పురుషులకూ పొదుపు సంఘాలు.. ఎంత రుణం ఇస్తారంటే

పురుషులకు పొదుపు
    • రచయిత, గరికిపాటి ఉమాకాంత్‌
    • హోదా, బీబీసీ కోసం

మహిళలకు డ్వాక్రా గ్రూపులు ఉన్నట్లుగా ఏపీలో అసంఘటిత రంగంలోని పురుష కార్మికుల కోసం పొదుపు సంఘాలు ఏర్పాటవుతున్నాయి.

పట్టణాలతో పాటు ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలను ఆర్ధికంగా అభివృద్ధి చేసేందుకు డ్వాక్రా(డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ ఉమెన్‌ అండ్‌ చిల్డ్రన్‌ ఇన్‌ రూరల్‌ ఏరియాస్‌) పథకాన్ని 1982లో ప్రారంభించారు.

మహిళల ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచేందుకు వారికి స్వయం ఉపాధి కల్పించడమే ఈ డ్వాక్రా పథకం ముఖ్యోద్దేశం.

డ్వాక్రా గ్రూపు మహిళలకు తక్కువ వడ్డీతో రుణ సౌకర్యం ద్వారా జీవనోపాధి అందించడమే లక్ష్యంగా ఆ పథకాన్ని కేంద్రం అమల్లోకి తెచ్చింది.

ఇప్పుడు పట్టణాల్లో అసంఘటిత రంగంలో పనిచేసే పురుషులకు కూడా ఇదే మాదిరి స్వయం శక్తి బృందాలు ఏర్పాటు చేసి రుణాలను అందించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది.

ఆ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మిషన్‌ ఫర్‌ ఎలిమినేషన్‌ ఆఫ్‌ పావర్టీ ఇన్‌ మున్సిపల్‌ ఏరియాస్‌– మెప్మా) పురుషుల స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేస్తోంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
పురుషుల పొదుపు సంఘాలు
ఫొటో క్యాప్షన్, మెప్మా పురుషుల సహాయక సంఘాలు ఏర్పాటుచేస్తోంది.
సహాయక సంఘాలు ఏర్పాటుచేస్తున్న మెప్మా

విజయవాడ, విశాఖల్లో మెప్మా పైలట్‌ ప్రాజెక్టు

ఏప్రిల్‌ 1 నుంచి దేశవ్యాప్తంగా మొదలుకానున్న ఈ పథకానికి సంబంధించి రాష్ట్రంలోని విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో పైలట్‌ ప్రాజెక్టుగా ఇప్పటికే 2,841 గ్రూపులను ఏర్పాటు చేసినట్టు మెప్మా మేనేజింగ్‌ డైరెక్టర్‌ తేజ్‌ భరత్‌ బీబీసీకి వెల్లడించారు.

జాతీయ పట్టణ జీవనోపాధుల మిషన్‌ (ఎన్‌యూఎల్‌ఎం) 2.0 గైడ్‌ లైన్స్‌ ప్రకారం మహిళల స్వయం సహాయక గ్రూపుల మాదిరిగా పురుషులకు కూడా రుణాలను అందించేందుకు తోడ్పాటు అందిస్తామని తెలిపారు.

అసంఘటిత రంగ కార్మికులు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందేలా ఈ పథకాన్ని రూపొందించారని తేజ్‌ భరత్‌ తెలిపారు.

సహాయక సంఘాలు ఏర్పాటుచేస్తున్న మెప్మా
ఫొటో క్యాప్షన్, పురుషుల పొదుపు సంఘంలో కనీసం ఐదుగురు సభ్యులుండాలి

గ్రూపులో ఎంతమంది ఉండాలంటే..

కనీసం ఐదుగురు పురుషులతో గ్రూప్ ఏర్పాటు చేయాలి. గరిష్ఠంగా ఎంతమందైనా ఉండొచ్చు.

ఒక గ్రూపుగా ఏర్పడితే బ్యాంకులు రుణాలను అందజేస్తాయి.

ఆ మొత్తాలను తిరిగి వాయిదాల రూపంలో చెల్లించవచ్చు.

ఎంత రుణం వస్తుందంటే..

ప్రతి సభ్యుడు నెలకు కనీసం 100 రూపాయలు పొదుపు చేయాలి. ఉదాహరణకు ఐదుగురు సభ్యులు ఓ గ్రూపుగా ఏర్పడి.. ఒక్కొక్కరు ప్రతి నెలా రూ. 500... మూడు నెలల పాటు క్రమం తప్పకుండా పొదుపు చేస్తే ప్రభుత్వం రివాల్వింగ్‌ ఫండ్‌ కింద పాతికవేలు అందిస్తుంది.

ఈ మొత్తంతో ఆరు నెలల పాటు క్రమం తప్పకుండా గ్రూపు సభ్యులు పొదుపు చేస్తే అకౌంట్‌లో ఉన్న మొత్తానికి ఫస్ట్‌ లింకేజ్‌ కింద బ్యాంకు ఆరు రెట్లు రుణం అందిస్తుంది.

