బీబీసీ ఐ ఇన్వెస్టిగేషన్: పశ్చిమాఫ్రికాలో మాదక ద్రవ్యాల సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తున్న భారత ఫార్మా సంస్థ

తీవ్ర వ్యసనానికి గురిచేసేమాదక ద్రవ్యాల(నల్లమందులాంటి పదార్థం)ను భారత్ లోని ఓ ఫార్మాస్యుటికల్ కు చెందిన మనుషులు, లైసెన్సులేకుండా అక్రమంగా తయారుచేసి, చట్టవిరుద్ధంగా పశ్చిమాఫ్రికాకు తరలిస్తున్నట్టు బీబీసీ ఐ ఇన్వెస్టిగేషన్ వెలుగులోకి తీసుకొచ్చింది.
ఈ మాదక ద్రవ్యాల వల్ల పశ్చిమాఫ్రికా ప్రజలు అతిపెద్ద ప్రజారోగ్య సంక్షోభానికి గురవుతున్నారని బీబీసీ ఐ ఇన్వెస్టిగేషన్‌లో వెల్లడైంది.
ముంబయికి చెందిన ఏవియో ఫార్మాస్యూటికల్ వివిధ బ్రాండ్ల పేరుతో వివిధ రకాల మందులను విక్రయిస్తోంది.
వీటి ప్యాకింగ్‌ను చూస్తే అచ్చం చట్టబద్ధమైన మెడిసిన్ల లాగానే ఉంటుంది. కానీ, వీటన్నింటిలోనూ హానికర పదార్థాల మిశ్రమం ఒకటి కలిసి ఉంటుంది.
అందులో ఒకటి.. టాపెంటడాల్, ఇది శక్తివంతమైన మాదక ద్రవ్యం. మరొకటి కండరాలకు రిలాక్సేషన్ కలిగించే ఔషధం కారిసోప్రొడాల్. ఇది చాలా వ్యసనపూరితమైనది కావడంతో యూరప్‌లో ఈ డ్రగ్‌ను నిషేధించారు.
ఈ డ్రగ్స్ మిశ్రమాన్ని ప్రపంచంలో ఎక్కడా ఉపయోగించేందుకు లైసెన్స్ లేదు. శ్వాస సంబంధమైన ఇబ్బందులకు, మూర్ఛకు ఈ మందులు కారణమవుతాయి. ఓవర్‌డోసు అయితే ప్రాణాలకే ప్రమాదం.
ఇలా ప్రమాదాలు ఉన్నప్పటికీ, చాలా పశ్చిమాఫ్రికా దేశాల్లో, వీధుల్లో దొరికే డ్రగ్స్‌గా ఈ మాదక ద్రవ్యాలు ఎక్కువగా పాపులర్.
ఎందుకంటే, ఇవి చౌకగా, విరివిగా అందుబాటులో ఉంటున్నాయి.
ఘనా, నైజీరియా, కోట్ డీ'ఐవరీ (ఐవరీ కోస్ట్) దేశాల్లోని పలు ప్రాంతాలలో వీధుల్లోనే ఏవియో ఫార్మాస్యూటికల్ లోగోతో ఉన్న ప్యాకెట్లు అమ్మడాన్ని బీబీసీ వరల్డ్ సర్వీస్ గుర్తించింది.
భారత్‌లో ఏవియో ఫ్యాక్టరీలో ఈ డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించిన తర్వాత, ఒక రహస్య కార్యకర్త (అండర్ కవర్ ఆపరేటివ్)ను ఈ ఫ్యాక్టరీలోకి బీబీసీ పంపించింది.
నైజీరియాకు మాదక ద్రవ్యాలను సరఫరా చేసే ఆఫ్రికా వ్యాపారవేత్తలాగా ఆ ఫ్యాక్టరీలోకి ఆయన ప్రవేశించారు.
పశ్చిమాఫ్రికా వ్యాప్తంగా అమ్ముతున్నట్లుగా బీబీసీ గుర్తించిన ఈ ప్రమాదకరమైన ఉత్పత్తులను ఏవియో డైరెక్టర్లలో ఒకరైన వినోద్ శర్మ తనకు చూపించడాన్ని హిడెన్ కెమెరా సహాయంతో ఆయన చిత్రీకరించారు.


రహస్యంగా రికార్డు చేసిన ఈ ఫుటేజీలో నైజీరియాలోని టీనేజర్లకు ఈ పిల్స్‌ను అమ్మాలన్నదే తన ప్లాన్ అని శర్మకు చెప్పారు సదరు వ్యక్తి. యువత వీటిని ఎక్కువగా ఇష్టపడతారని శర్మతో ఆయన అన్నారు. ఆ సమయంలో శర్మ ఏమాత్రం జంకకుండా, సరే అని సమాధానమిచ్చారు.
