ఛత్రపతి శివాజీ స్ఫూర్తితో 121 దుర్గాలను అధిరోహించానంటున్న ఏడేళ్ల చిన్నారి

ఏడేళ్ల వయసుకే 121 కోటలు ఎక్కిన శర్విక

ఫొటో సోర్స్, Jiten Mhatre

ఫొటో క్యాప్షన్, శర్విక జితేన్ మాత్రే

మీరెప్పుడైనా ఒక దుర్గాన్ని (కోటను) ఎక్కడానికి వెళ్లినప్పుడు, రెండు జడలు వేసుకుని, ముళ్ల పొదలను తెంపుకుంటూ ముందుకు వెళ్తున్న చిన్నారి అక్కడ కనిపించిందంటే ఆమె పేరు శర్విక.

ఏడేళ్ల ఆ బాలిక ఇప్పటికే 121 కోటలు ఎక్కేసింది. ఇదొక్కటే కాదు...'ఛత్రపతి శివాజీ మహరాజ్ కి జై' అనే నినాదాలతో మరిన్ని కోటలు ఎక్కడానికి సన్నద్ధమవుతోంది.

ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ట్రెక్కింగ్‌కు క్రేజ్ పెరిగిపోయింది. మహారాష్ట్రలో చాలామంది పర్వతారోహకులు (ట్రెక్కర్లు) కనిపిస్తుంటారు. కానీ ఏడేళ్ల వయసున్న ట్రెక్కర్లు చాలా అరుదు.

సహ్యాద్రి పర్వతాల్లోని 121 కోటల్లో ఆమె భారత జాతీయ జెండాను ఎగరేసింది. ఒక కోటను ఎన్నిసార్లు అధిరోహించినా, దాన్ని ఒక్కసారిగానే ఆమె పరిగణిస్తుంది.

మహారాష్ట్రలో అత్యంత ఎత్తయిన శిఖరం ఎక్కిన అతి చిన్నవయస్కురాలు శర్విక జితేన్ మాత్రే. ఆమె పేరు మీద చాలా రికార్డులున్నాయి.

ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, డైమండ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఓఎంజీ బుక్ ఆఫ్ రికార్డ్స్ వంటివాటిలో ఆమె పేరు నమోదయింది.

రెండున్నరేళ్ల వయసులో శర్విక మొదటిసారి ఒక కోట ఎక్కింది. మహారాష్ట్రలో అధిరోహించడం కష్టంగా భావించే కోటల్లో పన్వెల్- కర్‌జాట్‌ దగ్గరలోని కల్వంటిన్ శుక్లా కోట ఒకటి. మహారాష్ట్ర నుంచి ఈ కోట ఎక్కిన మొదటి బాలిక శర్విక.

మూడేళ్ల వయసులో ఆమె నాసిక్ జిల్లాలోని సల్హేర్ కోటను అధిరోహించింది. మహారాష్ట్రలోని సహ్యాద్రి పర్వతాల్లో అత్యంత ఎత్తయిన దుర్గం ఇదే.

నాలుగేళ్ల వయసు రాకముందే కల్సుబాయ్ శిఖరాన్ని అధిరోహించింది. మహారాష్ట్రలో ఇదే ఎత్తయిన కొండ. నాలుగేళ్ల వయసులో ఆ చిన్నారి గుజరాత్‌లోనే ఎత్తయిన గిర్నార్ శిఖరాన్ని ఎక్కింది.

ఏడేళ్ల వయసుకు శర్విక 121 కొండలను ఎక్కింది. వాటిలో ఎక్కువభాగం ఎక్కడానికి కష్టంగా ఉండేవి, దుర్బేధ్యమైనవే. మహారాష్ట్రలోని రాజ్‌గఢ్, రాయ్‌గఢ్ మొదలుకుని రోహిడా, పురందర్, కైలాస్‌గఢ్..ఇలా అనేకం ఆమె అధిరోహించిన దుర్గాల జాబితాలో ఉన్నాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఏడేళ్ల వయసుకే 121 కోటలు ఎక్కిన శర్విక

ఫొటో సోర్స్, Jiten Mhatre

ఫొటో క్యాప్షన్, మహారాష్ట్రలో ఎత్తయిన శిఖరం ఎక్కిన అతి చిన్నవయస్కురాలిగా శర్విక రికార్డు సృష్టించింది.

