జెలియెన్‌స్కీ పై అమెరికా వైఖరి ఒక్కసారిగా ఎందుకు మారిపోయింది, ఆయన్ను ‘నియంత’ అని ట్రంప్ ఎందుకు అంటున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, గాబ్రిమెలా పొమెరాయ్, జార్జ్ రైట్, ఆంతోని జర్చర్
- హోదా, బీబీసీ న్యూస్
యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలియెన్‌స్కీని 'నియంత'గా అభివర్ణిస్తూ అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ మాటల దాడికి దిగడం ద్వారా ఇరుదేశాల నేతల మధ్య నెలకొన్న విభేదాలను మరింత తీవ్రతరం చేశారు.
సౌదీ అరేబియాలో అమెరికా - రష్యా మధ్య జరిగిన చర్చల్లో యుక్రెయిన్‌ను మినహాయించడంపై జెలియెన్‌స్కీ స్పందిస్తూ, ''రష్యా ప్రభుత్వం తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తుంటే, అమెరికా అధ్యక్షుడు దాన్ని నమ్ముతున్నారు'' అని అన్నారు. అనంతరం, ట్రంప్ నుంచి దాడి మొదలైంది.
ఫ్లోరిడాలో, సౌదీ నేతృత్వంలో జరిగిన పెట్టుబడుల సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ, ''జో బైడెన్‌ను ఫిడేల్‌లా వాయించడంలో జెలియెన్‌స్కీ నిజంగా సిద్ధహస్తుడు'' అని అన్నారు.


ఫొటో సోర్స్, Getty Images
నియంత అనడంపై ప్రపంచ నేతల విమర్శలు..
జెలియెన్‌స్కీని ''నియంత'' అంటూ సంబోధించడంపై జర్మన్ చాన్స్‌లర్ ఓలాఫ్ షోల్జ్ సహా యూరోపియన్ యూనియన్ నేతల నుంచి వెంటనే విమర్శలు వినిపించాయి. ''ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన అధ్యక్షుడు జెలియెన్‌స్కీ చట్టబద్దతను కాదనడం తప్పు, అది ప్రమాదకరం కూడా'' అని వారు అన్నారు. స్వీడన్ ప్రధాని, జర్మన్ విదేశాంగ మంత్రి కూడా 'నియంత' అనే పదాన్ని వాడటాన్ని తప్పుబట్టారు.
‘మీకు మా మద్దతు ఉంటుంది’ అని జెలియెన్‌స్కీకి యూకే ప్రధాన మంత్రి సర్ కీర్ స్టార్మర్ ఫోన్ సంభాషణలో చెప్పారు.
''ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన నాయకుడిగా జెలియెన్‌స్కీకి కీర్ స్టార్మర్ తన మద్దతు తెలియజేశారు'' అని డౌనింగ్‌స్ట్రీట్ ప్రతినిధి తెలిపారు.
''రెండో ప్రపంచ యుద్ధ సమయంలో యూకే చేసినట్లుగా, యుద్ధ సమయంలో ఎన్నికలను నిలిపివేయడం సహేతుకమే'' అని పేర్కొన్నారు.
మరోవైపు, రష్యా -యుక్రెయిన్‌కు అమెరికా రాయబారిగా ఉన్న కీత్ కెల్లాగ్‌తో జెలియన్‌స్కీ గురువారం భేటీ కానున్నారు. అమెరికాతో నిర్మాణాత్మక సహకారానికి ఈ చర్చలు చాలా కీలకమని ఆయన అన్నారు.
వాస్తవానికి, 2024 మేలో జెలియెన్‌స్కీ ఐదేళ్ల పదవీకాలం ముగియాల్సి ఉంది. అయితే, 2022 ఫిబ్రవరిలో రష్యా పూర్తి స్థాయి సైనిక దాడి నాటి నుంచి యుక్రెయిన్‌లో మార్షల్ లా అమల్లో ఉండడంతో ఎన్నికలు నిలిచిపోయాయి.
ట్రూత్ సోషల్ మీడియా పోస్టులో నియంత అనే పదాన్ని ఉపయోగించిన కొద్దిగంటల తర్వాత, ఫ్లోరిడాలో మాట్లాడుతూ ట్రంప్ మరోసారి జెలియెన్‌స్కీని నియంత అని సంబోధించారు.
''ఎన్నికల నిర్వహణకు ఆయన నిరాకరిస్తున్నారు. వాస్తవానికి యుక్రెయిన్‌లో ఆయనకు అంతగా మద్దతు లేదని పోల్స్ చెబుతున్నాయి. దేశంలోని ప్రతి నగరం నాశనమైతే మీకెలా మద్దతు లభిస్తుంది?'' అని ట్రంప్ ప్రశ్నించారు.
