బ్రిటిషు వారికి క్షమాపణ చెప్పమని సావర్కర్‌ను గాంధీ కోరారా?

గాంధీ, సావర్కర్

ఫొటో సోర్స్, savarkarsmarak.com/Getty Images

కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ జర్నలిస్టు అరుణ్ శౌరీ రాసిన 'ది న్యూ ఐకాన్ - సావర్కర్ అండ్ ది ఫ్యాక్ట్స్' అనే పుస్తకం ఇటీవల విడుదలైంది. ఈ పుస్తకంలో వీడీసావర్కర్ రచనలను, ఆయన వ్యక్తిత్వాన్ని అరుణ్ శౌరీ నిశితంగా సమీక్షించారు.

సావర్కర్ రాసిన పత్రాలు, బ్రిటిషు రికార్డుల ఆధారంగా అరుణ్ శౌరీ ఈ పుస్తకాన్ని రాశారు.

దీనిపై అరుణ్ శౌరీతో బీబీసీ ప్రతినిధి జుగల్ పురోహిత్ ప్రత్యేకంగా మాట్లాడారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
అరుణ్ శౌరీ
ఫొటో క్యాప్షన్, అటల్ బిహారీ వాజ్‌పేయి క్యాబినెట్‌లో అరుణ్ శౌరీ మంత్రిగా పనిచేశారు.

బ్రిటిషు వారితో సావర్కర్

వినాయక్ దామోదర్ సావర్కర్‌పై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. సావర్కర్‌ను దేశభక్తుడు, జాతీయవాది అని బీజేపీ పిలుస్తుండగా, కాంగ్రెస్ అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది.

సావర్కర్ గొప్ప హేతువాది అని, ఆ విషయంలో ఆయనను అభినందిస్తున్నట్లు అరుణ్ శౌరీ తెలిపారు.

"సావర్కర్ అనేక ఆచారాలను ప్రశ్నించారు, దానికి ఆయనను అభినందిస్తున్నాను. కానీ, ఆయన బ్రిటిషు వారికి సాయం చేశారు" అని అరుణ్ అన్నారు.

"జాతీయ స్థాయిలో స్వాతంత్య్రం కోసం ఉద్యమం జరుగుతున్నప్పుడు బ్రిటిషు వారికి సావర్కర్ మద్దతుగా నిలిచారు. బ్రిటిషు వారికి రాజకీయంగా సహాయం చేస్తానని వాగ్దానం చేశారు" అని అరుణ్ శౌరీ చెప్పారు.

"సావర్కర్ బ్రిటిషు వారి షరతులను అవసరానికి మించి అంగీకరించారు. అవి ఆయనను జైలు నుంచి విడుదల చేయడానికి సంబంధించినవి కూడా కావు. సావర్కర్ వైస్రాయ్ లిన్‌లిత్‌గోను కలిసినప్పుడల్లా, ఆ సమావేశానికి సంబంధించిన పూర్తి రికార్డును లిన్‌లిత్‌గో లండన్‌కు పంపేవారు. ఆ రికార్డులలో 'సావర్కర్ నన్ను రెండుసార్లు వేడుకున్నారు' అని లిన్‌లిత్‌గో రాశారు" అని అరుణ్ తెలిపారు.

దామోదర్ సావర్కర్, బ్రిటిషు, భారత్

ఫొటో సోర్స్, savarkarsmarak.com

ఫొటో క్యాప్షన్, నాసిక్ కలెక్టర్ హత్యలో సావర్కర్ దోషిగా తేలారు.

సావర్కర్ క్షమాపణ

సావర్కర్ రాసిన క్షమాపణలపై అనేక ఊహాగానాలు ఉన్నాయి. వాస్తవానికి, నాసిక్ కలెక్టర్ హత్యలో సావర్కర్ దోషిగా తేలారు. ఆయనపై 25 సంవత్సరాల చొప్పున రెండు వేర్వేరు శిక్షలు విధించారు.

