వైఎస్ జగన్: అసెంబ్లీలో ఆ ఒక్కరోజు సంతకాన్ని హాజరుగా పరిగణించరా, అనర్హత వేటు పడుతుందా?

వైఎస్ జగన్, ఆంధ్రప్రదేశ్

ఫొటో సోర్స్, APCMO/FB

ఫొటో క్యాప్షన్, టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం మూడుసార్లు మాత్రమే వైఎస్ జగన్ అసెంబ్లీకి వచ్చారు.
    • రచయిత, గరికిపాటి ఉమాకాంత్‌
    • హోదా, బీబీసీ కోసం

మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఆ పార్టీ శాసన సభాపక్షనాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీ హాజరు విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన కేవలం మూడుసార్లు మాత్రమే అసెంబ్లీకి హాజరయ్యారు.

2024 జూన్‌లో అసెంబ్లీ కొలువుదీరగా తొలిరోజు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి, వెంటనే వెళ్లిపోయారు.

అదే ఏడాది, జూలైలో జరిగిన సమావేశాల తొలిరోజు గవర్నర్‌ ప్రసంగం మధ్యలోనే నిష్క్రమించారు.

తాజాగా 2025 ఫిబ్రవరి 24వ తేదీన ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్‌ ప్రసంగం మొదలుపెట్టిన పది నిమిషాలకే వైఎస్ జగన్ వెళ్లిపోయారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

సభలోకి వెళ్లే ముందే.. అక్కడ ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టేందుకు ఏర్పాటు చేసిన రిజిస్టర్‌లో వైఎస్‌ జగన్‌ సంతకం చేసి సభలోకి ప్రవేశించారు. గవర్నర్ ప్రసంగిస్తుండగానే ప్రతిపక్ష హోదా కోసం పట్టుబడుతూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నినాదాలు చేస్తూ సభలో నిరసనకు దిగారు. ఆ తర్వాత, వైఎస్సార్సీపీ సభ్యులు అందరినీ తోడ్కొని జగన్ సభ నుంచి వాకౌట్‌ చేశారు.

వాస్తవానికి, తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకుంటే శాసన సభకు వచ్చినా ప్రయోజనం లేదంటూ గత ఏడాది నవంబర్‌లో జరిగిన సమావేశాలను ఆయన బహిష్కరించారు.

'అసెంబ్లీ సమావేశాల సమయంలో మీడియా ముందుకొచ్చి మాట్లాడతాం. మీడియా సమక్షంలోనే ప్రతిపక్షంలా వ్యవహరిస్తూ చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీస్తాం'' అని మీడియా సమావేశంలో జగన్ చెప్పారు.

అయితే, వరుసగా 60 రోజుల పాటు అసెంబ్లీకి హాజరుకాకుంటే అనర్హత వేటు పడుతుందంటూ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు ఇటీవల పలుమార్లు వివిధ సందర్భాల్లో చెబుతూ వచ్చారు.

అందుకే, జగన్‌ సోమవారం అసెంబ్లీకి వచ్చి హాజరు వేయించుకుని వెళ్లారంటూ టీడీపీ నేతలు విమర్శించారు.

ఆ తర్వాత ఇప్పుడు, మరో కొత్త వాదన తెరపైకి వచ్చింది. గవర్నర్‌ ప్రసంగం రోజున వస్తే అది అసెంబ్లీకి హాజరుగా పరిగణించరనే చర్చ రాజకీయవర్గాల్లో మొదలైంది. దీనిపై కూడా టీడీపీ, వైఎస్సార్సీపీ పక్షాలు భిన్నవాదనలు వినిపిస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్, అసెంబ్లీ, యనమల

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, గవర్నర్‌ ప్రసంగం రోజు సంతకం తీసుకుంటారు కానీ, అది సెషన్స్‌కి హాజరుగా పరిగణించరని మాజీ స్పీకర్ యనమల చెబుతున్నారు.

అది సెషన్‌ కాదు.. హాజరుగా పరిగణించరు: యనమల

''ఉభయసభలను ఉద్దేశించి అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగం, లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగం సెషన్స్‌ కిందకు రావు. వాటికి సభ్యులు వచ్చినా హాజరుగా పరిగణించలేరు'' అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ శాసన సభకు గతంలో స్పీకర్‌గా పనిచేసిన మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు బీబీసీతో చెప్పారు.

''గవర్నర్‌ ప్రసంగం రోజున కూడా సంతకం తీసుకుంటారు కానీ, అది సెషన్స్‌కి హాజరుగా లెక్కలోకి తీసుకోరు'' అని ఆయన వివరించారు.

''వైఎస్‌ జగన్‌ సహా వైఎస్సార్‌సీపీ సభ్యులు సోమవారం నాడు సంతకాలు పెట్టినా అవి హాజరు కిందకు రాదు. మంగళవారం నుంచి జరిగే సభకు వచ్చుంటే దాన్ని మాత్రమే కచ్చితంగా హాజరు లేదా సిటింగ్‌ లెక్కలోకి తీసుకుంటారు'' అని యనమల చెప్పారు.

