పెళ్లి: అమ్మాయిలు సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారా, ఎలాంటి అబ్బాయిలను కోరుకుంటున్నారు?

వివాహం, అమ్మాయిలు, వివాహ వ్యవస్థ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, పద్మ మీనాక్షి
    • హోదా, బీబీసీ కోసం

"పెళ్లంటే నూరేళ్ల పంట" "వెయ్యి అబద్దాలాడైనా ఓ పెళ్లి చేయాలి"

ఇలాంటి మాటలకు కాలం చెల్లిందా?

అమ్మాయి అందంగా ఉండాలి, కట్నం కావాలి, చదువుకోవాలి అని అబ్బాయిలు తమ కోరికలు చెప్పే రోజుల నుంచి.. అబ్బాయి ఎంత సంపాదించాలి, ఎలాంటి ఉద్యోగం చేయాలి, అత్తమామలు, ఆడపడుచులతో కలిసి ఉండాలా? వద్దా? ఏ కారు ఉండాలి? అనే విషయాలను అమ్మాయిలు డిమాండ్ చేసే స్థాయికి రోజులు మారాయని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
భారత వివాహ వ్యవస్థ

ఫొటో సోర్స్, Getty Images

‘మీ ఇష్టం నాన్నగారు’ అనే ధోరణి తగ్గిందా?

ఈ మధ్య ఒక ఇన్‌స్టాగ్రామ్ రీల్ వైరల్ అయింది.

వన్, టూ, త్రీ, ఫోర్, ఫైవ్ అంటూ అమ్మాయిల కోరికలకు లంకె పెడుతూ... వన్ అంటే ఒకే కొడుకు ఉండాలి, టూ అంటే మనం ఇద్దరమే ఉండాలి, త్రీ అంటే త్రీ బెడ్ రూమ్ ఫ్లాట్ ఉండాలి, ఫోర్ అంటే ఫోర్ వీలర్ ఉండాలి, ఫైవ్ అంటే ఐదంకెల జీతం కనీసం ఉండాలి.

ఇలా ఒక పెద్ద జాబితా ఉంటోంది. ఇది వాస్తవ పరిస్థితి కాకపోవచ్చు కానీ దేశంలోని పెద్ద నగరాల్లో, ముఖ్యంగా మెట్రోల్లో, విదేశాల్లో చదువుకుంటున్న అమ్మాయిలు చాలామంది తాము పెళ్లి చేసుకోబోయే అబ్బాయి ఎలా ఉండాలో స్పష్టంగానే చెబుతున్నారు.

అమ్మాయిల్లో "మీ ఇష్టం నాన్నగారు" అనే ధోరణి చాలా వరకు తగ్గింది.

అబ్బాయి సిబిల్ స్కోర్ బాలేదని ఇటీవల మహారాష్ట్రలోని మూర్తీజాపూర్‌లో ఓ అమ్మాయి కుటుంబం పెళ్లి రద్దు చేసుకున్న విషయం వార్తల్లోకొచ్చింది.

ఆ అబ్బాయికి చాలా బ్యాంకుల నుంచి లోన్లు కూడా ఉన్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురించిన కథనంలో పేర్కొన్నారు.

"ఇన్ని అప్పులుంటే మా అమ్మాయిని ఎలా చూసుకుంటావు?" అని అమ్మాయి తరపు వాళ్లు ప్రశ్నించినట్లు ఆ కథనంలో రాశారు.

బ్యాంకుల నుంచి తీసుకున్న లోన్లు, క్రెడిట్ కార్డు బిల్లులు సకాలంలో చెల్లించకపోతే సిబిల్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఆ వ్యక్తికి భవిష్యత్తులో లోన్లు దొరక్కపోవచ్చు.

మరోచోట... అబ్బాయి నెల జీతం రూ.1.2 లక్షలు మాత్రమేనని, అది తనకు సరిపోదంటూ ఓ అమ్మాయి పీటలపై పెళ్లి రద్దు చేసుకున్న ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లో 2024 నవంబర్‌లో జరిగింది.(ఈ ఘటనలను బీబీసీ స్వతంత్రంగా ధ్రువీకరించలేదు.)

