‘‘ఆ పని చేస్తే మీరు అమెరికాలో చోటు కోల్పోతారు’’ బ్రిక్స్ దేశాలకు ట్రంప్ ఈ హెచ్చరిక ఎందుకు చేశారు?

డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, డోనల్డ్ ట్రంప్
    • రచయిత, హోలీ హోండెరిచ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అమెరికా డాలర్‌కు పోటీగా బ్రిక్స్ కొత్త కరెన్సీని సృష్టిస్తే ఆ గ్రూపులోని తొమ్మిది దేశాల దిగుమతులపై 100 శాతం సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డోనల్డ్ ట్రంప్ హెచ్చరించారు.

ఈమేరకు ట్రంప్ శనివారం సోషల్ మీడియాలో ఒక పోస్టు చేశారు.

“బ్రిక్స్ దేశాలు డాలర్ వాడకాన్ని ఆపడానికి ప్రయత్నిస్తున్నాయి, ఇక మేం చూస్తూ ఉండాలనుకోవడం లేదు” అని తెలిపారు.

బ్రిక్స్ గ్రూపులో భారత్, చైనా, రష్యా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, ఇరాన్, ఈజిప్ట్, ఇథియోపియా, యూఏఈ దేశాలు ఉన్నాయి.

దిగుమతులపై పలు రకాల పన్నులను ప్రవేశపెడతామని ట్రంప్ ఎన్నికల ప్రచారంలోనే ప్రకటించారు. తాజాగా వాటికి సంబంధించిన హెచ్చరికలూ చేస్తున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
బ్రిక్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అంతర్జాతీయ వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థల్లో అమెరికా డాలరుకు పోటీగా ఉమ్మడి కరెన్సీని ఏర్పాటుచేయాలని రష్యా, బ్రెజిల్ దేశాల నేతలు సూచించారు.

బ్రిక్స్ కరెన్సీ ఎందుకు?

అమెరికా అధ్యక్షుడిగా 2025 జనవరి 20న బాధ్యతలు చేపట్టనున్న ట్రంప్‌ నుంచి వచ్చిన ఈ సుంకాల పెంపు సందేశం ఎక్కువగా అభివృద్ధి చెందుతున్న దేశాలతో కూడిన బ్రిక్స్‌ గ్రూపును ఉద్దేశించినది.

ప్రపంచ వాణిజ్యంలో అమెరికా డాలర్ శక్తిని తగ్గించడానికి బ్రిక్స్ కరెన్సీని సృష్టించాలని బ్రెజిల్, రష్యా నాయకులు సూచించారు. అయితే, బ్రిక్స్ గ్రూపులోని విభేదాల కారణంగా వారి ప్రణాళికలు ముందుకు సాగలేదు.

“ఈ దేశాలు కొత్త బ్రిక్స్ కరెన్సీని సృష్టించబోమని లేదా అమెరికా డాలర్‌ స్థానంలో ఇతర కరెన్సీకి మద్దతు ఇవ్వమని హామీ ఇవ్వాలి. వారు అలా చేయకపోతే వారి దిగుమతులపై 100 శాతం సుంకాలు ఎదుర్కొంటారు. అద్భుతమైన అమెరికా మార్కెట్‌లో అమ్మకాలను కోల్పోతారు’’ అని ట్రంప్ ఎక్స్‌లో తెలిపారు. ఆయా దేశాలు మరొకరి దగ్గరికి వెళ్లవచ్చని కూడా ట్రంప్ సూచించారు

ట్రంప్ ప్రకటనలు కేవలం చర్చలకు చేసిన వ్యూహంలో భాగమని ఆయన మిత్రులు భావిస్తున్నారు. ట్రంప్ సుంకాల గురించి రిపబ్లికన్ సెనేటర్ టెడ్ క్రూజ్‌ను అడిగితే.. అది బేరసారాలకు పెత్తనం ఇస్తుందన్నారు.

మెక్సికో, కెనడాలపై బెదిరింపు సుంకాలు ఇప్పటికే చర్చలకు దారితీశాయని ఆయన ఆదివారం సీబీఎస్ వార్తాసంస్థతో మాట్లాడుతూ గుర్తుచేశారు.

కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో శుక్రవారం ట్రంప్ ఫ్లోరిడా ఎస్టేట్ అయిన మార్-ఎ-లాగోకు వెళ్లారు. అమెరికాకు విక్రయిస్తున్న కెనడా వస్తువులపై 25 శాతం పన్ను విధించకుండా ఒప్పించడానికి ఆయన అక్కడికి వెళ్లినట్లుగా ప్రచారం జరిగింది.

ట్రెజరీ సెక్రటరీగా ట్రంప్ ఎంపిక చేసిన స్కాట్ బెస్సెంట్ మాట్లాడుతూ.. ట్రంప్ అధిక సుంకాల బెదిరింపులు చర్చల వ్యూహంగా ఉండవచ్చని, ఆయన అంతిమంగా స్వేచ్ఛా వాణిజ్యానికి మద్దతిస్తారని అభిప్రాయపడ్డారు.

దిగుమతులపై పన్నులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ట్రంప్ ఆర్థిక విధానాలలో సుంకాలు కీలక అంశంగా ఉన్నాయి

ఈ సుంకాలు ఎలా విధిస్తారు?

దేశంలోకి దిగుమతయ్యే వస్తువుల విలువ ఆధారంగా సుంకం విధిస్తారు. ఉదాహరణకు అమెరికా 50 వేల డాలర్లకు ఓ కారును దిగుమతి చేసుకుంటే దానిపై 25 శాతం సుంకం విధించారనుకుంటే ప్రభుత్వానికి 12,500 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది.

ట్రంప్ ఆర్థిక విధానాలలో సుంకాలు కీలక అంశంగా ఉన్నాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ వృద్ధికి, ఉద్యోగాల పరిరక్షణకు, పన్నుల ఆదాయం పెంపునకు సుంకాలను ట్రంప్ ఒక మార్గంగా చూస్తున్నారు.

అయితే ఈ సుంకాలు అమెరికా పౌరులకు భారం కావని, అవి విదేశాలకు అయ్యే ఖర్చు అని ట్రంప్ గతంలో ప్రకటించారు. అయితే, ఈ విధానం తప్పుదోవ పట్టించేలా ఉందని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థికవేత్తలు వాదిస్తున్నారు.

ట్రంప్ విధించే సుంకం దేశీయంగా వస్తువులను దిగుమతి చేసుకున్న సంస్థలే చెల్లిస్తాయి కానీ, వాటిని ఎగుమతి చేసే కంపెనీలు కాదు. అంటే ఈ సుంకాలను నేరుగా అమెరికా కంపెనీలే అక్కడి ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది.

ట్రంప్ తన తొలి పాలనా కాలంలో అనేకరకాల సుంకాలను విధించారు. వీటిలో చాలావాటిని అధ్యక్షుడు జో బైడెన్ కొనసాగించారు. అంతిమంగా అమెరికా వినియోగదారులే వీటి భారాన్ని ఎక్కువగా భరించారని ఆర్థిక అధ్యయనాలు చెబుతున్నాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)