ఆర్‌బీఐ రెపో రేటు తగ్గించినా.. బ్యాంక్‌లు ఎందుకు వడ్డీ రేట్లు తగ్గించడం లేదు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, నాగేంద్ర సాయి కుందవరం
- హోదా, బిజినెస్ అనలిస్ట్, బీబీసీ కోసం
ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించి రెండు వారాలు దాటింది. ఇక వడ్డీ రేట్లు తగ్గిపోయినట్టేనని అందరూ లెక్కలు వేశారు. కానీ, తగ్గట్లేదు. ఎందుకిలా జరుగుతోందని మనలో చాలా మంది అనుకుంటూ ఉంటారు.
ఇంతకీ వడ్డీ రేట్లు ఎప్పుడు తగ్గుతాయి? బ్యాంకులు ఎప్పటిలోపు వీటిని తగ్గిస్తాయి? వినియోగదారులకు ఎప్పటి నుంచి ఊరట లభిస్తుంది? ఒకవేళ మీ బ్యాంక్ వడ్డీ రేట్లు తగ్గించకపోతే ఏం చేయాలి?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఫిబ్రవరి మొదటివారంలో రెపో రేటును 6.5 శాతం నుంచి 6.25 శాతానికి తగ్గించింది.
ఆర్బీఐ నుంచి బ్యాంకులు తీసుకునే నిధులకు చెల్లించే వడ్డీ రేట్లను రెపో రేటుగా పిలుచుకుంటాం. ఫిక్స్‌డ్ డిపాజిట్ల పైన, రుణాల పైన ఈ రేటు ఆధారంగానే సాధారణంగా వడ్డీలు నిర్ణయమవుతాయి.
అయితే, అలా ఆర్బీఐ రేట్లు సవరణ చేసిన వెంటనే, బ్యాంకులు కూడా ఆ ప్రయోజనాన్ని మనకు కల్పిస్తాయి అని చెప్పలేం. వివిధ రుణాల్లో ఇలాంటి యూనిఫార్మిటీ ఉండదు.
సాధారణంగా వడ్డీ రేట్లను రెండుగా విభజించి చూడొచ్చు. ఒకటి ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేట్ (ఈబీఎల్ఆర్), రెండోది మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్ఆర్).

ఈబీఎల్ఆర్‌లో ఆర్బీఐ రెపో రేటు ఆధారంగా ప్రభుత్వ ట్రెజరీ బిల్స్, మార్కెట్ రేట్లు ఆధారపడి ఉంటాయి. వీటితో పాటు పర్సనల్ లోన్స్, హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎంఎస్ఎంఈ లోన్స్ వంటివి కూడా ఉంటాయి.
ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించినప్పుడు ఈ లోన్లన్నీ నేరుగా ప్రభావితమవుతాయి. ఇక్కడ బ్యాంకులు పూర్తిగా కాకపోయినా, కొద్దిగా అయినా వడ్డీ రేట్లు తగ్గించేందుకు ఆస్కారం ఉంటుంది.
అయితే, ఎంసీఎల్ఆర్‌లో సాధారణంగా కార్పొరేట్ లోన్స్, ఎస్ఎంఈ లోన్స్‌తో పాటు కొన్ని పర్సనల్ లోన్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది.
ఒకప్పుడున్న బేస్ రేట్ విధానాన్ని మార్చి ఆర్బీఐ 2016లో ఈ విధానాన్ని అమలు చేయడం ప్రారంభించింది.

ఫొటో సోర్స్, Getty Images
మార్జిన్ కాస్ట్ లెండింగ్ రేట్‌లో సాధారణంగా బ్యాంకుకూ, బ్యాంకుకూ మధ్య వ్యత్యాసం ఉంటుంది.
