కోల్‌కతా ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య కేసు: దోషి సంజయ్ రాయ్‌‌కి జీవిత ఖైదు

సంజయ్ రాయ్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, నిందితుడు సంజయ్‌రాయ్
    • రచయిత, సల్మాన్ రావి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్‌‌ రేప్, మర్డర్ కేసులో దోషి సంజయ్ రాయ్‌కు కోర్టు జీవిత ఖైదు విధించింది. ఈ మేరకు సీల్దా కోర్టు సోమవారం తీర్పును వెల్లడించింది.

దోషికి 50 వేల రూపాయల జరిమానా కూడా విధించింది. బాధిత కుటుంబానికి రూ.17 లక్షల నష్టపరిహారం చెల్లించాల్సిందిగా పశ్చిమబెంగాల్ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.

'మాకు పరిహారం అవసరం లేదు, న్యాయం కావాలి' అని మృతురాలి తల్లిదండ్రులు న్యాయమూర్తితో అన్నట్లు లాయర్ రెహ్మాన్ ఏఎన్ఐ వార్తాసంస్థతో అన్నారు.

''ఈ కేసులో దోషికి ఉరిశిక్ష విధించాలని సీబీఐ డిమాండ్ చేసింది. ఇది అరుదైన కేసుల్లో అరుదైన కేసు కాదని, అందుకే ఉరిశిక్ష విధించడం లేదని న్యాయమూర్తి అన్నారు'' అని రెహ్మాన్ అన్నారు.

కోల్‌కతా డాక్టర్ కేసు

ఫొటో సోర్స్, Samir Jana/Hindustan Times via Getty Images

ఫొటో క్యాప్షన్, కోల్‌కతా ట్రైనీ డాక్టర్ కేసులో నిందితుడిని న్యాయస్థానం దోషిగా ప్రకటించింది

2024 ఆగస్టు 9న హాస్పిటల్ సెమినార్ హాల్లో 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్ మృతదేహాన్ని గుర్తించారు. ఆమెపై లైంగిక దాడికి పాల్పడిన తర్వాత హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది.

ఈ ఘటనతో కోల్‌కతాలో భారీ నిరసనలు జరిగాయి. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో రెండు నెలలకు పైగా ఆరోగ్య సేవలు స్తంభించిపోయాయి.

బీబీసీ న్యూస్ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ట్రైనీ డాక్టర్ హత్య కేసు

ఫొటో సోర్స్, Getty Images

దోషిగా నిర్ధరిస్తూ కోర్టు ఏం చెప్పింది?

ఈ ఘటన జరిగిన ఐదు నెలల తర్వాత కోల్‌కతాలోని సీల్దా కోర్టు తీర్పు వెలువరించింది.

భారత శిక్షాస్మృతిలోని సెక్షన్లు 64, 103 (1) కింద నిందితుడు సంజయ్ రాయ్‌ని దోషిగా నిర్ధరిస్తూ, జీవిత ఖైదు విధించింది.

ఈ కేసులో 'సాక్ష్యాలు నాశనం చేయడం' గురించి వచ్చిన అభియోగాల్లో మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్, స్థానిక టాలా పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి అభిజీత్ మండల్‌పై సీబీఐ చార్జీషీట్ దాఖలు చేయలేకపోయింది. దీంతో వారికి గతంలోనే బెయిల్ లభించింది.

అయితే, సీబీఐ దర్యాప్తుపై మృతురాలి తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేశారు. కేసును పర్యవేక్షిస్తున్న సుప్రీంకోర్టు, కోల్‌కతా హైకోర్టులలో పిటిషన్లు దాఖలు చేశారు. సీల్దా ప్రత్యేక కోర్టు శిక్ష ప్రకటించకుండా ఆపాలని, ఈ కేసులో మరోసారి సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరారు.

కోల్‌కతా ట్రైనీ డాక్టర్ కేసు

ఫొటో సోర్స్, Reuters

ఏరోజు, ఏం జరిగింది?

