SLBC సొరంగ ప్రమాదం: 'ఎవరూ బతికే అవకాశం లేదు, మా సిబ్బంది ప్రత్యక్షంగా చూశారు'

ఫొటో సోర్స్, ANI
- రచయిత, బళ్ళ సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనకు సంబంధించి సొరంగం లోపల చిక్కుకుపోయిన వారిలో ఎవరూ ప్రాణాలతో ఉండే అవకాశం లేదని చెబుతున్నారు.
'ఇది దురదృష్టకర ఘటన, కచ్చితంగా ఎవరూ జీవించే అవకాశం ఐతే లేదు' అని తెలంగాణ మంత్రి ఒకరు బీబీసీతో చెప్పారు.
ఎవరూ ప్రాణాలతో ఉండే అవకాశం లేదని, సహాయక సిబ్బంది ఘటనా స్థలాన్ని ప్రత్యక్షంగా చూశారని ఆయన చెప్పారు.
''ఎన్డీఆర్ఎఫ్, సైన్యం, ఇతర సహాయక బృందాలు ఆదివారం ఘటనా స్థలం వరకూ చేరుకున్నాయి. చాలా దగ్గరి నుంచి ఘటనా స్థలాన్ని పరిశీలించాయి. ఆ ప్రదేశాన్ని పరిశీలించిన అనంతరం, తెలంగాణ ప్రభుత్వ మంత్రులకు ఫోన్ ద్వారా వివరాలు తెలియజేశారు. వారు తెలంగాణ మంత్రులకు ఇచ్చిన సమాచారం ప్రకారం, కనిపించకుండాపోయిన ఎవరూ కూడా జీవించి ఉండే అవకాశం లేదని అధికారులు విశ్వసనీయంగా మంత్రులతో చెప్పారు'' అదే విషయాన్ని తెలంగాణ మంత్రి ఒకరు బీబీసీకి ధ్రువీకరించి చెప్పారు.
''ప్రస్తుతానికి కనపడలేదు అని నమ్ముతున్నాం. కానీ, ఎట్టిపరిస్థితుల్లోనూ వారు జీవించి ఉండే అవకాశం లేదని అక్కడ పరిశీలనకు వెళ్లిన అధికారులు స్పష్టంగా తెలియజేశారు'' అని ఆయన చెప్పారు.
అక్కడి నుంచి దృశ్యాలను వీడియో కాల్ ద్వారా మంత్రులకు అధికారులు చూపించారని, అవి చూసిన తర్వాత వారు బతికి ఉండే అవకాశం లేదని మంత్రులు కూడా ధ్రువీకరణకు వచ్చినట్లు తెలిపారు. కాసేపట్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
సంఘటనా స్థలం నుంచి ఫోన్ చేసిన సహాయక సిబ్బంది తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డితో ఫోన్‌లో మాట్లాడుతూ, ''టీబీఎం(టన్నెల్ బోరింగ్ మెషీన్) నుంచి కేవలం 75 మీటర్ల దూరంలో ఉన్నాం. బతికి ఉండే అవకాశం(లోపల చిక్కుకుపోయిన వారు) చాలా తక్కువ'' అని చెప్పారు.
ప్రమాద స్థలానికి 75 మీటర్ల దూరంలో ఉన్నామని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని సిబ్బంది మంత్రికి ఫోన్‌లో చెప్పారు.

ఎస్ఎల్బీసీ ప్రమాదానికి సంబంధించి అసలైన రెస్క్యూ ఆపరేషన్ ఆదివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో మొదలైంది.
అప్పటి వరకూ ఘటనా స్థలానికి చేరుకున్న బృందాలు, సొరంగం నుంచి మట్టి తొలగింపు ప్రథమ కర్తవ్యంగా రంగంలోకి దిగాయి. లోపల ఉన్న వారి ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది.
శనివారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో తెలంగాణలోని శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ - ఎస్ఎల్‌బీసీ) సొరంగంలో భారీ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులకు గాయాలు కాగా, ఎనిమిది మంది సొరంగం లోపలే చిక్కుకుపోయారు.
ఈ ప్రమాదం జరిగిన తరువాత వెంటనే ప్రభుత్వ యంత్రాంగం స్పందించింది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ సహాయక బృందాలను ఎస్‌ఎల్‌బీసీ దగ్గరకు పిలిపించారు. సుమారు రాత్రి 10 గంటల ప్రాంతంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది ఒక రైలు( టన్నెల్ లోపలికి వెళ్లడానికి ఉపయోగించే వాహనం)లో లోపలికి వెళ్ళి పరిశీలించారు.
సుమారు 11.30 ప్రాంతంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ టన్నెల్ వద్దకు చేరుకున్నారు. రాత్రి 10 గంటల సమయంలో సింగరేణి రెస్క్యూ బృందాలు, ఆదివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఇండియన్ ఆర్మీ బృందాలూ చేరుకున్నాయి.
ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఫైర్, హైడ్రా ఇతర ఉన్నతాధికారులు సుమారు గంటన్నర పాటూ సమావేశమై తదుపరి కార్యాచరణను చర్చించారు.

