ఆన్‌లైన్ కన్నా ముందు కంప్యూటర్ మ్యాచింగ్..డేటింగ్‌లో టెక్నాలజీ వాడకం ఎప్పటి నుంచి మొదలైందంటే

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అయిన్ క్విన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఈ రోజుల్లో డేటింగ్ చేయాలని నిర్ణయించుకోవడమే ఆలస్యం, ఇంటర్నెట్ ద్వారా పదుల సంఖ్యలో ఉన్న డేటింగ్ యాప్స్‌లో మనకు సౌకర్యంగా అనిపించిన దాన్ని స్మార్ట్‌ఫోన్‌లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
మనకుసరైన పార్టనర్ దొరుకుతారా లేదా అనేది వేరే విషయం. ఇందులో అనేక అంశాలు ఆధారపడి ఉంటాయి. అయితే, యాప్స్ వచ్చి డేటింగ్‌ను సునాయాసం చేశాయి.
ప్యు రీసర్చ్ ప్రకారం 2023లో అమెరికాలో ప్రతి 10 మందిలో ఒకరు తమ భాగస్వాములని ఆన్‌లైన్ డేటింగ్ ద్వారా కలిశారు.
అసలు డేటింగ్ కోసం టెక్నాలజీ సాయం తీసుకోవడం ఎప్పుడు మెుదలైంది?


ఫొటో సోర్స్, Getty Images
తొలి రోజుల్లో ఆన్ లైన్ డేటింగ్
దాదాపు 60 ఏళ్ల కిందటి మాట. పార్టనర్ కోసం వెతుకుతున్న 2వేల మందిని తాము కనిపెట్టిన డేటింగ్ సర్వీసుని ప్రయత్నించమని టాక్ట్ (టెక్నికల్ ఆటోమేటెడ్ కంపాటబిలిటీ టెస్టింగ్ ) అనే కంపెనీ ఆహ్వానించింది. ఈ పార్టీలో పాల్గొన్నవారందరు ఒక ప్రశ్నావళిని నింపాలి. అందులో అవును, కాదు అనే సమాధానాలు మాత్రమే ఉంటాయి. 1966లో, బీబీసీ టుమారోస్ వరల్డ్ న్యూయార్క్‌లో జరిగిన ఈ ఎలక్ట్రానిక్ డేటింగ్ సర్వీస్ పార్టీకి వెళ్లింది.
భార్య కావాలంటూ మొట్టమొదటిసారిగా 1788లో న్యూయార్క్‌లో ఇంపార్షియల్ గెజిటీర్ పత్రికలో ఓ వ్యక్తి ప్రకటన వేశారని చరిత్రకారిణి ఫ్రాన్సేసా బ్యూమాన్ తెలిపారు. ఈనాటి టిండర్ డేటింగ్ యాప్‌లోని బయోడేటాను తలపించేలా తనను తాను ఉన్నత కుటుంబం నుంచి వచ్చిన, సంపద కలిగిన వ్యక్తినని, ఇటీవలే పట్టణానికి వచ్చానని ఆ వ్యక్తి చెప్పుకున్నారు. కనీసం వెయ్యి పౌండ్ల సొమ్ము, అంగవైకల్యం లేని 40 ఏళ్లలోపు మహిళ కోసం చూస్తున్నానని ప్రకటించారు.
దాదాపు 200 సంవత్సరాల తరువాత, న్యూయార్క్ డేటింగ్‌కు వినూత్నమైన కంప్యూటర్ మ్యాచ్ మేకింగ్‌కు వేదిక అయ్యింది.
ఐబీఎం సంస్థలో కంప్యూటర్ ప్రోగ్రామర్ బాబ్ రాస్, అకౌంటెంట్ లూయిస్ ఆల్ట్‌ఫెస్ట్‌లు కలిసి టాక్ట్‌ను 1965లో రూపొందించారు. టాక్ట్ సర్వీస్ నగరమంతటా వేగంగా ప్రాచుర్యం పొందింది.
కంప్యూటర్ ద్వారా తమకు సరిజోడీని కనిపెట్టేందుకు వేలమంది దీనిలో సైన్‌అప్ చేశారు.