వాళ్లకు నిధులు లభించే రేటు ఆధారంగా ఈ వడ్డీని బ్యాంకులు తమ కస్టమర్లకు అందిస్తాయి. వీటినే కాస్ట్ ఆఫ్ ఫండ్స్, ఆపరేషనల్ కాస్ట్స్, టెనర్ ప్రీమియంగా చెప్తారు.
రెపో రేటును నిర్ణయించే అధికారం ఆర్బీఐ దగ్గర ఉన్నప్పటికీ, ఎంసీఎల్ఆర్ మాత్రం పూర్తిగా బ్యాంక్ అంతర్గత విధానాలపైనే ఆధారపడి ఉంటుంది.
సింపుల్‌గా చెప్పాలంటే ఆర్బీఐ నుంచి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఏదైనా లోన్ తీసుకోవడానికి, మరో చిన్న బ్యాంక్ లోన్ తీసుకోవడానికి చాలా తేడా ఉంటుంది కదా.
పెద్ద బ్యాంకుకు ఇచ్చే వడ్డీ రేటు, వాళ్లపైన ఉండే నమ్మకం.. వంటివి వేరు. ముఖ్యంగా చిన్న బ్యాంకులు, నిధుల కటకటను ఎదుర్కొంటున్న సంస్థలు కాస్త ఇబ్బందిపడతాయి. అందుకే ఆర్బీఐ రేట్ల సవరణ చేసిన వెంటనే, వీళ్లు తక్షణమే తగ్గించే అవకాశాలు లేవు.
ఫిక్స్‌డ్ Vs ఫ్లోటింగ్ :
మన దగ్గర సాధారణంగా బ్యాంకులు రెండు రకాల వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తాయి. ఒకటి ఫిక్స్‌డ్, మరొకటి ఫ్లోటింగ్. ఫిక్స్‌డ్‌లో పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్ లోన్స్, ఆటో లోన్స్ వంటివి ఉంటాయి. ఆర్బీఐ వడ్డీ రేట్లు మార్చినా వీటిలో మాత్రం మార్పులుండవు. లోన్ తీసుకున్నప్పుడు నిర్ణయించిన వడ్డీనే ఆఖరిదాకా ఉంటుంది.
అయితే, హౌసింగ్ లోన్ల విషయంలో మాత్రం కొంత మార్పు ఉంటుంది. ఒకవేళ ఫిక్స్‌డ్ హౌసింగ్ లోన్ అయినా అది రెండు, మూడేళ్లు మాత్రమే ఉంటుంది. మళ్లీ ఆ రోజు మార్కెట్ ఆధారంగానే వడ్డీ రేటు నిర్ణయమవుతుంది.
అదే ఫ్లోటింగ్ రేట్ అయితే మాత్రం మారుతూ ఉంటుంది. ఆర్బీఐ నిర్దేశించే రెపో రేటు లేదా ఎంసీఎల్ఆర్ ఆధారంగా ఇవి మారుతూ ఉంటాయి. హోమ్ లోన్స్, బిజినెస్ లోన్స్, కార్పొరేట్ లోన్స్ వంటివి ఈ కేటగిరీ కిందికి వస్తాయి. ఆర్బీఐ వడ్డీరేట్లు తగ్గిస్తే, ఇవి కూడా తగ్గుతాయి. ఫ్లోటింగ్ రేట్లకు సెన్సిటివిటీ ఎక్కువ.

ఫొటో సోర్స్, Getty Images
ఫ్లోటింగ్ రేటు ఉన్నా ఎందుకు ఈఎంఐలు తగ్గడం లేదు?
సాధారణంగా ఫ్లోటింగ్ రేట్లు అన్నీ రెపో రేటుకు లింకై ఉన్నప్పటికీ ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ కావు. ఎందుకంటే ఇవి మార్చడానికి ఒక నిర్దిష్ట సమయాన్ని బ్యాంకులు నిర్దేశించుకుంటాయి.
