ఏపీ, తెలంగాణ: తులం-సవర, సెంటు-గుంట, వీటి మధ్య తేడా ఎంతో తెలుసా..

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, బళ్ళ సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారతదేశంలో భూమికి, బంగారానికి ఉన్న ప్రాధాన్యత కొత్తగా చెప్పక్కర్లేదు. వాటికి ఎంత ప్రాధాన్యం ఉందో, వాటి చుట్టూ అంతే గందరగోళం కూడా ఉంటుంది.
అలాంటి గందరగోళం పోవాలంటే వాటిని కొలిచే, తూకం వేసే లెక్కలు, వాటి పేర్లు తెలియాలి. ముఖ్యంగా తెలుగువారికి ఈ విషయంలో ఆంధ్ర, తెలంగాణలో వాడుకలో ఉన్న కొలమానాల మధ్య తేడాలు కూడా తెలియాలి.
భారతదేశం, ప్రపంచవ్యాప్తంగా చాలా కొలమానాలు ఉన్న నేపథ్యంలో తెలుగువారికి అవసరమయ్యే భూమి, బంగారం కొలతల గురించి సులువుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.


ఫొటో సోర్స్, Getty Images
బంగారం కొలత:
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బంగారం కొలతలో నాలుగు ప్రధాన పదాలు వినిపిస్తాయి.
- తులం
- కాసు
- సవర
- గ్రాము
తులం: పూర్వం నుంచి భారతదేశంలో ఉన్న సంప్రదాయ కొలమానం తులం. దీన్నే తోలా (Tola) అని కూడా కొన్ని చోట్ల అంటారు. తులం అంటే వాస్తవానికి 11.7 గ్రాములు.
అయినప్పటికీ, ప్రస్తుతం భారతదేశంలో 10 గ్రాములనే తులంగా వ్యవహరిస్తున్నారు. లెక్కలు వేయడానికి సులువుగా ఉంటుందని వ్యవహారికంలో దీన్ని గ్రాములతో రౌండ్ ఫిగర్ చేశారన్నమాట.
అయితే, ఇప్పటికీ ఇంగ్లండ్‌లో తులం అంటే 11.7 గ్రాముల కిందే వ్యవహారంలో ఉంది. అక్కడ పది తులాలు అంటే 117 గ్రాములు.
భారత్‌తో పాటు దక్షిణాసియా దేశాలైన పాకిస్తాన్, నేపాల్ వంటి చోట్ల కూడా ఈ తులం కొలత ఉంది. మొత్తంగా ఇప్పుడు బంగారం దుకాణంలో తులం అంటే 10 గ్రాముల కిందే లెక్కిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
కాసు – సవర
దక్షిణ భారతదేశంలో ఎక్కువగా ఉండే కొలత ఇది. వాస్తవానికి దీని విలువ 7.98805 గ్రాములు. కానీ, గందరగోళం లేకుండా ఉండటానికి 8 గ్రాముల కింద రౌండ్ ఫిగర్ చేసి లెక్కిస్తారు. బ్రిటిష్ వారు విడుదల చేసే 8 గ్రాముల బంగారు నాణాన్నే సావరీన్ గోల్డ్ కాయిన్ అంటారు. సరిగ్గా ఆ నాణెం బరువుతో సమానమైన బంగారంగా ఈ కొలత వాడకంలోకి వచ్చింది.
''సావరీన్ (Sovereign) అనే ఇంగ్లిష్ పదం, సవర అనే భారతీయ పదంగా రూపాంతరం చెందింది. అలాగే, బ్రిటిష్ వారి కాసుతో సమానమైన బరువు కలిగిన బంగారం కాబట్టి కాసు అనేది వాడకంలోకి వచ్చాయి. రెండు పదాలకూ అర్థం ఒకటే. 8 గ్రాములు'' అని బీబీసీతో చెప్పారు శ్రీనివాసరావు అనే స్వర్ణకారుడు.

