అలిపిరి మెట్లపై అలుపెరుగని ప్రయాణికులు వీరు, ఏం చేస్తారంటే...

అలిపిరి మెట్లపై అలుపులేని ప్రయాణం
ఫొటో క్యాప్షన్, తిరుపతితో పాటు, పరిసర గ్రామాలకు చెందినవారు ఈ పనిలో ఉన్నారు.
    • రచయిత, బళ్ళ సతీశ్, నవీన్ కుమార్ కందేరి
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

తిరుమలకు అలిపిరి నుంచి నడకదారిలో వెళ్లే భక్తులందరికీ అలిపిరి మెట్లు ఎలా ఉంటాయో తెలిసే ఉంటుంది. ఈ రాతి మెట్లు కాస్త ఎత్తుగా ఉంటాయి. అడుగు కొంచెం పైకి ఎత్తి వేయాల్సి ఉంటుంది. అందుకే నాలుగు మెట్లు ఎక్కగానే ఎవరికైనా అలుపు వచ్చేస్తుంది.

భక్తులు తమ సామాన్లన్నింటినీ కింద లగేజీ కౌంటర్లలో ఇచ్చేసి ఎటువంటి బరువు లేకుండా మెట్లు ఎక్కుతుంటారు. మెట్లు ఎక్కుతున్న కొద్దీ ఆయాసం కూడా పెరుగుతుంది. అందుకే చాలామంది మధ్యలో ఆగి, ఆగి నడుస్తుంటారు.

కానీ అదే దారిలో కొంతమంది నెత్తిన బోలెడు బరువుతో మెట్లు ఎక్కుతూ కనిపిస్తుంటారు. నడకదారిలోని దుకాణాలకు సరుకులను చేర్చేది నెత్తిన బరువుతో సాగిపోయే ఈ శ్రామికులే.

తిరుమల కొండ మెట్ల దారిలో ఎన్నో దుకాణాల్లో తినుబండారాలు అమ్ముతుంటారు. వాటిని ఆ అంగళ్లకు చేర్చడానికి శ్రమించేది ఈ కూలీలే. తిరుమల గిరుల్లో అలిపిరి మెట్లపై అలుపులేని ప్రయాణం వీరిది. ఈ పని దశాబ్దాలుగాచేస్తున్నవారూ ఉన్నారు.

తలపై బరువుతో, ఒంటిపై చెమటతో, అలిపిరి మెట్లపై సాగే ఆ శ్రమ జీవులతో కాసేపు మాట కలిపి, వారి జీవన చిత్రాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసింది బీబీసీ.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
గరుడాళ్వార్ విగ్రహం

కష్టపడి, సంతోషంగా బతుకుతున్నాం

తిరుపతితో పాటు, పరిసర గ్రామాలకు చెందినవారు ఈ పనిలో ఉన్నారు. తిరుమల కొండ కింద నుంచి సరకులను 900-1000 మెట్ల వరకూ వీళ్లు చేరుస్తారు. అలాగే కొండ దిగే రోడ్డు నుంచి సరకు తెచ్చి, 2100 మెట్టు దగ్గర (గాలి గోపురం ప్రాంతంలో) స్టాక్ పెట్టుకుని, అక్కడ నుంచి కింద వైపున్న దుకాణాలకు మోసుకుంటూ దించుతారు.

ఈ పనిచేసేవారు సుమారు 20-30 మంది వరకూ ఉంటారని అంచనా. మొత్తం సరకంత మోసే వారు కొందరుంటే.. బృందాలుగా మొత్తం సరకును చేరవేసేవారు ఇంకొందరు ఉంటారు.

ఒక ట్రేకి 30-35 రూపాయల చొప్పున ఇస్తారు. బృందంగా సరకు చేర్చితే, బృందంలోని సభ్యులందరూ ఆ డబ్బును పంచుకుంటారు. వస్తువుల బరువును బట్టి కూలీ ఉంటుంది.