ఆగస్టు 9, 2024

ఉదయం, ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ సెమినార్ హాల్లో మహిళా ట్రైనీ డాక్టర్ మృతదేహం లభ్యమైంది. ట్రైనీ డాక్టర్‌‌ను రేప్ చేసి, ఆ తర్వాత చంపేశారు. హత్యకు గురైన డాక్టర్, రాత్రి భోజనం చేసిన తర్వాత సెమినార్ హాల్లోనే నిద్రపోయారు.

పోలీసుల కథనం ప్రకారం, ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటన రాత్రి 3 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య జరిగింది.

ఈ ఘటనపై వైద్యులు నిరసనలకు దిగారు.

ఆగస్టు 10, 2024

పోలీసులు టాస్క్‌ఫోర్స్ టీమ్‌ను ఏర్పాటు చేశారు. ఆరుగంటల్లోనే నిందితుడు సంజయ్ రాయ్‌ను అరెస్టు చేశారు. సీసీటీవీ ఫుటేజీతో పాటు సెమినార్ హాల్లో విరిగిపోయిన బ్లూటూత్ ఇయర్‌ఫోన్‌ను గుర్తించారు.

అది నిందితుడి ఫోన్‌తో కనెక్ట్ అయ్యి ఉంది. వీటి ఆధారంగా పోలీసులు నిందితుడు సంజయ్ రాయ్‌ను అరెస్టు చేశారు.

ఆగస్టు 12, 2024

మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ రాజీనామా.

ఆగస్టు 13, 2024

ఈ కేసులో దర్యాప్తు సరిగ్గా జరగలేదన్న కోల్‌కతా హైకోర్టు, కేసును సీబీఐకి అప్పగించింది.

ఆగస్టు 15, 2024

ఆగస్టు 14, 15 తేదీల మధ్య రాత్రి, ఆర్‌జీ కర్ ఆస్పత్రిలోని వైద్యుల నిరసన శిబిరంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు.

ఆగస్టు 16, 2024

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్‌కతాలో మార్చ్‌ నిర్వహించారు. ఈ మార్చ్‌పై బీజేపీతో పాటు అనేక మంది విమర్శలు చేశారు.

సుప్రీం కోర్టు

ఫొటో సోర్స్, ANI

సుమోటోగా సుప్రీం కోర్టు విచారణ

ఆగస్టు 20, 2024

కోల్‌కతా ట్రైనీ డాక్టర్ రేప్, మర్డర్ కేసును సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. దేశవ్యాప్తంగా వైద్యులు, వైద్య సిబ్బందికి సరైన భద్రతా ఏర్పాట్లు లేకపోవడంపై సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. నేషనల్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది.

ఆగస్టు 21, 2024

ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ భద్రతా వ్యవహారాలను సీఐఎస్ఎఫ్ చేపట్టింది.

ఆగస్టు 22, 2024

అప్పటికి 11 రోజులుగా కొనసాగుతున్న సమ్మెను డాక్టర్లు విరమించుకున్నారు.

ఆగస్టు 27, 2024

వైద్యురాలిపై అత్యాచారం, హత్యను నిరసిస్తూ విద్యార్థులు రాష్ట్ర సచివాలయం వరకూ నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చారు. ఈ నిరసన సందర్భంగా నిరసనకారులు, పోలీసుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

'పశ్చిమ్ బంగా ఛాత్ర్ సమాజ్' అనే నూతన విద్యార్థి సంఘం ఈ నిరసనకు ''నబాన్న అభియాన్'' అని పేరుపెట్టింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయాలని నిరసనకారులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

ఆగస్టు 28, 2024

నిరసన ప్రదర్శన చేస్తున్న విద్యార్థులపై పోలీసు బలగాల మోహరింపు, అరెస్టులను వ్యతిరేకిస్తూ బీజేపీ 12 గంటలపాటు బెంగాల్ బంద్‌కు పిలుపునిచ్చింది. బీజేపీ రాష్ట్రంలో అరాచకం సృష్టించాలని చూస్తోందని అధికార టీఎంసీ ఆరోపించింది.