రెండున్నరేళ్ల వయసులోనే కోట అధిరోహణ

రెండున్నరేళ్ల వయసులో శర్విక మొదటిసారి రాయ్‌గఢ్ కోటను ఎక్కింది. తనకు ట్రెక్కింగ్ అంటే చాలా ఇష్టమని, శివాజీ మహరాజ్ కోటలు ఎక్కేవారని శర్విక బీబీసీతో చెప్పింది.

''శివాజీ మహరాజ్ కథలు వింటుంటే నాకు సంతోషంగా ఉంటుంది. ప్రత్యేక శక్తి వచ్చిన అనుభూతి కలుగుతుంది'' అని శర్విక చెప్పింది.

ఏడేళ్ల వయసుకే 121 కోటలు ఎక్కిన శర్విక

ఫొటో సోర్స్, Jiten Mhatre

ఫొటో క్యాప్షన్, శర్విక పేరు మీద చాలా రికార్డులు ఉన్నాయి.

ఏడేళ్ల వయసులోనే ఎంతో మందికి రోల్ మోడల్‌

ట్రెక్కింగ్‌కు వెళ్లినప్పుడు కొంతమంది ధైర్యం కోల్పోతారని, కానీ వారు శర్విక కోటను ఎక్కుతున్న విధానం చూస్తే, తాము కూడా కోట చివర వరకు ఎక్కడం మొదలుపెడతారని ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు.

''శర్విక కోట ఎక్కిన తర్వాత ఎవరో ఒకరు ఆమె వీడియో తీసి ఫేస్‌బుక్‌లో పోస్టు చేస్తారు. మేం అక్కడినుంచి ఇంటికి చేరుకునే సమయానికి ఆ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంటుంది'' అని ఆమె తండ్రి జితేన్ మాత్రే చెప్పారు.

మొదటిసారి రాయ్‌గఢ్ కోట ఎక్కిన తర్వాత కోటలంటే తనకు అంతకంతకూ ఇష్టం పెరుగుతోందని శర్విక బీబీసీతో చెప్పారు.

శర్విక తల్లిదండ్రుల పర్వతారోహకులు. వాళ్లిద్దరికీ ట్రెక్కింగ్ అంటే ఇష్టం. అలా పర్వతారోహణపై శర్వికకు కూడా ఆసక్తి పెరిగిందని ఆమె తల్లి అమృత మాత్రే చెప్పారు.

ఏడేళ్ల వయసుకే 121 కోటలు ఎక్కిన శర్విక

ఫొటో సోర్స్, Jiten Mhatre

ఫొటో క్యాప్షన్, శర్విక రెండున్నరేళ్ల వయసుకే రాయ్‌గఢ్ కోట ఎక్కింది.

చిన్నతనం నుంచి ఫోన్, టీవీకి ఆమడ దూరం

శర్వికకు ఫోన్, టీవీ చూడాలన్న ఆలోచన ఉండదు. తల్లిదండ్రులు వాటి నుంచి ఆమెను దూరంగా ఉంచారు. శారీరక వ్యాయామం, బయటికెళ్లి ఆడుకోవడం శర్వికకు ఇష్టం.

ట్రెక్కింగే కాకుండా ప్రస్తుతం రాక్ క్లైంబింగ్‌ను కెరీర్‌గా మార్చుకునేందుకు ప్రయత్నిస్తోంది శర్విక.

కోటలు ఎక్కడం ఇప్పుడామెకు హాబీ అయింది. ఆమెకు, ఆమె కుటుంబానికి ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్న హాబీ ఇది.