ఏడుకొండల వాడి చెంతకు నడకదారిలో వెళ్లే భక్తులకు దుకాణాలలో తినుబండారాలు అందడంలో వీరి పాత్ర ప్రత్యేకం.

నిత్యం చెమటోడుస్తూ పనిచేసే వీరికి, ఎవరి మీదా ఫిర్యాదులు లేవు. దేవుడు ఇచ్చిన దాంట్లో సంతోషంగా, కష్టపడి పనిచేసుకుంటున్నామంటూ నవ్వుతూనే చెబుతారు. అంగడి (దుకాణం) యజమానులు కూడా బాగా చూసుకుంటారంటూ చెబుతున్నారు.

తినుబండారాల దుకాణాల దగ్గరకు సరకులు చేర్చే కూలీల జీవనచిత్రం
ఫొటో క్యాప్షన్, మంచినీళ్లు, జ్యూస్ వంటివి తాగి కూడా పనిచేస్తామంటున్న కవిత

‘‘1100 మెట్ల వరకు సరుకులు మోస్తాం’’

''చాలా కాలం నుంచి ఇదే పనిలో ఉన్నాను. ఉదయాన్నే వస్తాం. పనిని బట్టి ఒక్కోసారి 4 గంటలకు, ఒక్కోసారి 7-8 గంటలకూ వచ్చేస్తాం. తల మీద ఇంత బరువుతో ఎలా ఎక్కుతున్నారు అని కొందరు అడుగుతుంటారు. మాకు అలవాటైపోయింది.

అన్నం తినకపోయినా ఎక్కేస్తాం. మంచినీళ్లు, జ్యూస్ వంటివి తాగి కూడా పనిచేస్తాం. అన్నం తింటే గస వస్తుందని ఒక్కోసారి తినకుండానే పనిచేస్తాం. పని అయ్యాక కిందకు వెళతాం. గాలిగోపురం నుంచి 1,100 మెట్టు వరకూ సరుకు మోస్తాం'' అని బీబీసీతో చెప్పారు గంగడిపల్లికి చెందిన కవిత.

తినుబండారాల దుకాణాల దగ్గరకు సరకులు చేర్చే కూలీల జీవనచిత్రం
ఫొటో క్యాప్షన్, ‘‘ఎప్పుడూ భగవంతుడి దగ్గరే ఉన్నాను'' అని చంద్రగిరికి చెందిన వెంకటేశ్ చెప్పారు.

చిన్నతనం నుంచి కొండమీద, కొండదారిలోనూ పనులు చేసుకు బతుకుతున్నారు వెంకటేశ్. భగవంతుడినే నమ్ముకున్నాను, సమస్యలేవీ లేవని నవ్వుతూ చెబుతారాయన.

''నేను చిన్నప్పటి నుంచి కొండ మీద, మెట్ల మీదే పనులు చేసుకుని బతుకుతున్నాను. పటాల లామినేషన్ (ఫొటో ఫ్రేములు) పని చేశాను. మద్రాస్ సరకు పని చేశాను. గుడిలో పనిచేశా. పరకామణి పని చేశాను. ఇప్పుడు చాలా కాలంగా మెట్ల మీదకు కూల్ డ్రింకులు, మంచినీరు తీసుకెళ్లే పనిచేస్తున్నాను. ఏ సమస్యా లేదు. సంతోషంగా ఉన్నాను.

సుమారు 20 మంది ఈ పనిచేస్తాం. తెల్లవారుఝామునే వస్తాం. బ్యాచీల వారీగా, వంతుల వారీగా మోస్తాం. భగవంతుణ్ణి నమ్ముకున్నాం. సమస్యలేమీ లేవు. అంగడి వారు కూడా బాగా చూసుకుంటారు. ఎప్పుడూ భగవంతుడి దగ్గరే ఉన్నాను'' అని బీబీసీతో చెప్పారు చంద్రగిరికి చెందిన వెంకటేశ్.

తినుబండారాల దుకాణాల దగ్గరకు సరకులు చేర్చే కూలీల జీవనచిత్రం
ఫొటో క్యాప్షన్, 60 ఏళ్ల వయసులోనూ బరువు ఎత్తుకుని కృష్ణారెడ్డి మెట్లు ఎక్కుతున్నారు.

