పక్క సీట్లో శవంతో విమాన ప్రయాణం - విహార యాత్రకు వెళ్తున్న జంటకు ఎదురైన అనుభవం

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మాయియా డేవిస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఖతార్ ఎయిర్ వేస్ విమానంలో తాము కూర్చున్న సీటు పక్కనే ఓ మృతదేహాన్ని ఉంచారంటూ తమకు ఎదురైన అనుభవాన్ని ఓ ఆస్ట్రేలియన్ జంట మీడియాకు వెల్లడించింది.
వెనిస్‌లో తమ హాలిడే గడిపేందుకు మిషెల్ రింగ్, జెన్నిఫర్ కోలిన్‌లు మెల్‌బోర్న్ నుంచి దోహా వెళ్లే విమానం ఎక్కారు. ఆ ప్రయాణంలో తమ పక్కన కూర్చున్న ఓ మహిళ విమానంలోనే మరణించారని వారు ఆస్ట్రేలియాకు చెందిన ‘చానల్ 9’తో చెప్పారు.
ఆమె చనిపోయిందని చెప్పిన తర్వాత విమానంలో సిబ్బంది ఆమెపై ఒక దుప్పటి కప్పారని, విమానంలో వేరే సీట్లు ఖాళీగా ఉన్నప్పటికీ అందులో కూర్చునేందుకు తమను అనుమతించలేదని మిషెల్ రింగ్ తెలిపారు.
దాంతో తాము నాలుగు గంటల పాటు మృతదేహం పక్కనే కూర్చుని ప్రయాణించాల్సి వచ్చిందని అన్నారు.
కాగా ఆ జంటకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెబుతూ ఖతార్ ఎయిర్ వేస్ ప్రకటన జారీ చేసింది. తాము వారిని సంప్రదించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపింది.
అయితే తమను ఖతార్ ఎయిర్‌వేస్ కానీ, తాము టిక్కెట్లు బుక్ చేసిన ఖాంటాస్ సంస్థ సంప్రదించలేదని, తమకు ఎలాంటి మద్దతు అందించలేదని ఆ జంట ఆరోపించింది.
ఇలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు విమానంలో ఉన్న ప్రయాణికుల విషయంలో అనుసరించాల్సిన నియమావళిని ఏర్పాటు చేయడం అవసరం అని రింగ్, కోలిన్ అభిప్రాయపడ్డారు.

ఖాళీ సీట్లున్నా నన్ను కూర్చోనివ్వలేదు
మహిళ పడిపోగానే సిబ్బంది చాలా త్వరగా స్పందించారని అయితే దురదృష్టత్తువశాత్తూ ఆమెను కాపాడలేకపోయారని రింగ్.. ‘చానల్ 9’ కరెంట్ అఫైర్స్ కార్యక్రమంలో చెప్పారు. ఆ పరిస్థితి చూడటానికి హృదయ విదారకంగా ఉందన్నారు.
విమానంలో సిబ్బంది ఆమె మృతదేహాన్ని బిజినెస్ క్లాస్ వైపు తీసుకు వెళ్లేందుకు ప్రయత్నించారని అయితే "భారీ కాయం కావడంతో సీట్లో నుంచి కదిలించడానికి వీలు కాలేదు" అని రింగ్ చెప్పారు.
విమానంలో ఖాళీ సీట్లు ఉన్న విషయాన్ని తాను సిబ్బంది దృష్టికి తెచ్చినట్లు రింగ్ చెప్పారు.
"మీరు పక్క సీట్లోకి వెళతారా అని అడిగారు. అప్పుడు నేను నాకు ఎలాంటి సమస్య లేదని చెప్పాను"
"నేను పక్క సీట్లోకి వెళ్లగానే వాళ్లు అంతవరకు నేను కూర్చున్న సీట్లో ఆమె మృతదేహాన్ని ఉంచారు"
కోలిన్ ఖాళీగా ఉన్న మరో సీట్లోకి వెళ్లి కూర్చున్నారు.
అయితే ఖాళీ సీట్లు ఉన్నప్పటికీ క్యాబిన్ క్రూ తనకు అలాంటి అవకాశం ఇవ్వలేదని రింగ్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఆమె చనిపోయిన నాలుగు గంటల తర్వాత విమానం ల్యాండయింది. అయితే వైద్య సిబ్బంది, పోలీసులు వచ్చే వరకు ప్రయాణికులంతా విమానంలోనే ఉండాలని క్యాబిన్ క్రూ వారితో చెప్పారు.
విమానంలోకి వచ్చిన అంబులెన్స్ అధికారులు మహిళ మొహంపై కప్పిన దుప్పటిని తొలగించారని, అప్పుడు ఆమె మొహం చూసినట్లు రింగ్ చెప్పారు.
ప్రయాణికులు, సిబ్బందికి విధి నిర్వహణలో భద్రత అవసరం అని ఆ దంపతులు అభిప్రాయపడ్డారు.
"మీకు ఏదైనా సాయం కావాలా? మీరు కౌన్సిలింగ్ తీసుకుంటారా అని మమ్మల్ని సంప్రదించి ఉండాల్సింది. ఎందుకంటే అది చాలా భయంకరమైన అనుభవం" అని కోలిన్ చెప్పారు.
"ఆ మహిళ మరణానికి విమానయాన సంస్థ కారణం కాదని మాకు తెలుసు. అయితే విమానంలో ఉన్న ప్రయాణికులను పట్టించుకునేందుకు ఒక నియమావళి ఉండాలి కదా" అని ఆమె అన్నారు.
"విమానంలో మరణించిన మహిళ కుటుంబం గురించి మేం ఆలోచిస్తున్నాం. ఈ సంఘటనతో ఆ దంపతులకు జరిగిన అసౌకర్యం, ఆవేదనకు చింతిస్తున్నాం. మా విధి విధానాల ప్రకారం వారిని సంప్రదించే ప్రయత్నం చేస్తున్నాం" అని ఖతార్ ఎయిర్ వేస్ ఓ ప్రకటనలో తెలిపింది.
"విమానంలో జరిగే ఇలాంటి సంఘటనలను విమాన నిర్వహణ సంస్థ ఖతార్ ఎయిర్ వేస్ చూసుకుంటుంది" అని ఖాంటాస్ అధికార ప్రతినిధి చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














