సినీ నటి శ్రీదేవి సహా అనేకమంది మృతదేహాలను ఉచితంగా స్వదేశానికి పంపించిన అష్రఫ్ థామారాస్సెరీ ఎవరు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అమితాబ్ భట్టాశాలి
- హోదా, బీబీసీ ప్రతినిధి
అది 2018 ఫిబ్రవరి 24. దుబయ్ హోటల్లో బాలీవుడ్ సూపర్‌స్టార్ శ్రీదేవి మరణం లక్షల మంది అభిమానులను విషాదంలోకి నెట్టింది.
ఇది జరిగిన కొన్నిరోజుల తర్వాత ఆమె 'ఎంబామింగ్ సర్టిఫికేట్', భారత్‌లోని మీడియా చేతికి చిక్కింది. ఆ సర్టిఫికెట్ మీద ఒక ఫోన్ నంబర్ రాసి ఉంది.
అది అష్రఫ్ థామారాస్సెరీ అనే వ్యక్తి నంబర్. శ్రీదేవి మృతదేహాన్ని ఆమె కుటుంబం తరఫున అధికారుల నుంచి ఆయనే స్వాధీనం చేసుకున్నారు. తర్వాత భారత్‌కు పంపించారు.
కేరళకు చెందిన అష్రఫ్ ఇప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని అజ్మాన్‌లో ఉంటున్నారు.
2018లో ఇదంతా జరిగిన సమయంలో నేను ఆయనతో మాట్లాడాను. ఆ తర్వాత కూడా మేం చాలాసార్లు మాట్లాడుకున్నాం.

అయితే అష్రఫ్‌కు, శ్రీదేవికి మధ్య సంబంధం ఏంటనే ప్రశ్న మీకు వచ్చి ఉండొచ్చు. శ్రీదేవికి మాత్రమే కాదు, మధ్యప్రాచ్య దేశాల్లో నివసించే చాలామంది వలసదారులకు ఆయనొక 'లాస్ట్ ఫ్రెండ్'. అంటే ఆఖరి స్నేహితుడు.
మధ్యప్రాచ్య దేశాలకు వలసవచ్చిన వారు ఎవరైనా అక్కడే చనిపోతే ఆ మృతదేహాన్ని ఉచితంగా బంధువులకు అప్పగించే ఏర్పాట్లను అష్రఫ్ చేస్తుంటారు.
ఆయన దాదాపు 25 ఏళ్లుగా ఈ పని చేస్తున్నారు. ఇందుకు చాలామంది ఆయనను మెచ్చుకున్నారు. సంవత్సరాలుగా ఎన్నో కుటుంబాల అభిమానాన్ని ఆయన పొందారు. వారి కుటుంబాల్లో ఆయన ఒక సభ్యుడు అయ్యారు.
భారత ప్రభుత్వం కూడా ఆయనను ప్రత్యేక గౌరవంతో సత్కరించింది.

ఫొటో సోర్స్, Lipi Publications
'మండల్ కోల్‌కతా బిర్యానీ'
పశ్చిమ బెంగాల్‌లోని నాడియా నుంచి షెఫ్‌గా పని చేసేందుకు యూఏఈ వెళ్లిన ఝనూ మండల్‌కు కూడా ఆయనే ఆఖరి స్నేహితుడిగా వ్యవహరించారు.
నిరుడు నవంబర్ 30న సాయంత్రం 3:30-4:00 గంటల మధ్య నాడియాలోని సోనియా మండల్‌కు ఒక ఫోన్‌కాల్ వచ్చింది. దుబయ్ నుంచి పాకిస్తాన్ పౌరుడు ఆబేద్ గుజ్జర్ ఆ ఫోన్ కాల్ చేశారు.
''ఆబేద్ అంకుల్ మా నాన్న ఫ్రెండ్. మా నాన్న చనిపోయారని ఆయన ఫోన్‌లో చెప్పగానే మేం కుప్పకూలిపోయాం'' అని బీబీసీతో ఝునూ మండల్ పెద్ద కూతురు సోనియా చెప్పారు.
ఝునూ మండల్ అద్భుతంగా బిర్యానీ చేసేవారని, అందుకే హోటల్ యజమాని ఆ హోటల్‌కు 'మండల్ కోల్‌కతా బిర్యానీ' అని పేరు పెట్టారని సోనియా చెప్పారు.
