అసహజ లైంగిక దాడి చేసి భార్య మరణానికి కారకుడైన వ్యక్తిని నిర్దోషిగా వదిలేసిన హైకోర్టు, ఈ తీర్పుపై ఆగ్రహం, ఆందోళనలు ఎందుకు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, గీతా పాండే
- హోదా, బీబీసీ ప్రతినిధి
హెచ్చరిక: ఈ కథనంలో మిమ్మల్ని కలచివేసే అంశాలున్నాయి.
భార్యపై "అసహజ లైంగిక దాడి" చేయడంతో పాటు ఆమె మరణానికి కారణమైన వ్యక్తిని వదిలేస్తూ కోర్టు ఇచ్చిన తీర్పుపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ఈ తీర్పు తర్వాత, వివాహిత మహిళలకు మరింత మెరుగైన రక్షణ కల్పించాలనే వారి సంఖ్య పెరుగుతోంది.
ఈ వివాదాస్పద తీర్పు, భార్యపై అత్యాచారాన్ని నేరంగా పరిగణించేందుకు నిరాకరిస్తున్న దేశంలో ఈ అంశాన్ని మరోసారి వెలుగులోకి తెచ్చింది.
ఈ వారం మొదట్లో, ఛత్తీస్‌గఢ్ హైకోర్టు జడ్జ్ ఒకరు 40 ఏళ్ల వ్యక్తిని నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు చెప్పారు. ఆయన భార్యపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడు. ఆమెపై అసహజ పద్దతిలో లైంగిక దాడి చెయ్యడంతో, కొన్ని గంటల్లోనే ఆమె మరణించారు. ఈ కేసులో కింది కోర్టు ఆయనను దోషిగా ప్రకటించింది.
"ఆయన చేసింది హత్యకు ఏ మాత్రం తక్కువ కాని నేరపూరిత చర్య" అని కింది కోర్టు ఈ కేసు తీర్పులో పేర్కొంది. ఆ వ్యక్తిపై మోపిన నేరాభియోగాలకు ఒక్కొక్కదానికి పది సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. అన్ని శిక్షలు ఏకకాలంలో అమలు చేయాలని ఆదేశించింది.
అయితే ఫిబ్రవరి 10న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నరేంద్ర కుమార్ వ్యాస్ ఈ వ్యక్తిపై మోపిన అన్ని అభియోగాలను కొట్టివేస్తూ నిర్దోషిగా ప్రకటించారు.
పెళ్లి చేసుకున్న జంట మధ్య పరస్పర అంగీకారం లేని శృంగారం లేదా పరస్పర అంగీకారం లేని అసహజ శృంగారాన్ని భారతదేశంలో నేరంగా పరిగణించడం లేదు. అందుకే ఆయన్ను నిర్దోషిగా వదిలేస్తున్నట్లు కోర్టు తెలిపింది.
అయితే, ఈ తీర్పుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. భారతదేశంలో వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాలన్న తమ డిమాండ్‌ను కార్యకర్తలు, న్యాయవాదులు, ప్రచారకులు పునరుద్ఘాటిస్తున్నారు.
"ఆ వ్యక్తిని నిర్దోషిగా వదిలేయడం ఎంత మాత్రం ఆమోదనీయం కాదు. ఈ తీర్పు చట్ట ప్రకారం సరైనది కావచ్చేమో, అయితే నైతికంగా, విలువలపరంగా మాత్రం దారుణమైనది." అని న్యాయవాది, జెండర్ రైట్స్ కార్యకర్త సుకృతి చౌహాన్ అన్నారు.
"అలాంటి నేరం చేసిన వ్యక్తిని నిర్దోషిగా ప్రకటించడం, అసలది నేరం కాదని చెప్పడం మన న్యాయ వ్యవస్థలో చీకటి కోణం." అని ఆమె బీబీసీతో అన్నారు.
"ఇది మమ్మల్ని నిలువెల్లా కదిలించివేసింది. దీన్ని మార్చెయ్యాలి, అది కూడా తక్షణమే" అని ఆమె అన్నారు.


ఫొటో సోర్స్, Getty Images
కోర్టు పత్రాల్లో విస్తు గొలిపే వాస్తవాలు
"భర్త కాబట్టి మీకు అన్ని హక్కులు ఉంటాయనే సందేశాన్ని ఈ తీర్పు పంపిస్తోంది. మీరు ఏమైనా చెయ్యవచ్చు, భార్యను చంపేసి కూడా తప్పించుకోవచ్చు" అని ఈ తీర్పు సందేశం ఇస్తోందని ఛత్తీస్‌గఢ్‌కు చెందిన న్యాయవాది ప్రియాంక శుక్లా అన్నారు.
కోర్టులు ఇలాంటి తీర్పు ఇవ్వడం ఇదే తొలిసారి కాదు. ఇలాంటి తీర్పులు వచ్చినప్పుడల్లా ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోందని ఆమె గుర్తు చేశారు.
"ఈసారి ఆగ్రహావేశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇది చాలా భయంకరమైనది. అంతే కాదు, ఈ కేసులో బాధిత మహిళ చనిపోయింది" అని ఆమె అన్నారు.
