ఎఫ్‌బీఐ: నూతన డైరెక్టర్‌గా కాశ్ పటేల్, ఆయన నేపథ్యం ఇదీ..

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, బ్రాండన్ డ్రెనాన్, అభినవ్ గోయల్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) నూతన డైరెక్టర్‌గా భారత సంతతికి చెందిన 44 ఏళ్ల కశ్యప్ అలియాస్ కాశ్ పటేల్ నియమితులయ్యారు. ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన కాశ్ పటేల్ నియామకానికి సెనేట్ ఆమోదించింది.
ఆయన నియామకాన్ని 51-49 స్వల్ప తేడాతో సెనేట్ ఆమోదించింది. ఇద్దరు రిపబ్లికన్లు కాశ్‌కు వ్యతిరేకంగా ఓటేశారు.
సెనేట్ ఆమోదం తెలిపిన అనంతరం, ఎఫ్‌బీఐని పునర్నిర్మిస్తానని కాశ్ పటేల్ ప్రతిజ్ఞ చేశారు.
ట్రంప్ రాజకీయ ప్రత్యర్థులపై ప్రతీకార చర్యలు ఉంటాయన్న వాదనలను కాశ్ పటేల్ ఖండించినప్పటికీ, ప్రతీకార చర్యలకు దిగొచ్చని డెమోక్రట్లు ఆరోపిస్తున్నారు.
తన నియామక ప్రక్రియపై సెనేట్‌లో చర్చ సందర్భంగా, ట్రంప్‌ను విచారించిన అధికారులను గతంలో "క్రిమినల్ గ్యాంగ్‌స్టర్లు"గా పేర్కొనడం వంటి వివాదాస్పద వ్యాఖ్యల నుంచి వెనక్కి తగ్గడంతో పాటు, ''డీప్ స్టేట్'' శత్రువుల జాబితా వంటి వ్యాఖ్యలను కూడా కాశ్ పటేల్ తోసిపుచ్చారు.
డెమోక్రటిక్ సెనేటర్లు కాశ్ పటేల్‌కు వ్యతిరేకంగా ఓటేశారు. వారితో పాటు రిపబ్లికన్ సెనేటర్లు సుశా కాలిన్స్, లిసా ముర్కోవ్‌స్కి కూడా కాశ్ పటేల్ నియామకాన్ని వ్యతిరేకించారు.
నెల క్రితం ట్రంప్ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత చేపట్టిన నియామకాల్లో చట్టసభ్యులు ఆమోదించిన 18వ కేబినెట్ అధికారి కాశ్ పటేల్.
‘‘ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తొమ్మిదో డైరెక్టర్‌గా నియమించడం గౌరవంగా భావిస్తున్నా’’ అని సెనేట్ ఆమోదం లభించిన కాసేపటి తర్వాత పటేల్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.
‘‘డైరెక్టర్‌గా నా లక్ష్యం స్పష్టంగా ఉంది. మంచి పోలీసులను అలాగే ఉండనివ్వడం, ఎఫ్‌బీఐపై నమ్మకాన్ని పునర్నిర్మించడం’’ అని కాశ్ పటేల్ రాశారు.
అమెరికా ప్రజలు గర్వించేలా ఎఫ్‌బీఐని పునర్నిర్మిస్తామన్నారు.


ఫొటో సోర్స్, Getty Images
ఒక్కొక్కటిగా నియామకం..
‘ఎఫ్‌బీఐ తదుపరి డైరెక్టర్‌గా కశ్యప్ ‘కాశ్’ పటేల్‌ని ప్రకటించడం నాకు గర్వంగా ఉంది’ అని ఆ పదవికి కాశ్ పటేల్‌ను నియమించిన సమయంలో ట్రంప్ చెప్పారు.
"కాశ్ ఒక తెలివైన ప్రాసిక్యూటర్, దర్యాప్తు అధికారి, అమెరికా మొదటి వారియర్. అవినీతిని బయటపెట్టడం, న్యాయాన్ని కాపాడటం, అమెరికన్లను సంరక్షించడంలోనే ఆయన వృత్తి జీవితం సాగింది" అని ట్రంప్ తెలిపారు.
"నా మొదటి పదవీకాలంలో కాశ్ అద్భుతంగా పని చేశారు" అని ట్రంప్ చెప్పారు.

