‘ఇతరుల అభివృద్ధి కోసం మేం మునిగిపోవాలా?’ - నదుల అనుసంధానానికి వ్యతిరేకంగా రోడ్డెక్కిన ప్రజలు

- రచయిత, విష్ణుకాంత్ తివారి
- హోదా, బీబీసీ ప్రతినిధి
లక్షల కోట్ల విలువైన నదుల అనుసంధాన ప్రాజెక్టుకు వ్యతిరేకంగా మధ్యప్రదేశ్‌లో వేల మంది ప్రజలు రోడ్డెక్కారు. ఈ ప్రాజెక్ట్ వల్ల తమ ఇళ్లను, జీవనోపాధిని కోల్పోతామని వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
కేన్-బేత్వా ప్రాజెక్టును రూ. 440 వందల కోట్లతో చేపడుతున్నారు. ఈ ప్రాజెక్టుతో మధ్యప్రదేశ్‌లోని కేన్ నది నుంచి మిగులు జలాలను సొరంగాలు, కాలువలు, డ్యామ్ ద్వారా పక్కనున్న ఉత్తరప్రదేశ్‌లోని బేత్వా నదిలోకి తరలిస్తారు.
1980ల్లో జలవనరుల అభివృద్ధి కోసం భారత్ నేషనల్ పర్‌స్పెక్టివ్ ప్లాన్ కింద తలపెట్టిన 16 ‘నదుల-అనుసంధాన ప్రాజెక్టు’లో ఇదే మొదటిది.
2021లో ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు అనుమతులను క్లియర్ చేసేంత వరకు పర్యావరణ ఆందోళనలు, రాజకీయ వివాదాలతో ఎన్నోసార్లు ఆలస్యమైంది. గత ఏడాది డిసెంబర్‌లోనే ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు.
కరవు ప్రభావిత బుందేల్‌ఖండ్ ప్రాంతానికి ఈ ప్రాజెక్టు సాయం చేయనుంది. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లో కొన్ని ప్రాంతాలను కలిపి బుందేల్‌ఖండ్ అంటారు.
వర్షాభావ పరిస్థితులు, అకాల వర్షాలు వంటివి ఈ ప్రాంతం దశాబ్దాలుగా పేదరికంలో మగ్గిపోవడానికి, అభివృద్ధికి నోచుకోకపోవడానికి కారణమయ్యాయి.

కేన్-బేత్వా ప్రాజెక్ట్ 2030 నాటికి పూర్తయితే 10 లక్షల హెక్టార్లకు పైగా భూమిలో వ్యవసాయానికి అవకాశమేర్పడుతుందని ప్రభుత్వం తెలిపింది.
అంతేకాకుండా 62 లక్షల మంది ప్రజలకు మంచినీటి సదుపాయాన్ని కల్పించవచ్చని, 130 మెగావాట్ల జలవిద్యుత్‌ను, సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేయొచ్చని చెబుతోంది.
అయితే, ఇక్కడ ఆనకట్ట వద్ద జలాశయం నిర్మాణంలో అత్యంత విలువైన అటవీ భూమితో పాటు కనీసం 10 గ్రామాల వరకు ముంపు బారిన పడతాయని, మరో 11 గ్రామాల ప్రజలు కాలువ నిర్మాణంతో నిరాశ్రయులు కానున్నారని జిల్లా అధికారులు చెప్పారు.
ప్రాజెక్ట్ వల్ల 7 వేలకు పైగా కుటుంబాలు ప్రభావితం కానున్నాయన్నది అధికారుల లెక్క.
''మా జీవనోపాధి పూర్తిగా ఈ భూమితోనే ముడిపడి ఉంది. భవిష్యత్ ఏంటో మాకు అర్థం కావడం లేదు.'' అని ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తున్న వేల మంది గ్రామస్థుల్లో ఒకరైన తులసి ఆదివాసీ చెప్పారు.
వీరిలో చాలామంది స్థానిక గోండు, కోల్ తెగలకు చెందినవారు. వీరు అడవుల పక్కన వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తుంటారు.
పన్నా టైగర్ రిజర్వుకు చెందిన సుమారు 98 చదరపు కిలోమీటర్ల ప్రాంతం.. 2009లో పులులు అంతరించిపోవడం నుంచి కాపాడిన 543 చదరపు కి.మీ.ల అభయారణ్యం కూడా ఈ ప్రాజెక్ట్ ముంపు ప్రాంతంలోకే వస్తుందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఎన్నో ఏళ్లుగా పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టిన ప్రయత్నాలను ఇది తుడిచివేయనుందని అంటున్నారు.
''ఇది అనూహ్యం. ఇంత పెద్ద మౌలిక సదుపాయాల ప్రాజెక్టు కోసం నేషనల్ పార్కులోని కీలకమైన ప్రాంతాన్ని వాడటం ముందెప్పుడూ చూడలేదు.'' అని పర్యావరణవేత్త అమిత్ భట్నాగర్ అన్నారు.
2019లో భారత అత్యున్నత న్యాయస్థానం ఏర్పాటు చేసిన నిపుణులతో కూడిన ఒక ప్యానల్ కూడా ఈ ప్రాజెక్టుపై ఆందోళనలు వ్యక్తం చేసింది. ప్రాజెక్ట్ ఆర్థిక సాధ్యాసాధ్యాలు, వన్యప్రాణులపై ప్రభావాన్ని ప్యానల్ ప్రశ్నించింది. నదీ పరివాహక ప్రాంతంలో ప్రత్యామ్నాయ నీటి విధానాలను ప్రభుత్వం అన్వేషించాలని సూచించింది.
భారత్‌లో నదుల అనుసంధాన ప్రాజెక్టులపై చేపట్టిన పలు అధ్యయనాలు కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తంచేశాయి.
ఈ ప్రాజెక్టుకు కావాల్సిన అన్ని రకాల పర్యావరణ అనుమతులను పొందినట్లు నేషనల్ వాటర్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ హెడ్ బాలేశ్వర్ ఠాకూర్ చెప్పారు.
''ప్రాజెక్ట్ వల్ల కోల్పోయే పులుల ఆవాసాల కోసం అదనపు భూమిని కేటాయించాం. అలాగే, ప్రాజెక్టు మూలంగా ప్రభావితమయ్యే ఇతర జీవులకు పునరావాసం కల్పించనున్నాం'' అని తెలిపారు.
ఈ ప్రాంతంలో జీవవైవిధ్యానికి ఈ ప్రాజెక్టు సవాలుగా మారనుందని ప్రభుత్వ అధికారులు సైతం అంగీకరిస్తున్నారు. కానీ, ఈ ప్రాజెక్టు ప్రయోజనాలు ప్రతికూల ప్రభావాలను అధిగమిస్తాయని చెబుతున్నారు.

