దిల్లీ అల్లర్లకు అయిదేళ్లు: బాధితులకు న్యాయం జరిగిందా, దోషులకు శిక్ష పడిందా?

దిల్లీలో అల్లర్లు
ఫొటో క్యాప్షన్, దిల్లీ అల్లర్ల సమయంలో షాదాబ్ ఆలమ్ జైలుకు వెళ్లారు. నాలుగేళ్ల తర్వాత కోర్టు ఆయనను విడుదల చేసింది
    • రచయిత, ఉమంగ్ పొద్దార్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

న్యూదిల్లీలో మతపరమైన అల్లర్లు జరిగి అయిదేళ్లు గడిచాయి. ఈలోగా ఈ అల్లర్లకు సంబంధించిన 80 శాతానికి పైగా కేసుల్లో పలువురు నిర్దోషులుగా బయటకు వచ్చారు.

2020లో దిల్లీలో జరిగిన మతపరమైన హింస, గత 30 ఏళ్ల కాలంలో దేశ రాజధానిలో సంభవించిన అత్యంత దారుణమైన అల్లర్లుగా నిలిచాయి.

ఆ ఏడాది ఫిబ్రవరిలో నాలుగు రోజుల పాటు సాగిన ఈ అల్లర్లలో 53 మంది చనిపోయారు. మృతుల్లో 40 మంది ముస్లింలు, 14 మంది హిందువులు ఉన్నారు.

ఈ అల్లర్లకు ప్రణాళిక రచించారని ఆరోపిస్తూ విద్యార్థి నాయకులు, కార్యకర్తలు ఉమర్ ఖాలిద్, షార్జీల్ ఇమామ్ సహా మరో 16 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. 2019లో తీసుకొచ్చిన వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నెల రోజుల పాటు భారీగా జరిగిన నిరసనల నేపథ్యంలో వారు ఈ అల్లర్లలో పాలుపంచుకున్నట్లు పోలీసులు ఆరోపించారు.

అల్లర్లలో వందల మంది గాయపడ్డారు. అనేక ఇళ్లు, దుకాణాలు తగులబడ్డాయి. వీటికి సంబంధించి పోలీసులు 758 కేసులు నమోదు చేసి, రెండు వేల మందికి పైగా అరెస్ట్ చేశారు.

అయిదేళ్లు గడిచేసరికి, వీటిలో చాలాకేసులు కోర్టుల్లో తేలిపోతున్నాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
న్యూదిల్లీ అల్లర్లు
ఫొటో క్యాప్షన్, షాదాబ్ ఆలమ్ తండ్రి దిల్షాద్ అలీ

ఈ 758 కేసుల పరిస్థితిని రెండు నెలలకు పైగా పరిశీలించింది బీబీసీ. 126 కేసుల్లో కోర్టు తీర్పులను విశ్లేషించింది.

కోర్టు తీర్పులు వెలువరించిన కేసుల్లో 80 శాతానికి పైగా కేసుల్లో నిందితులు నిర్దోషులుగా బయటకు వచ్చినట్లు పోలీస్ డాటా, బీబీసీ విశ్లేషణల ద్వారా తెలిసింది.

డజన్ల కొద్ది తీర్పుల్లో (ఆర్డర్లు) పోలీస్ ఇన్వెస్టిగేషన్‌ను కోర్టు తీవ్రంగా విమర్శించింది. చార్జిషీట్లను ఏదో 'నామమాత్రంగా', 'ముందుగా నిర్ణయించినట్లుగా', 'నిందితులను ఇరికించేలా' నమోదు చేశారని, కృత్రిమంగా స్టేట్‌మెంట్లను తయారుచేశారని, ఘటనను పూర్తిగా దర్యాప్తు చేయలేదని కోర్టు వ్యాఖ్యానించింది.

