ఎర్రచందనం కూలీలా? భక్తులా? ఏనుగుల దాడిలో చనిపోయింది ఎవరు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, తులసీ ప్రసాద్ రెడ్డి నంగా
- హోదా, బీబీసీ కోసం
ఫిబ్రవరి 25 మంగళవారం వేకువజామున శేషాచలం అటవీ ప్రాంతంలోని ఓబులవారిపల్లి మండలం గుండాలకోన దగ్గర ఏనుగుల దాడిలో ముగ్గురు చనిపోగా, నలుగురు గాయపడ్డారు.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం ఉర్లగట్టుపోడుకు చెందిన వంకాయల దినేశ్, కన్నెగుంటకు చెందిన తిరుపతి చంగల్రాయులు, మణెమ్మలు చనిపోయారు.
ఉర్లగట్టుపోడు అరుంధతివాడకు చెందిన పలిగల రాజశేఖర్ అలియాస్ గని, వెంకట సుబ్బయ్య, వెంకటరత్నమ్మ, కన్నెగుంటకు చెందిన అమ్ములు గాయపడ్డారు.
రాజశేఖర్‌కు రెండు కాళ్లూ విరిగాయి. ఆయన్ను తిరుపతిలోని ఓ ఆస్పత్రికి తరలించారు.


అసలేం జరిగింది?
పోలీసులు, స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం కన్నెగుంట గిరిజన కాలనీకి చెందిన సుమారు 30 మంది సోమవారం రాత్రి 8 గంటల సమయంలో గ్రామం నుంచి బయల్దేరారు.
26న శివరాత్రి సందర్భంగా తలకోనలోని శివాలయానికి వాళ్లు కాలినడకన బయలుదేరారని స్థానిక మీడియా పేర్కొంది.
ఓబులవారిపల్లి మండలం గుండాలకోన సమీపంలో వీళ్లపై ఏనుగులు దాడి చేయడంతో ముగ్గురు చనిపోయారు.
తలకోనలోని శివాలయానికి వెళ్లడానికి బస్సు సౌకర్యం ఉంది. కానీ, కొందరు నడిచివెళ్లి దేవుడిని దర్శించుకుంటారని స్థానికులు చెప్పారు.

ఫొటో సోర్స్, UGC
బాధితులు ఏం చెప్పారు?
ఈ ఘటన ఎలా జరిగిందో తెలుసుకోడానికి ఈ గ్రామానికి బీబీసీ వెళ్లింది. బాధిత కుటుంబాలతో మాట్లాడింది. ఏనుగుల దాడి సమయంలో ఎదురైన అనుభవాన్ని భార్యను కోల్పోయిన తుపాకుల సిద్ధయ్య వివరించారు.
''మేం రాత్రి పన్నెండున్నర సమయంలో అడవిలోని ఓ ప్రాంతానికి వెళ్లాం. అక్కడ అందరం తెచ్చుకున్న భోజనాలు తిన్నాం. దారి తప్పడంతో లైట్ వేసుకొని ఆ దారిలోకి వెళ్దాం అనుకున్నాం. మమ్మల్ని తీసుకువెళ్లిన వ్యక్తి ఏమీ చెప్పకపోవడంతో అతనికి దారి తెలుసనుకుని మేం ఆయన వెనకే వెళ్లాం.
పోయిన వ్యక్తి గమ్మున ఉండకుండా క్యారియర్ తీసుకొని శబ్దం చేశాడు. అతనికి ఏనుగులు ఉన్నాయని అర్థమైంది. మాకు అది చెప్పుంటే, కూర్చోకుండా వెళ్లిపోయేవాళ్లం. కానీ, అతను వెళ్తూ వెళ్తూ క్యారియర్ తీసి మూడుసార్లు శబ్ధం చేశాడు.
అవి నా భార్య వెనకే ఉన్నాయి. ఒకేసారి గుంపుగా వచ్చి ఆమెను కొట్టాయి. అతను ముందుకు వెళ్లి పొదల్లో దూరేశాడు. నేను అక్కడే ఉన్న పెద్ద చెట్టుకు ఆనుకున్నా. నా పక్కనే లైట్ వేసుకుంటూ వెళ్తున్న అతడ్ని రెండు ఏనుగులు తొక్కి చంపేశాయి. మూడు మూడున్నరకి పైనుంచి అరుపులు వినిపించాయి. అప్పుడు నేను కూడా బతికే ఉన్నా, రండి.. అని పిలిచాను.
తాగేదానికి నీళ్లు లేవు, గొంతు ఆరిపోయింది. ఇక్కడ నుంచి బయలుదేరితే చచ్చిపోతాం అనుకున్నాం. అందుకనే తెల్లవార్లూ అక్కడే కూర్చొని అందరూ వచ్చిన తర్వాత వచ్చాం.'' అని సిద్ధయ్య బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, UGC
ఏనుగుల దాడి సమయంలో ఏం చేయాలో తమకు దిక్కుతోచలేదని కన్నెగుంట గ్రామస్థుడు శ్రీను వివరించారు.
''ఏనుగులు ఏ పక్క నుంచి వస్తున్నాయో మాకు తెలీలేదు. నా భార్య, చిన్న పిల్లలు ఉన్నారు. నాకసలు దిక్కు తోచలేదు. రెండువైపులా ఏనుగులు ఉన్నాయి. మేం పోయినా ఫర్వాలేదు, పిల్లలైనా బతకాలని వారిని ఎత్తుకున్నా. నా భార్య పక్కకు వెళ్లింది. అప్పటికే ఏనుగులు కొందర్ని తొక్కేశాయి. దాదాపు గంటన్నరసేపు తొక్కుతూనే ఉన్నాయి'' అని ఏనుగుల దాడి నుంచి తప్పించుకున్న శ్రీను చెప్పారు.
సుమారు 30 ఏనుగుల వరకు తమపై దాడి చేశాయని శ్రీను బీబీసీతో చెప్పారు.