కోర్టు పత్రాలు చదవడానికి కూడా భయం పుట్టించేలా ఉన్నాయి.
ప్రాసిక్యూషన్ ప్రకారం, ఈ సంఘటన 2017 డిసెంబర్ 11 రాత్రి జరిగింది. డ్రైవర్‌గా పని చేసే భర్త "భార్య ఇష్టానికి వ్యతిరేకంగా ఆమెతో అసహజంగా లైంగిక దాడి చేశారు. దీని వల్ల ఆమెకు చాలా నొప్పి కలిగింది" అని పత్రాలు పేర్కొన్నాయి.
ఆ తర్వాత ఆయన తన పనిలోకి వెళ్లగానే, ఆమె సాయం కోసం తన సోదరి, మరో బంధువును పిలిచారు. వాళ్లు ఆసుపత్రికి తీసుకెళ్లిన కొన్ని గంటల తర్వాత ఆమె చనిపోయారు.
ఆసుపత్రిలో ఆమె పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్, మెజిస్ట్రేట్ ఎదుట ఇచ్చిన వాంగ్మూలంలో ‘తన భర్త తనపై బలవంతంగా లైంగిక దాడి చెయ్యడం వల్ల’నే తాను అనారోగ్యానికి గురైనట్లు చెప్పారు.
మరణ వాంగ్మూలానికి కోర్టుల్లో చాలా విలువ ఉంటుంది. సరైన ఆధారాలతో విభేదిస్తే తప్ప, ఒక వ్యక్తిని దోషిగా నిర్థరించడానికి ఇది సరిపోతుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.
ఈ కేసుపై విచారణలో భాగంగా 2019లో బాధితురాలి భర్తను దోషిగా తేల్చేందుకు కింది కోర్టు ఎక్కువగా బాధిత మహిళ మరణ వాంగ్మూలం, పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ను పరిగణనలోకి తీసుకుంది.
"మరణానికి కారణం పొత్తి కడుపులో టిష్యూలు వాచిపోవడం, మల ద్వారానికి సమీపంలోని పెద్ద పేగు వద్ద గాయాలు" అని పోస్ట్ మార్టం నివేదిక తెలిపింది.
అయితే ఈ కేసులో మరణ వాంగ్మూలాకున్న "ప్రామాణికత"ను జస్టిస్ వ్యాస్ ప్రశ్నించారు. అంతే కాకుండా కొందరు సాక్షులు తమ వాంగ్మూలాలను వెనక్కి తీసుకున్నారని గుర్తు చేశారు. భారతదేశంలో వైవాహిక అత్యాచారం నేరం కాదని జస్టిస్ వ్యాస్ తన తీర్పులో చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
'అరుదైన కేసుల్లో అరుదైనది' అన్న కింది కోర్టు
కింది కోర్టు నిందితుడిని దోషిగా ప్రకటిస్తూ, ఈ కేసులో ‘బాధిత మహిళ మరణించింది కాబట్టి. ఇది అరుదైన వాటిలో అరుదైనది’ అని చెప్పిందని పేర్కొందని ప్రియాంక శుక్లా చెప్పారు.
అయితే హైకోర్టు న్యాయమూర్తి బాధిత మహిళ పట్ల కనీసం సానుభూతి కూడా ప్రకటించకపోవడం తమను నిర్ఘాంతపరిచిందని ఆమె అన్నారు.
భర్త, భార్యపై దాడి చేసిన తీరు, హైకోర్టు తీర్పు అనేక మందిని నిర్ఘాంతపోయేలా చేసింది. న్యాయమూర్తి ఈ కేసును ఇంత తేలిగ్గా కొట్టేస్తారని వారెవ్వరూ అనుకోలేదు.
పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, సౌదీ అరేబియాతో పాటు వైవాహిక అత్యాచారాన్ని నేరంగా గుర్తించని 30 దేశాలలో భారతదేశం కూడా ఒకటి.
భారతీయ శిక్ష్మా స్మృతిలో 1860 నుంచి అమల్లో ఉన్న సెక్షన్ 375ను రద్దు చేయాలని ఇటీవలి కాలంలో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి.
బ్రిటిషర్ల పాలనా కాలంలో శృంగారం రేప్ కాదని చెబుతూ అనేక మినహాయింపులు ఇచ్చారు. అందులో ఒకటి, భర్త తన భార్యతో చేసే శృంగారంలో పాల్గొన్నప్పుడు అది కూడా ఆమె వయసు 15 ఏళ్ల లోపు ఉంటేనే వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణిస్తారు.
బ్రిటన్‌లో 1991లో వైవాహిక అత్యాచారాన్ని తొలగించింది. అయితే భారత్‌లో ఇటీవల కొత్తగా రూపొందించిన న్యాయ సంహితలోనూ ఈ చట్టాన్ని అలాగే కొనసాగించారు.
