మొక్కజొన్న పరీక్షతో మీ జీర్ణవ్యవస్థ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవచ్చు, దీనితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, నిక్ ఇలోట్
- హోదా, బీబీసీ కోసం
మనలో చాలామంది తీసుకునే ఆహారంపై శ్రద్ధ వహిస్తుంటారు. మనం కూడా తీసుకుంటున్నది పోషకాహారమేనా, కాదా అని పరిశీలించుకుంటూ ఉంటాం.
కానీ, మనం తీసుకున్న ఆహారం ఎంతసేపటిలో జీర్ణం అవుతుందనే విషయం తెలుసా?
ఈ ప్రశ్నకు సమాధానం చాలా ముఖ్యం. ఎందుకంటే ఆహారం జీర్ణమయ్యే సమయం ఆరోగ్యాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేస్తుంది.
ఆహారాన్ని నమిలి మింగిన తర్వాత, అది జీర్ణ వాహిక ద్వారా శరీరంలో ప్రయాణిస్తుంది. ఇది జీర్ణాశయం, పెద్దపేగు, చిన్నపేగు వంటి అవయవాలగుండా వెళుతుంది.
జీర్ణవ్యవస్థ ద్వారా ఆహారం జీర్ణమవడాన్ని 'ఇంటెస్టినల్ మొటిలిటీ' అంటారు. మన పేగులలో ఉండే బిలియన్ల కొద్దీ బ్యాక్టీరియా ఈ ప్రక్రియను పాక్షికంగా నియంత్రిస్తుంది.
ఈ బ్యాక్టీరియా మన రోగనిరోధక శక్తిని పెంచడానికి, ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడానికి సహాయపడుతుంది. కాబట్టి ఆహారాన్ని మనకోసమే కాకుండా, చిన్నపేగుల్లో ఉండే ఈ బ్యాక్టీరియాను దృష్టిలో పెట్టుకుని కూడా తీసుకోవాలి.
ఈ బ్యాక్టీరియా మెటాబొలైట్స్ అని పిలిచే చిన్న అణువులను ఉత్పత్తి చేస్తుంది, ఇవి మన రోగనిరోధక వ్యవస్థను అభివృద్ధి చేయడంలో సహాయపడతాయి. ఆహారాన్ని కదిలించే నరాలను ప్రేరేపించడం ద్వారా మన పేగులను కదిలేలా చేస్తాయి.
ఈ బ్యాక్టీరియా, అవి ఉత్పత్తి చేసే మెటాబొలైట్స్ లేకుండా, మన పేగుల్లో ఆహారం జీర్ణంకాదు. అలా జీర్ణం కాకపోతే తిన్న పదార్థం పేరుకుపోయి మలబద్ధకం కారణంగా అసౌకర్యం కలుగుతుంది.


ఫొటో సోర్స్, Getty Images
జీర్ణక్రియ సమయం
ఆహారం... ఆహార నాళాల ద్వారా పెద్ద పేగులకు చేరుకుని, విచ్ఛిన్నం అయి శక్తిగా మారి చిన్నపేగు ద్వారా మల ద్వారం వద్దకు చేరుకోవడానకి పట్టే సమయాన్ని జీర్ణక్రియ సమయం అంటారు.
ఈ సమయం ఒక్కొక్కరికీ ఒక్కోవిధంగా ఉంటుంది. ఇటీవలి అంచనాల ప్రకారం ఈ జీర్ణక్రియకు 12 నుంచి 73 గంటలు పట్టవచ్చు. సగటున 23 లేదా 24 గంటలు పడుతుంది.
జీర్ణక్రియలో ఈ వైవిధ్యం పేగుల్లోని బ్యాక్టీరియాలో కొన్ని తేడాలను, పేగు ఆరోగ్యాన్ని వివరిస్తుంది.
ఆహారం శక్తిగా మారే సమయాన్ని జెనెటిక్స్, ఆహారం, సూక్ష్మజీవులతో సహా అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి.
మీ పేగులో ఆహారం నెమ్మదిగా జీర్ణమవుతోందంటే.. (అంటే నెమ్మదిగా శక్తిగా మారుతుంటే), పెద్ద పేగులోని బ్యాక్టీరియా వేర్వేరు మెటాబొలైట్స్‌ను ఉత్పత్తి చేస్తోందని అర్థం.
ఎందుకంటే, మనలాగే, మన శరీరంలోని బ్యాక్టీరియాకు ఆహారం ఇవ్వాలి. ఆ బ్యాక్టీరియా ఫైబర్‌ను ఇష్టపడుతుంది.
పేగులో ఆహారం కదులుతూ, ఫైబర్ పెద్ద పేగుకు చేరుకోవడానికి చాలా సమయం పడితే, పేగుల్లో ఉండే బ్యాక్టీరియా మరో ఆహార వనరు కోసం వెతకాలి. కాబట్టి అవి ప్రోటీన్ కోసం చూస్తాయి.
ఈ మార్పు విష వాయువుల ఉత్పత్తికి దారితీస్తుంది. ఉబ్బరం, కడుపులో మంట వంటి ఆరోగ్య సమస్యలు ఏర్పడవచ్చు.
