యుక్రెయిన్‌లోని ఏఏ ఖనిజాలు ట్రంప్ కావాలంటున్నారు

ఖనిజాలు, యుక్రెయిన్

ఫొటో సోర్స్, Getty Images

యుక్రెయిన్‌లోని ఖనిజ నిక్షేపాలను యాక్సెస్ చేసే అవకాశం అమెరికాకు కల్పించే ఒప్పందానికి అంగీకారం కుదిరినట్లు కీయెవ్‌లోని ఒక సీనియర్ అధికారి ‘బీబీసీ’తో చెప్పారు.

ఒప్పందం సాకారమయ్యేలా కీలక సవరణలు చేయడానికి రెండు దేశాలు అంగీకరించాయని యుక్రెయిన్‌కు చెందిన అధికారి చెప్పారు.

మిగిలిన ఏ వివరాలనూ ఆ అధికారి వెల్లడించలేదు.

యుక్రెయిన్‌లోని 500 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 43 లక్షల కోట్లు) విలువైన ఖనిజ సంపద తమకు కావాలన్న గత షరతును అమెరికా ఇప్పుడు సడలించిందని మీడియా కథనాలు తెలిపాయి.

అయితే ఒప్పందానికి ప్రతిగా, యుక్రెయిన్‌కు అమెరికా ఎలాంటి భద్రత హామీ ఇవ్వలేదు. ఒప్పందం కోసం యుక్రెయిన్ విధించిన ప్రధాన షరతు భద్రతే అయినప్పటికీ ఆ దేశానికి హామీ లభించలేదు.

ఈ ఒప్పందంపై సంతకం చేయడానికి యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్‌స్కీ ఈ వారం వాషింగ్టన్‌కు రావచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇటీవల

ఇద్దరు నాయకులు ఒకరిపై ఒకరు తీవ్రవిమర్శలు చేసుకున్నారు.

ట్రంప్ ఖనిజాల ఒప్పందం ప్రతిపాదనను గతంలో జెలియెన్‌స్కీ తిరస్కరించారు. ''నా దేశాన్ని అమ్మబోను'' అని అన్నారు.

యుక్రెయిన్‌లో అరుదైన ఖనిజాల నిల్వలు భారీగా ఉన్నాయి. ఈ ఖనిజాలు ఉన్న కొన్ని ప్రాంతాలు ప్రస్తుతం రష్యా నియంత్రణలో ఉన్నాయి.

''మాకు 500 బిలియన్ డాలర్ల విలువైన ఖనిజాలు కావాలని నేను వారికి చెప్పాను. వారు దాదాపుగా దీనికి అంగీకరించారు'' అని ఫిబ్రవరి 10న ఫాక్స్ న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ అన్నారు.

''దీనిపై మేము సీరియస్‌గా చర్చించలేదు. నేను నా దేశాన్ని అమ్మలేను'' అని ట్రంప్ ఇంటర్వ్యూ తర్వాత జెలియెన్‌స్కీ వ్యాఖ్యానించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
అరుదైన ఖనిజాలు, యుక్రెయిన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, యుక్రెయిన్‌లో 21రకాల అరుదైన ఖనిజాలున్నాయి.

యుద్ధం ఇప్పుడు ముగుస్తుందా..?

రష్యాతో యుద్ధం కోసం జో బైడెన్ యంత్రాంగం యుక్రెయిన్‌కు బిలియన్ల డాలర్ల సహాయం అందించిందని, ప్రతిగా యుక్రెయిన్ తన విలువైన ఖనిజాలను అమెరికా ఉపయోగించుకోవడానికి అనుమతించాలని ట్రంప్ అన్నారు.

అమెరికా ఇప్పటివరకు యుక్రెయిన్‌కు 300 నుంచి 500 బిలియన్ డాలర్ల సాయం అందించిందని ట్రంప్ అన్నారు.