60 ఏళ్ల వయసులోనూ...

గత ఇరవై ఏళ్ల నుంచి ఇదే పనిలో ఉన్నట్టు చెప్పారు కృష్ణా రెడ్డి. ఆయన వయసు 60 దాటింది. అయినప్పటికీ మెట్లపై సరుకు మోస్తున్నారు.

''కష్టపడి సొంతిల్లు కట్టుకున్నాను. గతంలో ఊరిలో సాగు చేసేవాడిని. వాటాల్లో భూమి తగ్గింది. నీరు లేదు. అందుకే పనిలోకి వచ్చేశాను'' అని చెప్పారు కృష్ణా రెడ్డి.

''అయ్యో చూడు ఎంత బరువు ఎత్తుకుని వస్తున్నారో పాపం.. అయ్యో నీకు ఎందుకు ఈ కష్టం? కాలో చెయ్యో జారితే ఎలా? మోయవద్దు.. అంటారు కొందరు. మానేద్దాం అంటే.. అప్పులు ఉండాయి కదా.. ఇప్పుడు మానేస్తే ఎలా? అప్పు తీరితే ఇబ్బంది లేదు. అప్పటి వరకూ మోయమంటారు ఇంట్లో. అందుకే…'' అంటూ తన కథ చెప్పారు కృష్ణా రెడ్డి.

తాను కష్టపడి సంపాదించిన సొమ్ముతో ఆటో కొనుక్కుంటే, రిపేరు కోసం ఇంజిన్ విప్పి బయటపెడితే, దొంగలు దాన్ని ఎత్తుకుపోయారని, ఇలా కష్టపడ్డ వారి సొమ్మే దొంగల పాలు అవుతోందంటూ తన బాధ చెప్పుకొచ్చారాయన.

తినుబండారాల దుకాణాల దగ్గరకు సరకులు చేర్చే కూలీల జీవనచిత్రం
ఫొటో క్యాప్షన్, మెట్లు ఎక్కే సమయంలో అప్పుడప్పుడు ఎవరన్నా అడ్డువస్తే పడిపోతుంటామని వనజాక్షి చెప్పారు.

‘‘కొన్నిసార్లు పడిపోతుంటాం’’

తల్లిదండ్రులు ఇదే పనిలో ఉండడంతో, వనజాక్షి కూడా ఇలా మెట్లపై సరకులు మోసే పనే చేస్తున్నారు. ఆమె భర్తది కూడా ఇదే పని.

బాగా సన్నగా కనిపించే వనజాక్షిని, అంత బరువు ఎలా మోస్తున్నావని ప్రశ్నిస్తే, ''మాకు చిన్నప్పటి నుంచి అలవాటు కాబట్టే చేస్తున్నాం. అలుపు వస్తే కాసేపు విశ్రాంతి తీసుకుంటాం. ఎత్తైన మెట్టుపైన సరకు పెట్టి, ఆయాసం, గస తగ్గిన తరువాత మళ్లీ ఎత్తుకుని నడుస్తాం'' అంటూ చెప్పుకొచ్చారు వనజాక్షి.

మెట్లు ఎక్కే సమయంలో కొందరు పిల్లలు అకస్మాత్తుగా అడ్డు రావడం లేదా మరికొందరు పరుగులు పెట్టడం వల్ల ఈ సామగ్రి మోసేవారు కింద పడిపోతుంటారని చెప్పారు వనజాక్షి.

''మా నాన్న, భర్త, మా అమ్మ కూడా అలా పడిపోయారు. కాకపోతే షాపుల వారు సామాన్లు దెబ్బతిన్నా మమ్మల్ని డబ్బులు కట్టమని అడగరు. మాకు ఏమైనా గాయాలయ్యాయా అని ఆప్యాయంగా ఆరా తీస్తారు'' అన్నారు వనజాక్షి.

