూ పార్టీపై నిషేధం విధించడం లేదా అందులో సభ్యుడిగా ఉండటం అక్రమం అనే ప్రకటన ఏదీ రాలేదు.
ఇలాంటి కేసుల గురించి బీబీసీ ఘాజీపూర్ పోలీస్ కమిషనర్ మొహమ్మద్ నజ్ముల్ కరీమ్ ఖాన్‌ను ప్రశ్నించింది. "కచ్చితమైన ఆధారాలున్న కేసుల్లోనే అరెస్టులు జరిగాయి" అని ఆయన చెప్పారు.
మాజీ మంత్రి నివాసంపై దాడి చేసి హింసాత్మక చర్యలకు పాల్పడటంతో పాటు విధ్వంసానికి దిగిన వారిలో ఎవరిరైనా అరెస్ట్ చేశారేమోనని బీబీసీ తెలుసుకునే ప్రయత్నం చేసింది.
"హింసాత్మక సంఘటనలు, విధ్వంసం గురించి మాకు ఏదైనా ఫిర్యాదు వస్తే, తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఫిర్యాదు లేకున్నా సరే మేము చర్యలు తీసుకుంటాం" అని ఘాజీపూర్ మెట్రోపాలిటన్ పోలీస్ కమిషనర్ చెప్పారు.
దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా మిమ్మల్ని ఆపుతోంది ఏంటని బీబీసీ అడిగినప్పుడు"చర్యలు తీసుకునేందుకు మా వద్ద ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు" అని ఆయన అన్నారు.

ముజీబుర్ ఇంటిని ధ్వంసం చేసినవారిని అరెస్ట్ చేయలేదెందుకు?
హింసాత్మక ఘటనలపై దర్యాప్తు, దోషులను చట్టం ముందు నిలబెట్టడం వంట విషయాల్లో ఎలాంటి చర్యలూ తీసుకోకుండా చూస్తూ ఉన్నారంటూ వచ్చిన ఆరోపణలపై బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రెస్ సెక్రటరీ షఫీకుల్ ఆలం స్పందించారు.
"మేము పోలీసుల్ని అన్ని ప్రాంతాలకు పంపించాం. 32 ధన్‌మోండీకి సైన్యాన్ని పంపించాం. ఇలా విధ్వంసానికి దిగడం తప్పు. అయితే వాస్తవం ఏంటంటే వేల మంది ప్రజలు ఒక్కసారిగా వచ్చినప్పుడు వారిని నియంత్రించడం భద్రతా బలగాలకు సాధ్యం కాదు" అని బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వం ప్రెస్ కార్యదర్శి షఫీకుల్ అస్లామ్ అన్నారు.
విధ్వంసానికి పాల్పడిన వారిపై చర్యలు ఎందుకు తీసుకోలేదని బీబీసీ ప్రభుత్వ ప్రెస్ కార్యదర్శిని ప్రశ్నించింది. దానికాయన బదులిస్తూ "మేము దర్యాప్తు చేస్తున్నాం. శాంతి భద్రతల పరిస్థితి మెరుగుపడాలి. తమ ఇళ్లపై దాడులు జరుగుతున్నాయని, దోపిడీలు జరుగుతున్నాయని అనేక మంది ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో శాంతి భద్రతల స్థాపనే ప్రభుత్వ ప్రధాన కర్తవ్యం" అని అన్నారు.
ఢాకా యూనివర్సిటీ ప్రొఫెసర్ జొబైదా నస్రీన్ ప్రభుత్వ వ్యవహార శైలిపై సందేహాలు వ్యక్తం చేశారు.
"విద్యార్థులను సంతృప్తి పరిచేందుకే ప్రభుత్వం డెవిల్ హంట్ ప్రారంభించింది. అనంతరం గత ప్రభుత్వ బాధిత విద్యార్థులకు న్యాయం జరగాలని చెప్పింది. అయితే విద్యార్థులు ఎవరి మీదైనా దాడి చేస్తే వారికి కూడా న్యాయం కోరే హక్కు ఉండాలి. అలాంటి న్యాయం ఇప్పటి వరకు జరగడం లేదు. ముజిబుర్ రెహమాన్ ఇంటి మీదకు బుల్డోజర్ తీసుకుని ప్రదర్శనగా వెళ్లడాన్ని సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. అంటే దాడి ప్రారంభం కావడానికి ముందే ఈ విషయం గురించి ప్రభుత్వానికి తెలుసు. అయితే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఆ గుంపుకు ప్రభుత్వం మద్దతు ఇచ్చినట్లైంది" అని ఆమె అన్నారు.
సమాజం ముక్కలైనట్లుగా కనిపిస్తోంది. కొంతమంది చాటుమాటుగానైనా సరే, ప్రస్తుత ప్రభుత్వానికి, హసీనా పాలనను పోల్చి మాట్లాడుకుంటున్నారు.
"ముజిబుర్ రెహమాన్ ఇంటి మీద దాడి చెయ్యడానికి ముందు చూస్తే, ఇటీవల అంత పెద్ద హింసాత్మక ఘటనలేవీ జరగలేదు. హసీనా ప్రసంగం వల్లనే తాము దాడికి దిగాల్సి వచ్చిందని విద్యార్థులు చెబుతున్నారు. ఇది ఆందోళన కలిగిస్తోంది. ఎవరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకూడదు" అని ది డైలీ స్టార్ వార్తా పత్రిక ఎడిటర్ మఫుజ్ ఆనం చెప్పారు.
హసీనా పాలనా కాలాన్ని ప్రస్తావిస్తూ "అలాంటి పొరపాట్లు మరోసారి జరక్కుండా, ప్రస్తుత ప్రభుత్వం చట్టాన్ని నిస్పక్షపాతంగా అమలు చేయాలి" అని అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ హ్యూమన్ రైట్స్ వాచ్ గుర్తు చేసింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















