సంభల్: షారిక్ సాఠాకి దావూద్ ఇబ్రహీంతో లింకులు, చార్జిషీటులో ఇంకా ఏముందంటే..

సంభల్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, సంభల్‌లోని జామా మసీదులో సర్వేను పర్యవేక్షించడానికి కోర్టు కమిషనర్ వచ్చిన సమయంలో అక్కడ హింస చెలరేగింది.
    • రచయిత, సయ్యద్ మోజెజ్ ఇమామ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి, లఖ్‌నవూ

ఉత్తరప్రదేశ్‌లోని సంభల్‌లో 2024 నవంబర్ 24న చెలరేగిన హింసకు సంబంధించిన కేసులో పోలీసులు కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు.

ఆ చార్జిషీటులో సంభల్ నివాసి షారిక్ సాఠాను హింసకు ప్రధాన సూత్రధారిగా పేర్కొన్నారు.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, షారిక్ సాఠాకు దావూద్ ఇబ్రహీంతో పాటు పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్‌ఐతో సంబంధాలు ఉన్నాయి. చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ అర్చనా సింగ్ కోర్టులో ఈ హింసకు సంబంధించిన నాలుగు కేసుల్లో 124 మంది నిందితులపై పోలీసులు చార్జిషీటు దాఖలు చేశారు.

కోర్టు ఆదేశాల తర్వాత, సంభల్‌లోని జామా మసీదులో సర్వేను పర్యవేక్షించడానికి కోర్టు కమిషనర్ వచ్చిన సమయంలో అక్కడ హింస చెలరేగింది. ఈ ఘటనలో నలుగురు చనిపోగా, 30 మంది పోలీసు సిబ్బంది గాయాలపాలయ్యారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

చార్జిషీటులో ఏముంది?

సంభల్‌ సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జియావుర్ రెహమాన్ బర్క్, ఎమ్మెల్యే ఇక్బాల్ మహమూద్ కుమారుడు సొహైల్ మహమూద్‌లను కూడా పోలీసులు విచారిస్తున్నారు.

సర్వే చేయడానికి వచ్చిన బృందంపై దాడి చేయాలని షారిక్ సాఠా మనుషులు కుట్ర పన్నినట్లు చార్జిషీటులో పోలీసులు పేర్కొన్నారు.

షారిక్ అనుచరులు కాల్పులు జరిపిన బుల్లెట్ల కారణంగా నలుగురు చనిపోయారని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కృష్ణకుమార్ బిష్ణోయీ, చార్జిషీటులో పేర్కొన్నారు.

ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య, పోలీసులను ప్రశంసిస్తూ, ''సిట్ చాలా మంచి పని చేసింది. నేరస్తులపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. 79 మంది నిందితులను అరెస్ట్ చేశారు. భవిష్యత్తులోనూ పోలీసులు ఇదే విధంగా ముందుకెళ్తారు'' అని అన్నారు.

ప్రభుత్వం ఏం కోరుకుంటుందో అదే పోలీసులు చేశారని సమాజ్‌వాద్ పార్టీ అధికార ప్రతినిధి ఫఖ్రుల్ హసన్ చాంద్ అన్నారు.

''ఇందులో అధికారుల పాత్ర అనుమానాస్పదంగా ఉంది. నవంబర్ 24న నినాదాలు చేస్తూ మసీదు వైపు వెళ్లిన వారిపై ఎలాంటి చర్య తీసుకోలేదు. కేవలం సంభల్ ప్రజల్ని హింసిస్తున్నారు'' అని ఫఖ్రుల్ హసన్ చాంద్ వ్యాఖ్యానించారు.

ఇప్పుడు కోర్టు నుంచి మాత్రమే న్యాయాన్ని ఆశిస్తున్నానని చాంద్ అన్నారు.

సంభల్ హింస ఒక పక్కా ప్రణాళికతో రచించిన కుట్ర అని పోలీసులు అభివర్ణించారు. ఈ మేరకు షారిక్ సాఠాతో పాటు ఆయన సహచరులను నిందితులుగా చేర్చారు.

షారిక్ సాఠా, సంభల్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఘటనా స్థలంలో పాకిస్తాన్‌లో తయారైన క్యాట్రిడ్జ్‌లు లభ్యమయ్యాయి.

ఎవరీ షారిక్ సాఠా? సంభల్ హింసతో సంబంధం ఏంటి?

షారిక్ సాఠా, సంభల్ నివాసి అని పోలీసులు వెల్లడించారు.