ఉదాహరణకు మూడు నెలలకోసారి, ఆరు నెలలకోసారి ఇంటర్వెల్స్ సెట్ చేసుకుంటాయి. అప్పుడు మాత్రమే మారుస్తూ ఉంటాయి.
ఉదాహరణకు మీ హోమ్ లోన్ రెపో రేట్‌తో లింక్ అయి, ఆరు నెలల రీసెట్ పీరియడ్ ఉందనుకుందాం. మార్చి నెలలో రేట్ కట్ జరిగినా, జూన్‌లో మాత్రమే మీకు ఈఎంఐల్లో మార్పు కనిపిస్తుంది. జనవరి, జూన్ నెలలను మనం రీసెట్ మంత్స్‌గా భావిస్తే ఇలా జరుగుతుంది.
ఉదాహరణకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కొన్ని ఖాతాలకు వడ్డీ రేటు రీసెట్ తేదీని ఏప్రిల్ ఒకటో తేదీగా నిర్ణయించింది. ఏప్రిల్ నెలలో 9.25 శాతంగా ఉన్న హౌసింగ్ లోన్ ఖాతాలకు 8.95 శాతం వడ్డీని వసూలు చేయబోతున్నట్టు రుణగ్రహీతలకు వెబ్‌సైట్ ద్వారా సమాచారం అందించింది ఈ బ్యాంక్.
ఇక ఎంసీఎల్ఆర్‌తో లింక్ అయిన వడ్డీ రేట్లు మరికొంత ఆలస్యంగా రేట్లను సవరిస్తాయి. అందుకే ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించినా, తక్షణమే ఆ ప్రభావం మనకు కనిపించదు.
ఆర్బీఐ ప్రకటన తర్వాత ఈ మధ్యే ఎస్‌బీఐ తన ఈబీఎల్ఆర్, రెపో రేట్ లెండింగ్ రేట్లను సవరించింది. అయితే ఎంసీఎల్ఆర్, బెంచ్ మార్క్ ప్రైమ్ లెండింగ్ రేట్లు మాత్రం యధాతథంగా ఉంచింది.
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర సహా కొన్ని బ్యాంకులు రేట్లను కొద్దిగా తగ్గించినా, ఇంకా చాలా బ్యాంకులు తమ ఖాతాదారులకు ఈ వడ్డీ తగ్గింపు ప్రయోజనాన్ని ఇవ్వాల్సి ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
వడ్డీ రేట్ల భారం ఎలా తగ్గించుకోవాలి?
మీ లోన్ ఎందులో ఉందో చెక్ చేయండి
దీనికి మీరు చేయాల్సిందల్లా మీ లోన్ అగ్రిమెంట్ చెక్ చేసుకోవడమే. మామూలుగా హౌసింగ్ లోన్లు వంటివి ఇరవై, ఇరవై ఐదేళ్లపాటు ఉంటాయి.
ఎప్పుడో లోన్ తీసుకున్న వాళ్లకు బేస్ రేట్ కిందో, ఎంసీఎల్ఆర్ కిందో లోన్ మంజూరై ఉంటుంది. ఇప్పుడు కూడా వాటికిందే ఈఎంఐల ప్రాసెసింగ్ ఉంటుంది. మీకు మీరు చొరవ తీసుకుని మార్చుకోకపోతే బ్యాంకులు వాటిని పాత రేట్ల కిందే ఉంచేస్తాయి.
అందుకే మీ లోన్ ఎంసీఎల్ఆర్‌లో ఉందా, రెపో రేట్‌కు లింక్ అయి ఉందా, ప్రైమ్ లెండింగ్ రేట్‌లో ఉందా అనేది కచ్చితంగా చూడండి.
ఒక వేళ మీ లోన్ ఎంసీఎల్ఆర్‌కో, ప్రైమ్ లెండింగ్‌కో లింక్ అయి ఉంటే, బ్యాంకును రిక్వెస్ట్ చేసి మీ లోన్‌ను రెపో లింక్డ్ రేట్‌కు మార్చుకోండి.
