‘26 ఏళ్లుగా ఈ స్టేషన్‌కు వస్తున్నాను, ఇంత జనాన్ని ఎన్నడూ చూడలేదు’

- రచయిత, దిల్‌నవాజ్ పాషా, అభినవ్ గోయల్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
న్యూదిల్లీ రైల్వే స్టేషన్‌లో శనివారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో 18 మందికి పైగా మరణించారు. అనేక మంది గాయపడ్డారు.
ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు నాయకులు తొక్కిసలాట ఘటనపై విచారం వ్యక్తం చేశారు.
తొక్కిసలాటలో గాయపడ్డవారికి న్యూదిల్లీ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న లోక్ నాయక్ జై ప్రకాశ్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
మృతుల్లో ఆభా దేవి, పింకీ దేవి, శీలా దేవి, వ్యోమ్, పూనమ్ దేవి, లలితా దేవి, సురుచి, కృష్ణా దేవి, విజయ్ సాహా, నీరజ్, శాంతి దేవి, పూజా కుమార్, సంగీతామాలిక్, పూనమ్, మమతా ఝా, రియా సింగ్, బేబీ కుమారి, మనోజ్ శామిల్ ఉన్నారు.
మృతులకు, గాయపడ్డవారికి భారతీయ రైల్వే నష్టపరిహారం ప్రకటించింది.
మృతుల కుటుంబాలకు పది లక్షల రూపాయలు, తీవ్రంగా గాయపడ్డవారికి రెండున్నర లక్షలు, గాయపడ్డవారికి లక్ష రూపాయలు నష్టపరిహారం అందిస్తామని తెలిపింది.

ఏం జరిగిందో అర్ధమయ్యేలోపే...
బిహార్ రాజధాని పట్నాకు చెందిన లలితా దేవి తన మేనల్లుడు గిర్‌ధారీతో కలిసి న్యూదిల్లీ నుంచి పానిపట్‌కు వెళ్తున్నారు. అది రాత్రి తొమ్మిది గంటల సమయం.
"మేమిద్దరం పట్నా నుంచి ఆనంద్ విహార్‌కు రైలులో వచ్చాం, తరువాత పానిపట్ వెళ్లడానికి న్యూదిల్లీ నుంచి రైలు ఎక్కాలనుకున్నాం. కానీ 14వ నంబరు ప్లాట్‌ఫాంపై జరిగిన తొక్కిసలాటలో మా అత్త చనిపోయారు'' అని గిర్‌ధారీ చెప్పారు.
''మేం స్టేషన్‌లోకి వెళ్లగానే అక్కడ ప్లాట్‌ఫాంపైకి చేరుకునేందుకు ప్రయత్నిస్తున్న జనం చాలామంది కనిపించారు. మెట్లపై తోపులాటతో నేను, మా అత్త వేరయిపోయాం'' అని గిర్‌ధారీ అన్నారు.
''కాసేపటి తర్వాత నేనామెను వెతుకుతూ వెళ్లినప్పుడు, ఇద్దరు, ముగ్గురు వ్యక్తులు రక్షించండి, రక్షించండి అని అరవడం వినిపించింది. దుప్పట్లో చుట్టి ఉన్న మా అత్తను నేను గుర్తుపట్టాను'' అని ఆయన తెలిపారు.
దిల్లీలోని కిరాడికి చెందిన ఉమేశ్ గిరి భార్య శీలందేవి తొక్కిసలాటలో చనిపోయారు. ఆమె వయసు 45ఏళ్లు.
"మేం మహాకుంభమేళాకు వెళ్తున్నాం. అజ్మేరీ గేట్ వైపు నుంచి వచ్చాం. మేం ప్లాట్‌ఫామ్ నంబర్ 14లో ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్ ఎక్కాలి. నా బెర్త్ ఏసీ కోచ్‌లో ఉంది'' అని ఉమేశ్ గిరి చెప్పారు.
''జనసమూహం అదుపు తప్పింది. జనం వెల్లువలా తరలిరావడంతో ఈ సంఘటన జరిగింది'' అని ఆయన తెలిపారు.
''నా ముందు అప్పటికే చాలా మృతదేహాలు పడి ఉన్నాయి. ఆ తర్వాత కొందరు కింద పడిపోయారు. కొందరు వారిపై నుంచే నడవడం ప్రారంభించారు. ఆ సమయంలో మృతదేహాలను వంతెన ముందు ఉంచారు. అప్పుడు అక్కడ అధికారులు గానీ, మీడియాగానీ ఎవరూ లేరు'' అని తన కళ్లతో చూసిన విషయాన్ని ఉమేశ్ వివరించారు.
''నాకు ఎలాంటి సాయం దొరకలేదు. చాలా ఆలస్యమైంది. నేను చాలా మంది పోలీసులకు, ఆర్పీఎఫ్ సిబ్బందికి చెప్పాను. కానీ ఎవరూ వినిపించుకోలేదు'' అని ఆయన తెలిపారు.

దిల్లీలోని సుల్తాన్‌పురికి చెందిన శోభ స్వస్థలం బిహార్. తొక్కిసలాటలో ఆమె వదిన చనిపోయారు.
''మా బావ గాయపడ్డారు. గాయపడ్డానని, త్వరగా రావాలని ఆయన ఫోన్ చేసి చెప్పారు'' అని శోభ తెలిపారు.
''ఆస్పత్రి వార్డు మొత్తం గాయపడ్డ వారితో నిండిపోయింది. అక్కడ చాలా మంది మృతదేహాలు ఉన్నాయి. నేనే స్వయంగా చూశాను. ఒక మంచం మీద నలుగురు వ్యక్తులు ఉన్నారు. మా వదిన ఉన్న మంచం మీద ముగ్గురు వ్యక్తులు ఉన్నారు" అని శోభ అన్నారు.

