ప్రతిపక్ష హోదా కావాలంటే జగన్ జర్మనీ వెళ్లాలని పవన్ కల్యాణ్ ఎందుకన్నారు? ఆ దేశంలో ప్రతిపక్ష హోదా ఎవరికి ఇస్తారు

jagan, pawan

ఫొటో సోర్స్, facebook/ysjaganmohareddy/I&PR AP

    • రచయిత, ఇటికాల భవాని
    • హోదా, బీబీసీ ప్రతినిధి

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడి హోదా పొందే అర్హత లేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోమవారం అన్నారు.

ఆ పార్టీ వచ్చిన ఓట్ల శాతం ఆధారంగా జగన్‌కు ప్రతిపక్ష నేత హోదా రాదని.. అలాంటి హోదా కావాలంటే జర్మనీ వెళ్లాలని పవన్ అన్నారు.

అయితే, పవన్ కల్యాణ్ ఎందుకు అలా అన్నారు? జర్మనీ లో ప్రతిపక్ష నాయకుడి హోదా ఎవరికి ఇస్తారు? ఎలా ఇస్తారు?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సోమవారం వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌కు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనంటూ శాసనసభలో నినాదాలు చేశారు.

అసెంబ్లీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారపక్షంగా ఉన్నందున మిగిలిన ఏకైక పక్షం వైఎస్సార్‌సీపీకీ ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అని వైఎస్ఆర్‌సీపీ నాయకులు వాదించారు.

అనంతరం వారు సభను బహిష్కరిస్తూ బయటకు వెళ్లిపోయారు.

దీనిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. వచ్చే ఐదేళ్ల వరకు జగన్‌కు ప్రతిపక్ష హోదా లభించదని తేల్చి చెప్పారు.

‘ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ నేను కానీ నిర్ణయించింది కాదు. ఇది ప్రజల తీర్పు. రాజ్యాంగం నిర్దేశించిన రూల్. ఇది తెలిసి కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు విలువైన అసెంబ్లీ సమయాన్ని వృథా చేస్తున్నారు’ అని పవన్ కల్యాన్ అన్నారు.

నిబంధనల ప్రకారం పార్లమెంట్/ శాసన సభలో ప్రధాన ప్రతిపక్ష నేత హోదా దక్కాలంటే సభలో ఆ పార్టీకి కనీసం 10 శాతం సభ్యులుండాలి.

2024 ఎన్నికల్లో ఏపీ అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీకి 135, జనసేనకి 21, బీజేపీకి 8 స్థానాలొచ్చాయి. ఈ మూడు పార్టీల కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

వైఎస్‌ఆర్‌సీపీకి 11 స్థానాలు వచ్చాయి. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కాలంటే వైఎస్ఆర్సిపీకి కనీసం 18 మంది ఎమ్మెల్యేల బలం ఉండాలి కాని 11 స్థానాలను మాత్రమే ఆ పార్టీ గెలుచుకుంది

German Bundestag

ఫొటో సోర్స్, Getty Images

జర్మనీలో ప్రతిపక్ష నాయకుడి హోదా ఎలా ఇస్తారు

జర్మనీ రాజకీయ వ్యవస్థలో ఏ పార్టీ అయినా ఒంటరిగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తగినంత ఓట్లను పొందడం కష్టం.

అక్కడ బుందెస్టాగ్‌ (పార్లమెంట్)లో ప్రవేశించడానికి కనీసం 5 శాతం ఓట్లు దక్కాలి.

తాజాగా జర్మనీలో ఎన్నికలు జరిగాయి. కొన్ని రోజుల కిందటి వరకు ప్రతిపక్ష కూటమిగా ఉన్న క్రిస్టియన్ డెమొక్రటిక్ యూనియన్ (సీడీయూ), క్రిస్టియన్ సోషల్ యూనియన్ (సీఎస్‌యూ) 28.6% ఓట్లు సాధించింది.

అయితే సీడీయూ/సీఎస్‌యూకి 630 సీట్లు ఉన్న బుందెస్టాగ్‌లో కేవలం 208 సీట్లే దక్కాయి.

