న్యూదిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట.. 18 మంది మృతి

ఫొటో సోర్స్, Getty Images
న్యూదిల్లీ రైల్వేస్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో 18 మంది మరణించారు. 10 మందికి పైగా గాయపడ్డారు.
శనివారం రాత్రి న్యూదిల్లీ రైల్వేస్టేషన్‌కు పెద్దఎత్తున ప్రయాణికులు రావడంతో తొక్కిసలాట జరిగింది.
తొక్కిసలాటలో ప్రయాణికులు మరణించినట్లు దిల్లీలోని లోక్‌నాయక్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రీతూ సక్సేనా బీబీసీతో చెప్పారు.
చనిపోయినవారిలో 10 మంది మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నట్టు రాయిటర్స్ వార్తాసంస్థ వెల్లడించింది.


ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సోషల్ మీడియా ప్లాట్‌ఫాం 'ఎక్స్'లో ఆయన సానుభూతి తెలిపారు.
రైల్వేస్టేషన్‌లో శనివారం రాత్రి విపరీతమైన రద్దీ ఏర్పడిందని ప్రత్యక్ష సాక్షులు కొందరు 'బీబీసీ'తో చెప్పారు.
కుంభమేళాకు వెళ్లివస్తున్న ప్రయాణికులతో స్టేషన్ కిక్కిరిసిపోయిందని తెలిపారు.
‘‘మేం 13వ నంబరు ప్లాట్‌ఫామ్‌పై ఉన్నాం. రద్దీ విపరీతంగా ఉండడంతో మేం అసలు లోపలకికి కూడా వెళ్లలేకపోయాం’’ అని రుబీదేవి అనే ప్రయాణికురాలు చెప్పారు.
రద్దీని నియంత్రించేందుకు పోలీసులు ప్రయత్నించినప్పటికీ ప్రయాణికులు పోటెత్తడంతో ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడిందని మరో ప్రత్యక్షసాక్షి చెప్పారు.
ఒక రైలు బయలుదేరి వెళ్లిన తర్వాత ప్రమాదం జరిగిందని తెలిపారు.

తొక్కిసలాట జరిగే సమయానికి కుంభమేళాకు వెళ్తున్న రైలు ఒకటి బయలుదేరేందుకు సిద్ధంగా ఉందని, అప్పటికే మరో రెండు ఆలస్యమయ్యాయని అధికారులు చెప్పారు.
'నేను నా జీవితంలో ఎన్నడూ అంతమంది ప్రయాణికులను చూడలేదు' అని కుంభమేళాకు వెళ్తున్న ధర్మేంద్ర సింగ్ అనే ప్రయాణికుడు 'పీటీఐ' న్యూస్ ఏజెన్సీతో చెప్పారు.
విపరీతమైన రద్దీ కారణంగా 10 నుంచి 15 నిమిషాల పాటు పరిస్థితి పూర్తిగా అదుపు తప్పిందని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కేపీఎస్ మల్హోత్రా చెప్పారు.
రైల్వే శాఖ తొలుత తొక్కిసలాట ఘటనను వదంతిగా కొట్టిపారేసినప్పటికీ ఆ తరువాత ప్రయాణికులు మరణించారని అంగీకరించింది, అయితే, ఎంతమంది చనిపోయారనేది స్పష్టం చేయలేదు.
న్యూదిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాట ఘటన తీవ్ర షాక్‌కు గురిచేసిందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ‘ఎక్స్’లో పోస్టు చేశారు.
న్యూదిల్లీ రైల్వేస్టేషన్‌లో విషాద ఘటన జరిగిందని దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా చెప్పారు. మొత్తం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నానని తెలిపారు.
హైపవర్ కమిటీ ఏర్పాటు
‘‘ప్రయాగ్‌రాజ్, మగధ్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల కోసం రాత్రి వేళ చాలామంది ప్రయాణికులు వచ్చారు. ప్రయాణికులంతా అదే చివరి ట్రైన్ అనుకున్నారు, ఎలాగైనా రైలు ఎక్కాలని భావించారు’’ అని రైల్వే మంత్రిత్వ శాఖ ప్రతినిధి దిలీప్ కుమార్ బీబీసీతో చెప్పారు. ప్రమాదంపై దర్యాప్తు చేయడానికి హై పవర్ కమిటీ ఏర్పాటుచేశామని తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














