ఆర్కే బీచ్‌లో ఆకుపచ్చ సముద్రం.. ఎందుకిలా?

ఫొటో సోర్స్, Nawaz
- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
విశాఖలో సముద్రం అప్పుడప్పుడు వివిధ రంగుల్లో కనిపిస్తుంటుంది.
భీమిలి సమీపంలో ఏడు నెలల కిందట ఎరుపు రంగులో కనిపిస్తే, మూడు వారాల కిందట పెదజాలరిపేటలో పసుపు రంగులో కనిపించింది.
తాజాగా ఆర్కే బీచ్ సమీపంలో ఆకుపచ్చగా కనిపించింది.
తరచూ తీరంలోని పలుచోట్ల సముద్రపు నీరు నల్లగా కనిపిస్తూ ఉంటుంది.
ఎప్పుడూ లేత నీలి రంగులో కనిపించే సముద్రం ఇలా రంగులు మారుతోంది ఎందుకు? సముద్రానికి రంగు మార్చే గుణం ఉందా?
సముద్రంలోని నీరే కాదు, తీరంలోని ఇసుక కూడా వివిధ రంగుల్లో కనిపిస్తూ సందర్శకులను ఆశ్చర్యపరుస్తోంది.
ఇలా సాగరం, తీరం రంగులు మారడానికి కారణమేంటి?


సముద్రం రంగు మారుతుందా?
సాధారణంగా సముద్రం నీలిరంగులోనే ఉంటుంది. కానీ అప్పుడప్పుడు, అక్కడక్కడ సముద్రం వేరే రంగుల్లో కనిపిస్తుంది. సముద్రం రంగు మారినట్లు కనిపించడమంటే, మొత్తం కనుచూపు మేరలో సముద్రమంతా అని కాదు.
కొన్ని చోట్ల 10 నుంచి వంద మీటర్లు, కొన్ని సార్లు ఇంకా చిన్న ప్రాంతంలో రంగు మార్పు కనిపిస్తుందని ఏయూ జియాలజీ విభాగం ప్రొఫెసర్ ఎ.యుగంధరరావు బీబీసీతో చెప్పారు.
"సాధారణంగా నదీ ప్రవాహాలు సముద్రంలోకి కలుస్తాయి. అప్పుడప్పుడు ఆ ప్రవాహాలతో పాటు ఏవైనా పదార్థాలు పెద్ద ఎత్తున కొట్టుకొని వస్తుంటాయి.
కొండ ప్రాంతాల నుంచి వచ్చే నది ప్రవాహాలైతే ఎక్కువగా ఖనిజ ధాతువులుండే నీటిని తీసుకొస్తాయి.
ఇలా పెద్ద మొత్తంలో సముద్రంలో కలిసినప్పుడు ఆ ఖనిజ ధాతువును బట్టి సముద్రంలోని రంగు కూడా మారుతుంది" అని యుగంధరరావు చెప్పారు.
భీమిలి సమీపంలో గత ఆగస్టులో ఇదే జరిగిందని ఆయన తెలిపారు.

ఖనిజ ధాతువును బట్టి రంగు...
''ఉదాహరణకు ఐరన్ ఎక్కువగా ఉండే నీటి ప్రవాహాలు సముద్రంలో కలిస్తే అక్కడ సముద్రం ఎర్రగా మారుతుంది. భీమిలి సమీపంలోని ఎర్రమట్టి దిబ్బల్లోని మట్టిలో హెమటైట్‌లో ఫెర్రిక్ ఆక్సైడ్ ఉంటుంది.
ఇందులో ఐరన్ ఎక్కువ ఉంటుంది. వర్షాలు పడినప్పుడు వాన నీరు ఈ ఇసుక దిబ్బల్లోని హెమటైట్ ఇతర మినరల్స్‌తో చర్య పొంది ఐరన్ కలర్ (రెడ్ కలర్) విడుదల చేస్తాయి. అది ఎక్కువ మొత్తంలో సముద్రంలో కలిసినప్పుడు అక్కడ సముద్రపు నీరు ఎరుపు రంగులో కనిపిస్తుంది'' అని ప్రొఫెసర్ ఎ.యుగంధర్ రావు చెప్పారు.
సముద్రంలో ఏర్పడిన ఎర్ర రంగు క్రమంగా గోధుమరంగులోకి మారుతూ లేత నీలి రంగులోకి మారిపోతుంది.
అదే వేరే పదార్థాలు ఏవైనా ముఖ్యంగా వ్యర్థ పదార్థాలు లేదా జలాలు (పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలు, ఇంటి వ్యర్థాలు, పెద్ద ఎత్తున పూజ సామాగ్రి) కలిసే చోట లేత ఆకుపచ్చ రంగు నుంచి పసుపు రంగులోకి సముద్రపు నీరు మారుతుంది. పెదజాలరిపేటలో ఇదే జరిగి ఉంటుందని ప్రొఫెసర్ యుగంధరరావు చెప్పారు.
దీనిపై మరింత పరిశోధన చేస్తే స్పష్టమైన కారణం తెలుస్తుందన్నారు.