యుక్రెయిన్‌లో లభించే అరుదైన ఖనిజాలకు సంబంధించి తాను చేసిన ప్రయత్నాలను కూడా ప్రస్తావిస్తూ, జెలియన్‌స్కీ ప్రభుత్వం 'ఒప్పందాన్ని ఉల్లంఘించింది' అని ట్రంప్ అన్నారు.
''జెలియెన్‌స్కీ భయంకరమైన తప్పు చేశారు, దేశం నాశనమైంది, లక్షలమంది అన్యాయంగా ప్రాణాలు కోల్పోయారు'' అంటూ ట్రూత్ పోస్టులో పేర్కొన్న విషయాలే ట్రంప్ ప్రసంగంలోనూ ప్రతిధ్వనించాయి. అలాగే, ''రష్యాతో యుద్ధం ముగింపుకు అమెరికా విజయవంతంగా చర్చలు జరుపుతోంది'' అన్నారు.
ట్రంప్ పోస్టుపై వైట్ హౌస్ అధికారి స్పందిస్తూ, జెలియెన్‌స్కీ చేసిన 'తప్పుడు సమాచారం' వ్యాఖ్యలకు ఇవి ప్రతిస్పందనగా అభివర్ణించారు.
యుక్రెయిన్ మాజీ ప్రధాని అర్సేనియ్ యాట్సెన్యుక్ బీబీసీతో మాట్లాడుతూ, ‘ట్రంప్ వ్యాఖ్యలతో రష్యా ఇప్పుడు షాంపేన్ తాగుతోంది' అని అన్నారు.
వొలొదిమిర్ జెలియెన్‌స్కీ చట్టబద్ధంగా ఎన్నికైన అధ్యక్షుడని, ప్రస్తుతం మార్షల్ లా అమల్లో ఉండడం వల్ల ఎన్నికలు నిర్వహించలేమని ఆయన బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
రష్యాతో అమెరికా చర్చలు
యుక్రెయిన్‌పై రష్యా పూర్తిస్థాయి యుద్ధానికి దిగిన తర్వాత, మొదటిసారిగా మంగళవారం అమెరికా - రష్యా అధికారుల మధ్య ఉన్నతస్థాయి ముఖాముఖి చర్చలు జరిగాయి.
అయితే, యుద్ధం విషయంలో యుక్రెయిన్‌ను నిందిస్తూ మంగళవారం ఫ్లోరిడాలో జరిగిన మీడియా సమావేశంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో మాటల యుద్ధం ప్రారంభమైంది.
యుక్రేనియన్లు మోసపోయారని భావించే వారికి మీరిచ్చే సందేశం ఏమిటని బీబీసీ న్యూస్ ట్రంప్‌ను ప్రశ్నించినప్పుడు, ''చర్చల్లో వారికి చోటు లేకపోవడంపై కలత చెందుతున్నారని విన్నా. అయితే, మూడేళ్లు, అంతకంటే ముందు నుంచి వారు భాగస్వామిగా ఉన్నారు. దీన్ని చాలా సులభంగా పరిష్కరించుకుని ఉండొచ్చు'' అన్నారు.
''మీరు దీన్ని మొదలుపెట్టి ఉండకూడదు, ఒప్పందం కుదుర్చుకుని ఉండాల్సింది'' అని ట్రంప్ అన్నారు.
2022 ఫిబ్రవరిలో యుక్రెయిన్‌పై దాడికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ ఎక్కడా ప్రస్తావించలేదు.
ఆ తర్వాత బుధవారం జెలియెన్‌స్కీ కీవ్‌లో జర్నలిస్టులతో మాట్లాడుతూ, ''చాలా తప్పుడు సమాచారం వ్యాప్తిచెందుతోంది, రష్యా నుంచి. నాయకుడిగా, పూర్తి గౌరవంతో అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌కు చెప్పేదొకటే, ఆయన తప్పుడు సమాచారాన్ని నమ్ముతున్నారు.'' అన్నారు
ఏళ్లుగా ఒంటరైన రష్యా, ఆ ఒంటరితనం నుంచి బయటపడడానికి అమెరికా సాయం చేసిందని తాను భావిస్తున్నట్లు జెలియెన్‌స్కీ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అమెరికా విదేశాంగ విధానంలో మార్పు
యుక్రెయిన్ యుద్ధం, రష్యాపై పోరాటంలో యుక్రెయిన్‌కు అమెరికా మద్దతుకు సంబంధించిన సందేహాలన్నింటికీ ట్రంప్ బుధవారం తెరదించారు.
