పాంపేయ్: 2,000 ఏళ్ల కిందట చనిపోయిన తాబేలు గర్భంలో పదిలంగా ఉన్న గుడ్డు, ఆశ్చర్యపోతున్న పురావస్తు శాస్త్రవేత్తలు

ఫొటో సోర్స్, PARCO ARCHEOLOGICO POMPEI
- రచయిత, లియో సాండ్స్
- హోదా, బీబీసీ న్యూస్
2000 ఏళ్ల క్రితం వెసువియాస్ అగ్నిపర్వతం బద్ధలైనప్పుడు పాంపేయ్‌కి చెందిన ప్రజలంతా ఆ బూడిదలో కూరుకుపోయారు.
అక్కడి వృక్ష జాతి, జీవ జాలం కూడా అందులోనే కలిసిపోయాయి. ఇలా అంతమై పోయిన వాటిలో ఒక తాబేలు, దాని గుడ్డు కూడా ఉంది.
పురావస్తు శాస్త్రవేత్తలకు ఆ తాబేలుకు సంబంధించిన అవశేషాలు లభ్యమయ్యాయి. క్రీ. శ 79 నుంచి ఈ అవశేషాలను ఎవరూ గుర్తించలేదు.
అప్పటికే ధ్వంసమైన ఒక భవనం కింద తాబేలు ఆశ్రయం పొందుతోన్న సమయంలోనే అగ్నిపర్వత విస్పోటనం సంభవించింది.
పాంపేయ్‌లోని ఒక ప్రాంతంలో తవ్వుతుండగా పురావస్తు శాస్త్రవేత్తలు, ఈ తాబేలు అవశేషాలను కనుగొన్నారు.
క్రీస్తు శకం 62లో పాంపేయ్‌లో భూకంపం సంభవించింది.
భూకంపం కారణంగా ధ్వంసమైన ఒక దుకాణం భూగర్భంలోకి 2000 ఏళ్ల క్రితం 14 సెం.మీ పొడవున్న తాబేలు ప్రవేశించింది.
గుడ్డు పెట్టడం కోసం మంచి ప్రదేశాన్ని వెతుక్కుంటున్న సమయంలో అగ్నిపర్వతం కారణంగా ఈ తాబేలు చనిపోయి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, PARCO ARCHEOLOGICO POMPEI
ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ పురావస్తు శాస్త్రవేత్త మార్క్ రాబిన్సన్, 2002లో పాంపేయ్ సమీప ప్రాంతంలోనే మరో తాబేలు అవశేషాలను కనుగొన్నారు. ఆయన బీబీసీతో మాట్లాడుతూ, ఆ తాబేలు అక్కడికి ఎలా వచ్చిందనడానికి రెండు వివరణలు ఉన్నాయని అన్నారు.
''ఒకటి ఏంటంటే, అది పెంపుడు తాబేలు అయి ఉండొచ్చు. బహుశా అది తప్పించుకొని అక్కడికి వచ్చి ఉండొచ్చు. లేదా అది అక్కడి సమీప గ్రామీణ ప్రాంతాల నుంచి ఆ పురాతన నగరంలోకి వచ్చి ఉండొచ్చు'' అని చెప్పారు.
''భూకంపంతో పాంపేయ్ బాగా ధ్వంసమైంది. తర్వాత పాంపీలోని అన్ని చోట్లా పునర్నిర్మాణం జరగలేదు. అక్కడి జీవ జాలం అంతా పట్టణాలకు తరలిపోయింది'' అని తెలిపారు.

ఫొటో సోర్స్, PARCO ARCHEOLOGICO POMPEI
తాజా ఆవిష్కరణతో భూకంపం తర్వాతి కాలంలో పాంపేయ్ సహజ పర్యావరణ వ్యవస్థ గొప్పతనం గురించి తెలుసుకోవచ్చని నిపుణులు అంటున్నారు.
'' భూకంపం తర్వాత నగరమంతా పునర్నిర్మాణంలో ఉండేది. కొన్ని ప్రాంతాలు నిరుపయోగంగా మారడంతో అడవి జంతువులు అక్కడ సంచరించడానికి, గుడ్డు పెట్టడానికి ప్రయత్నించాయి'' అని పాంపేయ్ డైరెక్టర్ జనరల్ గాబ్రియెల్ జుచ్‌ట్రిగెల్ చెప్పారు.
తాబేలు అవశేషాలు లభ్యమైనప్పుడు ఫిన్లాండ్‌కు చెందిన పీహెచ్‌డీ విద్యార్థి, పాంపేయ్ సందర్శనలో ఉన్నారు. దాన్ని చూసిన ఆయన బీబీసీతో మాట్లాడుతూ ''అది అద్భుతంగా ఉంది'' అని అన్నారు.
''వారు అప్పుడే తాబేలు పై చిప్పను తొలిగించారు. దాని లోపల అస్థిపంజరంతో పాటు గుడ్డు కూడా కనిపించింది. అది లేత గోధుమ రంగులో ఉంది. అది తాబేలు గుడ్డు అని వారు నాకు చెప్పారు. లేకపోతే నేను దాన్ని గుడ్డు అని గుర్తించకపోయేవాడిని'' అని జూనస్ వన్హాలా చెప్పారు.

ఫొటో సోర్స్, PARCO ARCHEOLOGICO POMPEI
ఇవి కూడా చదవండి:
- తీస్తా సెతల్వాద్: అహ్మదాబాద్‌కు తరలించిన ఏటీఎస్, అక్కడ ఆమె ఏమన్నారంటే...
- భారత్-రష్యా: పశ్చిమ దేశాల ఆంక్షల వల్ల రష్యా నుంచి భారత్‌కు రావాల్సిన ఆయుధాలు తగ్గిపోతున్నాయా?
- ఆన్లైన్ బ్యాంకింగ్ మోసాల బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి
- ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైసీపీకి కలిసొచ్చిన సానుభూతి - డిపాజిట్ కోల్పోయిన బీజేపీ
- గ్యాస్ట్రిక్ అల్సర్ల కోసం కనిపెట్టిన మాత్రను అబార్షన్ల కోసం ఎలా ఉపయోగిస్తున్నారంటే
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