ఆ శిక్షను అనుభవించడానికి ఆయనను అండమాన్ (కాలాపానీ)కి పంపారు. జైలుకు వెళ్లిన తర్వాత సావర్కర్ బ్రిటిషు వారికి చాలా క్షమాపణ లేఖలు రాశారు. ఈ విషయంపై పలువురు సావర్కర్‌ను విమర్శించారు.

అయితే, బ్రిటిషు వారికి క్షమాపణ చెప్పడాన్ని సావర్కర్, ఆయన మద్దతుదారులు సమర్థించుకున్నారు.అది తమ వ్యూహంలో భాగమన్నారు. దీంతో కొన్ని రాయితీలు పొందవచ్చన్నారు. సావర్కర్ ఇచ్చిన ఈ వివరణను అరుణ్ శౌరీ తన పుస్తకంలో ప్రస్తావించారు.

సావర్కర్ క్షమాపణలను శివాజీ వంటి వ్యూహాలుగా అరుణ్ శౌరీ భావించడం లేదు.

"శివాజీకి (ఔరంగజేబు లేదా ఆయన సైన్యం వల్ల) ఎప్పుడు ఇబ్బందులు ఎదురైనా, దక్షిణాదిని గెలవడానికి సహాయం చేస్తానని ఔరంగజేబుకు ఉత్తరం రాసేవారు. ఔరంగజేబు అక్కడి నుంచి వెళ్లిన వెంటనే, శివాజీ మళ్లీ తన పని తాను చేసుకునేవారు. కానీ, సావర్కర్ బ్రిటిషు వారి వద్ద శివాజీ వ్యూహాన్ని అనుసరించారా? అంటే కచ్చితంగా కాదు. ఆయన బ్రిటిషు వారికి సాయం చేస్తూనే ఉన్నారు" అని అరుణ్ తెలిపారు.

సావర్కర్

ఫొటో సోర్స్, savarkarsmarak.com

ఫొటో క్యాప్షన్, 1910 మార్చి 13న విక్టోరియా స్టేషన్‌లో అరెస్టు అయిన తర్వాత తీసిన సావర్కర్ ఫోటో.

క్షమాపణ కోరమని గాంధీజీ అడిగారా?

సావర్కర్ దుష్ప్రచారాలకు బాధితుడని 2021లో కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ బహిరంగ వేదికపై వ్యాఖ్యానించారు. గాంధీజీ కోరిక మేరకే సావర్కర్ క్షమాపణలు రాశారని ఆయన ఆరోపించారు.

దీనిపై అరుణ్ శౌరీ మాట్లాడుతూ "1910లో సావర్కర్‌ని దోషిగా నిర్ధరించిన విషయం ఆయనకు (రాజ్‌నాథ్‌సింగ్‌కు) తెలియకపోవచ్చు. జైలు శిక్ష అనుభవించేందుకు సావర్కర్‌ను అండమాన్‌కు పంపారు. అయితే, ఆయన రెండు నెలల్లోనే క్షమాపణ చెప్పారు. ఆ తర్వాత అనేక క్షమాపణ లేఖలు రాశారు. ఆ సమయంలో గాంధీ దక్షిణాఫ్రికాలో (1910-11) ఉన్నారు. 1915లో గాంధీ భారతదేశానికి తిరిగి వచ్చారు. సావర్కర్ అప్పటికే నాలుగేళ్లు జైలులో ఉన్నారు, ఐదు క్షమాపణలు దాఖలు చేశారు'' అని అన్నారు.