ఈ రుణానికి వడ్డీ మాఫీ కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే అందిస్తాయి.

సహాయక సంఘాలు ఏర్పాటుచేస్తున్న మెప్మా
ఫొటో క్యాప్షన్, ప్రస్తుతం ఆరు రంగాల్లోని కార్మికులతో పొదుపు సంఘాలు ఏర్పాటవుతున్నాయి.

ఈ ఆరు రంగాల్లోని కార్మికులకు రుణాలు

  • భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులు
  • తోపుడు బండ్లు, రిక్షా కూలీలు
  • గిగ్‌ వర్కర్స్‌ - స్విగ్గీ, జొమాటో వంటి ఆన్‌లైన్‌ సంస్థల్లో పనిచేసేవారు
  • వేస్ట్‌ వర్కర్స్‌ - పారిశుద్ధ్య కార్మికులు
  • డొమెస్టిక్‌ వర్కర్స్‌ - ఇళ్లల్లో పనిచేసే వాళ్లు, తోట మాలీలు
  • కేర్‌ వర్కర్స్‌ - వృద్ధులకు సహాయకులుగా పనిచేసే వాళ్లు, పిల్లల సంరక్షణ కేంద్రాల్లో పనిచేసేవారు

ఎన్‌యూఎల్‌ఎం 2.0 గైడ్‌ లైన్స్‌ మేరకు ఈ ఆరు అసంఘటిత రంగాల్లోని కార్మికులకు రుణాలను అందజేయిస్తామని మెప్మా ఎండీ తేజ్‌ భరత్‌ తెలిపారు.

పదిమంది కలిసి గ్రూపుగా ఏర్పడ్డాం..

''మాది విజయవాడ మధురానగర్‌.. నేను బిల్డింగ్‌ మేస్త్రీని.. మా ఫ్రెండ్స్‌ పదిమంది కలిసి చంద్రబోస్‌ కన్‌స్ట్రక్షన్‌'' పేరిట ఓ గ్రూపు పెట్టుకున్నాం.

జనవరిలో మొదలు పెట్టాం.. ప్రతి నెలా 500రూపాయలు పొదుపు చేస్తున్నాం. ఇంకా రుణం రాలేదు. కానీ ఇలా పొదుపు చేయడం బాగానే ఉంది '' అని భవన నిర్మాణ కార్మికుడు జి.రమేశ్ తెలిపారు.

ఫ్లిప్‌కార్డ్‌ డెలీవరీ బాయ్‌గా ఉన్న తాను మరో తొమ్మిది మంది కలిసి శివకాశీ గ్రూప్ పేరిట నెలకు మూడు వందల రూపాయలు పొదుపు చేస్తున్నామని త్వరలోనే రుణం వస్తుందని అధికారులు హామీనిచ్చారని విజయవాడ దేవీనగర్‌కు చెందిన గిగ్‌ వర్కర్‌ ఎం.దుర్గాప్రసాద్‌ చెప్పారు.

తాను మరో నలుగురితో కలిసి శ్రీ విజయదుర్గ గిగ్‌ వర్కర్స్‌ పేరిట గ్రూపుగా ఏర్పడి ప్రతి నెలా మూడు వందలు పొదుపు చేస్తున్నామని విశాఖలో డెలీవరీ బాయ్‌గా పనిచేస్తున్న ఆనంద్‌ చెప్పారు.

అయ్యప్ప భవననిర్మాణ కార్మికుల సంఘం పేరిట ప్రతి నెలా వెయ్యి రూపాయలు పొదుపు చేస్తున్నామని విశాఖకే చెందిన భవననిర్మాణకార్మికుడు తిరుపతిరావు, మరో నలుగురు చెప్పారు.

సహాయక సంఘాలు ఏర్పాటుచేస్తున్న మెప్మా
ఫొటో క్యాప్షన్, మెప్మా ఎండీ తేజ్‌భరత్‌

ఉపాధి పెంపే లక్ష్యం

''ఇలా పొదుపు సంఘాలను ఏర్పాటు చేయడం ద్వారా పురుషుల్లో పొదుపు అలవాటును మరింతగా పెంచవచ్చు. ఇక బ్యాంకుల నుంచి ఇప్పించే రుణాల ద్వారా వారి ఆర్ధిక స్థితిగతులు మరింతగా మెరుగు పడతాయని భావిస్తున్నాం.. ఇప్పుడు పైలట్‌ ప్రాజెక్టుగా విజయవాడ, విశాఖల్లో గ్రూపులు ఏర్పాటు చేస్తున్నాం. అనకాపల్లి, కాకినాడ, రాజమండ్రి పట్టణాల్లో కూడా వర్క్‌ మొదలు పెట్టాం, రాష్ట్రమంతటా అన్ని చోట్లా ఇలా పురుషులకు పొదుపు సంఘాలు ఏర్పాటు చేయిస్తాం'' అని మెప్మా ఎండీ తేజ్‌భరత్‌ బీబీసీకి తెలిపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)