సుమారు మూడేళ్ల కిందట, రష్యా దాడిని తిప్పికొట్టేందుకు జెలియెన్‌స్కీ చేసిన పోరాట ప్రయత్నాలను యూఎస్ కాంగ్రెస్ లేచి నిల్చుని మరీ గౌరవించింది.
కానీ, ఇప్పుడు ట్రంప్ యుక్రెయిన్ అధ్యక్షుడిని నియంతగా సంబోధించారు. ఆయనపై అవినీతి ఆరోపణలు కూడా చేశారు.
విదేశీ సాయాన్ని కొనసాగించాలని జెలియెన్‌స్కీ కోరుకుంటున్నారని ట్రంప్ అన్నారు. యుద్ధానికి రష్యా కాకుండా, యుక్రెయిన్ కారణమని నిందించారు.
అమెరికా విదేశాంగ విధానంలో ఈ ఆకస్మిక మార్పు నిజంగా నాటకీయమే, కానీ ఇదేమీ ఆశ్చర్యం అనిపించదు. చాలా ఏళ్లుగా డోనల్డ్ ట్రంప్ ఇదే దిశగా పనిచేస్తున్నారు.
ఆయన తాజా వ్యాఖ్యలు, 'అమెరికా ఫస్ట్' విధానాన్ని నిజం చేస్తున్న అధ్యక్షుడిని చూపుతున్నాయి.
యుక్రెయిన్ ఖనిజ సంపదను పొందేందుకు అమెరికా చేసిన ప్రయత్నాలను బహిరంగంగా తిరస్కరించిన అనంతరం, జెలియెన్‌స్కీపై ట్రంప్ తాజా దాడి మొదలైంది.
'నేను నా దేశాన్ని అమ్ముకోలేను' అని జెలియెన్‌స్కీ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ట్రంప్‌కి టార్గెట్‌గా మారిన జెలియెన్‌స్కీ
అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించి అమెరికా అధ్యక్షులకు విస్తృత అధికారాలు ఉన్నాయి. అలాగే, ట్రంప్ కూడా చాలా ఏళ్లుగా యుక్రెయిన్‌పై తన అభిప్రాయాలను స్పష్టంగా వెల్లడిస్తూ వచ్చారు.
యుక్రెయిన్ యుద్ధానికి బైడెన్ ప్రభుత్వ అసమర్థతే కారణమని పదేపదే నిందిస్తూ వస్తున్నారు ట్రంప్. యుద్ధాన్ని సునాయాసంగా నిలిపివేస్తామని కూడా హామీ ఇచ్చారు.
జెలియెన్‌స్కీపై గతంలో అంత తీవ్ర విమర్శలు చేయకపోయినప్పటికీ, అమెరికా నుంచి ఆర్థిక సాయం పొందేలా ఒప్పించడంలో మాత్రం నిపుణుడని అంటుండేవారు.
జెలియెన్‌స్కీతో ట్రంప్‌కు ఈ కలహపూరిత సంబంధాలకు సుదీర్ఘ చరిత్ర ఉంది.
అమెరికన్ వామపక్షాలు జెలియెన్‌స్కీని హీరో అంటూ ప్రశంసించాయి. అలాగే, విదేశీ సాయం కోసం జెలియెన్‌స్కీ బహిరంగంగా అభ్యర్థించడంపై కూడా కొన్నిసార్లు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.
''అధ్యక్షుడి గురించి మీడియాలో చెడుగా మాట్లాడడం ద్వారా ఆయన మనసు మార్చుకునేలా చేయొచ్చనే జెలియన్‌స్కీ ఆలోచన పనిచేయదు'' అని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ట్రంప్ కూడా రష్యా వైఖరిపై, పుతిన్‌పై సానుభూతితో కూడిన అభిప్రాయాలను వెలిబుచ్చుతూ వచ్చారు.
యుక్రెయిన్‌పై దాడి ప్రారంభించిన కొద్దిరోజుల అనంతరం, పుతిన్‌ను 'మేధావి'గా అభివర్ణించారు.
2016 ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకోలేదని 2018 జూలైలో హెల్సింకిలో జరిగిన అమెరికా - రష్యా శిఖరాగ్ర సమావేశంలో పుతిన్ చేసిన ప్రకటనను అనుమానించేందుకు, తనకు ఎలాంటి కారణం కనిపించడం లేదని ట్రంప్ అన్నారు.
