బూరుగు: స్వాతంత్య్రం వచ్చిన 77 ఏళ్ల తర్వాత ఈ ఊరికి కరెంటొచ్చింది..

- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
రోజుకు 12 గంటలే వెలుగు ఉండే ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి జిల్లా బూరుగు గ్రామానికి ఇప్పుడు రోజుకు 24 గంటల వెలుగు వచ్చింది.
వెలుగంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకే అని గడిపిన బూరుగు గిరిజనులు, ఇప్పుడు విద్యుత్ సౌకర్యం రావడంతో రాత్రి సమయంలో కూడా పనులు చేసుకోగలుతున్నారు.
చిన్నారులు 'కరెంట్ బుడ్డి' వెలుగులో ఆటలాడుతూ, చదువుకుంటూ మధ్యమధ్యలో ఆ ‘బుడ్డి’ని చూస్తూ ఆనందపడుతున్నారు.
ఈ గ్రామం పుట్టినప్పుటి నుంచి ఇక్కడి గిరిజనులకు విద్యుత్ వెలుగు అంటే ఏంటో తెలియదు.
ఇంత ఆధునిక కాలంలోనూ ఈ గిరిజన గ్రామానికి రోడ్డు, విద్యుత్ వంటి సౌకర్యాలు నిన్నమొన్నటి వరకు లేవు.


బూరుగు గ్రామంలోని గిరిజనుల జీవన పరిస్థితులపై 2022 ఆగస్టులో బీబీసీ కథనం ప్రచురించింది. అనంతరం అధికారులు ఈ గ్రామాన్ని సందర్శించారు. ఈ గ్రామానికి విద్యుత్, రోడ్డు సౌకర్యం కల్పిస్తామని పాడేరు ఐటీడీఏ అధికారులు బీబీసీతో చెప్పారు.
2025 ఫిబ్రవరి రెండోవారంలో ఈ గ్రామంలోని ఇళ్లకు విద్యుత్ లైన్లను వేసి, ఇంటింటికి కరెంట్ బుడ్లు (ఎలక్ట్రిక్ బల్బ్) వేశారు. దీంతో రాత్రి సమయంలో ప్రతి ఇంటి ముందు వెలుగుతున్న విద్యుత్ దీపాలు, చీకటి పడ్డాక కూడా బూరుగు అనే గ్రామం ఉందని తెలియజేస్తున్నాయి.
విద్యుత్ వచ్చిన రోజు నుంచి రోజూ రాత్రి విద్యుత్ బల్బుల వెలుగులో గిరిజనులు ఆనందంతో థింసా నృత్యం చేస్తున్నారు. గిరిజనులు విద్యుత్ బల్బ్ ను కరెంట్ బుడ్డీలు, కరెంటు బుడ్లు అని పిలుస్తూ సంబరపడుతున్నారు.

2022లో బీబీసీ బూరుగు ఎలా వెళ్లిందంటే...
2022 ఆగస్టులో ఒకరోజున నేను గిరిజన సంఘం నాయకుడితో ఫోన్‌లో మాట్లాడుతున్నాను. బూరుగు, చినకోనెల అనే గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించమని కోరుతూ అధికారులతో మాట్లాడేందుకు వెళ్లానని ఆయన చెప్పారు. అక్కడి గిరిజనులు ఎప్పుడు గ్రామంలో విద్యుత్ స్తంభం, బల్బు, విద్యుత్ తీగలు చూడలేదని చెప్పారు.
దీనికి రెండు వారాల ముందే 'ఉజ్వల భారత్- ఉజ్వల భవిష్య- పవర్ 2047' పేరుతో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన విద్యుత్ మహోత్సవంలో విద్యుత్ సౌకర్యం ఎలా ఉందంటూ అల్లూరి జిల్లా చింతపల్లి మండలంలోని రత్నగిరి కాలనీ వాసులతో ప్రధాని నరేంద్ర మోదీ అన్‌లైన్‌లో మాట్లాడారు. ఈ గ్రామానికి 2017లో దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామజ్యోతి యోజన పథకం కింద విద్యుత్ వచ్చింది.

