తెలంగాణ: ఎస్ఎల్బీసీ సొరంగంలో ప్రమాదం, లోపలే చిక్కుకుపోయిన 8 మంది కార్మికులు

తెలంగాణ, శ్రీశైలం, ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్ట్

ఫొటో సోర్స్, UGC

    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తెలంగాణలోని శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ - ఎస్ఎల్బీసీ) సొరంగంలో భారీ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులకు గాయాలు కాగా, ఎనిమిది మంది సొరంగం లోపలే చిక్కుకుపోయారు.

నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట గ్రామం వద్ద ఎస్ఎల్బీసీ సొరంగం పనులు నడుస్తున్నాయి.

ఇది శ్రీశైలం ప్రాజెక్టుకి అత్యంత సమీపంలో ఉంటుంది.

సొరంగం పనులు జరుగుతుండగా.. ఒక్కసారిగా లీకేజీ కారణంగా నీరు వచ్చినట్లుగా ప్రాథమికంగా సమాచారం అందుతోంది.

తెలంగాణ, శ్రీశైలం, ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్ట్

ఫొటో సోర్స్, UGC

కార్మికులు, సాంకేతిక సిబ్బంది ఎనిమిది మంది వరకూ సొరంగం లోపల చిక్కుకుపోయినట్లుగా అమ్రాబాద్ మండల తహసీల్దార్ మారుతి బీబీసికి చెప్పారు.

''లోపల ఎనిమిది మంది చిక్కుకున్నట్లుగా సమాచారం ఉంది. వారిని రక్షించేందుకు సహాయక చర్యలు జరుగుతున్నాయి. లోపల చిక్కుకున్న వారి వివరాలు తెలియాల్సి ఉంది'' అని చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
తెలంగాణ, శ్రీశైలం, ఎస్‌ఎల్‌బీసీ

ఫొటో సోర్స్, Uttam Kumar Reddy @FB

సొరంగం 14వ కిలోమీటరు పాయింటు వద్ద టన్నెల్ పైకప్పు కూలిపోయినట్లుగా సమాచారం ఉందని నీటిపారుదల శాఖ అధికారులు చెప్పారు.

శనివారం ఉదయం టన్నెల్ కు సంబంధించిన పనులు చేసేందుకు సొరంగం లోపలికి కార్మికులు, సాంకేతిక సిబ్బంది వెళ్లారు.

''దాదాపు 13 లేదా 14 కిలోమీటరు వద్ద పనులు నడుస్తున్నాయి. ఉదయం ఎనిమిదిన్నర నుంచి తొమ్మిది గంటల ప్రాంతంలో ఒక్కసారిగా బయటకు బురద, నీళ్లు రావడం వస్తున్నట్లు సమాచారం ఇచ్చింది. లోపల ఎనిమిది మంది కార్మికులు చిక్కుకుపోయారని మిగిలిన సిబ్బంది చెప్పారు.'' అని అమ్రాబాద్ సీఐ బీబీసీకి చెప్పారు.

ఈ ప్రమాదం ఎలా జరిగింది.. ఏం జరిగిందనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని ఆయన వివరించారు.

తెలంగాణ, శ్రీశైలం, నాగర్‌కర్నూల్

ఫొటో సోర్స్, PTI

ప్రమాదానికి అదే కారణం: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ప్రమాదంపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. ప్రమాదానికి గల కారణాలు వివరించారు.

''శ్రీశైలం నుంచి దేవరకొండ వైపు వెళ్లే టన్నెల్ 14 కిలోమీటరు ఇన్లేట్ వద్ద (దోమలపెంట దగ్గర) సీపేజ్‌ను పూడ్చివేసిన కాంక్రీట్ సెగ్మెంట్ స్లిప్ అవడంవల్ల ప్రమాదం జరిగింది'' అని చెప్పారు.

రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్: బండి సంజయ్

ప్రమాద విషయం తెలియడంతో ఎన్డీఆర్ఎఫ్ అధికారులకు ఫోన్ చేసినట్లు కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ తెలిపారు.

ఎస్ఎల్బీసీ టన్నెల్ దుర్ఘటన నేపథ్యంలో సహాయ చర్యలు చేపట్టాలని ఎన్డీఆర్ఎఫ్‌ను ఆదేశించినట్లు ఆయన సోషల్ మీడియా ఎక్స్ వేదికగా తెలిపారు.