ఆయన దాదాపు 25 ఏళ్లుగా మిడిల్ ఈస్ట్‌లోనే ఉంటున్నారు. గుండె జబ్బు కారణంగా గత ఏడాది నవంబర్‌లో ఝునూను ఆసుపత్రిలో చేర్చారు. ఇలా ఆయన మరణవార్త వినాల్సి వస్తుందని ఆయన భార్య, ఇద్దరు కుమార్తెలు కలలో కూడా అనుకోలేదు.
ఆయన మృతదేహాన్ని భారత్‌కు ఎలా తీసుకురావాలని వారి కుటుంబం చాలా ఆందోళన చెందింది.
''ఆబేద్ అంకుల్ మాకు అష్రఫ్ సర్ నంబర్ ఇచ్చారు. తర్వాత ఆయనే అన్నీ చూసుకున్నారు. రెండు వారాల తర్వాత మా నాన్న శవపేటిక కోల్‌కతాకు వచ్చింది.'' అని సోనియా వివరించారు.

ఫొటో సోర్స్, Lipi Publications
'నేను కేరళలో ట్రక్కు నడిపేవాడిని'
అష్రఫ్‌ది కేరళ. 1993లో ఆయన తొలిసారి మిడిల్ ఈస్ట్‌కు వెళ్లారు. సౌదీ అరేబియాలో ఉన్నారు. అక్కడికి వెళ్లకముందు కేరళలో ట్రక్కు నడిపేవారు.
కొన్నేళ్లు సౌదీలో ఉన్న తర్వాత మళ్లీ భారత్‌కు తిరిగొచ్చారు. 1999లో తన బావమరిదితో కలిసి యూఏఈకి వెళ్లారు. వీరిద్దరూ కలిసి అజ్మాన్ నగరంలో ఒక గ్యారేజ్ తెరిచారు.
వలసదారులకు 'లాస్ట్ ఫ్రెండ్'గా మారడంతో ఇప్పుడు మిడిల్ ఈస్ట్‌లో ఆయన పాపులారిటీ పెరిగింది.
శ్రీదేవి కుటుంబం నుంచి ఝునూ మండల్ వరకు ఇలాంటి వేల కుటుంబాలకు ఆయన చివరి ఆశగా మారారు.
తాను ఇప్పటివరకు 15,000 మృతదేహాలను 40కి పైగా దేశాల్లోని ఆయా కుటుంబీకుల వద్దకు చేర్చానని ఆయన చెప్పారు. ఇదే కాకుండా దాదాపు రెండు వేల మృతదేహాలకు మిడిల్ ఈస్ట్‌లోనే ఖననం చేయడానికి ఏర్పాట్లు కూడా చేశారు.
ఆయన అత్యధికంగా మృతదేహాలను తన సొంత రాష్ట్రమైన కేరళకు పంపారు. దీనితో పాటు పశ్చిమ బెంగాల్, ఒడిశా, అస్సాం రాష్ట్రాల్లోని చాలా కుటుంబాలకు వారి బంధువుల మృతదేహాలను పంపడంలో కీలక పాత్ర పోషించారు.
బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్ దేశాల్లోని కుటుంబాలకు కూడా ఆయన ఈ సేవ చేశారు. యూరప్, అమెరికా, ఆఫ్రికాలోని వివిధ దేశాల నుంచి వలస వచ్చిన వారి మృతదేహాలను పంపడానికి కూడా ఆయన ఏర్పాట్లు చేశారు.
అనేక దేశాలకు చెందిన వివిధ మతాల వారికి ఈయన ఈ సహాయం చేశారు.

ఎలా మొదలైంది?
యూఏఈలోని అజ్మాన్ నగరంలో గ్యారేజ్‌ను నడిపే అష్రఫ్, 2000లో అనారోగ్యంతో ఉన్న తన స్నేహితుడిని చూసేందుకు షార్జాకు వెళ్లారు.
తిరిగొచ్చేటప్పుడు ఆయనకు ఏడుస్తున్న ఇద్దరు యువకులు కనిపించారు. బహుశా వారిద్దరూ కేరళకు చెందినవారై ఉంటారని అనుకున్నానని ఆయన చెప్పారు.