శౌరీ వివరిస్తూ "రాజకీయ ఖైదీలందరికీ బ్రిటిషు వారు సాధారణ క్షమాభిక్షప్రకటించినప్పుడు సావర్కర్‌ పేరును అందులో చేర్చలేదు. దీంతో సావర్కర్ తమ్ముడు నారాయణ్ గాంధీజీ సలహా కోరారు. దీంతో సావర్కర్ తన పిటిషన్‌లో తాను రాజకీయ ఖైదీ అని రాస్తే, అప్పుడు ఆయన కూడా క్షమాభిక్ష పరిధిలోకి వస్తారని గాంధీజీ సూచించారు. సావర్కర్ అదే చేశారు. ఆయనతో పాటు జైలులో ఉన్న తన సోదరులు భారతదేశంలో బ్రిటిషు పాలనకు వ్యతిరేకం కాదని హామీ ఇచ్చారు'' అని తెలిపారు.

సావర్కర్, స్వాతంత్య్ర పోరాటం

ఫొటో సోర్స్, savarkarsmarak.com

ఫొటో క్యాప్షన్, గాంధీజీతో సావర్కర్‌కు ఎలాంటి సంబంధం ఉండేది. ఇద్దరూ స్నేహితులేనా?

గాంధీజీకి మిత్రుడా?

1948లో మహాత్మాగాంధీ హత్యకు గురైన ఆరో రోజున, ఈ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలపై సావర్కర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే, ఫిబ్రవరి 1949లో ఆయన నిర్దోషిగా విడుదలయ్యారు.

సావర్కర్ ప్రకారం, ఆయన ఒకప్పుడు గాంధీజీకి స్నేహితులు. ఇంతకీ గాంధీజీతో సావర్కర్‌కు ఎలాంటి సంబంధం ఉండేది. ఇద్దరూ స్నేహితులేనా?

ఈ ప్రశ్నకు అరుణ్ శౌరీ సమాధానమిస్తూ "అస్సలు కాదు. నిజానికి గాంధీజీని సావర్కర్ అసహ్యించుకున్నారు. గాంధీజీని ఆయన మూర్ఖుడు, పిచ్చివాడనేవారు. మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి అంటుండేవారు. 'నడిచే ప్లేగు' అనేవారు" అని తెలిపారు.

సావర్కర్, భారత్

ఫొటో సోర్స్, savarkarsmarak.com

ఫొటో క్యాప్షన్, సావర్కర్ 1923లో 'హిందుత్వ – ఎవరు హిందువు?' అనే పుస్తకం రాశారు.

‘హిందుత్వ నుంచి హిందూమతాన్ని కాపాడాలి’

సావర్కర్ 1923లో 'హిందుత్వ – ఎవరు హిందువు?' అనే పుస్తకం రాశారు. ఇందులో ఆయన తొలిసారిగా హిందుత్వను రాజకీయ సిద్ధాంతంగా ఉపయోగించుకున్నారు.

దీనిపై అరుణ్ శౌరి స్పందిస్తూ "సావర్కర్ తను రాసిన పుస్తకంలో హిందుత్వ, హిందూయిజం చాలా భిన్నమైనవని రాశారు" అని తెలిపారు.

హిందూమతాన్ని హిందుత్వనుంచి కాపాడాలని శౌరీ 'ది న్యూ ఐకాన్ - సావర్కర్ అండ్ ది ఫ్యాక్ట్స్' పుస్తకంలో విజ్ఞప్తి చేశారు.

"సావర్కర్ ఆశించిన హిందుత్వం వస్తే ఇక మనది భారతదేశం కాదు, పాకిస్తాన్‌గా మారుతుంది. అది 'కాషాయరంగులోని ఇస్లామిక్ రాజ్యం' అవుతుంది'' అని శౌరీ అభిప్రాయపడ్డారు.

"సావర్కర్ హిందుత్వం క్రూరత్వాన్ని, ద్వేషాన్ని బోధిస్తుంది. ఒక సమాజం అటువంటి విలువలను అవలంబిస్తే హిందూ మతం ఎక్కడ మిగులుతుంది?" అని అరుణ్ శౌరీ ప్రశ్నించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)