విద్యుత్ లేని బూరుగు, చినకోనెల వంటి గ్రామాలను వదిలేసి విద్యుత్ ఉన్న గ్రామస్థులతో మాట్లాడటంపై గిరిజన సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.
ఈ నేపథ్యంలోనే దేశంలో ఇంకా విద్యుత్ లేని గ్రామలున్నాయనే విషయాన్ని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నంలో బూరుగు గ్రామంపై కథనం చేసేందుకు ఆ గ్రామానికి బయలుదేరింది బీబీసీ బృందం.
బూరుగులోనే ఒక రాత్రి బస చేసి, అక్కడి పరిస్థితులను బీబీసీ పరిశీలించింది. ఈ గ్రామాన్ని సూర్యాస్తమయంతో చీకటి కప్పేస్తుంది. ఆ తర్వాత వంట పని, ఇంటి పని, భోజనాలు, చదువులు అన్నీ చీకట్లోనే. రాత్రి సమయంలో సెల్ ఫోన్ టార్చ్, పొయ్యి వెలుగు, హెడ్ ల్యాంప్ ద్వారా గ్రామంలోని పరిస్థితులను చూశాం.

2025లో బీబీసీ వెళ్లినప్పుడు బూరుగు ఎలా ఉందంటే...
ఈ ఏడాది ఫిబ్రవరి రెండోవారంలో అక్కడికి వెళ్లాం. బూరుగు వెళ్లే రోడ్డు మార్గం అంతా గుంతలు ఏర్పడి, అంచులు కొండవైపు జారిపోతూ భయంకరంగా తయారయ్యాయి. ఆ మార్గంలోనే ప్రయాణం చేస్తూ బీబీసీ బూరుగు చేరుకుంది.
గ్రామంలోని ఇళ్ల సంఖ్య 75 నుంచి 60కి తగ్గింది. పనుల కోసం వేరే ఊర్లకి కొందరు వెళ్లిపోయారని గ్రామంలోని గిరిజనులు చెప్పారు. ఉన్న అన్ని ఇళ్ల ముందు వేలాడుతున్న విద్యుత్ బల్బులు కనిపించాయి.
సూర్యాస్తమయం కాగానే ఇంటి ముందు లైట్లు వెలిగాయి. ఊర్లో ప్రతి ఇల్లు వెలుతురుతో నిండింది. ఆ లైట్ల వెలుగులో చిన్నారులు గుంపుగా ఏర్పడి ఒక ఇంటి ముందు చదువుకుంటున్న దృశ్యాలు కనిపించాయి.
కొద్దిసేపటికే ఊరిలోని చిన్నా, పెద్దా, ఆడా, మగా అందరూ కలిసి అలుపొచ్చేంత వరకు థింసా నృత్యం చేశారు.
"మాకు కరెంటు బుడ్డీలు వచ్చాయి. చాలా సంతోషంగా ఉంది. అందుకే రోజూ థింసా ఆడుతున్నాం" అని చంద్రమ్మ అనే గిరిజన మహిళ బీబీసీతో సంతోషంగా చెప్పారు.
2022లో వెళ్లినప్పుడు సాయంత్రం ఆరుగంటలకే ఊరంతా చీకటైపోయి, అక్కడ ఒక గ్రామం ఉందంటే నమ్మలేకుండా ఉండేది. ఇప్పుడు 2025లో విద్యుత్ వెలుగులు రావడంతో ప్రతి ఇంటి ముందు లైట్ వెలుగుతూ ఊరంతా కనిపించింది.