జెలియెన్‌స్కీని ట్రంప్ ఇటీవల నియంత అని విమర్శించారు. యుద్ధం మొదలవడానికి కారణం యుక్రెయినే అని ఆరోపించారు.

రష్యాకు వ్యతిరేకంగా యుక్రెయిన్‌కు అమెరికా మద్దతు కొనసాగడానికి ఈ ఖనిజ ఒప్పందాన్ని ఒక ముఖ్యమైన షరతుగా చూస్తున్నారు.

యుక్రెయిన్, రష్యా మధ్య కాల్పుల విరమణకు ఈ ఒప్పందం మొదటి అడుగు అవుతుందని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది.

యుక్రెయిన్‌ ఖనిజాలను అమెరికా తీసుకోవడాన్ని తాను వ్యతిరేకించబోనని రష్యా అధ్యక్షుడు పుతిన్ మంగళవారం(ఫిబ్రవరి 25న) అన్నారు.

ఇందులో రష్యా ఆక్రమించిన ప్రాంతాల్లోని ఖనిజాలు కూడా ఉన్నాయి.

ఈ ఒప్పందానికి ప్రతిగా యుక్రెయిన్‌కు అమెరికా ఎలాంటి భద్రతా హామీ ఇవ్వకపోయినప్పటికీ, ఇకనుంచి కాల్పుల విరమణ ప్రయత్నాలు వేగవంతమవుతాయని భావిస్తున్నారు.

అరుదైన ఖనిజాలు, యుక్రెయిన్

ఫొటో సోర్స్, Win McNamee/Getty Images

ఫొటో క్యాప్షన్, యుక్రెయిన్ ఖనిజాలపై దృష్టిపెట్టిన ట్రంప్

యుక్రెయిన్ ఖనిజాలపై ట్రంప్ ఎందుకు దృష్టి పెడుతున్నారు?

యుక్రెయిన్ ఖనిజాల కోసం ట్రంప్ ఎందుకు అంత ప్రాధాన్యం ఇస్తున్నారన్న ప్రశ్నలు వినపడుతున్నాయి.

ఎలక్ట్రిక్ కార్లు, ఆధునిక ఆయుధాలు, సైనిక పరికరాల తయారీలో ఉపయోంచే విలువైన ఖనిజ సంపదపై ట్రంప్ దృష్టిపడింది.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అరుదైన ఖనిజాల సరఫరాలో చైనా ఆధిపత్యం చెలాయిస్తోంది.

బహుశా చైనాకు చెక్ పెట్టడానికి, ఖనిజాల ఉత్పత్తి, సరఫరాలో అమెరికా వాటాను పెంచడానికి ట్రంప్ ప్రయత్నిస్తున్నారు.

అరుదైన భూ ఖనిజాల తవ్వకం, ప్రాసెసింగ్‌లో చైనా గత కొన్ని దశాబ్దాలుగా ఆధిపత్యం చెలాయిస్తోంది.

ప్రపంచంలో మొత్తం ఈ ఖనిజాల ఉత్పత్తిలో చైనా వాటా 60 నుంచి 70 శాతం వరకు ఉంటుంది. ప్రాసెసింగ్ సామర్థ్యంలో కూడా చైనాకు 90 శాతం వాటా ఉంది.

అరుదైన ఖనిజాల కోసం చైనాపై అమెరికా ఆధారపడటం ట్రంప్ యంత్రాంగానికి ఆందోళన కలిగిస్తోంది. ఆర్థిక, సైనిక రంగంలో చైనాతో పోటీలో ఇది అమెరికాను బలహీనపరచవచ్చని వారు భావిస్తున్నారు.

ప్రపంచంలో కీలకంగా భావించే 30 ఖనిజాల్లో 21 యుక్రెయిన్‌లో ఉన్నాయి. యుక్రెయిన్ దగ్గరున్న ఈ ఖనిజాల నిల్వలు మొత్తం ప్రపంచంలోని అరుదైన భూ ఖనిజాల నిల్వలలో 5 శాతం.