ఒకేసారి రెండు లేదా మూడు పిల్స్ తీసుకున్న తర్వాత, వారు రిలాక్స్ అవుతారని, ఆ తర్వాత ఎక్కువ ఉత్తేజం కలుగుతుందని శర్మ వివరించారు.
మీటింగ్ ముగిసే సమయంలో, ‘ఈ పిల్స్ ఆరోగ్యానికి చాలా హానికరం. కానీ, ఇప్పుడిదే బిజినెస్’ అని శర్మ అన్నారు.

పశ్చిమాఫ్రికాలో లక్షలమంది యువత జీవితాన్ని నాశనం చేస్తూ, ఆరోగ్యానికి ప్రమాదకరంగా నిలుస్తున్న వ్యాపారం ఇది.
ఉత్తర ఘనాలోని ‘తమలె’ నగరంలో చాలామంది యువత చట్టవిరుద్ధంగా ఈ మాదక ద్రవ్యాలను తీసుకుంటున్నారు.
ఈ నగర అధినేతలలో ఒకరైన అల్హాసన్ మహమ్ 100 మంది స్థానిక ప్రజలతో ఒక వాలంటరీ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. వీరి పని ఏంటంటే.. ఈ మాదక ద్రవ్యాలను అమ్మే డీలర్లపై దాడి చేసి, ఈ పిల్స్ వీధుల్లోకి రాకుండా చూడటం.
''ఈ డ్రగ్స్ వాటిని వాడేవారి ఆరోగ్యాన్ని హరిస్తాయి.'' అని మహమ్ చెప్పారు. అది అగ్గిపై కిరోసిన్ పోసినప్పుడు మంటలు రాజుకున్న మాదిరిగా ఉంటుందని ఆయన అన్నారు.
ఈ మందుకు బానిసైన ఓ వ్యక్తి కూడా దీని గురించి బీబీసీతో మాట్లాడారు. ‘‘ఇది మా జీవితాలను నాశనం చేస్తుంది.’’ అని ఆయన అన్నారు.
బీబీసీ బృందం ఈ టాస్క్ ఫోర్స్‌ను అనుసరించింది.
డ్రగ్ డీల్ గురించి సమాచారం అందుకున్న తర్వాత, తమలె నగర సరిహద్దులో ఉన్న ఒక మారుమూల ప్రాంతానికి వారు వెళ్లారు. మార్గం మధ్యలో ఒక యువకుడు కింద పడిపోయి ఉన్నారు. ఆ వ్యక్తి డ్రగ్స్ తీసుకున్నారని స్థానికులు చెబుతున్నారు.

డీలర్‌ను పట్టుకున్నప్పుడు, టఫ్రోడాల్ అనే లేబుల్‌తో పచ్చని మాత్రలతో నిండి ఉన్న ఒక ప్లాస్టిక్ బ్యాగ్‌ను ఆయన తీసుకెళ్తున్నారు. ఈ ప్యాకెట్లపై ఏవియో ఫార్మాస్యూటికల్స్‌కు చెందిన లోగో వేసి ఉంది.
ఏవియో పిల్స్ కేవలం తమలె నగరంలో మాత్రమే అనర్థాలను సృష్టించడం లేదు.
ఏవియో తయారుచేసిన ఇలాంటి ఉత్పత్తులను ఘనాలో మిగిలిన ప్రాంతాల్లో కూడా పోలీసులు సీజ్ చేసినట్లు బీబీసీ గుర్తించింది.
నైజీరియా, కోట్ డీ'ఐవరీ వీధుల్లో కూడా ఏవియో మాత్రలను అమ్ముతున్నట్లు బీబీసీ ఐ గుర్తించింది. వీటిని ఉత్తేజం కోసం టీనేజర్లు ఆల్కాహాలిక్ ఎనర్జీ డ్రింక్‌లలో కలుపుకుని తాగుతున్నారు.
ప్రజలకు అందుబాటులో ఉన్న ఎక్స్‌పోర్ట్స్ డేటా ప్రకారం, ఏవియో ఫార్మాస్యూటికల్స్, దాని సిస్టర్ కంపెనీ వెస్ట్‌ఫిన్ ఇంటర్నేషనల్ ఘనాకు, ఇతర పశ్చిమాఫ్రికా దేశాలకు లక్షల కొద్ది ఈ టాబ్లెట్లను సరఫరా చేస్తున్నట్లు తెలిసింది.