షారిక్ గతంలో దిల్లీ ఎన్‌సీఆర్ ప్రాంతంలో కార్ల దొంగల ముఠాకు నాయకుడిగా ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ ముఠా దాదాపు 300 కార్లు దొంగిలించిందని ఆరోపణలు ఉన్నాయని, దిల్లీ పోలీసులు కూడా షారిక్ కోసం వెతుకుతున్నారని చెప్పారు.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, షారిక్ 2020లో నకిలీ పాస్‌పోర్ట్ సహాయంతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కి పారిపోయారు. ఘటనా ప్రదేశంలో పాకిస్తాన్‌లో తయారైన క్యాట్రిడ్జ్‌లు లభ్యమైనట్లు సంభల్ సూపరింటెండ్ ఆఫ్ పోలీస్ కృష్ణ కుమార్ బిష్ణోయీ తెలిపారు.

పోలీసుల కథనం ప్రకారం, షారిక్‌కు బలమైన రాజకీయ సంబంధాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ కేసుపై దర్యాప్తు జరుగుతోంది. తర్వాత దీనిపై ఒక అనుబంధ చార్జిషీటు దాఖలు చేస్తారు.

ఘటన జరిగిన రోజున నేరానికి పాల్పడిన గులామ్‌ను అరెస్ట్ చేశామని మీడియాకు సంభల్ ఎస్పీ చెప్పారు.

గులామ్ నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. షారిక్ సాఠా సూచనల మేరకే గులామ్ ఆయుధాలను సరఫరా చేసినట్లు, మరో నిందితుడు ముల్లా అఫ్రోజ్‌కు ఆయుధాలను ఇచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు.

ఇవే కాకుండా చెకోస్లోవేకియా, పాకిస్తాన్‌లో తయారైన ఆయుధాలను కూడా గులామ్ నుంచి స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నారు.

గులామ్‌పై 20 కేసులు నమోదైనట్లు పోలీసులు చెప్పారు.

ఎలాగైనా మసీదులో సర్వేను ఆపేయాలనే ఉద్దేశంతో ఈ ఘటనకు పాల్పడ్డారని బిష్ణోయీ చెప్పారు. హింసాత్మక ఘటనలో పోలీసు శాఖకు చెందిన 30 మంది గాయపడ్డారని తెలిపారు.

గులామ్ అరెస్ట్ సందర్భంగా సంభల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మాట్లాడుతూ, ఈ వ్యక్తుల లక్ష్యం హిందూవర్గానికి చెందిన లాయర్ విష్ణు శంకర్ జైన్ అని చెప్పారు.

సంభల్ ఎస్సీ కృష్ణ కుమార్ బిష్ణోయీ

ఫొటో సోర్స్, X/Sambhalpolice

ఫొటో క్యాప్షన్, సంభల్ ఎస్సీ కృష్ణ కుమార్ బిష్ణోయీ

ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకున్నారు?

నాలుగు కేసుల్లో చార్జిషీట్లు నమోదైనట్లు మీడియాతో జిల్లా ప్రభుత్వ అడ్వొకేట్ హరి ఓంప్రకాశ్ చెప్పారు.

నవంబర్‌ 24న సంభల్‌లోని జామా మసీదు సర్వే సమయంలో జరిగిన హింసకు సంబంధించి ఆరు కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు పోలీసులు 124 మంది నిందితులపై కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు.

ఈ హింసకు సంబంధించి ఇప్పటివరకు పోలీసులు 80 మందిని అరెస్ట్ చేశారు.

అరెస్టైన ముగ్గురు మహిళల్లో ఒకరికి దర్యాప్తులో పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చారు. కోర్టు ఉత్తర్వుల మేరకు ఆమెను విడుదల చేశారు.

సంభల్ హింసకు సంబంధించి సంభల్‌ పోలీస్ స్టేషన్‌లో నమోదైన 333/24 నంబర్ కేసులో 39 మంది నిందితులపై కోర్టులో చార్జిషీటు దాఖలు అయింది.

దర్యాప్తు సమయంలో మరో 54 మంది నిందితుల పేర్లు వెలుగులోకి వచ్చాయని చార్జిషీటులో దర్యాప్తు అధికారి (ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్) పేర్కొన్నారు.

సంభల్‌లో నమోదైన మరో కేసు 336/24లో 37 మంది నిందితులపై చార్జిషీటు దాఖలు చేశారు. మరో 52 మంది నిందితుల పేర్లు కూడా వెలుగులోకి వచ్చాయి.

సంభల్‌లోని నఖాస పోలీస్ స్టేషన్‌లో నమోదైన 304/24 కేసుకు సంబంధించి 25 మందిపై చార్జిషీటు నమోదైంది. వాంటెడ్ జాబితాలో ఉన్న మరో 15 మందిపై నాన్ బెయిలబుల్ వారెంట్స్ జారీ అయ్యాయి.