''కేన్-బేత్వా ఆనకట్టను ప్రభుత్వం కడుతుంది. ఇది ఇతరులకు నీటిని అందిస్తుంది. కానీ, మమ్మల్ని ముంచేస్తుంది'' అని అంటూ దౌదన్ గ్రామానికి చెందిన 48 ఏళ్ల మహేశ్ ఆదివాసీ పాట రూపంలో తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు.
ఈ ప్రాంతంలో అత్యంత పేద ప్రాంతాల్లో దౌదన్ ఒకటి. రక్షిత మంచినీరు, విద్యుత్ వంటి కనీస సదుపాయాలు కూడా ఇక్కడ అందుబాటులో లేవు.
కనీసం తమ సొంత గ్రామానికి కరెంట్ ఇవ్వలేనప్పుడు, మరో 13 గ్రామాలకు విద్యుత్ అందించేందుకు తమల్ని ఎందుకు ఇళ్లను విడిచిపెట్టి వెళ్లమంటున్నారని అక్కడి ప్రజలు అడుగుతున్నారు.
''తరాలు తరాలు ఎలాంటి అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఇతరుల అభివృద్ధి కోసం ఇప్పుడు మా జీవితాలను త్యాగం చేయమంటున్నారు. మరి మా పరిస్థితి ఏంటి?'' అని మహేశ్ ప్రశ్నించారు.
పరిహారాల ప్రణాళికలో కూడా ప్రభుత్వం ఈ గ్రామస్థులకు ఆప్షన్స్‌ను అందిస్తుంది. అంటే రూ.7,50,000తో పాటు కొంత భూమిని లేదా రూ.12,50,000ను వన్ టైమ్ పేఅవుట్‌గా తీసుకోవచ్చని చెబుతోంది. ఎవరికైతే భూమి ఉంటుందో, వారి భూ విలువను లెక్కకట్టి అదనపు మొత్తం అందిస్తామని అంటోంది.
90 శాతం ప్రజలు వన్ టైం పే అవుట్ తీసుకునేందుకు మొగ్గు చూపారని ఠాకూర్ చెప్పారు. ''అదే సమయంలో, ఈ గ్రామస్థులకు పునరావాసం కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ భూములను చూడటం ప్రారంభించింది.'' అని తెలిపారు. అయితే, ప్రభుత్వం చాలీచాలని పరిహారాలను అందిస్తుందని స్థానికులు అంటున్నారు. తమ ఇంటికి రూ.46 వేలను లెక్కకట్టినట్లుగా ప్రభుత్వం ఇచ్చిన నోటీసును తులసీ ఆదివాసీ బీబీసీకి చూపించారు. ఈ మొత్తంతో ఎవరైనా ఇంటిని కట్టుకోగలరా?'' అని అడిగారు.

తామెప్పుడు ఖాళీ చేయాలి? ఎక్కడికి వెళ్లాలి? అనే దానిపై ఎవరూ తమకు చెప్పలేదని ఇతరులు అంటున్నారు. వారి భవిష్యత్‌లో ఎన్నో ఆందోళనలు ఉన్నాయన్నారు.
''ఈ ప్రాజెక్టు మా గ్రామానికి ఒక వరంలా ఉండాలి. కానీ, ఇది మా జీవితాలను మరింత చీకటిలోకి నెట్టేస్తుంది'' అని 20 ఏళ్ల లక్ష్మి ఆదివాసీ చెప్పారు.
కేన్ నది నుంచి మిగులు జలాలను ఉపయోగించేందుకే ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నారనే దానిపై కూడా పలు ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. 2003లోని డేటాపై ప్రభుత్వం ఆధారపడుతుందని, నదీ వార్షిక జలాలపై ఎలాంటి స్వతంత్ర పరిశీలన చేపట్టలేదని విమర్శకులు అంటున్నారు.
అయితే, ఈ ఆరోపణలను ఠాకూర్ కొట్టివేస్తున్నారు. ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వ అధికారుల వద్ద డేటా అంతా ఉందని అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