ఖనిజాల నిల్వలు చాలావరకు క్రిస్టలైన్ షీల్డ్ దక్షిణ ప్రాంతంలో ఉన్నాయి. ఈ ప్రాంతం అజోవ్ సముద్రం పరిధిలోకి వస్తుంది. ఇక్కడ చాలా ప్రాంతాలు ప్రస్తుతం రష్యా ఆక్రమణలో ఉన్నాయి.

ప్రస్తుతం యుక్రెయిన్‌లో కోటీ 90లక్షల టన్నుల గ్రాఫైట్ నిల్వలు ఉన్నాయి. దీనిని ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ఉపయోగిస్తారు.

ఎలక్ట్రిక్ వాహనాలకు ఉపయోగించే బ్యాటరీలను తయారు చేయడానికి అవసరమైన లిథియం నిల్వలు కూడా యుక్రెయిన్‌లో ఉన్నాయి. యూరప్‌లోని అతిపెద్ద లిథియం నిల్వల్లో మూడో వంతు యుక్రెయిన్‌లోనే ఉన్నాయి.

రష్యా దాడికి ముందు ప్రపంచంలోని టైటానియంలో ఏడు శాతం యుక్రెయిన్ ఉత్పత్తి చేసేది. విమానాల నుంచి విద్యుత్ కేంద్రాల వరకు అంతటా టైటానియం ఉపయోగిస్తారు.

యుక్రెయిన్‌లోని అరుదైన భూ ఖనిజ నిల్వలను రష్యా స్వాధీనం చేసుకుంది. రష్యా దాదాపు 350 బిలియన్ డాలర్ల విలువైన ఖనిజ వనరులను తన అధీనంలోకి తీసుకుందని యుక్రెయిన్ ఆర్థిక వ్యవహారాల మంత్రి యులియా స్విరిడెంకో చెప్పారు.

అరుదైన ఖనిజాలు, యుక్రెయిన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలో లిథియం ఉపయోగిస్తారు.

ఈ అరుదైన ఖనిజాలేంటి?

స్మార్ట్‌ఫోన్‌లు, కంప్యూటర్లు, వైద్య పరికరాలు వంటి అనేక వస్తువుల తయారీలో అరుదైన ఖనిజాలను ఉపయోగిస్తారు.

స్కాండియమ్, వాయీట్రియమ్, లేంథనమ్, సీరియమ్, ప్రెసిడోనియమ్, నియోడైమియం, ప్రోమేథియం, సమారియం, యూరోపియం, గాడోలినియం, టెర్బియం, డిస్ప్రోసియం, హోల్మియం, ఎర్బియం, థోలియం, లుటెటియం వంటివి అరుదైన భూ ఖనిజాల జాబితాలోకి వస్తాయి.

వాటి స్వచ్ఛమైన రూపాన్ని కనుగొనడం దాదాపు అసాధ్యం కావడంతో వాటిని అరుదైన ఖనిజాలుగా పిలుస్తారు. అయితే, ప్రపంచవ్యాప్తంగా ఈ ఖనిజాల నిల్వలు కొన్నిచోట్ల ఉన్నాయి.

థోరియం, యురేనియం వంటి రేడియోధార్మిక మూలకాలతో పాటు అరుదైన భూ ఖనిజాలు తరచుగా కనిపిస్తాయి. కానీ వాటిని వేరు చేయడానికి, చాలా విషపూరిత రసాయనాలు అవసరం. అందుకే వాటి ప్రాసెసింగ్ చాలా కష్టం, ఖరీదైన వ్యవహారం.

వీడియో క్యాప్షన్, యుక్రెయిన్‌లోని కీలక ఖనిజాలపై అమెరికాతో రాజీపడ్డ యుక్రెయిన్

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)