‘‘ఈ అల్లర్ల చరిత్రను తిరిగి చూసినప్పడు సరైన విచారణను చేపట్టడంలో ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీల వైఫల్యం, ప్రజాస్వామ్య పరిరక్షకులను బాధిస్తుందని అనకుండా ఉండలేకపోతున్నా.’’ అని రెండు తీర్పుల సందర్భంగా జడ్జి వ్యాఖ్యానించారు.

ఈశాన్య దిల్లీ వీధుల్లో అల్లర్లు చెలరేగిన 2020 ఫిబ్రవరి 24న తాను పనిచేసే ఒక మెడికల్ షాపు టెర్రస్‌పై ఉన్నానని షాదాబ్ ఆలమ్ అనే వ్యక్తి చెప్పారు.

అల్లర్లు కొనసాగుతున్నందున దుకాణాన్ని మూసేయాలని తనకు పోలీసులు చెప్పారని ఆయన వెల్లడించారు.

''సడెన్‌గా పోలీసులు వచ్చి మాలో కొంతమందిని వాళ్ల వ్యానులో తీసుకెళ్లారు'' అని షాదాబ్ చెప్పారు.

తనను ఎందుకు తీసుకెళ్తున్నారని పోలీసులను అడిగితే, అల్లర్లకు పాల్పడుతున్నందున నిన్ను తీసుకెళ్తున్నామని వారు చెప్పినట్లు షాదాబ్ వివరించారు.

న్యూదిల్లీ అల్లర్లు
ఫొటో క్యాప్షన్, పోలీసులు రెండు వీడియోల ఆధారంగా 2020 డిసెంబర్‌లో సందీప్ భటిని అరెస్ట్ చేశారు

ఈ కేసుకు సంబంధించి షాదాబ్‌తో పాటు మరో పది మందిపై పోలీసులు అభియోగాలు నమోదు చేశారు.

అయితే, ఈ కేసులో విచారణ మొదలు కావడానికి ముందే, పోలీసుల ఇన్వెస్టిగేషన్‌ను విమర్శిస్తూ కోర్టు వారందరినీ విడుదల చేసింది.

''సాక్షుల వాంగ్మూలాలు కృత్రిమంగా తయారు చేసినవి అయ్యుండొచ్చు. ఆ దుకాణాన్ని హిందూ గుంపు తగులబెట్టి ఉండొచ్చు. ఘటన జరిగినప్పుడు అక్కడే ఉన్నప్పటికీ పోలీసులు ఈ దిశగా అసలు దర్యాప్తు చేయలేదు.'' అని కోర్టు వ్యాఖ్యానించింది.

దీనిపై స్పందన కోసం బీబీసీ చేసిన ఈమెయిల్స్‌కు పోలీసుల నుంచి స్పందన రాలేదు. వ్యక్తిగతంగా మాట్లాడేందుకు కూడా బీబీసీ ప్రయత్నించింది.

గత ఏప్రిల్‌లో నమోదు చేసిన ఒక రిపోర్టులో, ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు అంతా చాలా న్యాయంగా, నిష్పాక్షికంగా, విశ్వసనీయంగా సాగిందని కోర్టుకు పోలీసులు వెల్లడించారు.

గుల్ఫిషా ఫాతిమా వయస్సు 33 ఏళ్లు. ఆమె పీహెచ్‌డీ విద్యార్ధిని. ఆమె దాదాపు అయిదేళ్లుగా ఎలాంటి విచారణ లేకుండా, బెయిల్ లేకుండా జైల్లోనే ఉంటున్నారు. ఈ కేసులో మరో 11 మంది కూడా జైల్లోనే ఉన్నారు.

''జైలుకు వెళ్లినప్పటి నుంచి, ప్రతీ విచారణ సందర్భంగా ఆమెకు బెయిల్ వస్తుందని మేం ఆశిస్తుంటాం'' అని బీబీసీతో గుల్ఫిషా తండ్రి సయ్యద్ తన్సీఫ్ హుస్సేన్ చెప్పారు.