కుటుంబంతో కలిసి కుంభమేళాకు బయలుదేరిన సంజయ్ కుటుంబంలోనూ విషాదం చోటుచేసుకుంది. తొక్కిసలాటలో ఆయన సోదరి చనిపోయారు.
''ప్రయాగ్ ఎక్స్‌ప్రెస్‌లో మేం 12మందికి కుంభమేళాకు వెళ్లాలి. కానీ మేం ప్లాట్‌ఫామ్‌పైకి కూడా చేరుకోలేకపోయాం. మెట్ల దగ్గరే చిక్కుకుపోయాం'' అని ఆయన చెప్పారు.
''మేం కిందకు దిగుతున్నాం. వెనకనుంచి జనం వస్తున్నారు. గేటు ముందు పడిపోయిన జనం నలిగిపోయారు. జనసమూహం భారీగా ఉండడంతో...ప్రజలు ఒకరి మధ్య ఒకరు నలిగిపోయారు.
మా తమ్ముడి భార్య, నా కూతురు చిక్కుకుపోయారు. మేం వారిని రక్షించాం. అరగంట తర్వాత నా సోదరి కనిపించింది. కానీ అప్పటికే ఆమె చనిపోయింది. సీపీఆర్ చేశాం. ఆ గంటలో సాయం చేయడానికి ఎవరూ రాలేదు'' అని సంజయ్ తెలిపారు.
తనకు జరిగింది మరెవరికీ జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

ప్రత్యక్షసాక్షులు ఏం చెప్పారంటే...
తొక్కిసలాట జరిగినప్పుడు రైల్వేస్టేషన్‌లో ఉన్న రవి అక్కడేం జరిగిందో న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐకి వివరించారు.
''తొమ్మిది, తొమ్మిదిన్నర గంటల సమయంలో తొక్కిసలాట జరిగింది. కొన్ని రైళ్లు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. ఆ సమయంలో అక్కడ భారీగా జనం ఉన్నారు. 13వ నంబర్ ప్లాట్‌ఫామ్‌పై కూడా జనం గుంపులుగుంపులుగా ఉన్నారు.
రైలు రావడం గమనించిన వెంటనే ఇంకో ప్లాట్‌ఫామ్‌పై నుంచి కూడా జనం ఇక్కడకు వచ్చారు. దీంతో తొక్కిసలాట జరిగింది. చాలా మంది పైన కూడా నిల్చుని ఉన్నారు. జనసమూహం చాలా పెద్దదిగా ఉంది. పోలీసులు అంతా చూశారు కానీ జనాలను నియంత్రించలేకపోయారు'' అని రవి చెప్పారు.
''దాదాపు 9గంటల సమయంలో తొక్కిసలాట జరిగింది. జనాలను నియంత్రించేందుకు పోలీసులు ఎంతగానో ప్రయత్నించారు గానీ పరిస్థితి వారి చేయిదాటిపోయింది'' అని మరో ప్రత్యక్షసాక్షి చెప్పారు.
''26 ఏళ్ల నుంచి నేనిక్కడకు వస్తున్నా. అంతమంది జనాన్ని నేనెప్పుడూ చూడలేదు. ఛత్‌పూజ సమయంలో కూడా అంతమంది లేరు. రాత్రి భారీ జన సమూహం కనిపించింది'' అని మరో ప్రత్యక్షసాక్షి తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ సంఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సహా పలువురు నాయకులు విచారం వ్యక్తం చేశారు.
‘‘న్యూదిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాట నన్ను బాధించింది" అని ప్రధాని మోదీ సోషల్ మీడియాలో పోస్టుచేశారు.
‘‘న్యూదిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో ప్రజలు మరణించడం చాలా బాధ కలిగించింది. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా" అని రాష్ట్రపతి ముర్ము అన్నారు .

ఫొటో సోర్స్, Getty Images
ప్రతిపక్షాల విమర్శలు
తొక్కిసలాటపై ప్రతిపక్ష నాయకులు విచారం వ్యక్తం చేశారు.
''న్యూదిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాట మరణాలపై నరేంద్ర మోదీ ప్రభుత్వం నిజాన్ని దాచడానికి చేసిన ప్రయత్నం సిగ్గుచేటు..దీన్ని ఖండిస్తున్నాం'' అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు.
''మృతులు, గాయపడ్డ వారి సంఖ్యను వీలైనంత త్వరగా ప్రకటించాలి, తప్పిపోయిన వ్యక్తులను గుర్తించాలి'' అని ఆయన డిమాండ్ చేశారు.
''న్యూదిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాట, మరణాలు మనసును బాధించాయి. ప్రభుత్వ వనరులు చాలా ఉన్నప్పటికీ, భక్తులు తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోతున్నారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఇలాంటి దురదృష్టఘటనలను తొక్కిపెట్టి, ప్రచారం చేసుకోవడంలో బిజీగా ఉంది'' అని ఆయన విమర్శించారు.
''సామాన్య ప్రజలు, భక్తులపై కంటే, మీడియా నిర్వహణ, వీఐపీల సౌకర్యాలు, వారి ఏర్పాట్లపైనే ప్రభుత్వం దృష్టి పెట్టింది'' అని ఆయన అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














