ది వైస్రాయ్స్ డాటర్స్: ఓ గవర్నర్ జనరల్, ఆయన ఇద్దరు కూతుళ్లు, అల్లుడి వివాహేతర బంధాల కథ

ఫొటో సోర్స్, HarperCollins
- రచయిత, వకార్ ముస్తఫా
- హోదా, బీబీసీ కోసం
బ్రిటిష్ పాలనలో భారత్ వైస్రాయ్‌గా వ్యవహరించిన కర్జన్, తన జీవితంలో ముగ్గరు కూతుళ్లను దూరంగా పెట్టారు. తన చివరి రోజుల్లో సైతం ఆయన వారిని దగ్గరకు రానివ్వలేదు.
తండ్రికి పేరు, హోదా ఉన్నప్పటికీ ఆ ముగ్గురు కూతుళ్లు ఒంటరి జీవితాన్ని గడిపారు. ఆ గవర్నర్ జనరల్ పేరు కర్జన్.
ఇంతకీ ఆయన వ్యక్తిగత జీవితంలో వివాదాలేంటి? కర్జన్ కూతుళ్ల వైవాహిక జీవితం ఎలా సాగింది? వాళ్లు తండ్రికి ఎందుకు దూరమయ్యారు?

ఓ రోజు సాయంత్రం తన జీవితంలో అన్ని రహస్యాలను భార్య సిమీకి చెప్పేయాలని నిర్ణయించుకున్నారు టామ్.
తన లవ్ ఎఫైర్స్ అన్నింటి గురించీ ఎలాంటి దాపరికం లేకుండా ఆమెకు చెప్పేశారు. ఇవన్నీ సరదా కోసం చేశానన్నారు.
సిమీ పూర్తి పేరు సింథియా. అప్పటి బ్రిటీష్ వైస్రాయ్ కర్జన్ కుమార్తె ఆమె. కర్జన్ 1899 నుంచి 1905 వరకు భారతదేశానికి వైస్రాయిగా, గవర్నర్ జనరల్‌గా పనిచేశారు.
సింథియా భర్త పేరు టామ్. ఆయన పూర్తి పేరు ఓస్వాల్డ్ మోస్లే. బ్రిటిష్ రాజకీయాలపై అసంతృప్తి పెంచుకున్న ఆయన ఫాసిజం సిద్ధాంతాలవైపు మొగ్గుచూపారు.
టామ్ తన లవ్ ఎఫైర్స్ గురించి చెప్పిన తర్వాత సింథియా ఏడుస్తూ ‘వారంతా నా స్నేహితులు’ అని అన్నారు. 1933లో సింథియా చనిపోయారు.
కర్జన్ మరో కూతురి పేరు మేరీ ఐరీన్.
ఆమెను నీనా అని కూడా పిలిచేవారు. మేరీ 1896లో పుట్టారు. సిమీ కన్నా రెండేళ్లు పెద్ద. కానీ ఆమె పెళ్లిచేసుకోలేదు.
కర్జన్ మూడో కూతురి పేరు అలెగ్జాండ్రా. ఆమె ముద్దుపేరు బాబా. టామ్‌కు అలెగ్జాండ్రాతో కూడా సంబంధముంది.
సింథియా మరణం తర్వాత టామ్ తన స్నేహితురాలు డయానా గినెస్‌ను వివాహం చేసుకున్నారు. హిట్లర్ సహచరుడు జోసెఫ్ గోబెల్స్ ఇంట్లో ఈ పెళ్లి జరిగింది. దీనికి ప్రత్యేక అతిథి అడాల్ఫ్ హిట్లర్.

ఫొటో సోర్స్, Getty Images
సంచలనాత్మక ఆరోపణలు
టామ్‌కు ఆమె అంటే ఎంతో క్రేజ్ అని డయానా గినెస్ జీవితచరిత్రలో జేన్ డీలీ రాశారు.
టామ్ తన మొదటి భార్య సింథియాని మోసం చేయడమే కాకుండా ఆమె అక్కాచెల్లెళ్లు, ఆమె సవతి తల్లితోనూ సంబంధాలు పెట్టుకున్నారని సెబాస్టియన్ మర్ఫీ-బేట్స్ బ్రిటిష్ వార్తాపత్రిక 'ది మెయిల్'లో రాశారు. డయానా గినెస్ లేఖల ఆధారంగా సెబాస్టియన్ ఇది రాశారు.
ఈ సంచలనాత్మక లేఖలు స్కాట్లాండ్ జాతీయ గ్రంథాలయంలో భద్రంగా ఉన్నాయి.
ఐరీన్, సింథియా, అలెగ్జాండ్రాల తల్లి పేరు మేరీ లైటర్. అమెరికాలో అత్యంత ధనవంతులు, అందమైన మహిళల్లో మేరీ ఒకరు.
ఆన్ డీ కర్సీ రాసిన 'ది వైస్రాయ్స్ డాటర్స్' పుస్తకంలో మహిళలపై కర్జన్ అభిప్రాయాలను ప్రస్తావించారు.
''మంచి గుర్రాలు, మంచి వైన్ లేదా అందమైన వస్తువులను వేరే మగవారు ఎలా ఇష్టపడతారో అలా కర్జన్ నన్ను ప్రేమించారు. కానీ ఆయన దృష్టిలో నేను వాటన్నింటితో సమానం కాదు'' అని కర్జన్ ప్రియురాలు ఎలీనర్ గ్లెన్ చెప్పినట్టు ఆ పుస్తకంలో రాసి ఉంది.
మేరీ లైటర్ మరణించిన కొన్ని నెలల తర్వాత గ్లెన్‌తో కర్జన్ బంధం మొదలయింది.