ఇందులో పాల్గొనేవారు 5 డాలర్లు (ఇప్పటి కరెన్సీలో సుమారు రూ. 400) చెల్లించి, ఓ ప్రశ్నాపత్రాన్ని పూర్తి చేస్తారు. టాక్ట్ స్థాపకుడు రాస్ చెప్పినదాని ప్రకారం, అది సాధారణ ప్రశ్నాపత్రంలా కాకుండా మూడు స్థాయిలలో అంటే - సామాజిక-సాంస్కృతిక అంశాలు, అభిప్రాయాలు-విలువలు, మానసిక అంశాలు’ పై ప్రశ్నలుండేవి.
సమాధానాలను కంప్యూటర్‌లో సేవ్ చేస్తే, తన భాగస్వామిని ఎంచుకునే అవకాశం కలుగుతుంది. స్వలింగ సంపర్కులను ఎంచుకునే అవకాశం ఉండదు.

ఎలాంటి ప్రశ్నలు ఉండేవి ?
ఈ మ్యాచ్ మేకింగ్ ప్రశ్నలన్నీ ప్రఖ్యాత సైకాలజిస్ట్ డాక్టర్ సాల్వటోర్ వి డిడాటో ఆమోదించిన ప్రశ్నలు. టాక్ట్ వంటి సేవలు సమాజానికి చాలా అవసరమని ఆయన భావించారు. ఇతర మ్యాచ్ మేకింగ్ సేవలు "కేవలం వయస్సు, లింగం, మతం, ఎత్తు, బరువు వంటి అంశాలను మాత్రమే పోల్చడంతో సరిపెడతాయి" అని సాల్వటోర్ అన్నారు.
కానీ, టాక్ట్ ప్రశ్నాపత్రం అంతటితో ఆగకుండా, వరుసగా వ్యాఖ్యలు కూడా ఉంటాయి. ప్రశ్నావళిలో ఆ వ్యాఖ్యలకు ఎదురుగా అవును లేదా కాదు అని నింపాలి.
బీబీసీ సేకరించిన ఓ ప్రశ్నాపత్రం లో స్పందనలు ఇలా ఉన్నాయి:
- వ్యక్తులతో నా సంబంధాల గురించి ఆందోళన చెందుతున్నాను - అవును.
- స్వేచ్ఛగా ప్రేమను వ్యక్తపరిచే వ్యక్తులను నేను ఇష్టపడతాను - అవును.
- ఎక్కువ శాతం స్వతంత్రంగా వ్యవహరిస్తాను - లేదు.
- పార్టీలకు వెళ్లడం ఇష్టం - అవును."
‘పెళ్లిళ్ల బ్రోకర్ కాదు…’
‘‘టాక్ట్ అనేది ఒంటరి హృదయాల క్లబ్ కాదు. పెళ్ళిళ్ల బ్రోకర్ కూడా కాదు. కొత్త వ్యక్తులను కలిసేందుకు ఓ కొత్త సరదా మార్గం. 18 నుండి 45 సంవత్సరాల మధ్య ఉత్సాహవంతులైన వారందరూ పాల్గొనచ్చు.’’ అని బీబీసీ టుమారోస్ వరల్డ్ కార్యక్రమంలో రాస్ అన్నారు.
‘‘ప్రజలు అనేక కారణాల వల్ల టాక్ట్‌ని వాడతారు. కొత్త వ్యక్తులను కలవడానికి కొందరు, డేట్‌లకు వెళ్లడానికి మరికొందరు వాడితే, కొంతమంది మరింత సీరియస్‌గా గట్టి సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి ఆసక్తి చూపుతారు. ఆపై వివాహం చేసుకోవాలనుకునే వ్యక్తులు కూడా ఉన్నారు." అని రాస్ తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
టాక్ట్ ప్రాచుర్యం సమాజంలో మార్పులకు సూచిక
టాక్ట్ కొత్త సాంకేతికత రంగంలో అగ్రస్థానంలో ఉన్నప్పటికీ, ఇది మొట్టమొదటి కంప్యూటర్ డేటింగ్ సర్వీస్ కాదు. అదే సంవత్సరం హార్వర్డ్ విద్యార్థులు ప్రారంభించిన ఆపరేషన్ మ్యాచ్ నుంచి రాస్, ఆల్ట్‌ఫెస్ట్ ప్రేరణ పొందారు.
ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల మంది ప్రజలను కనెక్ట్ చేసే ఫేస్‌బుక్‌ను రూపొందించింది కూడా అదే విశ్వవిద్యాలయపు విద్యార్ధులే.
అయితే 1965లో, కంప్యూటర్లు చాలా కొత్త ఆవిష్కరణ. అయితే ఆపరేషన్ మ్యాచ్ రూపకర్తలు విశ్వవిద్యాలయంలోని కంప్యూటర్లలో ఒకదాన్ని గంటకు 100 డాలర్లకు అద్దెకు తీసుకోవలసి వచ్చేది. వేలమంది విద్యార్థులు ప్రశ్నాపత్రాలను పంపడంతో ఆపరేషన్ మ్యాచ్ కూడా ప్రాచుర్యం పొందింది.
అమెరికాలో 1960లో పౌర హక్కులు, ఫెమినిజం రెండో వేవ్ విప్లవాల జరుగుతున్న సమయం.
సామాజిక నిబంధనలలో మార్పు, సాంకేతికత అభివృద్ధితోపాటు, కంప్యూటర్ రాకతో సమాజంలో స్వేచ్ఛ పెరిగింది.

ఫొటో సోర్స్, Getty Images
ఎక్కువ కాలం కొనసాగలేక పోయిన కంప్యూటర్ మ్యాచ్ మేకింగ్ సేవలు
కంప్యూటర్ మ్యాచ్ మేకింగ్ సేవలు ఎక్కువ కాలం కొనసాగలేదు. కొంతమంది తమ భాగస్వాములను గుర్తించారు. కానీ, ఈ సేవలకు కొన్ని పరిమితులు ఉన్నాయి.
ప్రధానంగా మధ్యతరగతి కాలేజీ విద్యార్థులు, గ్రాడ్యుయేట్‌లను లక్ష్యంగా చేసుకున్నందున పరిమిత గ్రూపులకే ఈ సర్వీసులు అందాయి. మరో సమస్య ఏంటంటే, ప్రశ్నాపత్రాన్ని పంపిన తర్వాత, మ్యాచ్‌లు అందేసరికి వారాల పాటు వేచి ఉండాల్సి వచ్చేది.
మ్యాచ్‌ల మధ్య దూరాలను తొలగించటానికి పార్టీలు నిర్వహించేది టాక్ట్. కానీ, కొందరు అందులో పాల్గొనడాన్ని అసౌకర్యంగా భావించొచ్చు.
టాక్ట్ రూపకర్తలు మూడు దశల ప్రశ్నావళి గురించి గర్వంగా చెప్పుకున్నప్పటికీ, జంటలను కలిపే సమయంలో కొన్నిసార్లు అవి గురితప్పాయి.
‘‘ఒకసారి మేం ఓ వ్యక్తిని అతని చెల్లెలికి పార్ట్‌నర్‌గా సెలెక్ట్ చేశాం’’ అని రాస్ ఒప్పుకున్నారు.
"ప్రశ్నాపత్రం సరిగా వర్కవుట్ కాలేదు. తమకు మ్యాచ్ అయిన వారిని కలిసిన తర్వాత చాలామంది నిరాశపడిన సందర్భాలు ఉన్నాయి." అని రాస్ చెప్పారు.
అయినప్పటికీ, టాక్ట్, ఆపరేషన్ మ్యాచ్ వంటి సర్వీసులు ఇప్పుడు విచిత్రంగా కనిపిస్తున్నప్పటికీ, వార్తాపత్రికలలో మొట్టమొదటి వ్యక్తిగత ప్రకటనల నుండి వీడియో డేటింగ్ సేవల వరకు ప్రజలు తమను తాము ప్రేమవైపు నడిపించడానికి టెక్నాలజీని ఉపయోగిస్తూనే ఉన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