ఆ కష్టాలు ఎవరికి వద్దు: బూరుగు గ్రామస్థులు
విద్యుత్ రావడంతో తమ జీవితాల్లో కొత్తదనం కనిపిస్తోందని బూరుగు గ్రామస్థులు బీబీసీతో చెప్పారు.
"మాకు కరెంట్ లేనప్పుడు చీకటి పడగానే ఆ పొయ్యిని వెలిగించి ఆ వెలుగులోనే వంట చేసుకోవడం, ఇల్లు సర్దుకోవడం చేసేవాళ్లం. పిల్లలు ఆ వెలుగులోనే చదువుకోవాల్సి వచ్చేది. కొన్నిసార్లు వంటపని లేకపోయినా వెలుగు కోసమే పొయ్యి వెలిగించేవాళ్లం. దానివల్ల కొన్నిసార్లు మా ఇళ్లు కాలిపోయేవి. అయినా వెలుగు కోసం అలా చేయక తప్పేది కాదు. బీబీసీ మా కష్టాలను అందరికి చూపించింది." అని బూరుగు గ్రామస్థుడు అప్పలరాజు అన్నారు.
అప్పుడు అప్పలరాజు భార్య గర్భవతి. అప్పట్లో వెలుతురు కోసం సెల్ ఫోన్, హెడ్ లైట్, పొయ్యి వెలుగు మూడింటిని ఉపయోగిస్తూ అప్పలరాజు తన భార్యకు, ముగ్గురు పిల్లలకు సేవలు చేయడం చూశాం.
"విద్యుత్, రోడ్లు, నీళ్లు వంటి కనీస సదుపాయాలు కూడా లేని జీవితం, ఆ కష్టాలు ఎవరికి ఉండకూడదు" అని అప్పలరాజు అన్నారు.
"విద్యుత్ లేకపోవడంతో చాలా ఇబ్బంది పడేవాళ్లం. ముఖ్యంగా రాత్రి సమయంలో మలమూత్ర విసర్జనకు చీకట్లో వెళ్లడం, భయంగా ఉండేది. ఉదయం సెల్ ఫోన్ వాడేవాళ్లం కాదు. ఎందుకంటే చార్జింగ్ అయిపోతే మళ్లీ 20 కిలోమీటర్లు వెళ్లి చార్జింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు మా ఫోన్ చార్జింగ్ మా ఇంట్లోనే పెట్టుకుంటున్నాం. మా పిల్లలు విద్యుత్ బల్బు వెలుగులో చదువుకుంటున్నారు" అని పోలమ్మ తెలిపారు.

ఇప్పుడు మాకూ 24 గంటలే...
ఇక నుంచి మా ఊర్లో ఉదయమే కాకుండా రాత్రి వేళల్లో కూడా గ్రామ సమస్యలు, పండుగలపై సమావేశాలు ఏర్పాటు చేసుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు మాకు వెలుగు వచ్చిందని బూరుగు, చినకోనెల గ్రామస్థులు సింహాచలం, సోము బీబీసీతో చెప్పారు.
"మా తాత, ముత్తాల నుంచి మా గ్రామాలకు విద్యుత్ రావాలని, ఇక్కడ కరెంట్ స్తంభాలు చూడాలని కలలు కనేవారు. ఇన్నాళ్లకు ఆ కల నెరవేరింది. ఇప్పుడు గ్రామంలో విద్యుత్ స్తంభాలు, తీగలు, బల్బులు కనిపిస్తున్నాయి. అందరిలాగే మా గ్రామాలకు రోజంటే 24 గంటలే. ఏదైనా పని చేసుకోవాలంటే, సూర్యోదయం దాకా ఎదురు చూడాల్సిన అవసరం లేదు. అయితే మాకు కరెంటే కాదు రోడ్లు, నీళ్లు కూడా కావాలి." అని సింహాచలం, సోము అన్నారు.
మా పిల్లలకు వాళ్ల బడిలో మేస్త్రులు (టీచర్లు) ఇచ్చే వర్కు కూడా రాత్రి నిద్ర వచ్చినంత వరకు చేసుకుంటూ, చదువుకుంటున్నారు. లైట్ వెలుతురులో గ్రామంలోని పిల్లలందరూ కలిసి డ్యాన్సులు చేయడం, ఆటలాడటం చూస్తుంటే ఆనందం కలుగుతోందని గిరిజన మహిళ చంద్రమ్మ చెప్పారు.