లోపలికి వెళ్ళిన వివిధ బృందాల సభ్యులతో బీబీసీ మాట్లాడింది. ఆ బృందంలోని వివిధ సభ్యులు ఇచ్చిన వివరాల ప్రకారం..
''లోపల మోకాళ్ళ లోతు వరకూ నీరు చేరింది. దాదాపు 11 లేదా 11.5 కిలోమీటర్ల వరకూ రైలు వెళ్తోంది. అక్కడి నుంచి రైలులోకి నీరు వస్తున్నాయి. దీంతో పరిశీలించడం కోసం మేం రైలును ఆపేసి మట్టి తెచ్చే కన్వేయర్ బెల్టుపైకి ఎక్కి నడిచాము.
అలా దాదాపు 25 నిమిషాల పాటూ, 2 కిలోమీటర్ల దూరం కన్వేయర్ బెల్టుపై నడిచాం. లైటింగ్ పనిచేస్తోంది. నీరు కూడా మరీ ఎక్కువ లోతు లేదు. కానీ నీటి కంటే మట్టి ఎక్కువగా ఉంది.
అది కూలిపోయిన మట్టా, మెషీన్ వల్ల వచ్చిన మట్టా అన్నది తెలియదు. కానీ, మెత్తటి మట్టి ఎక్కువగా పేరుకుపోయింది. మట్టి, మెషీన్ ఉన్న దగ్గర నుంచి గట్టిగా అరుస్తూ, కేకలు వేస్తూ, ఈలలు వేస్తూ, టార్చ్ చూపిస్తూ లోపల చిక్కుకున్న వారి నుంచి స్పందన కోసం చూశాం. కానీ ఏ స్పందనా రాలేదు.
అక్కడ ఆ భారీ యంత్రం కూడా ఒకపక్కకు తిరిగిపోయి ఉంది. అంటే ప్రమాద తీవ్రత అర్థం చేసుకోవచ్చు. మెషీన్ అవతల ఖాళీ స్థలం ఉంది. అక్కడ సిగ్నల్ సరిగా లేకపోవడం వల్ల డ్రోన్ కూడా వెళ్ళడం లేదు. మా దగ్గర పూర్తి స్థాయి యంత్రాలు, పనిముట్లు లేవు కాబట్టి మట్టి దాటి వెళ్ళలేదు.'' అని వివరించారు.

''బాధితులు మట్టి అవతల ఖాళీ స్థలంలో ఉంటే ఇబ్బంది లేదనీ, కానీ మట్టిలో చిక్కుకుంటే ప్రమాదమనీ'' కొందరు సిబ్బంది బీబీసీతో అన్నారు.
ఈ బృందం చెప్పిన వివరాలు, కంపెనీ ప్రతినిధిలు అందించిన వివరాలతో సుదీర్ఘ కసరత్తు చేసిన ఉన్నతాధికారులు తెల్లవారుజామున 3 గంటల నుంచి రెస్క్యూ పనులు మొదలు పెట్టారు.
ముందుగా దారిలో పేరుకుపోయిన మట్టి తొలగించడమే ప్రథమ కర్తవ్యంగా నిర్ణయించారు. ఆ తరువాతనే ఏ పని అయినా చేయగలమని తేల్చారు. అందుకోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది, గ్యాస్ కట్టర్లు, పారలతో కూడిన రైలు లోపలికి వెళ్ళింది. తరువాత మిగతా బృందాలన్నీ లోపలికి వెళ్తున్నాయి.
తెల్లవారిన తరువాత నుంచి పనులు మరింత ఊపందుకున్నాయి. మట్టి తొలగించడానికి తగినంత సిబ్బంది, పనిముట్ల కోసం నాగర్ కర్నూలు జిల్లాతో పాటూ చుట్టుపక్కల జిల్లాలు, మున్సిపాలిటీలు, ఇతర ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల నుంచి సిబ్బంది, యంత్రాలు, పనిముట్లు సేకరించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు.
నాగర్ కర్నూలు కలెక్టర్ ఆ బాధ్యతలు చూస్తున్నారు. దాదాపు అన్ని ప్రభుత్వ శాఖలూ, ఉన్నతాధికారులూ ఇక్కడ పనులను పర్యవేక్షిస్తున్నారు.
శనివారం పనులు 13.6 కిలోమీటర్ దగ్గర జరిగాయి. అప్పుడే ప్రమాదం జరిగింది. మెషీన్ దాదాపు 80 మీటర్ల వరకూ జరిగిందని ప్రమాదం నుంచి తప్పించుకున్న వారు అంటున్నారు. అంటే పదమూడున్నర కిలోమీటర్ల దగ్గరే బాధితులు ఉండి ఉంటారనే అంచనాతో రెస్క్యూ సిబ్బంది పనిచేస్తున్నారు.
శనివారం రాత్రి ఈ ఘటనపై ప్రధాని మోదీ ముఖ్యమంత్రి రేవంత్‌తో ఫోన్లో మాట్లాడారు. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఆదివారం నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి రెస్క్యూ ఆపరేషన్ వివరాలు తెలుసుకున్నారు.
( తాజా సమాచారంతో ఈ వార్త అప్‌డేట్ అవుతోంది.)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