పేగుల్లో ఆహారం నెమ్మదిగా కదలడం వల్ల పాక్షికంగా జీర్ణమైన ఆహారం చిన్న పేగులలో చిక్కుకుపోతుంది.
ఇది పేగు భాగంలో బ్యాక్టీరియా అధికమవడం, కడుపు నొప్పి, వికారం, ఉబ్బరం వంటి సమస్యలకు దారితీస్తుంది. అయితే, పేగులో ఆహారం వేగంగా కదలడం కూడా సమస్యే.
ఉదాహరణకు.. ఆందోళన, ఇన్‌ఫ్లమేటరీ బోవెల్ డిసీజ్(ఐబీడీ), ఇర్రిటబుల్ బోవెల్ సిండ్రోమ్(ఐబీఎస్) వంటివి. ఇవి పేగులో ఆహారం కదిలే సమయం తగ్గిపోవడానికి, విరేచనాలకు కారణమవుతాయి.
పేగులో ఆహారం వేగంగా కదిలితే, ఫలితంగా వచ్చే మలం జిగటగా, అధిక నీటి శాతంతో ఉంటుంది. పేగులో ఎక్కువసేపు లేకపోవడం వల్ల శరీరం నీరు, పోషకాలను తగినంతగా గ్రహించకుండా నిరోధిస్తుందని ఇది సూచిస్తుంది. ఉదాహరణకు, ఇన్‌ఫ్లమేటరీ బోవెల్ డిసీజ్ కేసులలో ఇది డీహైడ్రేషన్‌కి దారితీస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
స్వీట్ కార్న్ టెస్ట్..
మీరు ఇంట్లోనే చేయగలిగే చాలా సులభమైన పరీక్ష ఇది. దీనిని "క్యాండీ కార్న్ టెస్ట్" అంటారు.
మెదటి దశ: 7 నుంచి 10 రోజులు ("శుభ్రపరిచే" దశ) మొక్కజొన్న తినకుండా ఉండాలి.
ఆ తర్వాతే మీరు టెస్టుకు సిద్ధమైనట్లు.
కొంచెం స్వీట్ కార్న్ తినండి. గుప్పెడు ఉడకపెట్టిన లేదా కాల్చిన మొక్కజొన్న కూడా సరిపోతుంది. తిన్న తేదీ, సమయాన్ని రాసి పెట్టుకోండి.
మొక్కజొన్న బయటి పొట్టు జీర్ణం కాదు కాబట్టి, అది మీరు తిన్న మిగిలిన ఆహారంతో పాటు జీర్ణవాహిక గుండా వెళుతుంది, చివరికి మీ మలంలో కనిపిస్తుంది.
మీరు చేయవలసింది ఏమిటంటే, పేగు కదలికలపై ఒక కన్ను వేసి ఉంచడమే. మొక్కజొన్న పొట్టు మలం ద్వారా బయటకు వచ్చిన సమయాన్ని నోట్ చేసుకోవాలి.
అయితే, ఇంట్లో చేసుకునే ఈ పరీక్ష ఖచ్చితమైంది కాదని గుర్తుంచుకోండి. కానీ, ఫలితం అధునాతన పరీక్షలకు సమానంగా ఉంటుందని చెప్పొచ్చు.
మీరు మొక్కజొన్నను 12 గంటలు లేదా అంతకంటే తక్కువ సమయంలో విసర్జిస్తే, మీ పేగులో ఆహారం వేగంగా కదులుతోందని అర్థం.
48 గంటలు లేదా అంతకంటే ఎక్కువ కాలం మలవిసర్జన చేయకపోతే, మీ పేగులో ఆహారం చాలా నెమ్మదిగా కదులుతోందని అర్థం.
మీ పేగులో ఆహారం నెమ్మదిగా కదలుతోంటే, దాన్ని మెరుగుపరచడానికి మీరు చేయగలిగే కొన్ని పనులు ఉన్నాయి.
ఆహారం మరీ నెమ్మదిగా కదులుతున్నప్పటికీ, ఉబ్బరం, కడుపు నొప్పి, ఆకలి లేకపోవడం లేదా వికారం వంటి ఇతర లక్షణాలు లేకపోతే బ్యాక్టీరియాకు అవసరమైన ఫైబర్ ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు తిని, ఎక్కువ నీరు తాగాలి. అలాగే వ్యాయామం కూడా చేయాలి.
సమతుల ఆహార పద్దతులను అనుసరించడం వలన మీ పేగులు ఆరోగ్యంగా ఉంటాయి.
అలా కాకుండా వేగంగా కదలుతోంటే పేగు లోపల ఏదైనా సమస్య ఉందేమో తెలుసుకోవడానికి వైద్యుడిని సంప్రదించడం మంచిది.
*ఈ కథనం ది కన్వెర్షేషన్లో ప్రచురితమైంది. దీని రచయిత నిక్ ఇలోట్.
*నిక్ ఇలోట్. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని ఆక్స్‌ఫర్డ్ సెంటర్ ఫర్ మైక్రోబయోమ్ స్టడీస్‌లో సీనియర్ రీసెర్చ్ ఫెలో, బయోఇన్ఫర్మేటిషియన్.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