22.5 కోట్ల మంది జనాభా ఉన్న నైజీరియా ఈ పిల్స్‌కు అతిపెద్ద మార్కెట్. 40 లక్షల మంది నైజీరియన్లు ఏదో ఒక రకమైన మత్తు మందులకు బానిస అయినట్లు నైజీరియా నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ అంచనావేసింది.
''ఈ డ్రగ్స్ మా యువతీ యువకులను, కుటుంబాల జీవితాలను నాశనం చేస్తున్నాయి. నైజీరియాలో ప్రతి కమ్యూనిటీలో ఇవి ఉన్నాయి.'' అని నైజీరియా డ్రగ్ అండ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ (ఎన్‌డీఎల్‌ఈఏ) చైర్మన్ బ్రిగేడియర్ జనరల్ మొహమ్మద్ బుబా మార్వా చెప్పారు.

2018లో స్ట్రీట్ డ్రగ్స్‌గా ఈ డ్రగ్స్ అమ్మకాలు జరుగుతున్నట్లు బీబీసీ ఆఫ్రికా ఐ పరిశోధనా బృందం వెలుగులోకి తీసుకొచ్చిన తర్వాత, పెద్ద ఎత్తున దుర్వినియోగమైన ట్రమడాల్ అని పిలిచే ఓపియాయిడ్ పెయిన్‌కిల్లర్‌ను నైజీరియా అధికారులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు.
ప్రిస్క్రిప్షన్ లేకుండా ట్రమడాల్ అమ్మకాన్ని ప్రభుత్వం నిషేధించింది. గరిష్టంగా ఇచ్చే డోసుపై కఠినమైన పరిమితులు విధించింది.
ఈ పిల్స్ చట్టవిరుద్ధంగా దిగుమతి కాకుండా ఉక్కుపాదం మోపింది. అదే సమయంలో, భారత అధికారులు కూడా ట్రమడాల్‌పై ఎగుమతి నియంత్రణలను కఠినం చేశారు.
భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్న కొద్దికాలానికే, ఏవియో ఫార్మాస్యూటికల్స్ మరింత శక్తివంతమైన మాదక ద్రవ్యం టాపెంటడాల్‌ను, కండరాలకు రిలాక్సేషన్‌కు వాడే కారిసోప్రొడాల్‌తో కలిపి కొత్త పిల్‌ను ఎగుమతి చేయడం ప్రారంభించింది.
ఫ్యాక్టరీలో ఈ కాంబినేషన్ డ్రగ్స్‌ను కార్టన్లలో పెట్టి ఒకదానిపై ఒకటి అలా సీలింగ్ ఎత్తు వరకు అమర్చారు.
ఆయన డెస్క్‌పై టఫ్రోడాల్, టిమాకింగ్, సూపర్ రాయల్-225 వంటి వివిధ పేర్లతో మార్కెట్లో కంపెనీ విక్రయిస్తున్న టాపెంటడాల్-కారిసోప్రొడాల్ కాక్‌టైల్ పిల్స్ పాకెట్లు ఒకదాని పక్కన ఒకటి పడి ఉన్నాయి.
మాదక ద్రవ్యాల ఎగుమతిదారులు ట్రమడాల్‌కు ప్రత్యామ్నాయంగా, ఆంక్షల నుంచి తప్పించుకునేందుకు ఈ కొత్త కాంబినేషన్‌లో రూపొందిన పిల్స్‌ను ఉపయోగిస్తున్నారని పశ్చిమ ఆఫ్రికా అధికారులు హెచ్చరించారు.
తమ ఫ్యాక్టరీలోని శాస్త్రవేత్తలు వివిధ రకాల డ్రగ్స్ మిశ్రమాన్ని వాడుతూ కొత్త ప్రొడక్ట్‌ను తయారు చేస్తున్నట్లు బీబీసీ అండర్‌కవర్ బృందానికి వినోద్ శర్మ చెప్పారు.
ట్రమడాల్ కంటే ప్రస్తుతం ఏవియో తీసుకొచ్చిన కొత్త ప్రొడక్ట్ మరింత ప్రమాదకరం.
టాపెంటడాల్ గాఢ నిద్రతో పాటు మాదక ద్రవ్యాలు తీసుకున్నప్పుడు కలిగే ప్రభావాలకు లోను చేస్తుందని బెంగళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్‌కు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లేఖాన్ష్ శుక్లా చెప్పారు.