నలుపు, లేత ఆకుపచ్చ రంగుల్లో...
కొన్నిచోట్ల సముద్రంలో నిరంతరం వ్యర్థ జలాలు కలుస్తూనే ఉంటాయి. అలాంటి చోట సముద్రపు నీరు లేత ఆకుపచ్చ రంగులో కనిపిస్తుందన్నారు.
"వ్యర్థ జలాలు, పదార్థాలలో ఎక్కువగా ఆల్గే ఉంటుంది. ఇది నీటిని ఆకుపచ్చగా మారినట్లు చేస్తుంది. వ్యర్థ జలాలు కలుస్తున్నన్ని రోజులు ఈ ప్రాంతమంతా సముద్రపు నీరు లేత ఆకుపచ్చరంగులో కనిపిస్తుంది. సాధారణంగా భార ఖనిజాలు (హెవీ మెటల్స్) ఉన్న చోట తీరంలో నల్లని ఇసుక ఉంటుంది.
ఇది పెద్ద మొత్తంలో ఏర్పడి, దాని మీదుగా సముద్రపు నీరు లోపలికి వెళ్లినప్పుడు అక్కడ సముద్రపు నీరు నల్లగా ఉన్నట్లు కనిపిస్తుంది" అని యుగంధరావు వివరించారు.
అయితే ఇలా రంగుల మార్పు రోజుల తరబడి ఉండదు. కొన్ని గంటలు మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ఇది స్థానికంగా జరిగిన ఒక చర్య వలన సముద్రంలోని ఒక ప్రాంతంలో మాత్రమే కనిపిస్తుంది. సమయం గడుస్తున్న కొద్ది ఆ రంగు సముద్రం నీటిలో కలిసిపోయి సముద్రం మళ్లీ సాధారణ రంగులోనే కనిపిస్తుందన్నారు.

తీరంలోని ఇసుక కూడా రంగులు మారుతుందా?
సాధారణంగా తీరంలో ఇసుక గోధుమ రంగులో ఉంటుంది. కానీ, చాలాసార్లు నలుపు, ఎరుపు రంగుల్లో కూడా తీరంలోని ఇసుక కనిపిస్తుంది. ఇది ఇసుక రంగు మారడం కాదని, రకరకాల రంగుల్లో ఇసుక ఉంటుందని ప్రొఫెసర్ యుగంధరరావు అన్నారు.
"మనం తీరంలోని గోధుమ రంగు ఇసుకని తీసుకుని మెక్రోస్కోప్‌లో పరిశీలిస్తే అందులో నలుపు, ఎరుపు రంగు ఇసుక కనిపిస్తుంది. దాని అర్థం సాధారణ ఇసుకలోనే నలుపు, ఎరుపు రంగు ఉండే ఖనిజ ధాతువులున్నాయని.
ఎక్కడైతే సముద్రంలో ఎక్కువగా వేవ్ యాక్షన్ (ఆటుపోట్లు) జరుగుతుందో అక్కడ భార, తేలికపాటి ఖనిజ ధాతువులు వాటి స్పెసిఫిక్ గ్రావిటీ ఆధారంగా తీరంలో డిపాజిట్ అవుతాయి.
అలా ఒకే స్పెసిఫిక్ గ్రావిటీ కలిగిన ఇసుక రేణువులు ఒక చోట డిపాజిట్ అవ్వడం వలన ఆ ఇసుకలో ఉన్న ఖనిజ ధాతువుని బట్టి రంగు కనిపిస్తుంది. ఇది తుపాను సమయంలో ఎక్కువగా తెలుస్తుంది’’ అని యుగంధర రావు తెలిపారు.
తీరానికి సమీపంలో అగ్నిపర్వతాలు ఉన్నా, ఏవైనా ఖనిజాల గనులు ఉన్నా కూడా తీరంలోని ఇసుక ఆయా రంగులను సంతరించుకుంటుంది. కొన్ని కంటికి కనిపిస్తాయి. కొన్ని పరీక్షలు చేస్తే కానీ తెలుసుకోలేం. విశాఖ తీరం పొడవునా అనేక ఖనిజాలు ఉన్నాయి అని ఆయన చెప్పారు.