''ఎందుకు ఏడుస్తున్నారని వాళ్లను అడిగాను. వాళ్ల నాన్న చనిపోయారని, భారత్‌కు ఆయన మృతదేహాన్ని ఎలా తీసుకెళ్లాలో తెలియడం లేదని చెప్పారు. నాకు కూడా అప్పుడు ఆ ప్రక్రియ గురించి ఏమీ తెలియదు. కానీ, నాకు వీలైనంత సహాయం చేస్తానని వాళ్లకు మాటిచ్చాను. దాంతో వాళ్లు కాస్త కుదుటపడ్డారు'' అని ఆయన చెప్పారు.
ఆ తర్వాత ఆయా దేశాలకు మృతదేహాలను పంపే ప్రక్రియ గురించి స్థానిక పోలీసులను అడిగి తెలుసుకున్నానని తెలిపారు అష్రఫ్.

ఫొటో సోర్స్, Lipi Publications
''మొదట పోలీసులకు సమాచారం ఇచ్చాను. వారి నుంచి అనుమతి పొందాను. తర్వాత ఎంబసీకి దీని గురించి చెప్పాను. చనిపోయిన వ్యక్తి వీసాను రద్దు చేయాల్సి ఉంటుందని వాళ్లు నాకు చెప్పారు. ఆ ప్రక్రియ పూర్తి చేయడానికి అయిదు రోజులు పట్టింది. చివరకు అన్ని ప్రక్రియలు పూర్తయిన తర్వాత, అయిదో రోజు దుబయ్ నుంచి శవపేటికలో ఆయన మృతదేహాన్ని భారత్‌కు పంపించాం'' అని ఆయన గుర్తు చేసుకున్నారు.
తన పనిని వదులుకొని, ఒక అపరిచితుడి మృతదేహాన్ని వారి కుటుంబం వద్దకు ఆయన చేర్చిన విషయం ఆనోటా ఈనోటా అంతటా పాకింది. దీని కారణంగా, కొన్నిరోజులకు ఆయనకు మరో ఫోన్ కాల్ వచ్చింది.
పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఒక యువకుడు మరణించారని, ఆయనను భారత్‌కు పంపడానికి ఏర్పాట్లు చేయాలని ఫోన్‌లో ఆయనను కోరారు. అయితే, ఆ మృతదేహం వెంట భారత్‌కు వెళ్లేవారు ఎవరూ లేరు.
అప్పుడు, అష్రఫ్ స్వయంగా విమానం టికెట్ కొని మృతదేహం ఉన్న శవపేటికను తీసుకొని కోల్‌కతాకు వెళ్లారు.
''చాలా వరకు నేను విమానాల్లో మృతదేహాలను పంపిస్తాను. కానీ, కొన్నిసార్లు స్వయంగా నేనే వెళ్లి వారి కుటుంబాలకు మృతదేహాలను అప్పగించి వస్తాను'' అని ఆయన చెప్పారు.
చాలాసార్లు ఆయన సొంత డబ్బులతో విమాన టిక్కెట్లు కొని మృతదేహాలను వారి కుటుంబీకుల చెంతకు చేర్చారు.

గ్యారేజ్‌ను తన బావమరిదికి అప్పగించిన అష్రప్ ఇదే పనిలో చాలా బిజీగా గడుపుతుంటారు.
కనీసం ఈద్ సమయంలో కూడా తన కుటుంబంతో ఆయన గడపలేకపోయారు. ఈ పని చేస్తున్నందున పరిచయస్థుల నుంచి లేదా అపరిచితుల నుంచి ఆయన అసలేమీ తీసుకోరు.
మరి ఈ ఖర్చులన్నింటికీ డబ్బు ఎలా?
''కొన్నిసార్లు కొందరు విరాళాలు ఇస్తుంటారు. కొన్నిసార్లు ఎన్జీవో సహాయపడుతుంది. నా గ్యారేజీని మా బావమరిదికి అప్పగించాను. దానికి బదులుగా ప్రతీనెలా ఆయన నాకు కొంత డబ్బు ఇస్తుంటారు. ఇలా నేను డబ్బును మేనేజ్ చేసుకుంటాను. ఇలా మృతదేహాలను వారి దేశాలకు పంపించినందుకు ఎప్పుడూ ఎవరి నుంచి నేను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు'' అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, two circles
అష్రఫ్‌పై పుస్తకం
అష్రఫ్ గురించి కేరళకు చెందిన ప్రముఖ జర్నలిస్ట్, రచయిత జి. ప్రజేశ్ సేన్ ఒక పుస్తకం రాశారు.
''ద లాస్ట్ ఫ్రెండ్- ద లైఫ్ ఆఫ్ అష్రఫ్ థామారాస్సెరి' పేరిట రాసిన ఈ పుస్తకంలో ఒక సంఘటన గురించి ప్రస్తావించారు.
