జెలియెన్‌స్కీ: ‘అవసరమైతే అధ్యక్ష పదవి వదులుకోడానికి సిద్ధం’

ఫొటో సోర్స్, Reuters
యుక్రెయిన్‌ను రష్యా ఆక్రమించి మూడేళ్లయిన సమయంలో వొలొదిమిర్ జెలియెన్‌స్కీ కీలక ప్రతిపాదన చేశారు. శాంతి కోసం యుక్రెయిన్ అధ్యక్షపదవిని వదులుకోడానికి సిద్ధంగా ఉన్నానన్నారు.
''నేనీ పదవి వదులుకోవాలని మీరు కోరుకుంటే, అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. యుక్రెయిన్‌కు నాటో సభ్యత్వం కోసం కూడా నేను పదవి వదులుకోడానికి సిద్ధంగా ఉన్నా'' అని న్యూస్ కాన్ఫరెన్స్‌లో ఓ ప్రశ్నకు జెలియెన్‌స్కీ సమాధానమిచ్చారు.
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఇటీవల జెలియెన్‌స్కీని ఎన్నికలు నిర్వహించని నియంతగా అభివర్ణించారు. ఈ నేపథ్యంలో జెలియెన్‌స్కీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమయింది.
''ఆ మాటలతో నేను బాధపడలేదు. అదే ఒక నియంత అయితే బాధపడతారు'' అని జెలియెన్‌స్కీ వ్యాఖ్యానించారు. 2019 మేలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో జెలియెన్‌స్కీ గెలుపొందారు.
యుక్రెయిన్ భద్రతపై ప్రస్తుతం తాను దృష్టిపెట్టానని జెలియెన్‌స్కీ చెప్పారు. దశాబ్దాల పాటు అధ్యక్షునిగా ఉండాలన్న కల తనకు లేదన్నారు.
మార్షల్ లా అమలులో ఉన్న సమయంలో యుక్రెయిన్ చట్టాల ప్రకారం ఎన్నికలపై నిషేధం ఉంటుంది. 2022 ఫిబ్రవరిలో రష్యా పూర్తిస్థాయి ఆక్రమణకు దిగిన తర్వాత యుక్రెయిన్‌లో మార్షల్ లా విధించారు.

అమెరికా అధ్యక్షుడు మధ్యవర్తి కన్నా ఎక్కువ పాత్ర పోషించాలి
యుక్రెయిన్‌కు మద్దతు ప్రకటించేందుకు, భద్రతాహామీలపై చర్చించేందుకు ఈయూ నాయకులు, ఇంకొన్ని దేశాల నేతలు కీయెవ్ వెళ్లనున్నారు.
స్పానిష్ ప్రధానిపెడ్రో సాంచెజ్, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ సమావేశానికి హాజరయ్యేవారిలో ఉంటారని భావిస్తున్నారు.
యుక్రెయిన్ నాటోలో చేరడంపై చర్చల ప్రతిపాదన ఉందని, అయితే చర్చలు ఎలా ముగుస్తాయనేది తనకు తెలియదని జెలియెన్‌స్కీ అన్నారు. ఈ సమావేశం కీలక మలుపు అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు.
అమెరికా అధ్యక్షుణ్ని తాను కీయెవ్, మాస్కో మధ్యవర్తికన్నా ఎక్కువగా, యుక్రెయిన్ భాగస్వామిగా చూడాలనుకుంటున్నానని జెలియెన్‌స్కీ చెప్పారు.
''నేను నిజంగా మధ్యవర్తిత్వం కంటే ఎక్కువ కోరుకుంటున్నా. అది సరిపోదు'' అని ప్రెస్ కాన్ఫరెన్స్‌లో జెలియెన్‌స్కీ అన్నారు.