విజయవాడ, హైదరాబాద్ నుంచి సహాయక బృందాలతో ఎన్డీఆర్ఎఫ్ కమాండెంట్ ఘటనా స్థలానికి చేరుకుంటారని బండి సంజయ్ తెలిపారు.

తెలంగాణ, నాగర్‌కర్నూల్

ఫొటో సోర్స్, PTI

ఘటనా స్థలానికి మంత్రులు

ప్రమాదం జరిగిన సమాచారం తెలుసుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఇతర అధికారులను సంఘటన స్థలానికి వెళ్లాలని సూచించినట్లుగా ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. ఘటనపై సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

''టన్నెల్‌ వద్ద పై కప్పు కూలి పలువురికి గాయాలైన సమాచారం అందిన వెంటనే ముఖ్యమంత్రి అధికారులను అప్రమత్తం చేశారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, అగ్నిమాపక శాఖ, హైడ్రా, ఇరిగేషన్ విభాగం అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు అందించాలని సీఎం ఆదేశించారు'' అని సీఎం కార్యాలయం తెలిపింది.

ముఖ్యమంత్రి ఆదేశాలతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇరిగేషన్ సలహాదారు ఆదిత్య నాథ్ దాస్, ఇతర అధికారులు ప్రత్యేక హెలీకాప్టర్ లో ప్రమాదం జరిగిన ప్రాంతానికి బయల్దేరి వెళ్లారు.

ఘటన స్థలానికి వెళ్లే ముందు ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు.

''టన్నెల్ లోనికి నీళ్లు వచ్చినట్లుగా సమాచారం ఉంది. సహాయక చర్యలు చేపట్టాం.'' అని చెప్పారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 1

తెలంగాణ, శ్రీశైలం, నాగర్‌కర్నూల్

ఫొటో సోర్స్, PTI

ప్రభుత్వ వైఫల్యం వల్లే ప్రమాదం: కేటీఆర్

ఎస్‌ఎల్బీసీ సొరంగం ప్రమాద ఘటనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.

''సుంకిశాలలో రీటైనింగ్ వాల్ కుప్పకూలిన ఘటన మరువకముందే రాష్ట్రంలో మరో దుర్ఘటన జరగడం కాంగ్రెస్ సర్కారు వైఫల్యానికి నిదర్శనం. కాంట్రాక్టర్లతో కుమ్మక్కై కమీషన్ల వేటలో పర్యవేక్షణను గాలికొదిలేయడం, నాణ్యతా ప్రమాణాల విషయంలో పూర్తిగా రాజీపడిపోవడం వల్లే ఇలాంటి వరుస సంఘటనలు జరుగుతున్నాయి'' అని ఆయన ట్వీట్ చేశారు.

పైకప్పు కూలిన ఈ ఘటనలో లోపల ఎవరైనా చిక్కుకుని ఉంటే వారిని క్షేమంగా బయటకు తీసుకొచ్చేందుకు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 2

తెలంగాణ, శ్రీశైలం, ఎస్‌ఎల్బీసీ

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, సొరంగం వద్ద అధికారులతో మాట్లాడుతున్న మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి

ప్రమాద ఘటనపై మంత్రుల సమీక్ష

ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద స్థలానికి చేరుకున్న మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు దోమలపెంటలోని జేపీ గెస్ట్‌హౌస్‌లో ఉన్నతాధికారులతో సమీక్షించారు.

సమీక్ష సమావేశంలో నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, ఐజీ సత్యనారాయణ, అగ్నిమాపక శాఖ డీజీ జి.వి నారాయణ రావు, నాగర్ కర్నూల్ కలెక్టర్, ఎస్‌ ఎల్బీసీ కాంట్రాక్ట్ పనులు నిర్వహిస్తున్న ఏజెన్సీ ప్రతినిధులు పాల్గొన్నారు.

క్షతగాత్రుల వివరాలు, వారి ఆరోగ్య పరిస్థితిపై మంత్రులు ఆరా తీశారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.

''సొరంగం లోపల చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తెచ్చేందుకు అధికారులు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు'' అని మంత్రులు తెలిపారు.

(ఈ కథనం అప్డేట్ అవుతోంది)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)