ఫీకల్ కోలిఫాం: కుంభమేళాలో స్నానమాచరిస్తున్న నీటిలో ఈ బ్యాక్టీరియా ఎక్కువగా ఉందా, దీనిపై వివాదమేంటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఆనంద్ మణి త్రిపాఠి
- హోదా, బీబీసీ ప్రతినిధి
మరికొద్దిరోజుల్లో ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా ముగియనుంది. త్రివేణీ సంగమం నీటిలో ఇప్పటికే కోట్లాది మంది స్నానమాచరించారు. అయితే, ఆ ప్రాంతంలో గంగా-యమునా నీటి స్వచ్ఛతకు సంబంధించి వెలువడిన రెండు రిపోర్టులు ఇప్పుడు చర్చనీయంగా మారాయి.
ఇంతకీ వాటిలో ఏముంది?
జనవరి 13 నుంచి ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా జరుగుతోంది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన సమాచారం ప్రకారం, ఇప్పటివరకు సుమారు 58 కోట్ల మంది ప్రజలు కుంభమేళాలో పవిత్ర స్నానాలు ఆచరించారు.
వాస్తవానికి, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) ఫిబ్రవరి 3నే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ)కి ఒక రిపోర్టు సమర్పించింది. గంగా-యమునా నీటిలో నిర్దేశిత ప్రమాణాల కంటే అనేక రెట్లు ఫీకల్ కోలిఫాం బ్యాక్టీరియా ఉందని అందులో పేర్కొంది.
అయితే, ఫిబ్రవరి 18న సీపీసీబీ రిపోర్టును తోసిపుచ్చుతూ ఉత్తరప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (యూపీపీసీబీ) నీటి నాణ్యతపై ఎన్జీటీకి కొత్త రిపోర్టు ఇచ్చింది. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఎన్జీటీ.. యూపీపీసీబీ నుంచి మరో నివేదికను కోరింది.
ఈ అంశంపై తదుపరి విచారణ ఫిబ్రవరి 28న జరగనుంది. అయితే, కుంభమేళా ఫిబ్రవరి 26న ముగుస్తుంది.


ఫొటో సోర్స్, Getty Images
సీపీసీబీ రిపోర్టులో ఏముంది?
కుంభమేళా సందర్భంగా శృంగవేర్‌పూర్ ఘాట్, లార్డ్ కర్జన్ బ్రిడ్జ్, నాగవాసుకి టెంపుల్, దీహా ఘాట్, నైనీ బ్రిడ్జ్, సంగమ ప్రాంతంలో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) నీటి నమూనాలను సేకరించింది.
ఇందులో 2025 జనవరి 13న గంగానది దీహా ఘాట్, యమునా పాత నైనీ వంతెన దగ్గర సేకరించిన నమూనాలో 100 ఎంఎల్ నీటిలో 33,000 ఎంపీఎన్ ఫీకల్ కోలిఫాం బ్యాక్టీరియా గుర్తించారు. ఇక, శృంగవేర్‌పూర్ ఘాట్ నుంచి వచ్చిన నమూనాలో 23,000 ఎంపీఎన్ ఫీకల్ కోలిఫాం బ్యాక్టీరియా ఉన్నట్లు తేలింది.
సీపీసీబీ ప్రకారం.. స్నానం చేయడానికి సురక్షితమైన స్థాయి 100 ఎంఎల్ నీటిలో 2,500 ఎంపీఎన్.
ఎక్కువమంది స్నానాలు చేసే ప్రదేశం సంగమం. ఇక్కడ ఉదయం, సాయంత్రం నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించారు. 100 మి.లీ నీటిలో ఫీకల్ కోలిఫాం బ్యాక్టీరియా 13,000 ఎంపీఎన్ ఉన్నట్లు గుర్తించారు. సంగం వద్ద నీరు తాగడానికి, స్నానానికి పనికిరాదని పరీక్షలో తేలింది.
కుంభ్‌లో పెద్ద సంఖ్యలో ప్రజలు స్నానాలు చేస్తారని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది. దీని వల్ల మనుషుల శరీరం, బట్టల నుంచి మురికి బయటకు వస్తుందని, ఇది నీటిలో మల బ్యాక్టీరియా సాంద్రతను పెంచుతుందని తెలిపింది.
కోలిఫాం బ్యాక్టీరియా అంటే ఏమిటి?
వాషింగ్టన్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ ప్రకారం, కోలిఫాం బ్యాక్టీరియా అనేది మానవులు, జంతువుల పేగులు, మలంలో కనిపించే బ్యాక్టీరియా సమూహం.
ఈ బ్యాక్టీరియా శరీరంలో ఉంటే హానికరం కాదు కానీ, నీటిలో కలిసిన తర్వాత ప్రమాదకరంగా మారుతుంది. టోటల్ కోలిఫాంలో ఫీకల్ కోలిఫాం ఒక రకం. అదేవిధంగా ఫీకల్ కోలిఫాంకు ఉప సమూహం ఇ.కోలి(ఎస్చెరిచియా కోలి).
టోటల్ కోలిఫాం మట్టిలో లేదా ఇతర వనరులలో పెరుగుతుంది. అయితే ఫీకల్ కోలిఫాం, ఇ.కోలి బ్యాక్టీరియాలు మనిషి లేదా జంతువుల మలం నుంచి వస్తాయి.
ఇ.కోలి ప్రతి జాతి ప్రమాదకరమైనది కాదు కానీ, ఇ.కోలి 0157:H7 రకం హానికరమైనదిగా పరిగణిస్తుంటారు.