ఇంతకీ ఇప్పటి అమ్మాయిలు ఎలాంటి అబ్బాయిలను భాగస్వామిగా కోరుకుంటున్నారు?

పెళ్లి

ఫొటో సోర్స్, Getty Images

ఎలాంటి భాగస్వామిని కోరుకుంటున్నారు?

హైదరాబాద్‌కు చెందిన 21 ఏళ్ల సాన్విక (పేరు మార్చాం) నాతో మాట్లాడారు.

"అబ్బాయికి మానవత్వం ఉండాలి. నన్ను నన్నులా ఆమోదించాలి. నన్ను ప్రేమించాలి. కొన్నేళ్లు గడిచాక ఆ అబ్బాయికి తగినట్లుగా నన్ను మారమని బలవంత పెట్టకూడదు. పరస్పర గౌరవం ఉండాలి. ఈ బంధంలో భాగస్వామి కావాలి కానీ నాపై పెత్తనం లేదా అధికారం చెలాయించే వ్యక్తి కాకూడదు. నేను తన సొంతం అనే భావన ఉండకూడదు. మేమిద్దరం రెండు వేర్వేరు భాగాలు అతుక్కుపోయినట్లుగా ఉండాలి" అని చెప్పారు.

తాను ఈ విధమైన అభిప్రాయాన్ని ఏర్పరచుకోవడానికి కారణం కూడా చెప్పారు సాన్విక.

"నా చిన్ననాటి స్నేహితుడి పట్ల బాగా ఆకర్షణకు లోనై, అతనితో జీవితాన్ని పంచుకోవాలని అనుకున్నప్పుడు... ఆ అబ్బాయి వ్యక్తం చేసిన అభిప్రాయం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. నన్ను మతం మార్చుకుంటావా అని అడిగాడు. అప్పటికి నా వయసుకు కులం, మతం గురించి ఆలోచించే పరిణితి కూడా లేదు.

ఈ ప్రతిపాదన నన్ను ఆలోచనకు గురి చేసింది. నిజంగా నన్ను ప్రేమిస్తే నన్ను మతం మార్చుకోవాలని ఎందుకు అడగాలి?

'ఇప్పటికి వద్దులే' అన్నాను. పెళ్లి తర్వాత నాకిష్టం లేని పద్ధతులను అలవాటు చేసుకోమని నన్ను బలవంతం చేయవచ్చని ఆ క్షణంలో నాకు అనిపించింది.

కులం, మతం లాంటి పట్టింపులు ఉన్న మన దేశంలో చాలా మంది అమ్మాయిలు.. 'తాము మారాలి, అబ్బాయి కుటుంబానికి తగినట్లుగా ఉండాలి' అని అనుకుంటున్నారు. వీటన్నిటి వల్ల నన్ను నన్నులా ఆమోదించి, ప్రేమించే మనిషి కావాలనిపించింది" అని వివరించారు సాన్విక.

"ఒకసారి ప్రేమిస్తే, ఆ అబ్బాయితోనే జీవితం అనుకోవడం మానేసి, భవిష్యత్తు ఎలా ఉండబోతోందో ముందుగానే ఊహించడం ఇద్దరికీ మంచిది" అన్నారు సాన్విక.

"భాగస్వామి అంటే కష్టంలో, సుఖంలో తోడుగా ఉండగలగాలి. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అన్ని సవాళ్లూ కలసి ఎదుర్కోగలగాలి. నాకు తోడుగా ఉంటూ నాకు మరింత బలాన్ని ఇవ్వగలగాలి. మనసు విప్పి మాట్లాడగలగాలి. నాతో కలిసి తన జీవితాన్ని చూడగలగాలి. నా తప్పుల్ని వివరించి, సరిదిద్దగలగాలి. తన తప్పుల్ని నేను చూపించినప్పుడు అంగీకరించే ధైర్యం ఉండాలి. జీవితాంతం కలిసి ఉండటానికి అవసరమైన ప్రయత్నం చేయాలి" అని తన భావాలను వివరించారు సాన్విక.