ఫొటో సోర్స్, defense.gov
కాశ్ పటేల్ ఎవరు?
డోనల్డ్ ట్రంప్‌కు అత్యంత నమ్మకమైన వ్యక్తులలో కాశ్ పటేల్ (44) ఒకరని చెబుతుంటారు.
ట్రంప్ విజయం తర్వాత కాశ్ పటేల్‌ను అమెరికా గూఢచార సంస్థ అయిన సీఐఏ అధిపతిగా నియమిస్తారనే ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే సీఐఏ చీఫ్‌గా జాన్ రాట్‌క్లిఫ్‌ను నియమిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు.
అమెరికా రక్షణ శాఖ ప్రకారం.. కాశ్ పటేల్ అమెరికా తాత్కాలిక రక్షణ మంత్రి క్రిస్టఫర్ మిల్లర్‌కు చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా పనిచేశారు. అంతకుముందు ప్రెసిడెంట్‌కు డిప్యూటీ అసిస్టెంట్‌గా, జాతీయ భద్రతా మండలిలో ఉగ్రవాద నిరోధక విభాగం సీనియర్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు.
ట్రంప్ హయాంలో జరిగిన కీలక ఆపరేషన్లలో కాశ్ పటేల్ ముఖ్యమైన పాత్ర పోషించారు. ఆ సమయంలోనే ఐసిస్ చీఫ్ అల్ బాగ్దాదీ, అల్ ఖైదాకు చెందిన ఖాసిమ్ అల్ రిమి మరణించారు. అమెరికన్ బందీలను సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చారు.
నేషనల్ ఇంటెలిజెన్స్ తాత్కాలిక డైరెక్టర్‌కు ప్రిన్సిపల్ డిప్యూటీగా కూడా పనిచేశారు కాశ్ పటేల్. ఆ హోదాలో ఆయన 17 ఇంటెలిజెన్స్ ఏజెన్సీల కార్యకలాపాలను పర్యవేక్షించారు. ప్రెసిడెంట్‌కు రోజువారీ బ్రీఫింగ్స్ ఇచ్చేవారు.
జాతీయ భద్రతా మండలిలో చేరడానికి ముందు, ఇంటెలిజెన్స్‌పై శాశ్వత సెలెక్ట్ కమిటీకి సీనియర్ కౌన్సిల్‌గా పనిచేశారు. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేసేందుకు రష్యా క్యాంపెయిన్ చేసిందంటూ వచ్చిన ఆరోపణలపై జరిగిన విచారణకు కాశ్ పటేల్ నాయకత్వం వహించారు.
కాశ్ పటేల్ ఇంటెలిజెన్స్ కమ్యూనిటీ, అమెరికా స్పెషల్ ఆపరేషన్స్ ఫోర్స్ కోసం సున్నితమైన కార్యక్రమాలను పర్యవేక్షించారు. ప్రపంచవ్యాప్తంగా ఇంటెలిజెన్స్, కౌంటర్ టెర్రరిజంపై పనిచేయడానికి బిలియన్ డాలర్ల నిధులను అందించే చట్టాన్ని ఆమోదించడానికి కూడా ఆయన చొరవ చూపారు.
అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్‌కు టెర్రరిజం ప్రాసిక్యూటర్‌గానూ పనిచేశారు.
పటేల్ న్యాయవాదిగా వృత్తిని ప్రారంభించారు. హత్యలు, మాదకద్రవ్యాల నుంచి సంక్లిష్టమైన ఆర్థిక నేరాల వరకు.. అనేక కేసులపై కోర్టులలో వాదించారు.

ఫొటో సోర్స్, Getty Images
కాశ్ పటేల్ వ్యక్తిగత జీవితం
కాశ్ పటేల్ భారత సంతతికి చెందిన వారు. మీడియా కథనాల ప్రకారం.. ఆయన ఒక గుజరాతీ కుటుంబంలో జన్మించారు. కాశ్ పటేల్ తండ్రి ఒక అమెరికన్ ఏవియేషన్ కంపెనీలో పనిచేశారు.
అమెరికా రక్షణ శాఖ ప్రకారం.. పటేల్ న్యూ యార్క్ వాసి. రిచ్‌మండ్ విశ్వవిద్యాలయంలో అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. న్యూ యార్క్ తిరిగి వచ్చి న్యాయశాస్త్రంలో డిగ్రీ పట్టా పొందారు. యూకేలోని యూనివర్సిటీ కాలేజ్ లండన్‌కు చెందిన ఫ్యాకల్టీ ఆఫ్ లాస్ సంస్థ నుంచి అంతర్జాతీయ చట్టంలో సర్టిఫికేట్ పొందారు.
పటేల్‌కు ఐస్ హాకీ ఆడటం ఇష్టం. ఆయనకు త్రిశూల్ అనే కంపెనీ ఉంది.
ట్రంప్‌కు మద్దతుగా ఉన్న ‘సేవ్ అమెరికా’ విభాగానికి త్రిశూల్ కన్సల్టెంట్‌గా కూడా పనిచేసింది.
"చాలామంది మాదిరిగానే నా తల్లిదండ్రులు కూడా చదువుపై దృష్టి పెట్టాలని చెప్పారు. నా మతం, వారసత్వంపై అవగాహన ఉండాలని సూచించారు. అందుకే నాకు భారతదేశంతో మంచి అనుబంధం ఉంది. నేను హిందూ కుటుంబంలో పెరిగాను కాబట్టి, మేం గుడికి వెళ్తాం. ఇంట్లో పూజలు చేస్తాం" అని ఒక పుస్తకంలో కాశ్ పటేల్ చెప్పారు.
కాశ్ ఫౌండేషన్
‘‘‘కాశ్ ఫౌండేషన్’’అనే ఎన్జీవోను పటేల్ నడుపుతున్నారు. ఈ ఎన్జీవో అమెరికన్ పిల్లల చదువుల కోసం స్కాలర్‌షిప్‌లను అందించడానికి, విజిల్‌బ్లోయర్‌లకు సహాయం చేస్తుంది.
క్యాపిటల్ హిల్ దాడులకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి కూడా ఈ ఎన్జీవో సాయం చేస్తోందని కాశ్ పటేల్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
2020 అధ్యక్ష ఎన్నికల ఫలితాలను రద్దు చేయాలని పిలుపునిస్తూ 2021 జనవరి ఆరంభంలో ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ హిల్‌పై దాడి చేశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