కోల్‌కతా డాక్టర్ కేసు, ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్‌పై జరిగిన అత్యాచారం, హత్యపై సత్వర న్యాయం కోరుతూ, 'రీక్లైమ్ ది నైట్ మార్చ్' పేరుతో ఆందోళనకు దిగిన వైద్యులు, మహిళలు

పశ్చిమ బెంగాల్‌లో కొత్త చట్టం

సెప్టెంబర్ 2, 2024

సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌ను అరెస్టు చేసింది. ఆయనతో పాటు హాస్పిటల్‌కు వస్తువులను సరఫరా చేసే కాంట్రాక్టర్లు బిప్లబ్ సింగ్, సుమన్ హజ్రా, సందీప్ ఘోష్ బాడీగార్డ్ అఫ్సర్ అలీ ఖాన్‌ను కూడా అరెస్టు చేశారు.

దీంతో పాటు సాక్ష్యాలను నాశనం చేసేందుకు ప్రయత్నించారనే ఆరోపణలతో స్థానిక టాలా పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి అభిజీత్ మండల్‌ను కూడా సీబీఐ అరెస్టు చేసింది.

సెప్టెంబర్ 3, 2024

సంఘటన జరిగిన నెల రోజుల్లోనే, 'పశ్చిమ బెంగాల్ క్రిమినల్ లా'ను సవరిస్తూ చేసిన ''అపరాజిత వుమన్ అండ్ చైల్డ్ బిల్ 2024''ను పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది.

ఈ బిల్లుతో మహిళలపై నేరాలకు సంబంధించి ఇండియన్ జస్టిస్ కోడ్, 2023 (బీఎన్ఎస్), ఇండియన్ సివిల్ సెక్యూరిటీ కోడ్, 2023 (బీఎన్ఎస్ఎస్), పోక్సో యాక్ట్, 2012కు సవరణలు చేసింది.

కోల్‌కతా, పశ్చిమ బెంగాల్, మమతా బెనర్జీ

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సెప్టెంబర్‌లో నిరసన తెలుపుతున్న విద్యార్థులను కలిసేందుకు వెళ్లారు.

సెప్టెంబర్ 8, 2024

ఈ కేసు విషయంలో సొంతపార్టీ నేతల నుంచి కూడా మమతా బెనర్జీ ప్రభుత్వం వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చింది.

ఆర్‌జీ కర్ హాస్పిటల్లో అత్యాచారం, హత్య ఘటనపై ప్రజల నుంచి తీవ్ర ఆందోళనలు వ్యక్తమవడంతో రాజ్యసభలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ జవహర్ సర్కార్, పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి లేఖ రాయడంతో పాటు తాను రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు.

సెప్టెంబర్ 14, 2024

దాదాపు నెలరోజుల ఆందోళనలు, నిరసన ప్రదర్శనల అనంతరం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమ్మె చేస్తున్న వైద్యులను కలిశారు. ఈ సందర్భంగా తమ డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవడంతో పాటు ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు సీఎంని కోరారు.

సెప్టెంబర్ 17, 2024

కోల్‌కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయెల్‌ను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది.

అక్టోబర్ 7, 2024

ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌పై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది.

డిసెంబర్ 13, 2024

ఈ కేసులో నిందితులుగా ఉన్న అప్పటి ప్రిన్సిపల్ సందీప్ ఘోష్, కోల్‌కతా టాలా పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి అభిజీత్ మండల్‌లకు బెయిల్ లభించింది.

జనవరి 18, 2025

సంజయ్ రాయ్‌ను సీల్దా కోర్టు దోషిగా తేల్చింది.

జనవరి 20, 2025

సంజయ్ రాయ్‌కు జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)