తెలంగాణ కులాలు: కేసీఆర్ లెక్కకీ, రేవంత్ లెక్కకీ ఎంత తేడా వచ్చింది?

facebook/kcr/revanth

ఫొటో సోర్స్, facebook/kcr/revanth

    • రచయిత, బళ్ళ సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తెలంగాణలో బీసీల జనాభా తగ్గింది అన్న అంశంపై రాజకీయంగా గగ్గోలు పుట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని బీసీల జనాభా తగ్గించి చూపించిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

స్వయంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీయే సీఎం అసెంబ్లీలో వెల్లడించిన నివేదికను తగలబెట్టారు.

ముఖ్యంగా 2014లో కేసీఆర్ చేసిన సర్వేకి, 2024లో రేవంత్ చేసిన సర్వేకి మధ్య లక్షల్లో తేడా రావడం చర్చకు కారణమైంది.

రేవంత్ vs కేసీఆర్ లెక్కలు

తెలంగాణ కుల గణన

2024లో కాంగ్రెస్, 2014లో బీఆర్ఎస్ చేసిన సర్వేల్లో వచ్చిన జనాభా వివరాలు ఇలా ఉన్నాయి:

రేవంత్ రెడ్డి హయాంలో కేసీఆర్ హయాం కంటే కుటుంబాల సంఖ్య పెరిగింది. కానీ జనాభా తగ్గింది.

ఎస్సీ, ఎస్టీ, ముస్లిం జనాభాలోనూ తేడా వచ్చింది. కానీ అది స్వల్పమే.

ఓసీ, బీసీల జనాభాలో భారీ తేడా వచ్చింది. హిందూ బీసీల సంఖ్య దాదాపు 21 లక్షల వరకు, అంటే 5 శాతం తగ్గింది. ఇదే ఇప్పడు రచ్చకు కారణం అయింది.

పై టేబుల్ ప్రకారం ఓసీల జనాభా కూడా భారీగా తగ్గినట్టు కనిపిస్తున్నప్పటికీ, అప్పటి ఓసీల డాటా మతాల వారీగా బీబీసీ వద్ద అందుబాటులో లేదు కాబట్టి పోల్చలేం.

ముస్లిం బీసీ, ఓసీ, హిందూ బీసీ, ఓసీల జనాభా వివరాలు వేర్వేరుగా కాంగ్రెస్ ఇచ్చింది.

బీబీసీ న్యూస్ తెలుగు
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

బీఆర్ఎస్ పార్టీ విడుదల చేసిన లెక్క

తెలంగాణ బీసీ కుల గణన

బీసీల సంఖ్య ఎలా తగ్గిందంటున్న ప్రతిపక్షం

బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన లెక్క ప్రకారం చూస్తే ముస్లిం కాని ఓసీల జనాభా కూడా 5 శాతం అంటే దాదాపు 16 లక్షలు పెరిగింది.

అటు బీసీల జనాభా ఐదు శాతం తగ్గడం, ఓసీల జనాభా ఐదు శాతం పెరగడంపై పలు రకాల వాదనలు వినిపిస్తున్నాయి.

అసలు కాంగ్రెస్ ప్రభుత్వం సర్వే చేసిందే బీసీల జనాభా తేల్చడం కోసం. అంతేకాకుండా, ఆయా కులాల సామాజిక, ఆర్థిక స్థితి అంచనా వేయడం కోసం.

96 శాతం కుటుంబాలు సర్వేలో పాల్గొన్నాయని ప్రభుత్వం స్వయంగా చెప్పిన తరువాత కూడా ఈ స్థాయిలో జనాభా తేడా రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. దీనిపై బీసీ సంఘాలు, బీఆర్ఎస్ నేతలు ఘాటుగా స్పందించారు.

''ప్రభుత్వం మళ్లీ సర్వే చేయాలి. ఇది సరిగా జరగలేదు. పదేళ్ల క్రితం 52 శాతం ఉన్న బీసీలు, పదేళ్ల తర్వాత ఎలా తగ్గారు? ఈ సర్వే మొత్తం తప్పులే. ఎన్నికల సంఘం ప్రకారం ఓటర్ల సంఖ్య, రాష్ట్రంలో ఇంటర్ లోపు చదువుకుంటున్న విద్యార్థుల సంఖ్య కలిపినా ఈ లెక్క తేడా అని తెలుస్తోంది. బీసీల జనాభా ఏ రకంగా చూసినా 50 శాతానికి తగ్గదు. 56 శాతం వరకు ఉంటుంది. అటువంటి ఈ సర్వేను తిరస్కరిస్తున్నాం. కాంగ్రెస్ హామీ ఇచ్చిన ప్రకారం బీసీ రిజర్వేషన్ అమలు చేసి తీరాలి.'' అని బీఆర్ఎస్ నాయకులు మధుసూదనాచారి, గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు.

తెలంగాణలో పంచాయితీ, మునిసిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఆ హామీ ప్రకారం కుల గణన చేపట్టింది.