ప్రభుత్వం ఏర్పాటు కోసం అవసరమైన 316 సీట్ల లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది.

ప్రతిపక్ష పార్టీ విషయానికి వస్తే ప్రభుత్వ కూటమిలో లేని పార్టీలు అన్ని ప్రతిపక్ష పార్టీలే. సాధారణంగా మన దేశంలోనూ అంతే.

ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీల బాధ్యతలు ఎలా ఉంటాయో జర్మనీలో ప్రతిపక్షంలో ఉన్న పార్టీలకు అలాగే ఉంటుంది.

Pawan Kalyan

ఫొటో సోర్స్, facebook/Pawan Kalyan

పవన్ కల్యాణ్ ఎందుకు అలా అన్నారు?

మన దేశంలో ప్రధాన ప్రతిపక్ష నేతకు కొన్ని సదుపాయాలు, వసతులు ఉంటాయి.

ప్రధాన ప్రతిపక్ష నేతకు కేబినెట్ మంత్రి హోదా ఉంటుంది. సభలో సీట్ల కేటాయింపులో విపక్షానికి ప్రాధాన్యం దక్కుతుంది.

పీఎస్, పీఏ సహా సిబ్బంది, అలవెన్సులతో పాటు ప్రోటోకాల్ కూడా వర్తిస్తుంది.

సభలో చర్చల సందర్భంగా స్పీకర్ అనేక సందర్భాల్లో ప్రధాన ప్రతిపక్ష నేతను సంప్రదించడం ఆనవాయితీ.

సభలో ప్రశ్నలు వేసే విషయంలో కూడా ప్రాధాన్యం ఉంటుంది.

అయితే పవన్ కల్యాణ్ వాఖ్యలకు కారణం జర్మనీ ఓటింగ్ విధానం. ఇది భారతదేశంలో ఓటింగ్ ప్రక్రియ కంటే చాలా భిన్నమైంది.

జర్మనీలో ప్రతి ఓటర్ ఒకే బాలట్ పేపర్‌లో రెండు ఓట్లు వేస్తారు.

పార్లమెంటులో సగం సీట్లు స్థానిక ప్రతినిధుల కోసం కేటాయిస్తారు. మిగతా సగం పార్టీలకు కేటాయిస్తారు.

బ్యాలట్ పేపర్‌లో సగ భాగంలో అభ్యర్థుల పేర్లుంటాయి, రెండో సగభాగంలో పార్టీల పేర్లుంటాయి.

ఒక ఓటు అభ్యర్థికి, రెండో ఓటు పార్టీకి వేయాల్సి ఉంటుంది.

ఏదైనా ఒక పార్టీ, అదే పార్టీకి చెందిన అభ్యర్థికి ఓటర్లు ఓటు వేయొచ్చు.. పార్టీకి వేసిన ఓటు ఒకరికి.. అభ్యర్థికి వేసిన ఓటు ఇంకొకరికి కూడా వేయొచ్చు.

ఇవన్నీ పక్కన పెడితే అక్కడ ప్రతిపక్ష పార్టీలన్నిటిలోనూ ఎక్కువ శాతం ఓట్లు తెచ్చుకున్న పార్టీకి ప్రజల్లో, సభలో అనధికారికంగా ప్రధాన ప్రతిపక్ష హోదా ఉంటుంది.

అందుకే పవన్ కల్యాణ్ వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు జగన్ జర్మనీకి వెళ్లాలంటూ వ్యాఖ్యలు చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

కాగా పవన్ వ్యాఖ్యలపై వైఎస్‌ఆర్‌సీపీ నేత, శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ స్పందిస్తూ అసెంబ్లీలో పవన్ కల్యాణ్ కావాలంటే ప్రతిపక్ష పాత్ర పోషించొచ్చన్నారు.

ప్రభుత్వం చేసే తప్పులను ఆయన ప్రశ్నించొచ్చు అని బొత్స అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)