"చేసిన తప్పులను ఒప్పుకోకపోవడం వల్లే చాలా బంధాలు తెగిపోతూ ఉంటాయి. నా భాగస్వామి దగ్గర నేను నాలా ఉండగలగాలి. ముసుగులు వేసుకుని, అబద్ధాలు చెప్పాల్సిన స్థితి ఉండకూడదు. మనసులో ఏమనుకుంటున్నానో అది చెప్పగలగాలి. అప్పుడే బంధం బలంగా ఉంటుంది. ఒకరినొకరు ఎదుటి వ్యక్తుల బలాలను, బలహీనతలను కూడా ఆమోదించడం అలవాటు చేసుకుంటే... అది ఆ బంధంలో చాలా మార్పును తీసుకొస్తుంది" అని సాన్విక బీబీసీతో తన మనసులోని భావాలను పంచుకున్నారు.

రెస్టారంట్ లగ్జరీగా లేదని..

మరోవైపు నా స్నేహితురాలు వాళ్లబ్బాయికి పెళ్లి సంబంధాలు చూస్తూ.. అమ్మాయిలు సంబంధం ఎందుకు వద్దు అంటున్నారో చెప్పిన కారణాలు నన్ను ఆశ్చర్యానికి గురి చేశాయి.

ఆ అబ్బాయి అమెరికాలోని కాలిఫోర్నియాలో ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆ అబ్బాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు.

పెళ్లికి ముందే మంచి ఇల్లు, టెస్లా కారుతో పాటు తనకు కావాల్సిన వాటి జాబితాను ఓ అమ్మాయి ఈ అబ్బాయిని కలవక ముందే పంపించిందని నా స్నేహితురాలు చెప్పారు.

మరో అమ్మాయి ఇద్దరూ కలుసుకోవడానికి బుక్ చేసిన రెస్టారంట్ లగ్జరీగా లేదని సంబంధం వద్దని చెప్పినట్లు ఆమె చెప్పింది. "పెళ్లికి ముందే నన్ను తీసుకుని వెళ్లాల్సిన రెస్టారంట్‌పై శ్రద్ధ లేనప్పుడు పెళ్లి తర్వాత నా కోరికలకు ఎంత ప్రాధాన్యం ఇస్తావో అని భయంగా ఉంది. నిన్ను నేను పెళ్లి చేసుకోలేను" అని ఆ అమ్మాయి చెప్పిందని చెప్పారు.

నో సీక్రెట్స్

భాగస్వామి ఎలా ఉండాలనే దానిపై బెంగళూరుకు చెందిన 21 ఏళ్ల లక్ష్మీవర్మ ఆలోచనలు మరోలా ఉన్నాయి.

"మా బంధంలో రహస్యాలు ఉండకూడదు. నేను తనను ఏదైనా ప్రశ్నించగలిగే స్వేచ్ఛ ఉండాలి. నేను తన తల్లిదండ్రుల్ని ఎలా ఆమోదిస్తానో, తను కూడా నా కుటుంబాన్ని అలాగే స్వీకరించగలగాలి. నా తల్లిదండ్రుల్ని గౌరవించాలి.

ఇద్దరి మధ్య అసూయ ఉండకూడదు. నేను చేసే పని నచ్చకపోతే నాకు సున్నితంగా చెప్పగలగాలి. తన సహచర్యం నాకు మద్దతు, ధైర్యాన్నిచ్చేదిగా ఉండాలి" అని ఏళ్ల లక్ష్మీవర్మ తనకు కావల్సిన అబ్బాయిలో ఉండాల్సిన లక్షణాలను వివరించారు.