కానీ, ఉగ్రవాద నిరోధక చట్టం, చట్ట విరుద్ధ కార్యకలాపాల (ప్రివెన్షన్) చట్టం కింద అభియోగాలు నమోదు కావడంతో బెయిల్ లభించడం కష్టమైంది.

''కొన్నిసార్లు నేను అసలు ఆమెను చూస్తానా? ఆమె విడుదల కాకముందే చనిపోతానా అనిపిస్తుంది.'' అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

సందీప్ భాటి
ఫొటో క్యాప్షన్, సందీప్ భాటికి దాదాపు నాలుగు నెలలు జైల్లో ఉన్న తర్వాత బెయిల్ లభించింది

జైలు నుంచి బయటకు రావడం

కోర్టు నిర్దోషులుగా ప్రకటించిన వారికి కూడా జైలు నుంచి బయటకు రావడం అంత సులభం కాలేదు. పోలీసులు తమను అదుపులోకి తీసుకున్న తర్వాత ఏం జరిగిందో షాదాబ్ వివరించారు.

''వారు మా పేర్లు అడిగారు. కొట్టారు. నాతో అరెస్ట్ అయిన వారంతా ముస్లింలే'' అని షాదాబ్ చెప్పారు.

తనకు అయిన మూడు గాయాలకు సంబంధించిన వైద్య నివేదికను కోర్టులో ఆయన సమర్పించారు.

ఆయన తండ్రి దిల్షాద్ అలీ, బయట నుంచి ఈ కేసుకు సంబంధించిన కోర్టు పనులన్నీ చూసుకున్నారు.

''కరోనా సమయంలో ఇదంతా జరిగింది. అప్పుడు లాక్‌డౌన్ అమల్లో ఉంది. మేం చాలా భయపడ్డాం'' అని ఆయన గుర్తు చేసుకున్నారు.

మొదట రెండుసార్లు ఆయనకు బెయిల్ రాలేదు. 80 రోజులు జైల్లో గడిపిన తర్వాత చివరకు బెయిల్ దొరికింది. ఇప్పుడు వారి కుటుంబం తాము అనుభవించిన కష్టానికి నష్టపరిహారాన్ని కోరుతోంది.

''ఏమీ రుజువు కాలేదు. అసలు మేం ఏం చేయలేదు. కానీ, చాలా డబ్బును, సమయాన్ని వృథా చేయాల్సి వచ్చింది'' అని దిల్షాద్ అన్నారు. తన కుమారుడిపై తప్పుడు కేసు పెట్టారు కాబట్టి పోలీసులపై కూడా చర్యలు తీసుకోవాలి’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

కోర్టులు పోలీసులను విమర్శించడం, నిర్దోషులుగా విడుదల చేయడం వంటివి హిందువులను నిందితులుగా చేర్చిన కేసుల్లో కూడా జరిగాయి. అల్లర్ల సమయంలో ఒక ముస్లిం వ్యక్తిని ఈడ్చుకెళ్లడం, కొట్టారనే ఆరోపణలు ఎదుర్కొన్న సందీప్ భాటి అనే వ్యక్తిని జనవరిలో కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది.

భాటిని దోషిగా చూపించే రెండు వీడియోలను పోలీసులు సమర్పించారు. తన క్లయింట్‌ను ఇరికించడానికి పోలీసులు అసంపూర్ణ క్లిప్‌ను సమర్పించారని కోర్టులో ఆయన తరఫు లాయర్లు వాదించారు.

పూర్తి వీడియోలో భాటి ఒక ముస్లిం వ్యక్తిని కొట్టడానికి బదులుగా అతన్ని కాపాడుతున్నట్లుగా కనిపిస్తుంది.

అసలైన దోషులను పట్టుకోవడానికి బదులుగా సందీప్ భాటిని ఈ కేసులో ఇరికించడానికి పోలీసులు వీడియోను మ్యానిప్యులేట్ చేశారని కోర్టు కూడా వ్యాఖ్యానించింది. ఈ కేసులో దర్యాప్తు అధికారిపై చర్యలు తీసుకోవాలని దిల్లీ పోలీస్ కమిషనర్‌ను కోర్టు ఆదేశించింది.