ఇందుకోసం బ్యాంకులు కొంత మొత్తాన్ని కన్వర్షన్ ఫీజుగా తీసుకుంటాయి. అయితే ఈ కన్వర్షన్ మీకు సుదీర్ఘ కాలంలో కొన్ని లక్షలు మిగిల్చే అవకాశం ఉంది.
ఇతర బ్యాంకుల వడ్డీ రేట్లు చెక్ చేయండి
వివిధ బ్యాంకులు ఆఫర్ చేస్తున్న వడ్డీ రేటు ఎంత, మీ బ్యాంక్ ఎంత వడ్డీకి ఇస్తోందో చెక్ చేయండి.
ఒక వేళ మీ లోన్ ఎక్కువ వడ్డీ రేటుతో ఉంటే ఇతర బ్యాంకులకు లోన్ ట్రాన్స్‌ఫర్ చేసే ఆప్షన్ చెక్ చేయండి. ప్రాసెసింగ్ ఫీజు, మొత్తంగా ఎంత వడ్డీ తగ్గుతుందో తెలుసుకున్న తర్వాత ఒక నిర్ణయం తీసుకోండి.
సిబిల్ బాగుంటే వడ్డీ రేటు తగ్గొచ్చు
కొన్ని బ్యాంకులు మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న కస్టమర్లకు మార్జిన్స్ విషయంలో సడలింపులు ఇస్తాయి. కొంత బెస్ట్ ప్రైస్‌కు లోన్లు లభించే అవకాశం ఉంటుంది.
అందుకే మీ సిబిల్ స్కోర్ బాగుంటే, మీకు తక్కువ వడ్డీకే హౌసింగ్ లోన్ మరో బ్యాంకుకు మార్చుకోవచ్చు. ఇక్కడ మీ బేరమాడే శక్తి కూడా కీలకం.
పార్షియల్ పేమెంట్స్ చేసుకోండి
మీ దగ్గర ఏదైనా కొంత మొత్తం (సర్‌ప్లస్ మనీ) ఉంటే, దాంతో లోన్‌ను త్వరగా చెల్లించే ప్రయత్నం చేయండి.
పార్షియల్ పేమెంట్స్ చేసి మీ వడ్డీ భారాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి.

ఫొటో సోర్స్, Getty Images
తర్వాత ఏంటి?
సుమారు ఐదేళ్ల తర్వాత మనం మళ్లీ డౌన్‌వర్డ్ ఇంట్రెస్ట్ రేట్ సైకిల్‌లోకి వెళ్లే అవకాశాలున్నాయి.
ఈ మధ్యే పావుశాతం వడ్డీ రేట్లను తగ్గించిన ఆర్బీఐ, మరోసారి కూడా ఇలా తగ్గించే అవకాశాలున్నట్టు వారి మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ మినిట్స్‌ను బట్టి చూస్తే అర్థమవుతుంది.
అందుకే ఇక నుంచి కూడా కొద్దిగా వడ్డీ రేట్లు తగ్గే అవకాశాలున్నాయి.
కాబట్టి మీ హౌసింగ్ లోన్‌ను ఏ విధానంలో ప్రాసెస్ చేశారో చెక్ చేసుకోండి. ఈబీఎల్ఆర్, రెపో లింక్డ్ లేకపోతే వెంటనే వాటిని మార్చుకునే ప్రయత్నం చేయండి.
కొత్తగా ఇప్పుడు ఎవరైనా హౌసింగ్ లోన్ తీసుకుంటూ ఉంటే, వాటిని ఫ్లోటింగ్ పద్ధతిలో తీసుకోండి.
(గమనిక: ఇది అవగాహన కోసం మాత్రమే. నిర్ణయం తీసుకునే ముందు ఆర్థిక నిపుణులను సంప్రదించండి)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














