గుంటూరు మిర్చి యార్డ్: మిర్చి రైతుల సమస్య ఏంటి? క్వింటాల్ ధర ఎంత ఉంటే నష్టాల నుంచి బయట పడతారు?

- రచయిత, గరికిపాటి ఉమాకాంత్
- హోదా, బీబీసీ కోసం
పల్నాడు జిల్లా క్రోసూరు మండలం ఉయ్యందన గ్రామానికి చెందిన రైతు గడ్డిగుంపుల వెంకటేశ్వర్లు గతేడాది తనకున్న ఒక ఎకరంలో పండించిన మిర్చి పంటను క్వింటాల్ రూ.18వేలకు అమ్ముకున్నారు.
అదే వెంకటేశ్వర్లు ఈ ఏడాది జనవరి నెలాఖరులో వచ్చిన పంటను క్వింటాల్ రూ.11వేలకే అమ్ముకోవాల్సి వచ్చింది.
ఇంత తేడాతో తక్కువ రేటుకు పంటను అమ్ముకుని చాలా నష్టపోయానని, ఈ ఏడాది వేసిన పంటను ఉంచాలో, తెంచాలో అర్ధం కావడం లేదని ఆయన బీబీసీతో చెప్పారు.
వెంకటేశ్వర్లు మాత్రమేకాదు, మిర్చిసాగు చేసిన వేలాదిమంది రైతుల పరిస్థితి ఇలాగే ఉంది.
గతంలో మార్కెట్‌లో కొంత పంటను కొన్న తర్వాత ధరలో తగ్గుదల కనిపించేది. అయితే ఈ ఏడాది ఆరంభంలోనే ధరలు తగ్గడంతో మిర్చి రైతులు ఆందోళన చెందుతున్నారు.
పంటకు గిట్టుబాటు ధర రాక, తక్కువ ధరకు అమ్ముకోలేక రైతులు సతమతమవుతున్నారు.