ప్రజలు శ్వాస తీసుకోలేని స్థితికి తీసుకొస్తుందని వివరించారు. ''దీంతో పాటు మరో డ్రగ్ కారిసోప్రొడాల్‌ను ఇస్తున్నారు. ఇది కూడా గాఢ నిద్రను, రిలాక్సేషన్‌ను ఇస్తుంది. చెప్పాలంటే ఇది చాలా ప్రమాదకరమైన డ్రగ్స్ కాంబినేషన్'' అని చెప్పారు.
కారిసోప్రొడాల్‌ను యూరప్‌లో నిషేధించారు. ఎందుకంటే, ఇది చాలా అడిక్టివ్. అమెరికాలో దీన్ని వాడేందుకు అనుమతులు ఉన్నాయి. కానీ, మూడు వారాల స్వల్ప కాలానికి మాత్రమే అనుమతిస్తారు.
ఈ డ్రగ్ వాడకం ఆపేయడమో, తగ్గించడమో చేస్తే యాంగ్జైటీ, నిద్రలేమి, మానసిక భ్రాంతులకు గురవుతుంటారు.
రెగ్యులర్ డ్రగ్స్‌తో పోల్చిచూసినప్పుడు టాపెంటడాల్‌తో కలిపి ఈ డ్రగ్‌ను తీసుకుంటే విత్‌డ్రా సింప్టమ్స్ మరింత తీవ్రంగా ఉంటాయని డాక్టర్ శుక్లా చెప్పారు. ఇది చాలా బాధకరమైన అనుభవం అన్నారు.
ఈ కాంబినేషన్ పనితీరుపై ఎలాంటి క్లినికల్ ట్రయల్స్ చేపట్టలేదన్న విషయం తనకు తెలుసని చెప్పారు.
పరిమిత మోతాదులో చట్టబద్ధంగా వాడుకునే ట్రమడాల్ మాదిరిగా కాకుండా.. టాపెంటడాల్-కారిసోప్రొడాల్ కాక్‌టైల్ అనేది సరైన మిశ్రమంలా కనిపించడం లేదన్నారు శుక్లా.
‘‘ఇది మన దేశం(భారత్)లో ఉపయోగించుకునేందుకు లైసెన్స్ పొందినది కాదు’’ అని శుక్లా చెప్పారు.
భారత్‌లో ఫార్మాస్యూటికల్ కంపెనీలు తాము తయారు చేసిన మందులు దిగుమతి చేసుకునే దేశాల ప్రమాణాలకు అనుగుణంగా లేకపోతే వాటిని ఎగుమతి చేయలేవు.
టాపెంటడాల్, కారిసోప్రొడాల్ మిశ్రమాన్ని చట్టవిరుద్ధమైనదిగా, అక్రమమైనదిగా ఘనా నేషనల్ డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ పేర్కొంది. ఆ ప్రాంతానికి ఏవియో ఫార్మాస్యూటికల్ కంపెనీ టఫ్రొడాల్, ఇలాంటి ఇతర ప్రొడక్టులను తయారు చేసి అమ్ముతోంది.
ఘనాకు టఫ్రొడాల్‌ను రవాణా చేయడం ద్వారా ఏవియో ఫార్మాస్యూటికల్ భారత చట్టాలను కూడా ఉల్లంఘిస్తోంది.
ఇదే విషయం గురించి వినోద్ శర్మ, ఏవియో ఫార్మాస్యూటికల్స్ నుంచి స్పందన కోరినప్పుడు వారు సమాధానం ఇవ్వలేదు.
ప్రపంచ ప్రజల ఆరోగ్యం పట్ల తన బాధ్యతను గుర్తిస్తుందని భారత ఔషధ నియంత్రణ సంస్థ CDSCO బీబీసీకి తెలిపింది. భారత్‌లో బాధ్యతాయుతమైన, పటిష్ట ఔషధ నియంత్రణ వ్యవస్థ ఉండేలా చూసుకోవడానికి కట్టుబడి ఉంటామని వ్యాఖ్యానించింది.
భారత్ నుంచి ఇతర దేశాలకు జరుగుతున్న ఎగుమతులను నిశితంగా పర్యవేక్షిస్తున్నామని, ఇటీవల కఠినతరం చేసిన నియంత్రణను పటిష్టంగా అమలు చేస్తున్నామని తెలిపింది. దిగుమతి చేసుకునే దేశాలు కూడా ఇలాంటి కఠినమైన నియమాలను పాటిస్తూ భారత్ చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాలని కోరింది.