''సరైన కారణాలు లేకుండా వరుసగా 60 రోజులు అసెంబ్లీకి హాజరుకాకుంటే అనర్హత వేటు వేసే అవకాశం శాసన సభాపతికి ఉంటుంది. కానీ, ఒకవిధంగా చెప్పాలంటే ఇది అంత సులువైన ప్రక్రియ కాదు'' అన్నారు.

''సభ్యుడు అలా 60 రోజులు కంటిన్యూగా రాకుంటే సెలవు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ సెలవుకు కూడా సహేతుకమైన కారణాలు చెప్పాలి. తీవ్రమైన అనారోగ్యం, లేదంటే అత్యవసర పరిస్థితి కారణాలుగా చూపి సెలవుకు దరఖాస్తు చేయాలి. ఆ సెలవు లేఖను స్పీకర్‌కు లేదంటే శాసన సభ కార్యదర్శికి అందజేయాలి. ఆ విషయాన్ని సభలో ప్రవేశపెట్టాలి. లీడర్‌ ఆఫ్‌ హౌస్‌ అనుమతివ్వాలి, ఆ తర్వాత స్పీకర్‌ అనర్హత వేటుపై ప్రకటన చేయాలి'' అని వివరించారు యనమల.

అయితే, యనమల వాదనలతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ సమయంలో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా పనిచేసిన కోన రఘుపతి విభేదించారు.

కోన రఘుపతి, అసెంబ్లీ, ఆంధ్రప్రదేశ్

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, సభ్యుడు సభకి వచ్చి సంతకం పెట్టి వెళ్లారంటే హాజరైనట్టే అని మాజీ డిప్యూటీ స్పీకర్ రఘుపతి చెప్పారు.

అది హాజరు కిందకే వస్తుంది: కోన రఘుపతి

''వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ సహా 11 మంది వై‌సీపీ సభ్యులు సోమవారం నాటి గవర్నర్‌ ప్రసంగ సమావేశానికి వెళ్లడం హాజరు కిందకే వస్తుంది. అలా కాకుంటే సంతకం రిజిస్టర్ ఎందుకు పెట్టినట్టు? మా సభ్యులు సంతకం పెట్టేశారు, అటెండెన్సే లెక్క. అదే ప్రామాణికం. అక్కడితో అయిపోయింది.'' అని గత ప్రభుత్వ హయాంలో డిప్యూటీ స్పీకర్‌గా పనిచేసిన కోన రఘుపతి బీబీసీతో అన్నారు.

''మీరు సెషన్స్‌ పెడతారా.. గవర్నర్‌ ప్రసంగం పెడతారా? అనేది సంబంధం లేదు. సభ్యుడు సభకి వచ్చి సంతకం పెట్టి వెళ్లారంటే హాజరైనట్టే'' అని ఆయన అన్నారు.

''అసలు వాస్తవంగా చెప్పాలంటే, 60 రోజులు వరుసగా రాకుంటే సదరు సభ్యుడిపై అనర్హత వేటు వేయాలనే నిబంధనపైనే ఎక్కడా క్లారిటీ లేదు. సభ్యులు క్రమం తప్పకుండా రావాలనే ఉద్దేశంతో పెట్టిన నిబంధనే కానీ, ఇన్ని రోజులు రాకుంటే అనర్హత వేటు వేయాలనేదానిపై ఎక్కడా స్పష్టత లేదు. చాలా వెసులుబాట్లు ఉంటాయి'' అని రఘుపతి చెప్పారు.

అలాగే, మొత్తం శాసన సభ సభ్యుల్లో పది శాతం మంది ఎమ్మెల్యేలు ఉంటేనే ప్రతిపక్ష హోదా ఇవ్వాలనేది కూడా కచ్చితమైన నిబంధన ఏమీ కాదని ఆయన అన్నారు.

ఇదే విషయమై, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంను బీబీసీ సంప్రదించగా, తర్వాత మాట్లాడతానని ఆయన చెప్పారు.

రాజ్యాంగం

ఫొటో సోర్స్, Ministry of Law

ఆర్టికల్ 190(4) ఏం చెబుతోంది?

అసెంబ్లీ లేదా పార్లమెంటు సభ్యుడిని అనర్హుడిగా ప్రకటించేందుకు రాజ్యాంగం కొన్ని నిబంధనలు విధించింది. వాటిలో ద్వంద్వ సభ్యత్వంతో పాటు ఒక సభ్యుడు స్పీకర్ అనుమతి లేకుండా 60 రోజులపాటు సభకు హాజరుకాకపోతే అనర్హుడిగా ప్రకటించవచ్చని పేర్కొంది.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 190 (4) కింద ఒక రాష్ట్ర శాసన సభలోని సభ్యుడు 60 రోజులపాటు సభ అనుమతి లేకుండా అన్ని సమావేశాలకు గైర్హాజరైతే, సభ ఆ ప్రతినిధి సీటు ఖాళీ అయినట్టు ప్రకటించవచ్చని చెబుతోంది.