ఫొటో సోర్స్, Getty Images
ఏడాదిలోనే ధరలు ఎంతగా తగ్గాయంటే
వాస్తవానికి గతేడాది తొలినాళ్ల వరకు మిర్చి ధరలు ఆశాజనకంగానే ఉన్నాయి.
2014 నుంచి 2018 మార్చి వరకు కూడా బాగానే ఉన్న ధరలు ఆ తర్వాత గణనీయంగా తగ్గాయి.
రాష్ట్రంలోనే ప్రధానమైన గుంటూరు మిర్చి యార్డులో 2023 డిసెంబర్ నుంచి 2024 మార్చి వరకు క్వింటాల్ మిర్చి గరిష్టంగా 23వేల రూపాయల నుంచి రూ.26వేలకు పలికింది. అదే మిర్చి ధర ఇప్పుడు క్వింటాల్‌కు 10వేల నుంచి 14వేల వరకు మాత్రమే పలుకుతోంది.
సీజన్ ప్రారంభమైన జనవరి నెల మొదట్లో అయితే కనీసం క్వింటాల్‌కు రూ. 10వేలు కూడా రాకపోవడంతో తీవ్రంగా నష్టపోయామని సత్తెనపల్లికి చెందిన రైతు నరసింహారావు. చిలకలూరిపేటకి చెందిన మిర్చి రైతు రామారావు బీబీసీ వద్ద ఆవేదన వెలిబుచ్చారు.
కొన్నాళ్లుగా సరైన గిట్టుబాటు ధరలే వస్తుండటంతో రైతులు ఈ ఏడాది కూడా ఆశాజనకంగానే ఉంటుందని భావించి పెద్దమొత్తంలో పంట వేశారు.
దీంతో భారీస్థాయిలో మిర్చి మార్కెట్‌కు వచ్చింది. గతేడాది మార్చి నుంచి తగ్గిన ధరలు, మళ్లీ పెరుగుతాయన్న ఆశతో రైతులు గోదాముల్లోనే పాత సరుకు దాచుకున్నారు. "ఇప్పటికే పెద్దమొత్తంలో మిర్చి అందుబాటులో ఉండటం, ఈ ఏడాది కొత్త పంట రావడం.. సరిగ్గా ఇదే సమయంలో అంతర్జాతీయంగా తగ్గిన ఎగుమతుల వల్ల ధర ఒక్కసారిగా తగ్గిపోయింది" అని పల్నాడు రైతు సంఘం కార్యదర్శి గోపాల్ బీబీసీతో చెప్పారు.
మరోవైపు పంటను ఇటు తక్కువ ధరకు అమ్ముకోలేక అటు గిడ్డంగుల్లో దాచుకునేందుకు ఖాళీ లేక రైతులు దిగాలు పడుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎగుమతులపై ఆంక్షల ప్రభావం
గుంటూరు మిర్చి ఎక్కువగా చైనా, కొలంబో, బంగ్లాదేశ్, ఇండోనేషియా, థాయిలాండ్‌కు ఎగుమతయ్యేది.
అయితే ఇటీవలి కేంద్ర ప్రభుత్వం ఆయా దేశాలకు ఎగుమతులపై ఆంక్షలు విధించింది. దీంతో మిర్చి నిల్వలు పెరిగిపోయాయి.
అయితే చైనాకు ఆర్డర్లు పునరుద్ధరించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ అధికారులు ప్రకటించినప్పటికీ ఆ మేరకు ఫలితం కానరాలేదని రైతు సంఘం గుంటూరు జిల్లా కార్యదర్శి అజయ్ ఆరోపించారు.
ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 4 లక్షల ఎకరాల్లో మిర్చి సాగు చేయగా ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే 1.40 లక్షల ఎకరాల్లో సాగు చేశారు.
ఎకరాకు రూ.లక్షన్నర నుంచి రూ.రెండు లక్షలు పెట్టుబడి ఖర్చులవుతున్నాయని మిర్చి రైతు సీతయ్య చెప్పారు.
సగటున 15 నుంచి 20 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని ఆశించగా ఈ ఏడాది ఇప్పటి వరకు 12 నుంచి 14 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది.
గత ఐదారేళ్ల కాలంలో క్వింటాల్ గరిష్టంగా రూ.26 వేల వరకు వెళ్లడంతో రైతులు ఈసారి కూడా అధిక ధరలు వస్తాయన్న ఆశతో అప్పులు చేసి మరీ మిర్చి సాగు చేశారని సీతయ్య చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
కోల్డ్ స్టోరేజీల్లో 40లక్షల బస్తాలు..
ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, పశ్చిమగోదావరి జిల్లాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో తొలి కోతలు పూర్తయిన పంటను కొనుగోళ్ల కోసం గుంటూరు మిర్చి యార్డుకు తీసుకువస్తారు.
ఏటా కొత్త పంట వచ్చే సమయానికి గతేడాది మిర్చి నిల్వలన్నీ అమ్ముడయ్యేవి.
కానీ 2024 మార్చి తర్వాత ధర రూ.20వేల నుంచి సగానికి పడిపోవడంతో రైతులు మళ్లీ ధరలు పెరుగుతాయనే ఆశతో కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసుకున్నారు.
అప్పటి నుంచి ధరలు ఆశించిన స్థాయిలో పెరగకపోవడంతో 30 లక్షల బస్తాలకు పైగా స్టోరేజీల్లోనే మిగిలిపోయింది.
ఇప్పుడు పదిలక్షల బస్తాల కొత్త పంట కూడా వచ్చి చేరడంతో మొత్తంగా దాదాపు 40 లక్షల బస్తాలు కోల్డ్ స్టోరీజీల్లోనే ఉన్నాయని రైతు సంఘం నేతలు చెబుతున్నారు.
రాష్ట్రంలోని మిర్చి రైతులను ఆదుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు లేఖ రాశారు.
మిర్చి ధరలు బాగా పడిపోయినందున కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ (ఎంఐఎస్) కింద సేకరణ పరిమితులను పెంచాలని కోరారు. రాష్ట్రంలోని మిరప రైతుల భారీ నష్టాలను భర్తీ చేసేందుకు ప్రస్తుత 25 శాతం పరిమితి సరిపోదని బాబు పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం సాధారణ 50% కాకుండా 100% నష్టాలను భరించాలని, సహాయం అందించేటప్పుడు రైతుల ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకోవాలని ఆయన కోరారు. గత 10 సంవత్సరాల మిరప ఉత్పత్తి, ధరలపై డేటాను కూడా ముఖ్యమంత్రి సమర్పించారు.
ఈ మేరకు కేంద్ర వ్యవసాయశాఖ కార్యదర్శి చతుర్వేదితో కూడా ఆయన దిల్లీలో సమావేశమయ్యారు.

మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అంటే..
మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అంటే "వ్యవసాయ ఉత్పత్తుల ధరలు బాగా పడిపోయినప్పుడు, రాష్ట్రాలు సాయం కోరితే మద్దతు ధర పథకాల పరిధిలోకి రాని వ్యవసాయ ఉత్పత్తులను కేంద్రం సేకరిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఆ నష్టాలను భరిస్తుంది" అని రైతు నాయకుడు, మాజీ ఎంపీ యలమంచిలి శివాజీ బీబీసీతో చెప్పారు.
కేంద్రం ఎంఎస్‌పీ (గిట్టుబాటు ధర) ప్రకటించే వాణిజ్యపంటల జాబితాలో మిర్చి చేర్చకపోవడం వల్ల ఈ ఎంఐఎస్‌తో కొంతవరకు మేలు జరగచొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఎగుమతులు కేంద్రం చేతిలోనే ఉంటాయి కాబట్టి..ఎగుమతి విధానంపై కేంద్రం దృష్టి సారించాలని కోరారు.

రాజకీయ రంగు పులుముకున్న వివాదం
సరైన గిట్టుబాటు ధర కోసం మిర్చి రైతులు ఆందోళనతో ఎదురుచూస్తున్న సమయంలోనే విపక్ష నేత మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరు మిర్చి యార్డుకు వచ్చి రైతులను పరామర్శించారు.
అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ వైఎస్ జగన్ మిర్చి రైతులకు సంఘీభావం పేరిట రాజకీయం చేసేందుకే వచ్చారని టీడీపీ నేతలు విమర్శించారు.
ఎగుమతులు లేవని చెబుతున్న వ్యాపారులు రోజుకు లక్ష టిక్కీలు వచ్చినా కొనేస్తున్నారని, ఆ సరుకు అంతా ఎటుపోతుందోనని పల్నాడు రైతు సంఘం కారదర్శి గోపాల్ ప్రశ్నించారు. "ధర కొంత తగ్గిన మాట వాస్తవమే అయినప్పటికీ ఎగుమతిదారులు, కోల్డ్ స్టోరేజీ వ్యాపారులు, కమిషన్ వ్యాపారులు సిండికేట్ అయి ధరల్లో కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు’’ అని ఆయన బీబీసీతో చెప్పారు.
మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్‌తో కొనుగోళ్లు జరిపించినా రైతుకు కనీసం క్వింటాల్ మిర్చికి పాతికవేల రూపాయలు ఇప్పించాలని, అలాగైతేనే రైతు నష్టాల నుంచి బయటపడతారని రైతు సంఘం నేత గోపాల్ డిమాండ్ చేశారు.
ఆ మేరకు సీఎం చంద్రబాబు కేంద్రాన్ని ఒత్తిడి చేయాలని కోరారు.
గోదాముల్లో నిల్వ ఉంచిన సరకుకు అద్దెలు కూడా చెల్లించలేక రైతు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పరిస్థితి అర్ధం చేసుకుని ఉదారంగా సాయపడాలని కోరారు.

అమ్మకాలు, ఎగుమతులు పెరిగాయి..
ధరలు తగ్గడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న సమయంలోనే గుంటూరు మిర్చి యార్డులో మిర్చి అమ్మకాలు ఒక్కసారిగా పెరిగాయని యార్డు కార్యదర్శి ఎ.చంద్రిక బీబీసీకి తెలిపారు.
ఆర్డర్లు అధికంగా ఉండటంతో వ్యాపారులు కొనుగోళ్లకు ఆసక్తి కనబరిచారని చెప్పారు. శుక్రవారం నాటికి ధరలు కూడా ఒకింత పెరిగాయని, కామన్ వెరైటీ 334 మిర్చి రకం రూ. 14, 500 వరకు పలికిందని ఆమె అన్నారు.
మిగిలిన అన్ని రకాల ధరల్లో కూడా పెరుగుదల కనిపిస్తోందని, అలాగే ఎగుమతులు కూడా ఆశాజనకంగానే ఉంటున్నాయని చంద్రిక వివరించారు.
ఇప్పటివరకు 5.6 లక్షల టన్నులు ఎగుమతులు అయ్యాయని ఆమె బీబీసీకి వివరించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