వేవ్ యాక్షనే కారణం...
వేవ్ యాక్షన్ ఎక్కువగా ఉంటే అక్కడ సాగరంలోని నీరు, తీరంలోని ఇసుక వివిధ రంగుల్లో కనపడే అవకాశముందని ప్రొఫెసర్ యుగంధరరావు చెప్పారు.
"ఎటువంటి వేవ్ యాక్షన్ లేకపోతే అక్కడ సాగరం లేత నీలి రంగులో, తీరం గోధుమ రంగుల్లో కనిపిస్తుంది. అదే వేవ్ యాక్షన్ ఎక్కువగా జరిగితే తీరానికి కొట్టుకొచ్చే ఇసుకలో ఉండే ఖనిజ ధాతువుని బట్టి తీరంలోని ఇసుక రంగు కనిపిస్తుంది.
అలాగే సముద్రం లోపల కూడా చాలా ఖనిజాలు ఉంటాయి. అవి తీరానికి సమీపంలోనే ఉంటే ఆ ప్రభావం కూడా సాగరంలోని నీటిపై కనిపిస్తుంది" అని యుగంధరరావు తెలిపారు.
సముద్రం నుంచి బయటకు వచ్చే ఇసుక, సముద్రంలోకి చేరే వ్యర్థాలు తీరంలోని ఇసుక, సాగరంలోని రంగుని అప్పుడప్పుడు మారుస్తుంటాయని ఆయన చెప్పారు. అయితే ఇది తరచుగా జరగదని తెలిపారు.
ఇక స్థానికంగా తీరంలో జరిగే కార్యకలాపాలు (రంగులు వాడే ఉత్సవాలు, తీరంలో తవ్వకాలు, తీరంలో ఒక చోట వదిలే వ్యర్థాలు) కూడా కొద్దిసేపు సముద్రపు నీరు, తీరంలోని ఇసుక రంగుపై ప్రభావం చూపే అవకాశముందన్నారు. అయితే అది మైనర్ స్కేల్‌లో మాత్రమే జరుగుతుందని, పెద్ద ఎత్తున ఏదైనా జరిగినప్పుడు మాత్రమే దాని ప్రభావం అక్కడ ఉండే ఇసుక, నీటిపై పడి రంగు మారినట్లు కనిపిస్తుందన్నారు.

అది ప్రశాంతమైన తీరం...
సాధారణంగా ఆటుపోట్లు ఎక్కువగా ఉన్నప్పుడు ఇసుక స్పెసిఫిక్ గ్రావిటీని (అవగాహన కోసం బరువు అనుకోవచ్చు) బట్టి ఇసుక తీరానికి వచ్చి డిపాజిట్ అవుతూ ఉంటుందని యుగంధరరావు చెప్పారు.
"వాతావరణ పరిస్థితుల కారణంగా తీరానికి వచ్చిన మినరల్స్‌తో కూడిన ఇసుక మళ్లీ సముద్రంలోకి వెళ్లిపోతుంది. దాంతో మళ్లీ తీరంలో గోధుమ రంగు ఇసుకే కనిపిస్తుంది.
అలా కాకుండా వేవ్ యాక్షన్ ఎక్కువ జరిగినా కూడా ఆ తీరంలో నల్లని, ఎర్రని ఇసుక ఉందంటే అక్కడ హై ఎనర్జీ (అటుపోట్లు ఎక్కువగా జరిగే అవకాశం) ఉందని, ఒకవేళ అలలతో పాటు వచ్చిన ఇసుక కొట్టుకుపోయి తీరం గోధుమ రంగులోనే ఉంటే ఆ తీరంలోని వేవ్ యాక్షన్ పెద్దగా లేదని అర్థం" అని వివరించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