"నన్ను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, అడగక ముందే నా కోరికలను తెలుసుకోవాలి, మనసు తెలుసుకోవాలి. బాగా మాట్లాడాలి, మాకిద్దరికీ ఒకే అభిప్రాయాలు ఉండాలని లేదు కానీ ఇరువురం ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకోగలగాలి. ప్రయాణాలు చేయడం, రొమాంటిక్‌గా ఉండటం కూడా అవసరం" అని ఆమె చెప్పారు.

ఈ లక్షణాలు చాలా మందిలో లేకపోవడం వల్లే నాకు కాబోయే భాగస్వామిలో ఇవి ఉండాలని కోరుకుంటున్నానని లక్ష్మీవర్మ చెప్పారు.

పెళ్లి విషయంలో అమ్మాయిల ఆలోచన మారిందా?

ఫొటో సోర్స్, Getty Images

‘అదే కారణం’

అమ్మాయిలందరూ ఇంతే స్వతంత్రంగా ఉన్నారా లేదా ఇలానే ఆలోచిస్తున్నారా అనేది చర్చనీయాంశం.

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ప్రకారం 2022లో దేశవ్యాప్తంగా మహిళలపై 4,45,256 నేరాలు నమోదయ్యాయి. నమోదు చేయని కేసులు ఇంకా చాలానే ఉండొచ్చు. 2021తో పోలిస్తే ఇది 4% ఎక్కువ. ఈ నేరాల్లో ఎక్కువగా మహిళలపై భర్త తరపు బంధువులు పాల్పడిన నేరాలు, మహిళల అపహరణ, మహిళల ఆత్మాభిమానం దెబ్బ తీసే విధంగా చేసిన దాడులు ఎక్కువగా ఉన్నాయి.

"అబ్బాయి నా కన్నా పొడవుగా ఉండాలి, చాలా అందంగా ఉండాలి, నా మాతృ భాష మాట్లాడాలి. నాతో ఓపికగా ఉండాలి. నా కోసం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టనక్కరలేదు. ఇంట్లో పనిలో సాయం చేయాలి. కొంచెం రొమాంటిక్‌గా ఉండాలి. అప్పుడప్పుడూ 'ఐ లవ్ యూ' లాంటి మెసేజ్‌లు పంపడం, పువ్వులు ఇవ్వడం, పోస్ట్ కార్డ్స్ రాయడం, చిన్న చిన్న గిఫ్ట్స్ ఇవ్వడం లాంటివి చేస్తే నాకు ఇష్టం" అని మరో యువతి 21 ఏళ్ల గీతిక రాజ్ చెప్పారు.

యువతుల ఆలోచనా విధానంలో వస్తున్న ఈ మార్పులను హైదరాబాద్‌కు చెందిన సైకాలజిస్ట్ జీసీ కవిత విశ్లేషించారు. ఆర్థిక క్రమశిక్షణ లేని, అర్థం చేసుకోలేని మనస్తత్వం ఉన్న అబ్బాయిలను తిరస్కరించడంలో తప్పేమీ లేదని ఆమె అభిప్రాయపడ్డారు.

"పిల్లలు చిన్నప్పటి నుంచి చూసిన పరిస్థితులే వారు అభిప్రాయాలను ఏర్పరుచు కోవడానికి పునాది అవుతాయి. తల్లిదండ్రుల మధ్య బంధాన్ని బట్టి కొంతమంది తమ అభిప్రాయాలు ఏర్పరచుకుంటారు. కొంతమంది డబ్బు లేకుండా పెరిగితే తమకు డబ్బు ఉన్న భర్త కావాలని కోరుకుంటారు. కొంత మంది తమ అమ్మానాన్నల దగ్గర దొరకని ప్రేమను భర్త నుంచి పొందాలని కోరుకుంటారు. ప్రతి ఒక్కరికీ ప్రేమ, గౌరవం, డబ్బు, సౌకర్యం... అన్నీ కావాలి. కానీ, ఏ అవసరానికి ప్రాధాన్యం ఇస్తారు అనేది కుటుంబ నేపథ్యం, పెరిగిన వాతావరణాన్ని బట్టి ఉంటుంది" అని కవిత చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)