వజ్రాల కార్మికులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఈ పరిశ్రమకు ఏమైంది?

ఫొటో సోర్స్, RUPESH SONAVANE
- రచయిత, శీతల్ పటేల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
గుజరాత్‌లోని సూరత్ నగరంలో వజ్రాలను సానబెట్టే 28 ఏళ్ల నికుంజ్ టంక్ ఈ ఏడాది మే లో ఉద్యోగం కోల్పోయినప్పటి నుంచి నిరాశలో ఉన్నారు. ఆయన ఏడేళ్లుగా పనిచేసిన ఓ చిన్న పాలిషింగ్ యూనిట్ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి మూతపడింది. దాంతో ఆయనతో పాటు మరో డజను మందికి పైగా నిరుద్యోగులయ్యారు.
ఆగస్టు 2న నికుంజ్ ఆత్మహత్య చేసుకున్నారు.
నికుంజ్‌కు తల్లిదండ్రులు, భార్య, కుమార్తె ఉన్నారు. ఆయన మీదే కుటుంబం ఆధార పడింది. ఆయన పొదుపు చేసి వెనకేసింది కూడా ఏమీ లేదు.
"వేరే ఉద్యోగం దొరకలేదు. దీన్ని భరించలేక, తీవ్రమైన నిర్ణయం తీసుకున్నాడు" అని నికుంజ్ తండ్రి జయంతి టంక్ చెప్పారు. ఆయనో రిటైర్డ్ ఉద్యోగి.
‘‘నికుంజ్ భార్యను, 14 నెలల కూతురిని ఎవరు చూసుకుంటారు?’’ అని ఆయన ప్రశ్నించారు
ఈ ఆత్మహత్య పై సూరత్ పోలీసులు కేసు నమోదు చేశారు.
‘‘వజ్రాల పరిశ్రమలో నెలకొన్న మాంద్యం కారణంగానే నికుంజ్ ఆత్మహత్యకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. నిరుద్యోగం ఆయన మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది’’ అని సూరత్‌లోని అమ్రోలి పోలీసు స్టేషన్‌కు చెందిన ఒక అధికారి తెలిపారు.
(గమనిక: ఆత్మహత్య ఆలోచన అనేది ఒక తీవ్రమైన మానసిక, సామాజిక సమస్య. మానసిక సమస్యలు, ఆందోళనల పరిష్కారానికి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న హెల్ప్‌లైన్ నంబర్ 080-4611 0007ను సంప్రదించవచ్చు. వారంలో 7 రోజులూ 24 గంటలూ 13 భాషల్లో ఈ హెల్ప్‌లైన్ సేవలు అందుబాటులో ఉంటాయి. మీరు మీ సమస్య గురించి స్నేహితులతో, బంధువులతో కూడా మాట్లాడండి.)


ఫొటో సోర్స్, RUPESH SONAVANE
5 వేల యూనిట్లు, 8 లక్షలమందికి ఉపాధి
ప్రపంచంలోని 90 శాతం వజ్రాలను సూరత్‌లోని 5,000 కు పైగా యూనిట్లలో ప్రాసెస్ చేస్తారు. ఈ పరిశ్రమ 8 లక్షల మందికి పైగా పాలిషర్లకు ఉపాధి కల్పిస్తోంది. అయితే మాంద్యం కారణంగా గత కొన్నేళ్లుగా వజ్రాల వ్యాపారం దెబ్బతింది.
యుక్రెయిన్‌పై దాడి తరువాత మార్చిలో, రష్యాకు చెందిన పాలిష్ చేయని వజ్రాలను మూడో దేశం ద్వారా దిగుమతి చేసుకోకుండా యూరోపియన్ యూనియన్, జీ7 దేశాలు నిషేధం విధించడంతో ఈ సంక్షోభం మరింత తీవ్రమైంది.
కోవిడ్ అనంతరం నెలల తరబడి లాక్‌డౌన్, నెమ్మదించిన ఎగుమతులు, పాశ్చాత్య దేశాల నుంచి డిమాండ్ పడిపోవడం, చైనా ఆర్థిక వ్యవస్థ మందగించడంతో, వజ్రాల పరిశ్రమ గత కొన్నేళ్లుగా అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది.