ఒక బ్రిటిష్ ప్రవాసి మరణం తర్వాత ఆయన మృతదేహాన్ని తీసుకోవడానికి ఆయన భార్య దుబయ్‌కి వచ్చారు. ఆమె ఎయిర్‌ఫోర్స్‌లో పైలట్.
మృతదేహం అప్పగింతకు సంబంధించిన ప్రక్రియలన్నీ పూర్తయ్యాక విమానాశ్రయంలో ఆమె 5,000 డాలర్లు అష్రఫ్‌కు ఇవ్వబోయారు.
ఆ డబ్బును తీసుకోవడానికి తాను తిరస్కరించినందుకు ఆమె గట్టిగా అరవడం మొదలుపెట్టారని అష్రఫ్ చెప్పారు.
''ఆమె ఇస్తున్న డబ్బు తక్కువగా ఉందని నేను తీసుకోలేదని ఆమె భావించారు. అందుకే అరవడం మొదలుపెట్టారు. తర్వాత ఒక ఆమె భర్త పనిచేసే సంస్థకు చెందిన ఒక సూపర్‌వైజర్ ఆమెకు వివరించారు. వారు ఈ పని చేసినందుకు అసలు డబ్బు తీసుకోరు, ఇక ఎక్కువ, తక్కువ అనే ప్రసక్తే లేదు అని ఆమెకు ఆయన వివరించారు. తర్వాత ఆమె నా చేయి పట్టుకొని ఏడ్వటం మొదలుపెట్టారు.'' అని అష్రఫ్‌ను ఉటంకిస్తూ పుస్తకంలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Lipi Publications
భారత ప్రభుత్వ గౌరవం
దాదాపు 25 ఏళ్లుగా ఎవరి నుంచి ఏమీ తీసుకోకుండా వేలమంది వలసదారుల మృతదేహాలను స్వదేశాలకు పంపించడంలో ఆయన చేసిన కృషికి గుర్తుగా భారత ప్రభుత్వం 2015లో ఆయనను 'ప్రవాసీ భారతీయ సమ్మాన్' పురస్కారంతో సత్కరించింది.
వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి భారత ప్రభుత్వం ఈ అవార్డును అందిస్తుంది.
జి. ప్రజేశ్ సేన్ రాసిన పుస్తకంలో ఈ అవార్డు అందుకునే ముందు జరిగిన ఒక సంఘటన గురించి రాశారు.
ఎమిరేట్స్‌లో ఉంటున్న ఉత్తర భారత కుటుంబానికి చెందిన ఒక 12 ఏళ్ల బాలిక, ఇంటిపై నుంచి కిందపడి చనిపోయారు.
''ఆ బాలిక అంత్యక్రియలు ఎమిరేట్స్‌లోనే జరగాలి. నాకేమో మతమరమైన ఆచారాలు తెలియవు. కొంతమందితో మాట్లాడి వాటి గురించి కొంత సమాచారం తెలుసుకున్నాను. ఆ బాలిక మృతిని చూసి నేను కదిలిపోయాను. స్మశానం వద్ద ఆమె తల్లిదండ్రులను వదిలి వెనక్కి రాలేకపోయాను. నేను ఆ షాక్ నుంచి తేరుకోలేదు. అప్పుడే భారత రాయబార కార్యాలయం నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది.
అవతలివైపు నుంచి ఎవరో ఒక అధికారి ఏదో పురస్కారం గురించి నాతో మాట్లాడారు. 'నా దగ్గర డబ్బుల్లేవు, నేను ఏ అవార్డును కొనుక్కోలేను' అని సూటిగా చెప్పాను. అయితే ఎంబసీ వరకు ట్యాక్సీలో వచ్చేందుకు డబ్బులున్నాయా? అవి ఉంటే సరిపోతుందని అవతలి వైపు నుంచి వారు అన్నారు'' అని అష్రఫ్‌ను ఉటంకిస్తూ పుస్తకంలో రాశారు.
ఎంబసీకి చేరుకున్నాక, అక్కడ ఆయనకు దిల్లీకి వెళ్లేందుకు విమాన టిక్కెట్, ఒక ఉత్తరం ఇచ్చారు. ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ దిల్లీలో ఆయనకు పురస్కారాన్ని అందజేశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