కోర్టుకు చార్జిషీట్ తీసుకెళ్తున్న పోలీసులు
ఫొటో క్యాప్షన్, కోర్టుకు చార్జిషీట్ తీసుకెళ్తున్న పోలీసులు

సంభల్‌లో ఏం జరిగింది?

స్థానిక కోర్టు ఆదేశాల మేరకు, 2024 నవంబర్ 24న సంభల్‌లోని జామా మసీదులో సర్వే కోసం వెళ్లిన బృందాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులకు, మూకకు మధ్య జరిగిన హింసాత్మక ఘర్షణలో బిలాల్, నయీమ్, కైఫీ, అయాన్ అనే నలుగురు చనిపోయారు.

పోలీసుల కాల్పుల్లోనే వీరంతా మరణించారని మృతుల కుటుంబాలు పేర్కొన్నాయి. కానీ, జనం మధ్యలో నుంచి బుల్లెట్లు పేల్చారని చార్జిషీటులో పోలీసులు పేర్కొన్నారు.

పోలీసులు బుల్లెట్లను పేల్చలేదని హింస జరిగిన సమయంలో బీబీసీతో మొరాదాబాద్ డీఐజీ మునిరాజ్ చెప్పారు.

ఈ హింస తర్వాత, సంభల్ ఎంపీ జియావుర్ రెహమాన్ బర్క్‌తో పాటు 2500 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, హింస జరిగిన రోజు తాను బెంగళూరులో ఒక మీటింగ్‌లో ఉన్నానని జియావుర్ అన్నారు.

సంభల్, ఉత్తరప్రదేశ్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, పోలీసులు, సంభల్ సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జియావుర్ రెహమాన్‌ను విచారిస్తున్నారు

అసలు జామా మసీదు వివాదం ఏంటి?

సంభల్‌లోని చారిత్రక జామా మసీదును ఏ కాలంలో నిర్మించారనే దానిపై వివాదం ఉంది. మొఘల్ పాలకుడు బాబర్ ఆదేశాల మేరకు ఒక హిందు దేవాలయం స్థానంలో ఈ మసీదును నిర్మించారని కోర్టులో హిందూ పక్షం వాదించింది.

సంభల్ చరిత్రపై 'తారిఖ్-ఎ-సంభల్' అనే పుస్తకం రాసిన మౌలానా మొయిద్ మాట్లాడుతూ, ''బాబర్ ఈ మసీదుకు మరమ్మతులు చేయించారు. బాబర్ ఈ మసీదును నిర్మించాడనేది నిజం కాదు'' అని అన్నారు.

''లోధీలను ఓడించిన తర్వాత, 1526లో సంభల్‌ను బాబర్ సందర్శించారనేది చారిత్రక వాస్తవం. కానీ, జామా మసీదును బాబర్ నిర్మించలేదు. తుగ్లక్ పాలనా కాలంలో ఈ మసీదును నిర్మించి ఉండొచ్చు. ఈ మసీదు నిర్మాణ శైలి కూడా మొఘలుల నిర్మాణ శైలిలా ఉండదు'' అని ఆయన వివరించారు.

ప్రస్తుతం ఈ మసీదు, భారత పురాతత్వ శాఖ పర్యవేక్షణలో ఉంది. ఇదొక ప్రొటెక్టెడ్ బిల్డింగ్.

జామా మసీదుకు సంబంధించి వివాదం తలెత్తడం ఇదే మొదటిసారి కాదు. హిందూ సంస్థలు ఇదొక దేవాలయం అని వాదిస్తున్నాయి. దీనికి సమీపంలో ఉన్న ఒక బావి వద్ద శివరాత్రి సందర్భంగా పూజలు చేసేందుకు కూడా ప్రయత్నించాయి.

ఇటీవలి దశాబ్దాల్లో మసీదుకు సంబంధించి కోర్టులో ఒక కేసు నమోదు కావడం ఇదే తొలిసారని ముస్లిం వర్గాలు అంటున్నాయి.

''కేసు నమోదు చేయడం ద్వారా, ఈ ముస్లిం ప్రార్థనా స్థలాన్ని వివాదాస్పదం చేసే ప్రయత్నం జరిగింది. ఈ మసీదుకు సంబంధించి కోర్టులో ఎలాంటి వివాదం లేదు'' అని మస్లిం పక్షానికి చెందిన అడ్వొకేట్ మసూద్ అహ్మద్ అన్నారు.

చందౌసి సివిల్ జడ్జి కూడా తన ఉత్తర్వుల్లో, దీనికి సంబంధించి కోర్టులో కూడా ఎలాంటి కేవియెట్ (హెచ్చరికల లేదా షరతులకు సంబంధించి) పెండింగ్‌లో లేదని పేర్కొన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)