బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్: కాళేశ్వరం ప్రాజెక్ట్ విజిల్ బ్లోయర్ రాజలింగమూర్తి హత్యపై ఆరోపణలు ఏంటి?

నాగవెల్లి రాజలింగమూర్తి, తెలంగాణ

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, భూపాలపల్లికి చెందిన నాగవెల్లి రాజలింగమూర్తి ఫిబ్రవరి 19న హత్యకు గురయ్యారు
    • రచయిత, ప్రవీణ్ శుభం
    • హోదా, బీబీసీ కోసం

భూపాలపల్లిలో ఫిబ్రవరి 19న జరిగిన నాగవెల్లి రాజలింగమూర్తి హత్య తెలంగాణలో చర్చనీయాంశమైంది. బుధవారం రాత్రి సుమారు 7 గంటల ప్రాంతంలో రెడ్డి కాలనీ వద్ద గుర్తుతెలియని వ్యక్తులు రాజలింగమూర్తిని కత్తులతో పొడిచి చంపేశారు.

అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్‌ పరస్పర ఆరోపణలతో ఈ హత్య రాజకీయరంగు పులుముకుంది.

హతుడు రాజలింగమూర్తి భార్య సరళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు భూపాలపల్లి పోలీసులు తెలిపారు.

మేడిగడ్డ బరాజ్‌లో అవినీతి, భూపాలపల్లిలో భూఆక్రమణలపై పోరాడినందుకే తన భర్తను హత్య చేశారని, ఈ హత్య వెనుక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి హస్తముందని మృతుని భార్య సరళ, కూతురు నిత్యశ్రీ ఆరోపించారు.

అయితే, తనపై, తమ పార్టీ నేతలపై వచ్చిన ఆరోపణలను మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి ఖండించారు.

ఈ హత్య వెనుక రాజకీయం జరుగుతోందని ఆయన బీబీసీతో అన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
తెలంగాణ, భూపాలపల్లి, కాంగ్రెస్, బీఆర్‌ఎస్

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, మేడిగడ్డ బరాజ్ కుంగిపోవడానికి అప్పటి సీఎం కేసీఆర్, కాంట్రాక్ట్ సంస్థలే బాధ్యులంటూ రాజలింగమూర్తి కోర్టులో కేసులు వేశారు

ఎవరీ నాగవెల్లి రాజలింగమూర్తి?

కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌లో అవకతవకలు జరిగాయంటూ భూపాలపల్లిలోని ఫక్కీర్‌గడ్డ ప్రాంతానికి చెందిన నాగవెల్లి రాజలింగమూర్తి కోర్టులో కేసు వేశారు.

రాజలింగమూర్తి భార్య సరళ గతంలో భూపాలపల్లి మున్సిపాలిటీలో 15వ వార్డు నుంచి, బీఆర్ఎస్ కౌన్సిలర్‌గా కొంతకాలం కొనసాగారు.

ఆ తర్వాత వివిధ కారణాలతో ఆమె పార్టీని వీడారు.

కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌లో భాగంగా మేడిగడ్డ వద్ద నిర్మించిన బరాజ్ పిల్లర్లు దెబ్బతిని 2023 అక్టోబర్‌లో బరాజ్ కుంగిపోయింది.

ప్రాజెక్టులో అవినీతి, నాసిరకం నిర్మాణాల కారణంగానే ఇలా జరిగిందని, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మంత్రులు, నిర్మాణ సంస్థలే దీనికి బాధ్యులంటూ రాజలింగమూర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు ఈ ఫిర్యాదులను స్వీకరించకపోవడంతో ఆయన భూపాలపల్లి ప్రిన్సిపల్ జిల్లా సెషన్స్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో జిల్లా కోర్టు కేసీఆర్ సహా మరికొందరికి సమన్లు జారీ చేసింది.

అనంతరం, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై కౌంటర్ అఫిడవిట్ సమర్పించాల్సిందిగా రాజలింగమూర్తిని హైకోర్టు ఆదేశించింది.

హైకోర్టులో ఫిబ్రవరి 20న ఇదే అంశంపై విచారణ జరగాల్సి ఉన్న తరుణంలో, ఫిబ్రవరి 19 రాత్రి రాజలింగమూర్తి హత్య కు గురయ్యారు. దీంతో ఈ హత్య రాజకీయ మలుపులు తీసుకుంది.

తెలంగాణ, భూపాలపల్లి, నేరాలు
ఫొటో క్యాప్షన్, మేడిగడ్డ కేసును ఉపసంహరించుకోవాలని తన భర్తను మాజీ ఎమ్మెల్యే ప్రలోభపెట్టారని, ఒప్పుకోకపోతే చంపేస్తానని బెదిరించారని సరళ ఆరోపించారు.

'ప్రశ్నిస్తున్నారనే చంపేశారు'

'భూపాలపల్లిలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై నా భర్త పోరాడారు. మేడిగడ్డలో అవినీతిపై కోర్టుకు వెళ్లారు. నా భర్త హత్య వెనుక కేటీఆర్‌తో పాటు భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి హస్తముంది. వారి అనుచరులకు డబ్బులిచ్చి నడిరోడ్డు మీద చంపించారు' అని రాజలింగమూర్తి భార్య సరళ బీబీసీతో చెప్పారు.

మేడిగడ్డ కేసు విత్ డ్రా చేసుకుంటే పది లక్షలు ఇస్తామని నెలరోజుల కిందట తన భర్తను మాజీ ఎమ్మెల్యే ప్రలోభపెట్టారని, ఒప్పుకోకపోతే చంపేస్తానని బెదిరించినట్టు తన భర్త తనతో చెప్పారని ఆమె అన్నారు.