ఫొటో సోర్స్, Cover of Country Life magazine
కూతుళ్లతో తండ్రిగా కర్జన్ ఎలా ఉండేవారు?
కూతుళ్ల పట్ల కర్జన్ ప్రవర్తన గురించి తర్వాత అనేక విషయాలు బయటకు వచ్చాయి.
''లార్డ్ కర్జన్ తన కూతుళ్లకు రాసిన ఉత్తరాలు చూస్తే...ఓ తండ్రిగా వారంటే ఆయనకు ఎంతిష్టమో అర్ధం చేసుకోవచ్చు. కానీ భార్య మరణించిన తర్వాత కుమార్తెలను కంట్రోల్‌లో ఉంచేందుకు ఆయన ప్రయత్నించారు. తన ఆస్తిని వారికి చెందకుండా చేశారు'' అని పరిశోధకురాలు జో కేస్ బోర్న్ రాశారు.
''కర్జన్ తన కూతుళ్లతో కఠినంగా ప్రవర్తించారు. ఐరీన్, సిమీ, బాబాల పెంపకాన్ని 'నానీ'లకు వదిలేశారు. ముఖ్యంగా వాళ్ల అమ్మ వదిలి వెళ్లిన సంపద విషయంలో పిల్లలతో కర్జన్ వైఖరి కఠినంగా ఉంది'' అని న్యూయార్క్ టైమ్స్‌కు రాసిన ‘ది వైస్రాయ్స్ డాటర్స్’ పుస్తక సమీక్షలో మిరండా కార్టర్ విమర్శించారు.
తర్వాత కర్జన్‌కు ధనవంతురాలైన అమెరికా వితంతువు గ్రేస్ డిగ్నన్‌తో సంబంధం మొదలయింది. ఈ విషయం తెలియగానే, కర్జన్ తనకు రాసిన 500 ప్రేమలేఖలను గ్లెన్ కోపంతో తగలబెట్టారు.
గ్రేస్ డిగ్నన్‌కు మొదటి వివాహం ద్వారా ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె.
గ్రేస్ డిగ్నన్‌తో వారసుణ్ని కనాలని కర్జన్ ఎంతగానో కోరుకున్నారు. కానీ ఆయన కోరిక నెరవేరలేదు. ఆ తర్వాత వారిద్దరూ విడాకులు తీసుకోలేదుగానీ వేర్వేరుగా జీవించారు.
1920ల ప్రారంభంలో గ్రేస్ డిగ్నన్‌కు కర్జన్ రాసిన లేఖలు వారిద్దరూ ఒకరిపై ఒకరు నమ్మకంతో ఉన్నారన్న విషయాన్ని తెలియజేస్తున్నాయి.
కానీ, తన భార్య సిమీకి అక్క అయిన ఐరీన్, చెల్లీ అలెగ్జాండ్రాలతోపాటు, వారి సవతి తల్లి, కర్జన్ కొత్త ప్రియురాలు గ్రేస్ డిగ్నన్‌తోనూ తనకు సంబంధాలు ఉన్నాయని టామ్ అంగీకరించారు.