ల్యాబ్‌లో తయారు చేసిన వజ్రాలకు డిమాండ్ పెరగడం, అవి చాలా చౌకగా లభించడం కూడా సహజమైన వజ్రాల మార్కెట్‌పై ప్రభావం చూపింది.
కటింగ్, పాలిషింగ్ కోసం రష్యా నుంచి 30 శాతానికి పైగా రఫ్ డైమండ్స్‌ను భారతదేశం దిగుమతి చేసుకుంటోంది.
"ఆంక్షలతో వజ్రాల వ్యాపారం తీవ్రంగా దెబ్బతింది" అని ఇండియన్ డైమండ్ ఇన్‌స్టిట్యూట్ ప్రెసిడెంట్ దినేష్ నవాడియా అన్నారు.
‘‘2008 ఆర్థిక మాంద్యం కారణంగా దాదాపు 1000 పాలిషింగ్ యూనిట్లు మూతబడ్డాయి. 2 లక్షల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. కోవిడ్ తర్వాత జీ7 దేశాలు, యూఏఈ, చైనాలలోని మా కీలక మార్కెట్ల నుంచి డిమాండ్ తగ్గడంతో పరిస్థితి మరింత తీవ్రరూపం దాల్చింది” అని ఆయన అన్నారు.
‘‘2021 నుంచి పరిశ్రమ మాంద్యాన్ని ఎదుర్కొంటోంది. కోవిడ్ తర్వాత పాలిష్ చేసిన వజ్రాల ధరలు నిరంతరం హెచ్చుతగ్గులకు లోనవుతుండడమే దీనికి కారణం’’ అన్నారాయన.

ఫొటో సోర్స్, RUPESH SONAVANE
దిగజారుతున్న పరిస్థితి
డైమండ్ పాలిషర్‌లకు ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర డైమండ్ వర్కర్స్ యూనియన్ నేతలు బీబీసీతో మాట్లాడుతూ, గత 16 నెలల్లో 65 మంది ఆత్మహత్య చేసుకోగా, గత ఆరు నెలల్లోనే 30,000 మందికి పైగా ఉపాధి కోల్పోయారని తెలిపారు.
ఇటీవల ఆత్మహత్య చేసుకున్న తొమ్మిది మందికి పైగా డైమండ్ పాలిషర్ల కుటుంబాలను బీబీసీ గుజరాతీ కలుసుకుంది. ఆర్థిక మాంద్యం, ఉద్యోగాలు పోవడమే తమ వాళ్ల మరణాలకు కారణమని, తమకు చాలా తక్కువ సహాయం అందిందని వారు చెప్పారు.
మూడు నెలల కిందట ఉద్యోగం కోల్పోయిన 35 ఏళ్ల డైమండ్ పాలిషర్ దీపక్ హిర్పారా మాట్లాడుతూ, ‘‘ఎలాంటి సేవింగ్స్ లేకుండా ఎంతకాలం జీవించగలనో నాకు తెలీకుండా ఉంది’’ అన్నారు.
సూరత్‌లోని వరచా ప్రాంతంలో నివసించే ఆయన, భార్య, ఇద్దరు పిల్లలను పోషించలేక, అత్తమామల ఆర్థిక సహాయంతో జీవిస్తున్నారు.
సూరత్‌లోని చిన్న, మధ్య తరహా యూనిట్లలో పెద్ద మొత్తంలో ఉద్యోగులను తొలగించారు. వీళ్లలో రెండు రకాల వాళ్లు ఉన్నారు. రఫ్ డైమండ్స్‌పై (ముడి పదార్థం) పనిచేసేవారు, మరొకరు వజ్రాన్ని పాలిష్ చేసి, దానికి ఒక ఆకృతిని తెచ్చేవారు.
"సూరత్‌లోని వజ్రాల రంగంలో ఇప్పుడు ఒక చెడు దశ నడుస్తోంది’’ అని అధికార బీజేపీకి చెందిన స్థానిక శాసనసభ్యుడు కుమార్ కనాని అన్నారు.