కానీ, ఆ 60 రోజుల కాలాన్ని లెక్కించేటప్పుడు సభ వరుసగా నాలుగు రోజులకు మించి వాయిదా పడిన కాలాన్ని, ప్రోరోగ్ అయిన కాలాన్ని పరిగణనలోకి తీసుకోకూడదని తెలియజేసింది.

ఆంధ్రప్రదేశ్, అసెంబ్లీ

ఫొటో సోర్స్, FACEBOOK/TDP.NCBN.OFFICIAL

ఫొటో క్యాప్షన్, సభ అనుమతి లేకుండా 60 రోజులు వరుసగా సభకు గైర్హాజరైతే ఆ సీటు ఖాళీ అయినట్టు ప్రకటించవచ్చని ఆర్టికల్ 190 (4) చెబుతోంది.

అసెంబ్లీ వర్గాలు ఏమంటున్నాయంటే..

''60 రోజులు వరుసగా హాజరుకాకుంటే సదరు సభ్యుడిపై అనర్హత వేటు వేయడమనే విషయం పూర్తిగా స్పీకర్‌ విచక్షణాధికారంపై ఆధారపడి ఉంటుంది'' అని తన పేరు మీడియాలో రాయడానికి ఇష్టపడని ఏపీ శాసన సభ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ అధికారి బీబీసీకి తెలిపారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 208 (1) ప్రకారం రూపొందించుకున్న శాసన సభ విధి విధానాల మేరకు, 2007 మార్చి 30న శాసన మండలి పునర్నిర్మాణం సందర్భంగా చేసిన సవరణలను కూడా ఈ సందర్భంగా ఉదహరించవచ్చని ఆయన పేర్కొన్నారు.

రూల్‌ 187లో పేర్కొన్న ఏపీ శాసన సభ విధాన నియమాల ప్రకారం.. సభలో సభ్యుల ఆమోదంతో, అసెంబ్లీ ఏకీభవించి నిర్ణయం తీసుకోవచ్చని చెప్పారు.

అనర్హత, హాజరు అంశాలపై శాసన సభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్‌తో మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నించింది. అయితే, ఆయన అందుబాటులోకి రాలేదు.

మంత్రి అందుబాటులోకి వస్తే, ఆయన చెప్పిన వివరాలు ఈ కథనానికి జోడిస్తాం.

వైఎస్ జగన్, ఆంధ్రప్రదేశ్, అసెంబ్లీ

ఫొటో సోర్స్, APLEGISLATURE.ORG/YSJagan/FB

ఫొటో క్యాప్షన్, సభ్యుడిపై అనర్హత వేటు చాలా పెద్ద వ్యవహారమని సీనియర్ న్యాయవాది చెప్పారు.

అదంత సులువు కాదు..

అయితే, ఒక సభ్యుడిపై అనర్హత వేటు వేయడం అంత సులువు కాదని సీనియర్ న్యాయవాది ఒకరు బీబీసీతో చెప్పారు.

''వరుసగా 60 రోజులు సభకు రాని సభ్యుడి సభ్యత్వం రద్దు చేయవచ్చు అని చట్టంలో ఉంది. సభకు రాకపోతే ముందస్తు అనుమతి తీసుకోవాలి. కానీ, అది తీవ్ర అనారోగ్యం, అత్యవసర పరిస్థితులకు మాత్రమే వర్తిస్తుంది.''

''కానీ, నిజంగా ఒక సభ్యుడిని అలా తొలగించాలంటే చాలా పెద్ద కాంప్లెక్స్ వ్యవహారం ఉంది. చాలా కష్టమైన ప్రక్రియ అది. పైగా, అసలు అన్ని రోజులు సభ జరగడం కూడా పెద్ద విషయం'' ఆయన బీబీసీతో చెప్పారు.

'ఈ తీరు సరికాదు'

''అసెంబ్లీ సమావేశాలను ఇప్పుడు జగన్‌ బహిష్కరించడం.. గతంలో ఏ కారణాలతోనైనా, చంద్రబాబు బహిష్కరించడం సరైన పద్ధతి కాదు.. ఈ పోకడలు ప్రజాస్వామ్య పతనానికి నాంది. ప్రజా తీర్పును శిరసావహించాలి కదా'' అని సీనియర్‌ జర్నలిస్ట్ గాలి నాగరాజు అభిప్రాయపడ్డారు.

''ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక సభలకు గైర్హాజరు కావడం, అనర్హత వేటు పడుతుందనే భయంతో లాంఛనంగా వెళ్లిరావడం, ఏ పార్టీ వాళ్లైనా.. ఈ విధానం సరికాదు'' అన్నారాయన.

''బయట చేసే నిరసనకు, చట్టసభల్లో వ్యక్తం చేసే నిరసనకు తేడా ఉంటుంది'' అని నాగరాజు అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)