సందీప్ భాటిని బీబీసీ సంప్రదించినప్పుడు, నాలుగు నెలల పాటు తాను జైల్లో అనుభవించిన బాధను మళ్లీ గుర్తుచేసుకోలేనని ఆయన అన్నారు.

న్యూదిల్లీ అల్లర్లు
ఫొటో క్యాప్షన్, గుల్ఫిషా తండ్రి సయ్యద్ తన్సీఫ్ హుస్సేన్

డేటాను అర్థం చేసుకోవడం

దిల్లీ పోలీసులు 2024 ఏప్రిల్‌లో 758 కేసులకు సంబంధించిన స్టేటస్ రిపోర్టును సమర్పించారు. ఇప్పటివరకు వచ్చిన 111 తీర్పుల్లో, 80 శాతానికిపైగా కేసుల్లో నిందితులు నిర్దోషులుగా తేలారు లేదా విడుదలయ్యారు. 19 కేసుల్లో మాత్రమే దోషులను తేల్చారు.

భారత సమాచార హక్కు చట్టం కింద, బీబీసీ చేసిన విజ్ఞప్తికి స్పందనగా హత్యలకు సంబంధించిన 62 కేసుల వివరాలను పోలీసులు అందించారు. వీటిలో ఒక కేసులో మాత్రమే దోషులను తేల్చగా, మరో నాలుగు కేసుల్లో నిర్దోషులుగా గుర్తించారు.

బీబీసీ విశ్లేషించిన తీర్పుల్లో 2024 ఏప్రిల్ నుంచి 2025 జనవరి మధ్య 18 కేసుల్లో నిర్దోషులుగా, ఒక కేసులో దోషులను గుర్తించినట్లుగా తేలింది. దీంతో నిర్దోషులుగా ప్రకటించిన కేసులు 80 శాతంగా ఉన్నట్లు బీబీసీ గుర్తించింది.

చాలా కేసులు కోర్టుల్లో ఎందుకు తేలిపోతున్నాయో అర్థం చేసుకోవడానికి మేం 126 తీర్పులను పరిశీలించాం.

దీనికి రెండు కారణాలు గుర్తించాం. అందులో ఒకటి చాలా కేసుల్లో సాక్షులు మాట మార్చారు.

రెండోది, చాలా కేసుల్లో పోలీసులే సాక్ష్యం చెప్పారు. అనేక కారణాలతో కోర్టు, పోలీసుల సాక్ష్యాలను నమ్మలేదు.

గుల్ఫిషా తల్లి
ఫొటో క్యాప్షన్, గుల్ఫిషా తల్లి షాక్రా బేగమ్

వాంగ్మూలాలు సరిగా లేకపోవడం, నిందితుల గుర్తింపులో ఆలస్యం, అల్లర్లు జరిగిన చోట పోలీసులు ఉన్నారా? లేదా? అనే విషయంలో అనుమానాలు కూడా ఇందుకు దోహదపడ్డాయి.

కోర్టు చాలా కేసుల్లో పోలీసుల దర్యాప్తును విమర్శించింది. దాదాపు 80-90 కేసుల్లో దర్యాప్తు సరిగా జరగలేదని న్యాయవాది అబ్దుల్ గఫార్ అన్నారు. దిల్లీ అల్లర్ల నిందితుల తరఫున ఆయన వాదిస్తున్నారు.

మరో లాయర్ రక్ష్‌పాల్ సింగ్ మాట్లాడుతూ, పోలీసుల వద్ద తగినన్ని వనరులు లేవనే విషయాన్ని గమనించాలని అన్నారు. కోవిడ్-19 లాక్‌డౌన్ సమయంలో ఇన్ని కేసులను దర్యాప్తు చేయడం అంత సులభం కూడా కాదని వ్యాఖ్యానించారు.