'రోడ్లు వేసి, నీళ్లు ఇస్తే చాలు'
విద్యుత్ సౌకర్యం వచ్చినందుకు సంతోషమేనని కానీ గ్రామానికి సరైన రోడ్లు, గ్రామంలో మంచి నీటి సౌకర్యం లేదని బూరుగు, చినకోనెల గ్రామస్థులు తెలిపారు. రోడ్డు సౌకర్యం లేకపోవడంతో రేషన్ వాహనం గ్రామంలోకి రాదని, తామే 8 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి సరుకులు తెచ్చుకుంటున్నామని అన్నారు.
"గతంలో రోడ్ల పేరుతో మట్టి తవ్వేసి వెళ్లిపోయారు. అవి వర్షానికి కొట్టుకుపోవడంతో ఇప్పుడు మరింత దారుణంగా తయారయ్యాయి. అలా కాకుండా తారు రోడ్లు వేయాలి" అని బూరుగు గ్రామస్థుడు సింహాచలం అన్నారు.
"బీబీసీ ఈ గ్రామానికి వచ్చి ఈ చీకటి గ్రామాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లింది. ఇప్పుడు బూరుగుతో పాటు మరో ఐదు గ్రామాలకు విద్యుత్ వచ్చింది. కానీ ఏజెన్సీలో విద్యుత్‌తో పాటు రోడ్లు, నీళ్లు, ఆసుపత్రుల సమస్యలున్నాయి. వాటన్నిటిని మిషన్ కనెక్ట్ పాడేరు ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం" అని గిరిజన సంఘం నాయకుడు కె. గోవిందరావు బీబీసీతో అన్నారు.

విద్యుత్ లేని గ్రామాలు లేకుండా చేస్తాం: ఐటీడీఏ
అల్లూరి సీతారామరాజు జిల్లాలో 2022 ఆగస్టు నాటికి 35 గ్రామాలకు విద్యుత్ సౌకర్యం లేదని అప్పటి ఐటీడీఏ పీవో బీబీసీకి తెలిపారు. నిధులు రాగానే అన్నీ గ్రామాలకు విద్యుత్ కల్పిస్తామన్నారు.
దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 21, 2025 నాటికి 918 గ్రామాలకు ఇంకా విద్యుత్ సదుపాయం అందించాల్సి ఉందని మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్‌మెంట్ లెక్కలు చెబుతున్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో 46, తెలంగాణలో 19 గ్రామాలున్నాయి. ఇవి పూర్తిగా విద్యుత్ లేని గ్రామాలు కాగా, ఇంకా విద్యుత్ సదుపాయం అందకపోయినా త్వరలోనే విద్యుత్ అందించేందుకు పనులు జరుగుతున్న గ్రామాలు దేశవ్యాప్తంగా 1750 ఉన్నాయి. ఇలాంటివి ఏపీలో 57, తెలంగాణాలో 32 ఉన్నట్లు మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్‌మెంట్ చెబుతోంది.
బూరుగు, చినకోనెల వంటి గ్రామాలకు విద్యుత్ అందించడం ఎంతో శ్రమతో కూడుకున్నది అయినప్పటికీ ఎట్టకేలకు విద్యుత్ అందించగలిగామని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో అభిషేక్ గౌడ అన్నారు. ఇంకా 15లోపు గ్రామాలకు అల్లూరి జిల్లాలో విద్యుత్ సౌకర్యం అందించాల్సి ఉందని, ఆ పనులు కూడా త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు. మిషన్ కనెక్ట్ పాడేరులో భాగంగా రోడ్లు, తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఆయన వెల్లడించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