ఏడేళ్ల వయసుకే 121 కోటలు ఎక్కిన శర్విక

ఫొటో సోర్స్, Jiten Mhatre

ఫొటో క్యాప్షన్, ట్రెక్కింగ్‌తో పాటు రాక్ క్లైంబింగ్‌లో కెరీర్ తీర్చిదిద్దుకోవాలని శర్విక భావిస్తోంది.

శివాజీ కథలు చదువుతూ...

ప్రతి కోట నుంచి శర్విక మట్టి సేకరిస్తుంది. దాన్ని ఇత్తడి పాత్రలో దాస్తుంది. అది ఏ కోట నుంచి తెచ్చిందో దానిని పేరును ఆ పాత్ర మీద రాస్తుంది.

తాను విన్న పూర్వీకుల కథలను ఆమె బీబీసీ బృందానికి చెప్పింది.

ఆగ్రా కోట నుంచి శివాజీ మహరాజ్‌కు స్వేచ్ఛ లభించడం నుంచి హిర్కానీ సాహస కథలదాకా ఇందులో ఉన్నాయి. శివాజీ జీవిత విశేషాలకు సంబంధించిన పుస్తకాలు ఆమె దగ్గర ఉన్నాయి.

ఏడేళ్ల వయసుకే 121 కోటలు ఎక్కిన శర్విక

ఫొటో సోర్స్, Jiten Mhatre

ఫొటో క్యాప్షన్, ప్రతి కోట నుంచి సేకరించిన మట్టిని ఇత్తడి పాత్రలో నిల్వచేస్తుంది.

రాక్ క్లైంబింగ్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించాలన్న ఆశయం

శర్వికకు ట్రెక్కింగ్ అంటే చాలా ఇష్టం. అందుకే ఆమెకు రాక్ క్లైంబింగ్‌ నేర్పించాలని ఆమె తండ్రి నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఆమె కుటుంబం అలీబాగ్‌ నుంచి పుణెకు మకాం మార్చింది. రాక్ క్లైంబింగ్‌లో భారత్‌కు శర్విక ప్రాతినిధ్యం వహించాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు.

''అలీబాగ్ చాలా బాగుంటుంది. కానీ, శర్విక కోసం ఇష్టం లేకపోయినా పుణెకు మారాం'' అని శర్విక తండ్రి జితేన్ మాత్రే చెప్పారు.

శర్విక చరిత్ర సృష్టిస్తుందని ఆమె కోచ్ అమోల్ జోగ్‌దండ్ విశ్వాసం వ్యక్తంచేశారు. శర్విక మొదటిసారి పైకి ఎక్కడం చూసినప్పుడు తాను నమ్మలేకపోయానని ఆయన అన్నారు. ఒక చిన్నారి అంత బాగా కోటలను ఎలా ఎక్కగలుగుతుందోనని ఆశ్చర్యపోయినట్లు ఆయన చెప్పారు.

ప్రపంచ వేదికపై తన పేరు రాసుకోగల సామర్థ్యం ఆమెకుందని తనకు అనిపిస్తోందని అమోల్ తెలిపారు.

‘శివాజీ కోటలను పరిరక్షించాలి’

శర్వికకు కోటలు ఎక్కడం ఇష్టం. అలాగే ట్రెక్కింగ్‌కు వెళ్లినప్పుడు చెత్త, ప్లాస్టిక్ బాటిళ్లు వంటివాటన్నింటినీ ఏరివేస్తుంది. ట్రెక్కింగ్ అయిపోయిన తర్వాత సేకరించిన వ్యర్థాలన్నింటినీ చెత్తబుట్టలో వేస్తుంది.

''కోటలను మరమ్మత్తు చేయడానికి, పరిరక్షించడానికి నేటి తరం చర్యలు తీసుకుంటే మహారాష్ట్ర కోటలు మళ్లీ పూర్వవైభవం సాధించడానికి ఎక్కువ రోజులు పట్టదు'' అని శర్విక తండ్రి చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)