అయితే, ట్రంప్ ప్రకటన అమెరికా నిఘా నివేదికకు విరుద్ధంగా ఉంది.
ట్రంప్ మొదటి పదవీ కాలంలో, రష్యా ఉద్దేశాలను ఎక్కువగా అనుమానించే కొంతమంది సీనియర్ అధికారులు ఆయన విదేశాంగ విధాన బృందంలో ఉన్నారు. వీరిలో జాన్ బోల్టన్, మైక్ పాంపియో, జాన్ కెల్లీ వంటివారున్నారు. వీరు అధ్యక్షుడి విదేశాంగ విధానాన్ని ప్రభావితం చేయగలిగారు.
కానీ, ఈసారి ట్రంప్ చుట్టూ భావసారూప్యత కలిగిన సలహాదారులే ఉన్నారు. వారికి ట్రంప్ అభిప్రాయాలతో విభేదించే ఆలోచన ఉన్నట్లు కనిపించడం లేదు.
ఒకప్పుడు విదేశాంగ విధాన న్యాయనిపుణుడిగా పరిగణించే ప్రస్తుత అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ట్రంప్ నాయకత్వాన్ని అనుసరించే విషయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
రష్యాను విమర్శించే కీత్ కెల్లాగ్‌ను యుక్రెయిన్‌కు తన రాయబారిగా ట్రంప్ ఎంచుకున్నారు. కానీ, ఆయన్ను రష్యాతో చర్చలకు దూరంగా ఉంచారు. ట్రంప్‌కు సన్నిహితుడు, మిడిల్ ఈస్ట్ రాయబారిగా ఉన్న స్టీవ్ విట్‌కాఫ్ ఈ చర్చల్లో పాల్గొంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
'యుక్రెయిన్ యుద్ధం అమెరికా కంటే యూరప్‌కే కీలకం'
రిపబ్లికన్ పార్టీకి చెందిన చాలా మంది ట్రంప్ విధానాలకు మద్దతుగా నిలుస్తున్నారు. ఇది ఆయన్ను రాజకీయంగా మరింత బలోపేతోం చేస్తోంది.
ఫిబ్రవరిలో జరిగిన ప్యూ సర్వేలో, కేవలం 30 శాతం మంది రిపబ్లికన్లు మాత్రమే యుక్రెయిన్‌కు అమెరికా అందిస్తున్న మద్దతు 'సరిపోదు' లేదా 'ఫర్వాలేదు' అని భావిస్తున్నారని తేలింది.
రష్యా-యుక్రెయిన్ యుద్ధం మొదలైనప్పుడు 72 శాతం మంది ప్రజలు కూడా ఇలానే భావించారు.
యుక్రెయిన్‌కు మద్దతు ఇవ్వడం అమెరికా జాతీయ భద్రతకు హాని కలిగిస్తుందని 40 శాతం మంది రిపబ్లికన్లు విశ్వసిస్తున్నారని, 27 శాతం మంది మాత్రమే ఇది ఉపయోగపడుతుందని సర్వేలో చెప్పారు.
యుక్రెయిన్‌లో రష్యాకు వ్యతిరేకంగా నిలవడం అమెరికా జాతీయ భద్రతకు అవసరమని బైడెన్ ప్రభుత్వ హయాంలో వైట్ హౌస్ వాదించింది.
కానీ, ట్రంప్, ఆయన సన్నిహిత సలహాదారులు ప్రపంచాన్ని చూసే విధానం చాలా భిన్నంగా ఉంది.
ఇది సైద్ధాంతికపరమైన వివాదం కంటే, అమెరికా ప్రయోజనాలకు లాభమా? నష్టమా? అనేదానికి సంబంధించిన విషయంగా కనిపిస్తోంది.
యుక్రెయిన్‌కు మద్దతుగా ఉండడం వల్ల అమెరికాకు ఒనగూరే ప్రయోజనం 'ఏమీ లేదు' అంటూ ట్రంప్ 'ట్రూత్ సోషల్'లో చేసిన పోస్టే దానికి ఉదాహరణ.
ట్రంప్ బుధవారం ఇలా రాశారు, ''తమ ప్రభుత్వపు 'అమెరికా ఫస్ట్' ప్రాధాన్యాల్లో 'అందమైన సుదీర్ఘ తీరప్రాంతాల్లో' యుద్ధాల్లో పాల్గొనడానికి, లేదా ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు అమెరికా వనరులను ఖర్చు చేయడం వంటివి లేవు.''
యుక్రెయిన్ యుద్ధం 'మనకన్నా యూరప్‌కే చాలా కీలకం’ అని ఆయన అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