ఫొటో సోర్స్, Ukrainian State Emergency Services
యుక్రెయిన్‌పై రష్యా డ్రోన్ల దాడి
యుక్రెయిన్‌కు ఇప్పటివరకు అమెరికా చేసిన, చేయబోయే సాయానికి ప్రతిగా, యుక్రెయిన్‌లో ఉండే అరుదైన భూ ఖనిజాలను తమకు అందుబాటులో తేవాలని వైట్‌హౌస్ డిమాండ్ చేస్తోంది.
దీనిపై జెలియెన్‌స్కీని స్పందించారు. ఇకపై అమెరికా సాయాన్ని గ్రాంట్ల రూపంలో తీసుకుంటామని, అప్పుల రూపంలో కాదని ఆయనన్నారు.
''తరతరాలు చెల్లించే అవసరం ఉన్న భద్రతా ఒప్పందాన్ని నేను అంగీకరించబోను'' అని జెలియెన్‌స్కీ చెప్పారు.
ఖనిజాల ఒప్పందం కుదుర్చుకునే అవకాశంపై ప్రశ్నించగా ''ఒప్పందం దిశగా చర్చలు జరుగుతున్నాయి. ఒప్పందం గురించి మాట్లాడేందుకు యుక్రెయిన్, అమెరికా అధికారులు దీనిపై సంప్రదింపులు జరిపారు'' అని జెలియెన్‌స్కీ చెప్పారు.
''మేం వాటిని పంచడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యుద్ధాన్ని ముగిస్తారన్న హామీ వాషింగ్టన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది'' అని జెలియెన్‌స్కీ అన్నారు.
ప్రపంచ మీడియా ప్రశ్నలకు ఆయన నింపాదిగా స్పందించారు. గడిచిన మూడేళ్లలో ఆయన భావోద్వేగానికి గురయినట్టు కనిపించేవారు. కానీ ఆదివారం ఆయన వైఖరి అలా లేదు.
డోనల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన శాంతిప్రతిపాదన విధానాన్ని యుక్రెయిన్ అధ్యక్షుడు అంగీకరించకపోతే యుద్ధం పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.
ప్రస్తుత సంక్షోభం సమయంలోనూ యుక్రెయిన్‌పై రష్యా అతిపెద్ద డ్రోన్ దాడి చేసిన కొన్ని గంటల తర్వాత జెలియెన్‌స్కీ ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగిందని యుక్రెయిన్ అధికారులు చెప్పారు.
రికార్డు స్థాయిలో 267 డ్రోన్లతో యుక్రెయిన్‌పై రష్యా ఒకేసారి దాడిచేసిందని యుక్రెయిన్ ఎయిర్‌ఫోర్స్ కమాండ్ ప్రతినిధి యురీ ఇగ్నాట్ చెప్పారు.
13 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయని, మౌలిక సదుపాయాలకు ఎలాంటి నష్టం కలిగించకుండా చాలా డ్రోన్లను తిప్పికొట్టామని యుక్రెయిన్ ఎమర్జన్సీ సర్వీసెస్ తెలిపింది. ఈ దాడుల్లో కనీసం ముగ్గురు మృతిచెందారని వెల్లడించింది.
138 డ్రోన్లను కూల్చివేశామని, 119 డెకాయ్ డ్రోన్ల వల్ల ఎలాంటి ఇబ్బంది కలగలేదని, బహుశా జామింగ్ వల్ల ఇలా జరిగి ఉండొచ్చని యుక్రెయిన్ వైమానిక దళం తెలిపింది.
ఈ దాడి సందర్భంగా కీయెవ్‌లో ఆరు గంటలపాటు ఎయిర్ అలర్ట్స్ వినిపించాయి.
రష్యా ఈ వారంలో 1500 డ్రోన్లు, 1400 బాంబులు, 35 మిస్సైళ్లు ప్రయోగించిందని ఒక ప్రకటనలో జెలియెన్‌స్కీ ఆరోపించారు.

ఫొటో సోర్స్, Getty Images
‘మరో భయంకరమైన రాత్రి’
శనివారం రాత్రి జరిగిన దాడికి యుక్రెయిన్ అత్యవసర సర్వీసుల విభాగం స్పందించిన విధానాన్ని జెలియెన్‌స్కీ ప్రశంసించారు. న్యాయమైన, శాశ్వత శాంతిని కల్పించడానికి యూరప్, అమెరికా సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
రాత్రివేళ వందలాది డ్రోన్లు అనేమంది మరణానికి, వినాశనానికి కారణమయ్యాయని యుక్రెయిన్ ప్రథమ మహిళ ఒలెనా జెలియెన్‌స్కీ 'ఎక్స్'లో పోస్టు చేశారు.
''పేలుళ్లు, ఇళ్లు, కార్లు తగలబడడం, మౌలికసదుపాయాలు ధ్వంసం వంటివి జరిగిన మరో రాత్రి ఇది. తమవారంతా క్షేమంగా ఉండాలని ప్రజలు ప్రార్థిస్తూ గడిపిన మరో రాత్రి ఇది'' అని ఆమె తన పోస్టులో రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
శాంతి ఒప్పందం ఎప్పుడు కుదురుతుంది?
సోమవారం (ఫిబ్రవరి 24)తో యుద్ధం ప్రారంభమై నాలుగేళ్లవుతుంది.
శాంతి ఒప్పందంపై దౌత్యపరమైన చర్చలు సాగుతున్నాయి. సంక్షోభాన్ని ఎలా ముగించాలనేదానిపై యూరప్ మిత్రదేశాలు, అమెరికా భిన్నవైఖరులు కనబరుస్తున్నాయి.
సౌదీ అరేబియాలో అమెరికా, రష్యా ప్రాథమిక చర్చలు జరుపుతున్నాయి. యుక్రెయిన్‌తో పాటు యూరప్ దేశాలకు చెందినవారెవరూ ఈ చర్చల్లో భాగం కాలేదు. దీంతో యూరోపియన్ యూనియన్ నాయకులు పారిస్‌లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.
అమెరికా, రష్యా చర్చల్లో యుక్రెయిన్‌ను భాగస్వామిని చేయకపోవడంపై జెలియెన్‌స్కీ విమర్శలు చేశారు. మాస్కో అందిస్తున్న తప్పుడు సమాచారాన్ని ట్రంప్ నమ్ముతున్నారని ఆరోపించారు. దీనిపై స్పందించిన ట్రంప్, యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్‌స్కీ నియంత అని ఆరోపించారు.
ఫ్రాన్ అధ్యక్షుడు సోమవారం (ఫిబ్రవరి 24) అమెరికాలో పర్యటించనున్నారు. బ్రిటన్ ప్రధాని సర్ కీర్ స్టార్మర్ గురువారం (ఫిబ్రవరి 27) అమెరికా రానున్నారు.
జెలియెన్‌స్కీకి కీర్ మద్దతుగా ఉన్నారు. మొదటి నుంచి కీయెవ్‌కు ఉన్న మద్దతును కొనసాగిస్తున్నారు. ట్రంప్‌తో చర్చల్లో యుక్రెయిన్ సార్వభౌమత్వం ప్రాముఖ్యతను చర్చిస్తానని ఆయన తెలిపారు.
శ్వాసకోశవ్యాధితో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పోప్ ఫ్రాన్సిస్, యుద్ధం మూడేళ్లకాలాన్ని పూర్తి చేసుకోవడం మొత్తం మానవాళి బాధపడే, సిగ్గుపడే సందర్భమని ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














