హైదరాబాద్‌లో మిస్ వరల్డ్: తెలంగాణ చేనేత దుస్తుల్లో ప్రపంచ సుందరి పోటీదారులు మెరిసిపోతారా?

ఫొటో సోర్స్, www.missworld.com
- రచయిత, కొటేరు శ్రావణి, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రపంచ సుందరి పోటీ 'మిస్ వరల్డ్' 72వ ఎడిషన్‌కు తెలంగాణ వేదిక కాబోతుంది. 2025లో ఈ వేడుకను తెలంగాణలో నిర్వహించనున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు.
ఈసారి మిస్ వరల్డ్ పోటీలను తెలంగాణలో నిర్వహించనున్నట్లు మిస్ వరల్డ్ లిమిటెడ్ సీఈవో, చైర్మన్ జూలియా మోర్లీ, తెలంగాణ ప్రభుత్వ పర్యటక, సాంస్కృతిక, వారసత్వ, యువ వ్యవహారాల శాఖ ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్‌తో కలిసి ప్రకటించారు.
మే 4 నుంచి మే 31 వరకు 28 రోజుల పాటు సాగే ఈ కార్యక్రమం.. తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో నిర్వహించనున్నారు.
తెలంగాణ సాంస్కృతిక వారసత్వం, ఆధునికత ఉట్టిపడేలా ఈ కార్యక్రమం జరపనున్నట్లు ప్రభుత్వం, నిర్వాహకులు చెబుతున్నారు. మిస్ వరల్డ్‌కు చెందిన గ్రాండ్ ఫైనల్‌తో పాటు ప్రారంభ, ముగింపు వేడుకలకు హైదరాబాద్ వేదిక కానుంది.
'' 72వ ప్రపంచ సుందరి వేడుకను గొప్ప సంస్కృతి, వినూత్నత, ఆతిథ్యానికి నెలవైన తెలంగాణలో నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యం కావడం ద్వారా ఈ ప్రాంత అద్భుతమైన వారసత్వాన్ని, గతిశీల వృద్ధిని ప్రపంచ ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లేందుకు మాకు అవకాశం కల్పిస్తుంది. ఇది కేవలం ప్రపంచ సుందరి వేడుకను నిర్వహించడమే కాదు..కమ్యూనిటీల్లో సాధికారత తీసుకురావడం, వైవిధ్యాన్ని వేడుకగా చేయడం, 'బ్యూటీ విత్ పర్పస్' అనే ప్రామిస్ ద్వారా దీర్ఘకాలిక ప్రభావం చూపించే ప్రయత్నం కూడా.'' అని జూలియా మోర్లీ అన్నారు.


ఫొటో సోర్స్, www.missworld.com
అంతకుముందు వేడుకలూ భారత్‌లోనే..
రాజధాని న్యూదిల్లీలో, ముంబయిలో 71వ ఎడిషన్ మిస్ వరల్డ్ పోటీలు జరిగాయి. 72వ ఎడిషన్ పోటీలను కూడా భారత్‌లోనే నిర్వహిస్తున్నారు.
ముంబయిలో జరిగిన 71వ ఎడిషన్ 'మిస్ వరల్డ్' ఫైనల్ పోటీల్లో చెక్ రిపబ్లిక్‌కు చెందిన క్రిస్టినా పిస్కోవా విజేతగా నిలిచారు.
ఆ ఎడిషన్‌లో భారత్ నుంచి పోటీల్లో పాల్గొన్న కన్నడ అమ్మాయి సిని శెట్టి టాప్-8లో నిలిచారు. అంతకుముందు 1996లో భారత్‌లో ఈ పోటీలు జరిగాయి.

ఫొటో సోర్స్, X/SmitaSabharwal
‘ప్రధాన ఆకర్షణ చేనేత దుస్తులే.. ’
ఈసారి తెలంగాణలో జరగబోయే మిస్ వరల్డ్ పోటీల్లో ప్రధాన ఆకర్షణ చేనేత దుస్తులు. దేశ విదేశాల నుంచి అందాల పోటీలకు వచ్చే అమ్మాయిలంతా తెలంగాణ చేనేత వస్త్రాలు ధరించేలా ప్రణాళిక చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.
మిస్ వరల్డ్ పోటీల్లో అనేక థీమ్‌లు ఉంటాయి. అందులో భాగంగా ఒక థీమ్ తెలంగాణ చేనేత వస్త్రాలు ఉండేలా చూస్తామంటున్నారు అధికారులు.
''ఈ మిస్ వరల్డ్ పోటీలను ఉపయోగించుకుని చేనేత పరిశ్రమకు మేలు చేసేలా ఒక ప్రణాళిక వేస్తున్నాం. ఆ పోటీల్లో తెలంగాణ హ్యాండ్లూమ్ అనే థీమ్ కూడా పెడుతున్నాం. పోటీలో పాల్గొనే అమ్మాయిలంతా తెలంగాణ చేనేత వస్త్రాలు వేసుకుంటారు. ఇందుకోసం మేం స్థానిక, అంతర్జాతీయ డిజైనర్లను కూడా ఆహ్వానిస్తున్నాం. మోడ్రన్, ట్రెడిషనల్ కలిపి మిక్స్ అండ్ మ్యాచ్‌గా చేయబోతున్నాం.'' అని బీబీసీతో చెప్పారు తెలంగాణ టూరిజం శాఖ ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్.
మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే విదేశీ యువతులంతా ఇలా చేనేత దుస్తులు వేసుకుంటే అది భారతీయ చేనేత రంగానికి ప్రోత్సాహాన్నిస్తుందని అధికారులు భావిస్తున్నారు.
పోచంపల్లి, గద్వాల, నారాయణపేట వంటి వస్త్రాలతో పోటీదార్లకు సరికొత్త డిజైన్ల దుస్తులను రూపొందించే అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది.