వివాహంలో శృంగారానికి భార్య నుంచి సమ్మతి ఉంటుందని, అది ఆమె వెనక్కి తీసుకోదని, సెక్స్‌ను తిరస్కరించదనే నమ్మకం పాతుకుపోయింది. అయితే ఈ రోజుల్లో ఇలాంటి వాదనకు అవకాశం లేదని క్యాంపైనర్స్ చెబుతున్నారు. ఎవరు చేసినా బలవంతంగా సెక్స్ చేస్తే దాన్ని రేప్‌గానే పరిగణించాలనేది వారి వాదన.
అయితే వివాహం, కుటుంబాన్ని పవిత్రమైనవిగా భావించే దేశంలో, ఛత్తీస్‌గఢ్ హైకోర్టు తీర్పు, వైవాహిక అత్యాచారాన్ని వ్యతిరేకించే వారిని మరోసారి ఏకతాటిపైకి తీసుకువచ్చింది.
భారత ప్రభుత్వం, మత పెద్దలు, పురుష హక్కుల కార్యకర్తలు వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాలనే వాదనను వ్యతిరేకిస్తున్నారు.
వైవాహిక అత్యాచారాన్ని నేరంగా మార్చడం ‘మితిమీరి కఠినంగా వ్యవహరించినట్లు’ అవుతుందని 2024 అక్టోబర్‌లో భారత ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది.
‘ఇది వైవాహిక వ్యవస్థలో తీవ్రమైన సమస్యలకు దారి తీయవచ్చు’ అని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది.
లైంగిక వేధింపుల నుంచి వివాహిత మహిళల్ని రక్షించడానికి తగినన్ని చట్టాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. అయితే మహిళల శారీరక స్వీయ రక్షణను తిరస్కరించడానికి దేశం అలాంటి ప్రాచీన చట్టాల చాటున దాక్కోరాదని హక్కుల కార్యకర్తలు అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
చట్టాలను మార్చనంత వరకు ఏదీ మారదా?
‘రాజ్యాంగం పడగ్గదిలోకి రాకూడదని అనేకమంది చెబుతున్నారు. అయితే రాజ్యాంగం దేశంలోని మిగతా పౌరులకు ఇచ్చినట్లే మహిళల భద్రతకు, ప్రాథమిక హక్కుల్ని కల్పించలేదా? ఒక మహిళ ఇలాంటి భయంకరమైన హింసను ఎదుర్కోన్నప్పుడు మనమంతా ఇలా నిశబ్ధంగా ఎలా ఉండగలం? అని ’ అని చౌహాన్ ప్రశ్నించారు.
భారతదేశంలో వైవాహిక హింస తీవ్రంగా ఉంది. తాజాగా ప్రభుత్వం నిర్వహించిన ఒక సర్వేలో, 32 శాతం మంది వివాహిత స్త్రీలపై వారి భర్తలు భౌతిక, లైంగిక లేదా భావోద్వేగ పరమైన హింసకు పాల్పడ్డారు. 82 శాతం మహిళలు తమ భర్తల వల్ల లైంగిక హింసను ఎదుర్కొన్నట్లు చెప్పారు.
ఈ సర్వే సమస్య స్థాయిని పూర్తి చిత్రాన్ని చూపించడం లేదని శుక్లా చెప్పారు. ఎందుకంటే ఎక్కువ మంది మహిళలు తమపై దాడుల గురించి ఫిర్యాదు చేయరని, సిగ్గు వల్ల లైంగిక దాడుల గురించి అసలు చెప్పరని ఆమె అన్నారు.
"మహిళలు ఫిర్యాదు చేస్తే వారిని ఎవరూ నమ్మరు. అందరూ ఆమె అబద్దం చెబుతోందని అంటారు. మహిళ చనిపోయిన కేసుల్లోనే అలాంటి ఫిర్యాదుల్ని పట్టించుకుంటారు. అది కూడా భయంకరమైన లైంగిక దాడికి చనిపోయిన కేసుల్లోనే ఇలా జరుగుతున్నట్లు నాకు తెలిసింది" అని శుక్లా వివరించారు.
చట్టాలను మార్చనంత వరకు ఏదీ మారదని సుకృతి చౌహాన్ అంటున్నారు.
‘‘వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాలని మేము కోరుకుంటున్నాం. ఆ మహిళపై అంత తీవ్రంగా దాడి జరిగిన తర్వాత కూడా ఆమెకు న్యాయం జరగలేదు. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలి. ఇది ఆవేశంలో నుంచి పుట్టిన డిమాండ్ కాదు. బాగా ఆలోచించిన తర్వాతే అడుగుతున్నాం" అని ఆమె అన్నారు.
ఈ అంశాన్ని "స్త్రీ వర్సెస్ పురుషుల అంశం"గా ప్రభుత్వం, పురుషుల హక్కుల కార్యకర్తలు చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఆమె అన్నారు.
"వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాలన్న డిమాండ్ పురుషులకు వ్యతిరేకం కాదు. మహిళలకు భద్రత, సంక్షేమానికి అది అవసరం. మహిళలకు భద్రత కల్పించాల్సిన అవసరం లేదా?" అని సుకృతి చౌహాన్ ప్రశ్నించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