2014లో కేసీఆర్ చేసిన కులగణన ఉన్నప్పటికీ కాంగ్రెస్ మళ్లీ సొంతంగా ఈ గణన చేపట్టింది. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల అంశాలపై ప్రశ్నలు, ఉప ప్రశ్నలు కలిపి మొత్తం 75 ప్రశ్నలతో సర్వే చేసింది.

శాస్త్రీయంగా చేశామంటున్న కాంగ్రెస్

సుమారు లక్ష మందికి పైగా సిబ్బంది ఈ గణాంకాల సేకరణలో పాల్గొన్నారు.

50 రోజుల పాటు జరిగిన సర్వే 96.9 తెలంగాణను కవర్ చేసిందని ప్రభుత్వం చెప్పింది. అయినా తప్పులు రావడంపై పలువురు విశ్లేషకులు సైతం సర్వేపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

''బీసీ జనాభా తగ్గడం వెనుక బహుశా పాలకపక్షం వ్యూహం ఉందనిపిస్తోంది. రిజర్వేషన్ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుందని, అలాగే ఓసీలను మరీ తక్కువ చూపితే, వారికి పదవుల విషయంలో ఇబ్బంది వస్తుందని ఇలా చూపినట్టు అనిపిస్తోంది. ఇక ముస్లింలలో బీసీల కొలమానానికి ఎలాంటి ప్రామాణికత లేదు. ఈ సర్వే సమగ్రంగా అయితే లేదు. సాధారణంగా పెరిగే జనాభా పెరుగుదల కూడా ఇక్కడ కనిపించలేదు. అప్పట్లో కేసీఆర్ సర్వేలో కూడా కొన్ని కులాల సంఖ్యను తక్కువ చేసి చూపారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ సర్వేలో మరిన్ని లోపాలు కనిపిస్తున్నాయి.'' అని సీనియర్ పాత్రికేయుడు దుర్గం రవీందర్ బీబీసీతో చెప్పారు.

అయితే ఈ వాదనలతో కాంగ్రెస్ ఏకీభవించడం లేదు.

''ఎలాంటి ఆధారం లేకుండానే ఈ సర్వే తప్పు అంటున్నారు. ఎంతో శాస్త్రీయంగా లక్షకు పైగా సిబ్బందితో ఇల్లిల్లూ పరిశీలన చేసి గణన చేశాం. ఇది దేశానికే ఆదర్శం. 1931 తరువాత మొదటిసారి ఇలా, ఇంత పకడ్బందీగా దేశంలో కుల గణన జరిగింది. 2014 లో సమగ్ర కుటుంబ సర్వే లెక్కలను కూడా బయటకు చెప్పలేని బీఆర్ఎస్ ఇప్పుడు మాట్లాడడం అన్యాయం'' అన్నారు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్.

తెలంగాణ, కేసీఆర్, రేవంత్ రెడ్డి, కులగణన, బీసీలు, ముస్లింలు, హిందువులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన కులగణనపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

స్థానిక ఎన్నికలపై ప్రభావం ఉంటుందా?

మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తోన్న వేళ ఈ టెన్షన్ మరింత పెరుగుతోంది.

''స్థానిక రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ వారు హడావుడి పడకుండా, ప్రభుత్వ ఒత్తిడి లేకుండా నివేదిక ఇవ్వాలని'' బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన రావు అన్నారు.

ప్రభుత్వ సమాచారమే అంతిమం కాదని, కమిషన్ స్వతంత్రంగా వ్యవహరించాలని ఆయన అన్నారు. ప్రభుత్వం భేషజాలకు పోకుండా మళ్లీ సర్వే నిర్వహించాలని డిమాండ్ చేశారు.

(టేబుల్ సోర్స్: టేబుల్ 1లో 2024 లెక్కలు సీఎం రేవంత్ రెడ్డి శాసన సభలో ప్రకటించినవి కాగా, 2014 లెక్కలు ఎంసీఆర్ హెచ్ఆర్డీ వెబ్ సైట్ నుంచి గతంలో బీబీసీ సేకరించినవి.

(నోట్: 2014 లెక్కలు అప్పటి ప్రభుత్వం అధికారికంగా ఇవ్వలేదు. అయితే ఎంసీహెచ్ఆర్డీ సంస్థ ఈ సర్వే జరిగిన తీరు గురించి వివరిస్తూ ఒక నివేదికను సిద్ధం చేసిది. అందులోనే సర్వే ఫలితాలు కొన్నిటిని పొందుపరిచింది. ఆ నివేదిక వారి వెబ్ సైట్లో ఉండేది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ వివరాలను తొలగించింది. ఈ నివేదికను గతంలోనే బీబీసీ తీసుకున్నది. ఈ కథనంలో ఉపయోగించిన రెండో టేబుల్‌ను బీఆర్ఎస్ నాయకులు మీడియాకు విడుదల చేసిన సమాచారం నుంచి ప్రచురించాం.)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)