ఫొటో సోర్స్, www.missworld.com
ఈ పోటీలను తెలంగాణ రాష్ట్రాన్ని ప్రమోట్ చేయడానికి ఒక మంచి అవకాశంగా భావిస్తున్నారు అధికారులు.
మొత్తం ప్రపంచంలోని అన్ని దేశాల ప్రతినిధులూ పాల్గొనే పోటీ కాబట్టి, తెలంగాణ టూరిజం, ఉత్పత్తులు, పెట్టుబడి అవకాశాలు వీటన్నింటినీ అతిథులు ముందు ఉంచేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
''ఇది తెలంగాణ పర్యటక రంగానికి చాలా గొప్ప అవకాశం. చాలా పొటెన్షియల్ ఉన్న సందర్భం ఇది. అందుకే దీన్ని అన్ని రకాలుగా ఉపయోగించుకుంటూ భాగస్వాములం అవుతున్నాం. తెలంగాణ ఆహారం, ఆతిథ్యం, పర్యటక ప్రాంతాలు, చారిత్రక ప్రాంతాలు, చేనేత, పెట్టుబడులు.. ఇలా అన్ని రంగాల్లో తెలంగాణను ముందు పెట్టడానికి ఈ వేడుకను ఒక అవకాశంగా తీసుకుంటాం.'' అని బీబీసీతో చెప్పారు స్మితా సబర్వాల్.
పోటీదార్లను రామప్ప వంటి స్థలాలు, ఇతర పర్యటక ప్రాంతాలకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

ఫొటో సోర్స్, www.missworld.com
'బ్యూటీ విత్ పర్పస్' అనే లక్ష్యంతో..
ప్రపంచ సుందరి (మిస్ వరల్డ్) అనేది నేడు అత్యంత గుర్తింపు పొందిన హోదాగా నిలుస్తోంది. ఎన్నో ఏళ్లుగా నిర్వహిస్తున్న వేడుకలు ఇవి.
120 దేశాలు, భూభాగాలకు చెందిన పోటీదార్లను ఈ ప్రతిష్టాత్మక ప్రపంచ సుందరి వేడుక ఒకే వేదికపైకి తీసుకొస్తుంది. కేవలం గౌరవప్రదమైన టైటిల్, కిరీటం కోసమే కాకుండా.. మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్‌కు చెందిన 'బ్యూటీ విత్ పర్పస్' అనే లక్ష్యం కోసం ఈ వేడుకలో పోటీ పడాలి.
వివిధ దేశాలకు ప్రాతినిధ్యం వహించే వారు, మే 4న తెలంగాణకు రానున్నారు. హైదరాబాద్‌లో మే 31న జరిగే ఫైనల్ వేడుకలో, అంతకుముందు మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా తన కిరీటాన్ని ప్రపంచ సుందరిగా గెలిచే వారికి అలంకరించనున్నారు.
ఈ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించేందుకు సిద్ధమవుతున్న రాష్ట్రం.. 'తెలంగాణ, జరూర్ ఆనా : అందం తన నిజమైన అర్థాన్ని కనుగొనే చోటు' అనే పిలుపుతో ప్రపంచానికి ఆహ్వానం పంపుతోంది.
తొలి ప్రపంచ సుందరి ఎవరు?
1951 లో బ్రిటన్‌కు చెందిన ఎరిక్ మెర్లే ఈ పోటీలకు రూపకల్పన చేశారు. అదే ఏడాది జులై 29న మొదటిసారి లండన్‌లో పోటీలు నిర్వహించారు. మొట్టమొదటి ప్రపంచ సుందరిగా స్వీడన్‌కు చెందిన కికి హకన్సన్ నిలిచారు.
ఫెమినిస్ట్ గ్రూప్‌ల నుంచి పెద్ద ఎత్తున విమర్శలే కాక, అనేక వివాదాలలో చిక్కుకున్నప్పటికీ..20వ శతాబ్దంలో ప్రపంచ సుందరి పోటీలు బాగా ప్రాచుర్యాన్ని సంపాదించుకున్నాయి.
20వ శతాబ్దం చివరిలో ఈ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి.
ఇందులో పాల్గొనే వారు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలపై దృష్టి పెట్టేందుకు 'బ్యూటీ విత్ పర్పస్' అనే నినాదాన్ని అప్పుడే ప్రవేశపెట్టారు.
ఆధునిక కాలంలో మిస్ వరల్డ్ పోటీలను మహిళల్లో సాధికారత కల్పించేందుకు, వ్యక్తిగత విజయాలను ప్రపంచానికి చాటిచెప్పేందుకు, ఫిజికల్ అప్పియరెన్స్‌తో సామాజిక సహకారానికి దోహదం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
భారత ప్రపంచ సుందరీమణులు..
ఇప్పటివరకు ఆరుగురు భారతీయ యువతులు మిస్ వరల్డ్ కిరీటాన్ని చేజిక్కించుకున్నారు. 1966లో రీటా ఫారియా మొదటిసారిగా ప్రపంచ సుందరిగా నిలిచారు.
ఆ తర్వాత చాలా ఏళ్లకు ఐశ్వర్యరాయ్ 1994లో మిస్ వరల్డ్‌గా నిలిచారు. 1997లో డయానా హెడెన్, 1999లో యుక్తాముఖి, 2000 సంవత్సరంలో ప్రియాంక చోప్రా ప్రపంచ సుందరిగా నిలిచారు. 17 ఏళ్ల తర్వాత 2017 మిస్ వరల్డ్ కిరీటాన్ని మళ్లీ భారత్‌కు చెందిన మానుషి చిల్లర్ సొంతం చేసుకున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














