పాము - ముంగిస శత్రుత్వం నిజమేనా, పాము కాటేసినా ముంగిస చనిపోదా?

ఫొటో సోర్స్, Getty Images
పాములు, ముంగిసల గొడవ గురించి ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. ఇవి రెండూ భారత్‌లో తరచూ కనిపించే జీవులే. అయితే, ఈ రెండింటి పోరాటంపై ప్రజలకు విపరీతమైన ఆసక్తి కూడా.
పాము, ముంగిసల మధ్య జరిగే పోరాటాన్ని భారత ఉపఖండంలోని అనేక పురాతన గాథలు, ఇతిహాసాలు, ఆధునిక కథల్లోనూ వివరించారు.
వీటి మధ్య శత్రుత్వం గురించి మనం చాలా కథలు విన్నాం. అయితే, పాము, ముంగిస గొడవపడితే ముంగిస గెలుస్తుందా?
ఒకవేళ ఈ గొడవలో పాము ముంగిసను కాటేస్తే? అయినా, ఆ ముంగిస ఎందుకు చనిపోదు?


ఫొటో సోర్స్, Getty Images
పాము, ముంగిసల శత్రుత్వం నిజమేనా?
ముంగిస పిల్లలను పాములు తింటాయని, అందుకే వాటి మధ్య శత్రుత్వమని చెబుతారు. పాములు తమ పిల్లలను చంపేస్తాయని ముంగిసలు భయపడతాయి. అందుకే, పామును చూడగానే ఆడ ముంగిస దాడి చేస్తుంది.
అయితే, పరిమాణం పెద్దగా ఉండే ముంగిసల వంటి వాటిని కొండచిలువలు మాత్రమే మింగగలవని నిపుణులు చెబుతున్నారు. ఇతర పాములు బల్లులు, కప్పలు, ఎలుకల వంటి వాటిని తింటాయి.
ముంగిసకు ఇతర పాముల నుంచి ఎక్కువగా ప్రమాదం ఉండదు. కానీ, పాములకు ముంగిస నుంచి ప్రమాదం ఉంటుంది.
ముంగిసల ప్రవర్తనపై డాక్టర్ రష్మీ శర్మ 'స్టడీ ఆఫ్ బిహేవియర్ ఆఫ్ ఇండియన్ మంగూస్' అనే పరిశోధనా పత్రం రాశారు.
అందులో "ముంగిసలు ప్రధానంగా పగటిపూట చురుగ్గా ఉంటాయి. అవి విషపూరిత పాములతో పోరాడి, వాటిని చంపుతుంటాయి. చురుకుదనమే ముంగిసలకు గొప్ప బలం" అని రష్మీ శర్మ అందులో రాశారు.
"ముంగిసలు ఎక్కువగా గుంపులుగా ఉంటాయి. ప్రతీ గుంపులో 6 నుంచి 40 వరకు ముంగిసలు ఉంటాయి. ఈ గుంపులో ఏ ముంగిస బలంగా ఉంటే (ఆడదైనా, మగదైనా) అది ఆ గుంపు లీడర్‌గా ఉంటుంది. గుంపులోని ప్రతి ముంగిసకు ఒక నిర్దిష్టమైన పని ఉంటుంది" అని పరిశోధనా పత్రంలో పేర్కొన్నారు.
"కొన్ని ముంగిసలకు వాటిచుట్టూ పొంచివున్న ముప్పులను పర్యవేక్షించే బాధ్యత అప్పగిస్తాయి. సమయాన్ని బట్టి వాటి పని కూడా మారుతుంటుంది. ముంగిసలకు చాలా పదునైన ముక్కుతో పాటు చెవులు, కళ్లు చురుగ్గా ఉంటాయి" అని రష్మీ శర్మ తన పరిశోధన పత్రంలో వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
ముంగిసను పాము కాటేస్తే?
విషపూరితమైన పాములు, కోబ్రాలను కూడా ఎదుర్కొని ముంగిసలు ఎలా పోరాడగలుగుతాయి?
బీబీసీ వైల్డ్‌లైఫ్ ప్రకారం, కొన్నిరకాల ముంగిసలు అత్యంత విషపూరితమైన, ప్రమాదకరమైన పాముల నుంచి తమను తాము రక్షించుకోగలవు. పాము విషంలో సాధారణంగా వేగంగా ప్రభావం చూపే ఆల్ఫా-న్యూరోటాక్సిన్ ఉంటుంది. విషం శరీరంలోకి వెళ్లాక నాడీ వ్యవస్థ నుంచి వచ్చే సందేశాలను ఆల్ఫా-న్యూరోటాక్సిన్ బ్లాక్ చేస్తుంది. ఇది పక్షవాతానికి, చివరికి మరణానికి దారితీస్తుంది.
కానీ, ముంగిస శరీరానికి పాము విషంతో పోరాడే అద్భుత సామర్థ్యం ఉంది. వాటి శరీరంలోని ఎసిటైల్‌కోలిన్ రిసెప్టార్(గ్రాహకం)లో జరిగే మార్పులు, వాటి కండరాలకు సందేశాలు చేరేలా చేస్తాయి. కాబట్టి, పాము కాటేసినా ముంగిస తన ప్రాణాలను కాపాడుకోగలదు.
దీనర్థం, పాము కాటు వేసినా ముంగిసకు ఏమీ కాదని కాదు. భారీ విష సర్పం, లేదా అత్యంత విషపూరితమైన పాము ముంగిసను చంపగలదని, భారీ మొత్తంలో విషం ముంగిస శరీరంలోకి వెళ్తే చనిపోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
పోరాటంలో అనుభవంలేని ముంగిస కూడా పాముపై గెలవగలదు. కానీ, కోబ్రాతో ముంగిస పోరాటం చాలా భయానకంగా ఉంటుంది.
'స్టడీ ఆఫ్ బిహేవియర్ ఆఫ్ ఇండియన్ ముంగూస్' పరిశోధనా పత్రం దీని గురించి వివరించింది.
"ముంగిస శరీరంలోని ఎసిటైల్‌కోలిన్ గ్రాహకాల కారణంగా పాము విషం దాని శరీరాన్ని ప్రభావితం చేయదు. అయితే, అవి సాధారణంగా కోబ్రా వంటి అత్యంత విషపూరిత పాములతో పోరాడవు. అవి కోబ్రా మాంసాన్ని ఇష్టపడవు."