'నా పిల్లలు చిన్నవయసు వారు, నాకు న్యాయం చేయండి. మేడిగడ్డ కేసు గెలిస్తే వారి ఆటలు సాగవనే ఇదంతా చేశారు' అని సరళ అంటున్నారు.

తెలంగాణ, భూపాలపల్లి, కాంగ్రెస్, బీఆర్ఎస్
ఫొటో క్యాప్షన్, రాజలింగమూర్తి కూతురు నిత్యశ్రీ

రాజలింగమూర్తి కూతురు నిత్యశ్రీ బీబీసీతో మాట్లాడుతూ, ''నిన్న దేవుడి పండుగ కోసం నానమ్మ వాళ్లింటికి వెళ్లొచ్చాం. సాయంత్రం మమ్మల్ని ఇంట్లో దింపి డాడీ బయటకు వెళ్లిన సమయంలో చంపేశారు'' అన్నారు.

'డాడీ హత్య కేసులో పోలీసులు మాకు సహకరించడం లేదు. కేవలం ఇద్దరు నిందితులను మాత్రమే అదుపులో తీసుకున్నారని తెలిసింది. హత్య జరిగిన స్థలంలో సీసీ ఫుటేజీ ఇంకా రాలేదు. పోలీసుల అదుపులో ఉన్న వారికి డాడీని చంపేంత ధైర్యం లేదు. వారి వెనకుండి చేయించిన వారెవరో బయటకు రావాలి. మాకు న్యాయం జరగాలి' అన్నారు నిత్యశ్రీ.

తెలంగాణ, భూపాలపల్లి, కాంగ్రెస్, బీఆర్ఎస్
ఫొటో క్యాప్షన్, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు

సుపారీ హత్యలా అనిపిస్తోంది: ఎమ్మెల్యే

రాజలింగమూర్తి హత్యపై భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు (కాంగ్రెస్) మీడియా సమావేశంలో మాట్లాడారు.

''ఎవరో హత్య చేసి, ఇంకెవరో పోలీసులకు సరెండర్ అవుతున్నారేమోననే అనుమానాలున్నాయి. ఇది సుపారీ హత్యలా అనిపిస్తోంది. సీబీసీఐడీ విచారణ జరపాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా. హత్య వెనుక ఎవరున్నా విచారణలో నిగ్గు తేల్చాలి. హత్యకు కారణం వ్యక్తిగత విషయాలైనా, ఇంకేదైనా భూపాలపల్లిలో హత్యా రాజకీయాలకు తావులేదు'' అని గండ్ర సత్యనారాయణ రావు అన్నారు.

రాజలింగమూర్తి హత్యపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హైదరాబాద్ గాంధీభవన్‌లో మాట్లాడుతూ, ''బీఆర్ఎస్ దోపిడీని ప్రశ్నించిన రాజలింగమూర్తిని హత్య చేశారు. పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ హత్యా రాజకీయాన్ని పెంచిపోషించింది. ఈ హత్యను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాలని కోరుతున్నా. నిందితులను పట్టుకుని, ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి శిక్షించాలి. తెలంగాణలో హత్యా రాజకీయాలకు తావులేదు, అవినీతిపై పోరాడే వారికి రక్షణ కల్పిస్తాం'' అన్నారు.

గండ్ర వెంకటరమణారెడ్డి

ఫొటో సోర్స్, BRS Party/X

'మాకు సంబంధం లేదు'

ఈ హత్యతో తనకు,తమ పార్టీ నేత కేటీఆర్‌కు ఎలాంటి సంబంధం లేదని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి బీబీసీతో అన్నారు.

'ఈ హత్యకు మేడిగడ్డ కేసుతో, కేటీఆర్, కేసీఆర్‌లతో సంబంధం లేదు. రాజలింగమూర్తికి చాలామందితో శత్రుత్వం ఉంది. చంపినవారు పోలీసు కస్టడీలోనే ఉన్నారు. ఓ భూమి వివాదంలో ఇదంతా జరిగిందన్నది నాకున్న సమాచారం. కంప్లైంట్‌లో ఒకలా ఇచ్చారు, ఇప్పుడు రాజకీయాలు ఆపాదిస్తున్నారు' అని వెంకటరమణా రెడ్డి చెప్పారు.

''నా నలబై ఏళ్ల రాజకీయ చరిత్రలో ఎప్పుడూ ఇలా చేయలేదు. ఇదంతా పనిగట్టుకుని రాజకీయ దురుద్దేశంతో చేస్తున్నారు. ఈ కేసుతో మాకు సంబంధం లేదు. అలాంటి చరిత్ర మాకు లేదు. ఇదంతా పనిగట్టుకుని చేస్తున్నారు. మేడిగడ్డ కేసు ఇంకా కోర్టులోనే ఉంది. అవసరమైతే సీబీఐ ఎంక్వైరీ చేసుకోమనండి'' అన్నారాయన.

మేడిగడ్డ బరాజ్, కాళేశ్వరం, భూపాలపల్లి, తెలంగాణ
ఫొటో క్యాప్షన్, హతుడి భార్య సరళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు

పోలీసులు ఏం చెప్పారు?

రాజలింగమూర్తి హత్య కేసులో భూపాలపల్లి పోలీసులు విచారణ జరుపుతున్నారు.

''లింగమూర్తి భార్య సరళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. హత్యలో ఐదుగురు వ్యక్తుల ప్రమేయం ఉందని దరఖాస్తులో అనుమానం వెలిబుచ్చారు. సంఘటనా స్థలంలో లభించిన క్లూస్ ఆధారంగా ముందుకుపోతున్నాం. పోలీసుల అదుపులో ఎవరూ లేరు. ప్రత్యేక బృందాలను నియమించాం'' అని భూపాలపల్లి డీఎస్పీ సంపత్ బీబీసీకి తెలిపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)