ఈ విషయాన్ని పశ్చిమ ఆఫ్రికాతో సహా ఇతర దేశాలతో చర్చించామని, అవకతవకలను అరికట్టడానికి వారితో కలిసి పనిచేయడానికి కట్టుబడి ఉన్నామని సీడీఎస్‌సీఓ పేర్కొంది. నిబంధనలు ఉల్లంఘించిన సంస్థపై తక్షణమే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
లైసెన్స్ లేని ఈ డ్రగ్స్‌ను తయారు చేస్తోన్న, ఎగుమతి చేస్తోన్న భారత కంపెనీ ఏవియో ఫార్మాస్యూటికల్ ఒక్కటే కాదు.
ప్రజలకు అందుబాటులో ఉన్న ఎగుమతి డేటా ప్రకారం.. పశ్చిమాఫ్రికా వ్యాప్తంగా వివిధ బ్రాండింగ్‌తో ఇలాంటి ఉత్పత్తులను, డ్రగ్స్‌ను ఇతర ఫార్మా కంపెనీలు తయారు చేస్తున్నట్లు తెలిసింది.
ఈ తయారీ సంస్థలు వేగంగా ఎదుగుతోన్న భారత ఫార్మా పరిశ్రమ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా కోట్లమంది ప్రజలు ఆధారపడ్డ అత్యంత నాణ్యమైన జెనరిక్ మెడిసిన్లను, టీకాలను భారత ఫార్మా పరిశ్రమ ఉత్పత్తి చేస్తూ... కోట్లాదిమంది ప్రాణాలను కాపాడుతోంది. ఈ ఇండస్ట్రీ సుమారు ఏడాదికి 28 బిలియన్ డాలర్ల (రూ.2,42,580 కోట్లు) ఎగుమతులు చేస్తోంది.
''20 ఏళ్లకు పైగా ఈ డ్రగ్స్ సంక్షోభం గురించి నైజీరియా జర్నలిస్టులు రిపోర్టు చేస్తున్నారు. చివరకు ఆఫ్రికా డ్రగ్స్ విపత్తుకు మూలకారకుల్లోని ఒకరితో, ఈ ప్రొడక్టును తయారు చేసి, కంటైనర్ లోడ్‌లో మా దేశాల్లోకి రవాణా చేసే వారిలో ఒకరితో, నేను నేరుగా మాట్లాడాను. వారు చేసే దాంతో ప్రజలకు ప్రమాదకరమని ఆయనకు తెలుసు. కానీ, ఆయన ఏం పట్టించుకోనట్టే నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఇదొక వ్యాపారమని తేలిగ్గా చెప్పుకొచ్చారు.'' అని శర్మను ఇంటర్వ్యూ చేసిన బీబీసీ అండర్ కవర్ఆపరేటివ్ అన్నారు.
ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి గుర్తింపును భద్రతారీత్యా బయటపెట్టడం లేదు.
ఘనాలోని తమలెకు వెళ్తే.. బీబీసీ బృందం స్థానిక టాస్క్‌ఫోర్స్‌ను అనుసరించి ఒక చివరి దాడిలో పట్టుకున్న ఏవియో టఫ్రొడాల్‌ను చూపించింది. వారు సీజ్ చేసిన డ్రగ్స్‌ను కాల్చేందుకు స్థానిక పార్కులో ఆ రోజు సాయంత్రం సమావేశమయ్యారు.
'' అందరూ చూసేలా బహిరంగ ప్రదేశంలో వీటిని మేం కాల్చేస్తున్నాం.'' అని జీకే చెప్పారు. ఈ డ్రగ్స్‌ను పట్టుకున్న నేతల్లో జీకే కూడా ఒకరు.
ప్యాకెట్లపై పెట్రోల్ పోసి, తగలబెట్టారు. పట్టుకుంటే, మీ డ్రగ్స్‌ను కూడా ఇలానే తగలబెడతాం అనే సంకేతాలను సరఫరాదారులకు, అమ్మకందారులకు ఇచ్చారు.
టఫ్రొడాల్‌కు చెందిన వందల ప్యాకెట్లను వీరు కాల్చి బూడిద చేస్తుంటే.. మైళ్ల దూరంలో ఈ చైన్‌లో అగ్రస్థానంలో ఉన్న భారత్‌లోని సరఫరాదారులు, అమ్మకందారులు మాత్రం.. లక్షల కొద్ది ప్యాకెట్లను ఉత్పత్తి చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి వాటిపై వచ్చే లాభాలతో ధనవంతులవుతున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