ఫొటో సోర్స్, Getty Images
పాము, ముంగిస తలపడితే గెలిచేదెవరు?
పాములు, ముంగిసలను సాధారణంగా ఒకదానికొకటి శత్రువులుగా చెబుతారు. అయితే, ముంగిసలు క్షీరదాలు.
బ్రిటానికా ప్రకారం.. ముంగిసలు ప్రధానంగా ఆఫ్రికా, దక్షిణాసియా, దక్షిణ ఐరోపాలో కనిపిస్తుంటాయి.
ముంగిసలకు ఎక్కువగా నేల బొరియల్లో, చెట్ల తొర్రల్లో నివసిస్తాయి. చిన్నచిన్న క్షీరదాలు, పక్షులు, సరీసృపాలు, జంతువుల గుడ్లు, పండ్లు ముంగిసకు ప్రధాన ఆహారం.
ముంగిసలకు పాము తల అంటే ఇష్టం. ముంగిస ఎంత శక్తితో దాడి చేస్తుందంటే, ఆ దెబ్బకు పాము తల ఛిద్రమవుతుంది. ముంగిస చాలా చురుకైన జీవి కావడంతో, దాడి చేయడానికి ధైర్యం చేస్తుంది.
ముంగిస దాడి చాలా తీవ్రంగా ఉంటుంది, కొన్నిసార్లు ఒక్క దెబ్బకే పాము చనిపోతుంది. పాముల సంఖ్యను అదుపులో ఉంచడానికి ముంగిసలు సాయపడతాయి. కొంతమంది ముంగిసలను పెంపుడు జంతువులుగా కూడా పెంచుకుంటారు.
ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల ముంగిసలు ఉన్నాయి. భారతదేశంలో కనిపించే ప్రధాన జాతి 'బూడిద రంగు ముంగిస (ఇండియన్ గ్రే ముంగూస్)'. ఇదికాకుండా చారల ముంగిస ఎక్కువగా కనిపిస్తుంది.
ఆఫ్రికాలో పొడవాటి తోక కలిగిన ముంగిస, కంగారూ ముంగిసలు కనిపిస్తాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