“ఈ రంగానికి సంబంధించిన ప్రతి వ్యక్తితో నేను తరచూ మాట్లాడుతుంటాను. వజ్రాల పాలిషర్లు, వ్యాపారులకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వాళ్ల డిమాండ్లను చెప్పమని నేను కోరాను’’ అని ఆయన చెప్పారు.
2022లో బంగారు, వజ్రాల వ్యాపారం దేశ జీడీపీకి దాదాపు ఏడు శాతం దోహదపడింది. 2024 ఆర్థిక సంవత్సరంలో రత్నాలు, ఆభరణాల ఎగుమతులు విలువ రూ. 1.87 లక్షల కోట్లు. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 14.94% తక్కువ.

ఫొటో సోర్స్, Getty Images
భారీగా తొలగింపులు
డైమండ్ సిటీలో పెద్దఎత్తున తొలగింపులు జరగడం వల్ల వర్కర్స్ యూనియన్ జులై 2024లో హెల్ప్‌లైన్‌ను ప్రారంభించింది.
‘‘ఆగస్టులో, మా సూసైడ్ హెల్ప్‌లైన్ నంబర్‌కు డైమండ్ పాలిషర్‌ల నుంచి 1600 కంటే ఎక్కువ కాల్స్ వచ్చాయి’’ అని సూరత్‌లోని డైమండ్ వర్కర్స్ యూనియన్ గుజరాత్ ఉపాధ్యక్షుడు భావేష్ టంక్ తెలిపారు. కానీ సకాలంలో సహాయం పొందలేని వాళ్లు చాలా మంది ఉన్నారు.
‘‘కాల్ చేసేవాళ్లలో ఎక్కువ మంది ఉద్యోగం కావాలని లేదా ఆర్థిక సహాయం అందించమని మమ్మల్ని అభ్యర్థిస్తున్నారు’’ అని ఆయన చెప్పారు.
డైమండ్ పాలిషర్లు కాకుండా బ్రోకర్లు, వ్యాపారులు కూడా కష్టాలను ఎదుర్కొంటున్నారు.
కస్టమర్లు, వ్యాపారులు, ఇతర బ్రోకర్లకు వజ్రాలను విక్రయించే సుమారు 5,000 మంది బ్రోకర్లలో ఒకరైన 49 ఏళ్ల దిలీప్ సోజిత్రా మాట్లాడుతూ, “నేను ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ చూడలేదు. అమ్మకాలు లేదా కొనుగోళ్లు లేకుండా చాలా రోజులుగా ఖాళీగా కూర్చుంటున్నాం’’ అని అన్నారు.
సూరత్‌లో 800 కోట్ల రూపాయల కంటే ఎక్కువ వార్షిక టర్నోవర్ కలిగిన 15 పెద్ద సైజు పాలిషింగ్ యూనిట్‌లు, మరికొన్ని చిన్న, మధ్య తరహా యూనిట్లు ఉన్నాయి.
డి బీర్స్, రియో టింటో, రష్యా యాజమాన్యంలోని అల్రోసా, ఆఫ్రికన్ గనుల నుంచి ఇక్కడికి ముడి వజ్రాలు వస్తాయి.
‘‘వజ్రాల పరిశ్రమ వ్యాల్యూ చైన్‌లో భారత్ అట్టడుగున ఉంది. ముడిసరుకుతో పాటు తుది విక్రయాల కోసం మన దేశం ప్రపంచ మార్కెట్‌పై ఎక్కువగా ఆధారపడుతోంది’’ అని ప్రముఖ వజ్రాల ఎగుమతిదారు కీర్తి షా అన్నారు.
‘‘అమెరికా, హాంకాంగ్, యూఏఈ, బెల్జియంలు కట్ చేసిన, పాలిష్ చేసిన స్టోన్స్‌ను ఎగుమతి చేసే ముఖ్యమైన దేశాలు. భారతదేశం మొత్తం ఎగుమతుల్లో ఇవి 80% ఉన్నాయి. జీ7 దేశాలు, యూఏఈ, చైనాలో ఆర్థిక మందగమనం కారణంగా, మొత్తం మణులు, ఆభరణాల ఎగుమతులు ఆగస్టు నుంచి 23% క్షీణించాయి’’ అని షా వెల్లడించారు.