ఫొటో సోర్స్, Getty Images
''తులం అసలు కొలత 11.7 గ్రాములు వాస్తవమే అయినప్పటికీ, ఇప్పుడు సులభంగా ఉండటానికి ఆ కొలత పక్కన పెట్టేశారు. కొందరు స్వర్ణకారులతో పాటు, పాతకాలం వారికి మాత్రం ఆ కొలత గుర్తుంటుంది.
ఆ కొలత ప్రకారం తులంతో పాటు వీస, పరక, పాతిక, అడ్డిగ, బేడెత్తు, చుక్కెత్తు, గురిజ, అణా, మణుగు ఇలా చాలా ప్రాచీన భారతీయ కొలతలు ఉన్నాయి. అవి ఇప్పుడు వాడకంలో లేవు'' అని చెప్పారు శ్రీనివాసరావు.
ప్రాచీన సాహిత్యంలో ఈ మణుగు అనే పదం బాగా కనిపిస్తుంది. సంపన్నులు, రాజుల దగ్గర మణుగుల కొద్దీ బంగారం ఉంది అనే వర్ణన ఉంటుంది.
అమెరికా సహా చాలా దేశాల్లో బంగారాన్ని ట్రాయ్ ఔన్స్ అనే కొలమానంతో కొలుస్తారు. ఒక ట్రాయ్ ఔన్సు 31.103 గ్రాములకు సమానం. ఇది భారతదేశంలో వాడకంలో లేకపోయినా, అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ఎక్కువగా ఈ ట్రాయ్ ఔన్స్ కడ్డీల కింద అమ్ముతారు.

ఫొటో సోర్స్, Getty Images
గ్రాము అధికారికం..
అన్నింటికంటే ముఖ్యమైనది గ్రాము. దీని గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. మెట్రిక్ పద్ధతిలో అతి ముఖ్యమైన కొలమానం గ్రాము. వెయ్యి గ్రాములు ఒక కిలోగ్రాము లేదా కేజీ. ఎందుకంటే గ్రాము లెక్క అధికారికం. చట్ట ప్రకారం నడిచే లెక్క.
'ది స్టాండర్డ్స్ ఆఫ్ వెయిట్స్ అండ్ మెజర్స్' చట్టం-1976 ప్రకారం, బరువులు అన్నీ మెట్రిక్ కొలమాన పద్ధతిలోనే కొలవాలని భారత ప్రభుత్వం చట్టం చేసింది. అందుకే మీరు తులం, సవర, కాసు అని ఏ పేరు పిలిచినా బంగారు షాపు వారు ఇచ్చే బిల్లులో మాత్రం గ్రాముల్లోనే రాస్తారు.
వెయ్యి గ్రాములు కలిపితే కేజీ అయినట్టుగా, ఒక గ్రామును తిరిగి వెయ్యి మిల్లీ గ్రాములుగా కూడా విభజిస్తారు.
అందుకే, బంగారు దుకాణాల్లో వస్తువులపై బరువు సంఖ్య 9.123 ఇలా వేస్తారు. ఇందులో చుక్క ముందు ఉన్నది గ్రాము, చుక్క తరువాత ఉన్నవి మిల్లీ గ్రాములు.
మొత్తంగా అంగడికి వెళ్లినప్పుడు గుర్తుంచుకోవాల్సిన లెక్క కాసు/సవర అంటే 8 గ్రాములు, తులం అంటే 10 గ్రాములు.

ఫొటో సోర్స్, Getty Images
భూమి కొలతలు ఇలా..
భూమి కొలతలు కూడా దేశమంతా రకరకాలుగా ఉన్నాయి. అందునా ఆంధ్ర-తెలంగాణల్లో కూడా ఎన్నో రకాల కొలతలు ఉన్నాయి.
హెక్టార్లు – చదరపు మీటర్ల కొలత
ఎకరం – సెంట్లు/గుంటలు/గ్రౌండ్లు/అంకణాల కొలత
ఎకరం – గజాలు/అడుగుల కొలత
ఈ మూడింటిలోనూ మొదటిది చట్టపరమైన మెట్రిక్ పద్ధతి కాగా, మిగతావి వాస్తవంగా ప్రజలు వేసుకునే లెక్కలు.
పట్టణ ప్రాంతాల్లో ఇంటి, వాణిజ్య స్థలాలను గజాలు, అడుగుల లెక్కల్లో కొలుస్తారు. ఇక పొలాలను ఎకరాల్లో కొలుస్తారు.
ఎకరం అందరికీ తెలుసు. కానీ ఆ ఎకరాన్ని విభజించే దగ్గర కోస్తా, సీమ, తెలంగాణల్లో రకరకాల కొలతలున్నాయి. ఇవన్నీ అర్థం కావాలంటే ముందు కొన్ని బేసిక్ పదాలు కూడా తెలియాలి.
ఒక అడుగు – 12 అంగుళాలు లేదా 30.48 సెంటీమీటర్లు
ఒక మీటరు – 100 సెంటీమీటర్లు
ఒక గజం పొడవు – 3 అడుగుల పొడవు
ఒక చదరపు గజం – 9 చదరపు అడుగులు (3X3 అడుగులు)
భూమి కొలత వేసేప్పుడు దేనిని అయినా చతురస్రంగా కొలుస్తారు. దాన్నే చతురం అని, నలు చతురం అని, చదరపు అని పిలుస్తారు. ఇంగ్లిష్‌లో స్క్వేర్ అంటారు. అంటే పొడవు X వెడల్పు గుణిస్తే భూమి విస్తీర్ణం వస్తుంది.
ఇప్పుడు అసలు కొలతల సంగతి చూద్దాం:

ఫొటో సోర్స్, Getty Images
కోస్తా ప్రాంతంలో..
ఇక్కడ భూమిని ఎకరాల్లో కొలుస్తారు. ఒక ఎకరానికి పది కుంచాలు, వంద సెంట్లు ఉంటాయి.
1 ఎకరా – 100 సెంట్లు
1 ఎకరా – 10 కుంచాలు
1 ఎకరా – 4,840 చదరపు గజాలు (స్థలాల లెక్క)
1 ఎకరా – 43,560 చదరపు అడుగులు (స్థలాల లెక్క)
1 సెంటు – 48.4 చదరపు గజాలు (స్థలాల లెక్క)
తెలంగాణలో..
ఇక్కడ భూమిని ఎకరాల్లో కొలుస్తారు. ఒక ఎకరానికి 40 గుంటలు.
1 ఎకరా – 40 గుంటలు
1 గుంట – 121 చదరపు గజాలు (స్థలాల లెక్క)
1 గుంట – 2.5 సెంట్లు (ఆంధ్ర, తెలంగాణ మధ్య అన్వయానికి ఇది అవసరం)
1 గుంట – 1,089 చదరపు అడుగులు (స్థలాల లెక్క)
రాయలసీమలో..
రాయలసీమలో కూడా ఎకరాల్లోనే భూమిని కొలుస్తారు. అయితే, ఈ ఎకరాలను అంకణాలుగానూ, తమిళనాడు సరిహద్దుల్లో గ్రౌండ్లు గానూ విభజిస్తారు.
1 ఎకరా – 605 అంకణాలు
1 అంకణం – 72 చదరపు అడుగులు
1 అంకణం – 8 చదరపు గజాలు
1 ఎకరా – 18.15 గ్రౌండ్లు
1 గ్రౌండ్ – 5.51 సెంట్లు
1 గ్రౌండ్ – 2,400 అడుగులు
అంకణా మరింత సులువుగా అర్థం చేసుకోవాలంటే, ఒక సెంటుకి 6.05 అంకణాలు.
అయితే, ఈ అంకణా కొలత కొన్ని ప్రాంతాల్లో వేర్వేరుగా వాడుకలో ఉన్నట్లుగా కూడా చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఒక అంకణాకు 36 చదరపు అడుగులే లెక్కించడం కూడా వాడుకలో ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
హెక్టార్లు, మీటర్ల లెక్క..
ప్రభుత్వం భూమి సేకరించేప్పుడు, ప్రభుత్వ అధికారిక ప్రతాల్లో ఈ హెక్టార్లను కూడా ఉపయోగిస్తారు. ఇది ప్రపంచం అంతా వాడే మెట్రిక్ పద్ధతి. కార్పొరేట్ సంస్థలు స్థలాన్ని లీజుకు తీసుకున్నప్పుడు కూడా ఈ లెక్కే వాడతారు.
1 హెక్టార్ – 10 వేల చదరపు మీటర్లు
1 మీటర్ – 100 సెంటీమీటర్లు (భూమి విషయంలో చదరపు సెం.మీ)
1 హెక్టార్ – 2.47 ఎకరాలు (2.4710 మరీ కచ్చితంగా)
1 ఎకరా – 4,047 చదరపు మీటర్లు
''నిజానికి ఈ లెక్కలు ఎలా వచ్చాయన్నది చరిత్రతో ముడిపడిన అంశం. ప్రస్తుతం భారతదేశంలో భూమి కొన్నప్పుడు రిజిస్ట్రేషన్ కూడా రాష్ట్రాన్ని, ప్రాంతాన్ని బట్టి మార్చి చేస్తుంటారు. ఇక ఆ భూమిని కొలత వేసేప్పుడు కొన్ని ప్రాంతాలు గొలుసు – లింకు వ్యవస్థ వాడతారు. కొన్ని చోట్ల మీటర్ టేపులు ఉపయోగిస్తున్నారు. భూమి పంచుకున్నప్పుడు, కొనేప్పుడు, అమ్మేప్పుడు అక్కడి స్థానిక కొలమానంతో పాటు మీటర్ల లెక్క కూడా పత్రాల్లో రాయిస్తే ఉపయోగకరంగా ఉంటుంది'' అని బీబీసీకి వివరించారు న్యాయవాది వెంకట రమణ.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