భక్తులా? ఎర్రచందనం కూలీలా?
ఏనుగుల దాడిలో గాయపడిన వారు, చనిపోయిన వారు ఎవరనే దానిపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి.
గ్రామస్థులను తన సొంత ఖర్చులతో అడవి మార్గం గుండా తలకోనకు తీసుకెళ్లిన వ్యక్తి పలిగల రాజశేఖర్ అలియాస్ గని అని, ఆయన కూడా ఏనుగుల దాడిలో గాయపడ్డారని పోలీసులు చెబుతున్నారు.
ఆయనపై ఎర్రచందనం కేసులు ఉన్నాయని అన్నమయ్య జిల్లా ఏఎస్పీ వెంకటాద్రి బీబీసీతో చెప్పారు. రాజశేఖర్ తండ్రి సిద్ధయ్య కూడా ఎర్రచందనం అక్రమ రవాణా కేసుల్లో నిందితుడని పోలీసులు అంటున్నారు.
"వద్దంటున్నా వీళ్లు ఆ పనికి ఎందుకు వెళ్లారు?" అని కొందరు గ్రామస్థులు చర్చించుకోవడం బీబీసీ స్వయంగా గమనించింది. ఏ పనికి వెళ్లారని బీబీసీ ప్రశ్నించగా... వారిని ఎర్ర చందనం చెట్లు కొట్టడానికి తీసుకెళ్తుంటారని కొందరు చెప్పారు.
బీబీసీ ఈ విషయాన్ని స్వయంగా నిర్ధరించలేదు. వీళ్లు ఎర్రచందనం కోసమే అడవిలోకి వెళ్లారా లేక గుడికి వెళ్తున్నారా అనే అంశంపై విచారణ చేస్తామని పోలీసులు బీబీసీతో చెప్పారు.

అనుమతి లేకుండా అడవిలోకి వెళ్లడం నేరమన్న రాజంపేట డీఎఫ్ఓ జగన్నాథ్ సింగ్.. వారికి ఎర్ర చందనంతో సంబంధం లేదని, వెళ్లినవారిలో పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి భక్తులే కావచ్చని అన్నారు.
గ్రామస్థులను తీసుకువెళ్లిన రాజశేఖర్, ఆయన తండ్రిపై ఎర్ర చందనం కేసులు ఉండడంతో ఆ కోణంలోనూ తాము దర్యాప్తు చేస్తామని ఏఎస్పీ వెంకటాద్రి చెప్పారు.
కోడూరు సీఐ వెంకటేశ్వర్లు కూడా ఇదే చెప్పారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యం ఉన్న రాజశేఖర్ తన సొంత ఖర్చులతో గ్రామస్థులను తీసుకెళ్లడంపై విచారణ చేపడతామన్నారు.
''అదంతా ఎర్ర చందనం ఉండే ఏరియా. ప్రతి సంవత్సరం పగటి పూట వెళ్లేవారని మాకు సమాచారం. ఈసారి వాళ్లు అటవీశాఖ నుంచి అనుమతి తీసుకోకుండా గ్రూపుగా ఏర్పడి తలకోనకు వెళ్లారని మా ప్రాథమిక విచారణలో తేలింది. వారు దర్శనానికి పోతున్నారని తెలిసింది. అటవీశాఖ వారి సమన్వయంతో అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి దీని వెనక ఏముందో తెలుసుకుంటాం'' అని చెప్పారు.

ఫొటో సోర్స్, APDeputyCMO/X
పవన్ కల్యాణ్ ఏమన్నారు?
ఈ ఘటనపై పవన్ కల్యాణ్ అసెంబ్లీలో మాట్లాడారు.
''వాళ్లు నార్మల్ రూటు వాడలేదు. షార్ట్ కట్ అంటూ ఏనుగులు ఉన్నవైపు వెళ్లారు. గున్న ఏనుగు ఉంటే దాన్ని పంపించేయడానికి అరిస్తే.. మిగతా పెద్ద ఏనుగులు వచ్చి దాడి చేశాయి. నిర్దేశించిన రహదారిలోనే ప్రజలు వెళ్లాలి'' అని అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