ప్రపంచ బ్యాంక్ తాజా గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ ప్రకారం, గ్లోబల్ ఎకానమీ వరుసగా మూడవ సంవత్సరం కూడా మందగిస్తోంది.
ఇజ్రాయెల్-గాజా, రష్యా-యుక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధాలూ పరిశ్రమను తీవ్రంగా దెబ్బ తీశాయి.
"ప్రపంచ మాంద్యం కారణంగా పాలిష్ చేసిన వజ్రాల వ్యాపారం 25-30 శాతానికి పైగా తగ్గింది" అని కిరణ్ జెమ్స్ చైర్మన్ వల్లభ్ లఖానీ అన్నారు.
తక్కువ డిమాండ్, అధిక సరఫరా కారణంగా 2023లో పాలిష్ చేసిన వజ్రాల ధర 5% నుంచి 27% వరకు తగ్గిందని పరిశ్రమ నిపుణులు అంటున్నారు.
‘‘పరిమిత డిమాండ్ ఉన్నప్పటికీ డైమండ్ పాలిషింగ్ యూనిట్లు ఉత్పత్తిని కొనసాగించడం వల్ల అధిక సరఫరా జరిగింది. యూనిట్లను పని చేయిస్తూ ఉండడం కోసం ఇలా చేశారు. అయితే ఈ నిర్ణయం వాళ్ల నష్టాలను పెంచింది” అని పాలిషింగ్ యూనిట్ యజమాని మహేష్ వీరాని తెలిపారు.

ఫొటో సోర్స్, RUPESH SONAVANE
చౌక వజ్రాలు
ప్రయోగశాలలో తయారైన వజ్రాలు చాలా చౌకగా లభిస్తున్నాయి. వీటి డిమాండ్ పెరిగి, అసలు వజ్రాల వ్యాపారానికి గట్టి దెబ్బ తగిలింది.
“ల్యాబ్‌లో జులై 2022లో క్యారెట్‌కు రూ.25 వేల విలువైన తయారీ వజ్రాలు...ఇవాళ క్యారెట్‌కు రూ. 6.5 వేలు అంతకంటే తక్కువకే అమ్ముడవుతున్నాయి. ఇది వ్యాపారంపై ప్రభావం చూపుతోంది. రఫ్ డైమండ్స్ ధరలు తగ్గి, కట్ చేసి, పాలిష్ చేసిన వజ్రాల ధరలు పెరిగినప్పుడు మాత్రమే పరిస్థితి మెరుగుపడుతుంది” అని సూరత్ డైమండ్ బ్రోకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నందలాల్ నక్రానీ అన్నారు.
67 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో, ఇటీవల ప్రారంభించిన ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ సముదాయం సూరత్ డైమండ్ బోర్స్ (ఎస్‌డీబీ)లో కూడా మాంద్యం ప్రభావం కనిపిస్తుంది.
‘‘2022లో కట్ చేసి, పాలిష్ చేసిన స్టోన్స్ ఎగుమతులు రూ. 1.93 లక్షల కోట్లు. 2023లో ఇది రూ.1.34 లక్షల కోట్లకు పడిపోయింది. 2024లో ఇది రూ. లక్ష కోట్ల వద్ద కొనసాగుతుందని అంచనా. వజ్రాల పరిశ్రమలో మాంద్యం కారణంగా, వ్యాపారులు సూరత్‌కు రాలేక పోతున్నారని స్పష్టంగా తెలుస్తోంది” అని ఎస్‌డీబీ వైస్ చైర్మన్ గోవింద్ ధోలాకియా చెప్పారు.
అయితే రాబోయే సెలవుల సీజన్‌లో బిజినెస్ పుంజుకుంటుందని ఆయన ఆశిస్తున్నారు.
‘'వజ్రాల పరిశ్రమ అనేక సవాళ్లను తట్టుకుని నిలబడింది. 2008లోనూ ఇలాగే జరిగితే తర్వాత నిలదొక్కుకుంది. ఈ మాంద్యం కూడా గడిచిపోతుంది. దీపావళి, క్రిస్మస్, న్యూ ఇయర్ సీజన్‌లో వ్యాపారం ఊపందుకుంటుందని భావిస్తున్నా’’ అని దిలీప్ సోజిత్రా అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