ఫొటో సోర్స్, Getty Images
కర్జన్ పెద్ద కూతురు ఎందుకు పెళ్లిచేసుకోలేదు?
ఆన్ డీ కర్సీ పుస్తకంలో ఐరీన్ గురించి చాలా ఆసక్తికరమైన సమాచారం ఉంది.
"ఐరీన్ వేటలో మంచి నిపుణురాలు. బ్రిడ్జ్ ప్లేయర్ కూడా. తాగుడు అలవాటుంది. రొమాంటిక్ మహిళ. ఆమె ప్రేమికుల్లో ప్రసిద్ధ పియానిస్ట్ ఆర్థర్ రాబిన్‌స్టెయిన్ కూడా ఉన్నారు. పెళ్లి ప్రతిపాదనలు చాలా ఉన్నప్పటికీ ఆమె అవివాహితురాలిగా మిగిలిపోయారు" అని పుస్తకంలో రాసి ఉంది.
తన సంపద, హోదాలను ఎవరైనా తమ రాజకీయ జీవితం కోసం ఉపయోగిస్తారని ఐరీన్ భయపడ్డారు.
''కర్జన్ రెండో కూతురు సింథియా 21 ఏళ్ల వయసులో ఓసోల్డ్ మోస్లీ (టామ్)ని పెళ్లిచేసుకున్నారు. టామ్‌తో ఆమె చాలా ప్రేమగా ఉండేవారు. కానీ టామ్ నమ్మకద్రోహి, రాజకీయ అవకాశవాది. మొదట కన్జర్వేటివ్ పార్టీ నుంచి తర్వాత లేబర్ పార్టీ నుంచి పార్లమెంట్ సభ్యుడయ్యారు. తర్వాతికాలంలో ఫాసిస్టుల బ్రిటిష్ యూనియన్ స్థాపించారు'' అని తన సమీక్షలో మిరాండా కార్టర్ రాశారు.
1929 ఎన్నికల్లో, లేబర్ పార్టీ అభ్యర్థిగా గెలిచి సింథియా అందరినీ ఆశ్చర్యపరిచారు.
భర్త టామ్ వల్ల ఆమె లేబర్ పార్టీలో చేరారని, తర్వాత ఆమె అదే ఉత్సాహంతో ఫాసిజానికి మద్దతు ఇచ్చారని ‘ది వైస్రాయ్స్ డాటర్స్’ పుస్తకంలో ఉంది.
సింథియాను సౌమ్యురాలిగా ఈ పుస్తక రచయిత్రి ఆన్ డీ కర్సీ అభివర్ణించారు.
‘ఆల్ఫా గర్ల్’గా గుర్తింపు పొందిన కర్జన్ చిన్న కూతురు
కర్జన్ చిన్న కూతురి పేరు 'బాబా'. ఆమె 'ఆల్ఫా గర్ల్' అని కార్టర్ రాశారు.
ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉండే బాబా 21 ఏళ్ల వయసులో తన కన్నా చాలా పెద్దవాడైన
ఎడ్వర్డ్ డుడ్లీ (ఫ్రూటీ) మిట్‌కాల్ఫ్‌ను పెళ్లీ చేసుకున్నారు.
డుడ్లీ సౌమ్యుడేకానీ, ప్రతిభావంతుడు కాదు. ఫ్యాషన్, పార్టీలపై బాబాకు ఉండే ఇష్టాన్ని చూసి, ఆయన కూడా వాటిపై మక్కువ పెంచుకున్నారు.
అప్పటి ప్రిన్స్ ఆఫ్ వేల్స్, తర్వాత కాలంలో ఇంగ్లండ్ రాజు అయిన ఎడ్వర్డ్ 8 కి డుడ్లీ మంచి స్నేహితుడు.
ఎడ్వర్డ్ 8 తన పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చిన సంక్షోభాన్ని, తర్వాత ఆయన జీవితాన్ని డుడ్లీ దగ్గరగా చూడగలిగారు.
డుడ్లీతో విసుగు చెందిన తర్వాత తన అక్క భర్త టామ్‌తో సంబంధం పెట్టుకున్నారు బాబా.
డయానా నుంచి టామ్‌ను కాపాడటానికి తాను ప్రయత్నిస్తున్నానని బాబా చెప్పేవారు. కానీ డయానాను టామ్ వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లి విషయాన్ని బాబా దగ్గర రెండేళ్లపాటు రహస్యంగా ఉంచారు.
ప్రపంచ యుద్ధం ముప్పు ముంచుకొచ్చినప్పుడు అక్కాచెల్లెళ్లిద్దరూ 'ఫాసిస్ట్' ఉద్యమానికి దూరంగా ఉన్నారు. అయితే, వయసు మీద పడుతుండటం, మద్యానికి బానిస కావడం, అవివాహితగా ఉండటంతో ఐరీన్ తన చెల్లెలిని చూసి అసూయపడ్డారు.
రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఐరీన్ సామాజిక సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
సేవ్ ది చిల్డ్రన్ సంస్థలో బాబా 40 సంవత్సరాలకు పైగా పనిచేశారు. 1974లో ఆ సంస్థకు ఆమె ఉపాధ్యక్షురాలయ్యారు.
1925లో మరణించేంతవరకు కర్జన్ తన ముగ్గురు కుమార్తెలకు దూరంగా ఉన్నారు. ఆయన మరణించే సమయంలో ఐరీన్‌ను దగ్గరికి కూడా రానివ్వలేదు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