చాలామంది నిర్దోషులుగా విడుదలవుతున్న నేపథ్యంలో, భారత సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మదన్ లోకూర్ మాట్లాడుతూ, "అరెస్టు చట్టవిరుద్ధం లేదా అనవసరం అని తేలితే ప్రాసిక్యూషన్‌కు కూడా జవాబుదారీతనం ఉండాలి" అని అన్నారు.

ప్రజలు సంవత్సరాలుగా జైళ్లలో గడుపుతున్నారని, కానీ వారిని జైలుకు పంపించిన వ్యక్తులపై ఎలాంటి చర్య తీసుకోలేదని వ్యాఖ్యానించారు.

దిల్లీలో మత హింస
ఫొటో క్యాప్షన్, గుల్ఫిషా ఫోటోలు, జైలు నుంచి ఆమె రాసిన ఉత్తరాలు

విచారణ కోసం ఎదురుచూపులు

దిల్లీ అల్లర్లకు సంబంధించిన కొన్ని కేసుల్లో తీర్పులు రాగా, మరికొన్ని కేసుల్లో మాత్రం ఇంకా విచారణ మొదలు కాలేదు.

2019లో తీసుకొచ్చిన వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నెల రోజుల పాటు భారీగా జరిగిన నిరసనల నేపథ్యంలో అల్లర్లకు కుట్ర పన్నారనే ఆరోపణలతో దిల్లీ పోలీసులు మొత్తం 20 మంది నిందితుల్లో 18 మందిని అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో కార్యకర్తలు, విద్యార్థులు, రాజకీయ నాయకులు ఉన్నారు.

ఈ 18 మందిలో ఆరుగురికి బెయిల్ వచ్చింది. ''కానీ, బెయిల్ ప్రక్రియ చాలా నెమ్మదిగా జరిగింది'' అని హుస్సేన్ అన్నారు.

గుల్ఫిషా బెయిల్ పిటిషన్‌పై నెలల తరబడి విచారణ జరిగిన తర్వాత దిల్లీ హైకోర్టు జడ్జి బదిలీ అయ్యారు. ఇప్పుడు మొత్తం కేసు మళ్లీ విచారణకు వస్తోంది.

కేసును కొనసాగించే ముందు తమ దర్యాప్తు పూర్తయిందో లేదో కోర్టుకు సమాచారం ఇవ్వాలని 2023 సెప్టెంబర్‌లో అయిదుగురు నిందితులు పోలీసులను కోరారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు అయిదు చార్జిషీట్లు నమోదు చేశారు. ఇందులో చివరి చార్జిషీటును ఘటన జరిగిన మూడేళ్ల తర్వాత ఫైల్ చేశారు.

ఈ కేసు విచారణలో తాము (నిందితులు) గుర్తించిన లోపాలను సరిదిద్దేందుకు పోలీసులు తదుపరి చార్జిషీట్లు దాఖలు చేస్తున్నారని నిందితులు వాదించారు.

దర్యాప్తు స్థితి గురించి పోలీసులు తెలియజేయాలా వద్దా అనే దానిపై దాదాపు ఒక సంవత్సరం పాటు వాదనలు కొనసాగాయి. గత సెప్టెంబర్‌లో కోర్టు ఉత్తర్వుల తర్వాత, తమ దర్యాప్తు పూర్తయిందని నిందితులకు తెలియజేశారు పోలీసులు.

ఈ కేసు గురించి గుల్ఫిషా కుటుంబానికి పెద్దగా తెలియదు కానీ, ఆమెకు బెయిల్ లభిస్తుందని వారు ఆశిస్తున్నారు.

పోలీసులు అభియోగాలు మోపడం పూర్తై, హియరింగ్ మొదలైనా కూడా, ఈ కేసులో 20 మంది నిందితులు ఉన్నందున విచారణ పూర్తి కావడానికి సంవత్సరాల సమయం పట్టవచ్చని న్యాయ నిపుణులు భావిస్తున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)