ఫొటో సోర్స్, Getty Images
యూపీ ప్రభుత్వం ఏమంటోంది?
కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి రిపోర్టును ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా తోసిపుచ్చింది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఫిబ్రవరి 19న అసెంబ్లీలో ఈ రిపోర్టును వ్యతిరేకించారు.
త్రివేణి సంగమం నీరు స్నానానికే కాదు, తాగడానికి కూడా పనికొస్తుందని అన్నారు. నీటి నాణ్యతను యూపీ కాలుష్య నియంత్రణ మండలి నిరంతరం పర్యవేక్షిస్తుందని సీఎం చెప్పారు.
ప్రయాగ్‌రాజ్‌లో ఫీకల్ కోలిఫాం బ్యాక్టీరియా స్థాయి ప్రస్తుతం 100 ఎంఎల్‌కు 2,500 యూనిట్ల కంటే తక్కువగా ఉందన్నారు. మహా కుంభ్ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని యోగి ఆదిత్యనాథ్ ఆరోపించారు.
'సంగమం నీటిని బీజేపీ తాగడానికి, స్నానానికి ఉపయోగిస్తే.. గంగా జలం పరిశుభ్రంగా ఉందని మేం అంగీకరిస్తాం' అని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
యూపీపీసీబీ రిపోర్ట్‌లో ఏముంది..
సంగమ ప్రాంతంలోని నీటిని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఆరు పారామితులపై పరీక్షించింది.
కాలుష్య ప్రమాణాల ప్రకారం.. ఫీకల్ కోలిఫాం స్థాయి 100 మి.లీకి 2,500 యూనిట్ల కంటే తక్కువగా ఉండాలి, ఇది ఎక్కువగా ఉన్నట్లు పరీక్షల్లో గుర్తించారు.
కాగా, దీనికి విరుద్దంగా యూపీపీసీబీ ప్రయాగ్‌రాజ్ ప్రాంతీయ అధికారి సురేష్ చంద్ర శుక్లా ఫిబ్రవరి 18న ఎన్జీటీకి 549 పేజీల రిపోర్టును అందించారు.
నీటి ప్రమాణాలు ప్రామాణిక నాణ్యతతో ఉన్నాయని రిపోర్టులో పేర్కొన్నారు. ఇందులో యూపీపీసీబీ, జల్ నిగమ్, జియో ట్యూబ్, మోతీలాల్ నెహ్రూ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MNIT) పరిశోధన రిపోర్టులు కూడా పొందుపరిచారు.

ఫొటో సోర్స్, Getty Images
వైద్యులు ఏమంటున్నారు?
కుంభమేళా నుంచి తిరిగి వచ్చిన తర్వాత, చాలామంది ప్రజలు జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలతో బాధపడుతున్నట్లు చెబుతున్నారు.
గ్రేటర్ నోయిడాకు చెందిన సిమ్రన్ షా తన కుటుంబంతో కలిసి ఫిబ్రవరి 7న సంగంలో 'పవిత్ర స్నానం' చేశారు.
"కుంభ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత కుటుంబంలోని ప్రతి ఒక్కరూ అస్వస్థతకు గురవుతున్నారు. ఆరోగ్యం ఇంకా మెరుగుపడలేదు" అని సిమ్రన్ అన్నారు. అందరికీ గొంతు ఇన్ఫెక్షన్ వచ్చిందని, మందులు వాడుతున్నామని చెప్పారు.
ఫిబ్రవరి 17న తన కుటుంబంలోని 19 మంది సభ్యులతో కలిసి కుంభ్ స్నానం చేశానని అయోధ్య నివాసి అంకిత్ పాండే చెప్పారు.
"ప్రయాగ్‌రాజ్ నుంచి వచ్చిన తర్వాత దాదాపు ప్రతి ఒక్కరూ జలుబు, దగ్గు, తేలికపాటి జ్వరం సమస్యతో బాధపడ్డారు. వైద్యుల సలహా మేరకు మందులు తీసుకున్నారు. ఇప్పుడు ఆరోగ్యం మెరుగుపడింది" అని అన్నారు అంకిత్.
ఈ పరిస్థితిపై న్యూదిల్లీలోని మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీ మాజీ డైరెక్టర్ డాక్టర్ పన్నాలాల్ మాట్లాడుతూ.. ''ఇంత పెద్ద సంఖ్యలో జనం వచ్చారు కాబట్టి తప్పించుకోవడం (వ్యాధుల నుంచి) చాలాకష్టం. వచ్చినవారిలో కనీసం 20 శాతం మంది ఈ బ్యాక్టీరియా బారినపడతారు. సమస్య కొందరిలో ఎక్కువగా.. మరికొందరిలో తక్కువగా ఉండొచ్చు'' అని చెప్పారు.
ఫీకల్ కోలిఫాం కారణంగా బాధితులు రక్త విరేచనాలు, వాంతులు, ఇతర వ్యాధులకు గురవుతున్నారని డాక్టర్ పన్నాలాల్ చెప్పారు. దీనితో పాటు తేలికపాటి జ్వరం, జలుబు, దగ్గు, ఇతర ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశముందని అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