తినుబండారాల దుకాణాల దగ్గరకు సరకులు చేర్చే కూలీల జీవనచిత్రం
ఫొటో క్యాప్షన్, బాధ్యతతో పనిచేస్తామని బీబీసీతో చెప్పిన కూలీలు

‘‘అందరిలోనూ మంచే కనిపిస్తుంది’’

పాతికేళ్లుగా ఇక్కడే పనిచేస్తున్నారు తిరుపతికి చెందిన చిట్టెమ్మ.

''ఇక్కడే మానుకు జోలె (చెట్టుకు ఉయ్యాల) కట్టి చిన్న పిల్లల్ని వేసి పెంచుకుంటూ పనిచేసుకున్నాను. ఇప్పుడు పెద్దమ్మాయి డిగ్రీ కూడా అయిపోయింది. గతంలో ఇక్కడే పడుకునే వాళ్లం కూడా. ఈ మధ్యే జంతువుల భయం అంటూ కిందకు పంపేస్తున్నారు. దీంతో రోజూ కిందికి వెళ్లి వస్తున్నాం. నడిచే ఎక్కి, దిగుతాం'' అని చిట్టెమ్మ చెప్పారు.

''చాలా మంది పలకరిస్తారు. ఎవరైనా కొందరు టిఫిన్ తినమ్మా అని డబ్బు కూడా ఇస్తారు. కొందరు పుణ్యాత్ములు డబ్బు సాయం చేస్తారు.

చాలా మంది నడవలేక అవస్థ పడతారు. ఇప్పుడు అంబులెన్సులు వచ్చాయి కానీ గతంలో ఎవరైనా మెట్లు ఎక్కేప్పుడు హార్ట్ అటాక్ వచ్చి చనిపోతే మృతదేహాలను కూడా కిందకు మోశాం. ఇప్పుడు దేవస్థానం వారు కూడా సాయంగా ఉంటారు.

కష్టపడుతున్నారంటూ మమ్మల్ని చూసిన భక్తులు ఆప్యాయంగా పలకరించి మాట్లాడతారు. మేం కూడా మాట్లాడుతూ పలకరిస్తాం'' అన్నారు చిట్టెమ్మ.

''కొందరు యువకులైతే, అయ్యో ఆంటీ.. చాలా బరువు మోస్తున్నారు. సాయం చేద్దాం అంటూ నా నెత్తి మీద సామాన్లు తీసుకుని, వాళ్లే సాయం పట్టి పైకి తీసుకెళ్లారు కూడా. పెద్ద సమస్యలేమీ లేవు. ఈ మధ్య మోకాళ్ల నొప్పులు మొదలయ్యాయి'' అంటూ నవ్వుతూ చెప్పారు చిట్టెమ్మ.

తినుబండారాల దుకాణాల దగ్గరకు సరకులు చేర్చే కూలీల జీవనచిత్రం
ఫొటో క్యాప్షన్, టిఫిన్ తినమని కొందరు డబ్బులు ఇస్తుంటారని చిట్టెమ్మ చెప్పారు.

చివర్లో చిట్టెమ్మకు, బీబీసీ ప్రతినిధికి మధ్య జరిగిన ఓ చిన్నసంభాషణ

చిట్టెమ్మ: నేను 22 ఏళ్ల వయసు నుంచి మోస్తున్నాను

బీబీసీ: నీ అంత పుష్టి కలగాలంటే ఏం తినాలి?

చిట్టెమ్మ: ఏం తినలా.. మామూలు అన్నమే తింటాం అంతే. సోనా మసూరి కూడా తినం మేం. స్టోర్ బియ్యం (రేషన్ బియ్యం) తింటాం.

బీబీసీ: అందుకే మీకు అంత బలం వచ్చి ఉంటుంది.

చిట్టెమ్మ: బలం కాదు.. బాధ్యత.. పిల్లలను సాకాలి, బతుకు తెరువు కావాలి, చదివించాలి. కానీ ఎంత చదివించినా పిల్లలకు ఉద్యోగాలు మాత్రం రాలేదు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)