ఎమ్మెల్సీ ఎన్నికలు: పట్టభద్రులు, ఉపాధ్యాయులకే ప్రత్యేక నియోజకవర్గాలు ఎందుకు?

ఎమ్మెల్సీ ఎన్నికలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం
    • రచయిత, ప్రవీణ్ శుభం
    • హోదా, బీబీసీ కోసం

రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 6 స్థానాల్లో ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుంది.

ఏపీలో రెండు పట్టభద్రులు, ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి, తెలంగాణలో రెండు టీచర్ ఎమ్మెల్సీ, ఒక పట్టభద్రుల స్థానానికి ఈ ఎన్నికలు జరుగుతున్నాయి.

ఎమ్మెల్యే కోటాలో భాగంగా ఏపీ, తెలంగాణల్లో 10 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికకు తాజాగా మరో నోటిఫికేషన్ జారీ అయ్యింది.

శాసనసభతో పోలిస్తే శాసనమండలిలో సభ్యుల కూర్పు, ఎన్నికలు భిన్నంగా ఉంటాయి. కొన్ని వర్గాలకు ప్రత్యేక నియోజకవర్గాల ఏర్పాటు మండలిలో ఉంటుంది. పట్టభద్రులు, ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక నియోజక వర్గాలుండటం దీనికి ఉదాహరణ.

అయితే ఎందుకిలా? ఈ రెండు వర్గాలకే ప్రత్యేక స్థానాల ఏర్పాటు వెనుక రాజ్యాంగ రూపకర్తల ఉద్దేశం ఏమిటి? అంతేకాదు మండలి ఎన్నికల్లో అభ్యర్థుల ప్రచార ఖర్చులపై ఎలాంటి పరిమితి లేదు, ఇలా ఎందుకు.?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
శాసన మండలి

ఫొటో సోర్స్, legislature.telangana.gov.in/council

ఫొటో క్యాప్షన్, ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, బిహార్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో మాత్రమే శాసన మండళ్లున్నాయి.

శాసన మండలి

భారత రాజ్యాగంలోని ఆర్టికల్ 169 ఒక రాష్ట్రంలో శాసన మండలి ఏర్పాటు, రద్దు అంశాలను వివరిస్తోంది. శాసన మండలి ఉండాలా వద్దా అనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని అంశం.

1958లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మొదటిసారిగా శాసన మండలి ఏర్పాటైంది. అయితే, 1985లో ఎన్టీఆర్ ప్రభుత్వం దీన్ని రద్దు చేసింది. ఆ తర్వాత 2007లో వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో మండలి ఏర్పాటయింది.

ప్రస్తుతం దేశంలో కేవలం ఆరు రాష్ట్రాల్లో (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, బిహార్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్) మాత్రమే శాసన మండళ్లున్నాయి.

మొత్తం అసెంబ్లీ సభ్యుల్లో మూడో వంతు సంఖ్యతో శాసన మండలి ఏర్పాటవుతుంది. ఇది శాశ్వత సభ. సభ్యుల పదవీ కాలం ఆరేళ్లు. ప్రతి రెండేళ్లకు మొత్తం సభ్యుల్లో మూడోవంతు మంది పదవీ కాలం ముగుస్తుంది.

మొత్తం సంఖ్యలో.. మూడో వంతు సభ్యులను స్థానిక సంస్థల ప్రతినిధులు, మరో మూడో వంతు సభ్యులు ఎమ్మెల్యేల ద్వారా, ఆరోవంతు సభ్యులు గవర్నర్ ద్వారా నామినేట్ అవుతారు. పన్నెండో వంతు సభ్యులు పట్టభద్రులు, మరో పన్నెండు వంతు సభ్యులు ఉపాధ్యాయుల ద్వారా ఎన్నికవుతారు.

ఎందుకు ఈ విధానం తీసుకొచ్చారు?

స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో ఉన్న తక్కువ అక్షరాస్యత శాతం ఈ ప్రత్యేక స్థానాల ఏర్పాటు వెనుక ఒక కారణంగా భావిస్తారు.

''మేధావి వర్గంగా భావించే ఉపాధ్యాయులు, పట్టభద్రులు రాజకీయాలు, కుల మతాలతో సంబంధం లేకుండా శాసన మండలిలో చర్చలు, చట్టాల రూపకల్పనలో సరైన సూచనలు ఇస్తారన్న నమ్మకంతో చేసిన ఏర్పాటు ఇది. అప్పట్లో ఈ స్థానాల ఎన్నికల్లో రాజకీయాలు లేవు'' అని మాజీ టీచర్స్ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్ రెడ్డి బీబీసీతో అన్నారు.

1951 జనాభా లెక్కల ప్రకారం.. భారత అక్షరాస్యత 18.33 శాతం కాగా, 2011 జనాభా లెక్కల ప్రకారం అది 74.04 శాతంగా తేలింది. గతంతో పోలిస్తే ఎన్నికయ్యే సభ్యుల్లో గ్రాడ్యుయేట్ల సంఖ్య పెరిగిన నేపథ్యంలో ఈ ప్రత్యేక స్థానాల అవసరం ఎంతవరకనే చర్చ ఉంది.

ఎన్నికల కమిషన్

ఫొటో సోర్స్, Getty Images

రాజ్యంగ స్ఫూర్తి నెరవేరుతోందా?

పట్టభద్రుల స్థానాల్లో ఓటరు నమోదు సంఖ్య ఆశించిన స్థాయిలో ఉండటం లేదన్న వాదనలున్నాయి. ఉపాధ్యాయ, పట్టభద్రుల స్థానాల ఎన్నికల్లో రాజకీయాలు పెరిగాయన్న విశ్లేషణలున్నాయి.

‘‘అసెంబ్లీ ఎన్నికలకు మించిన రాజకీయం కనిపిస్తోంది. సమస్యలపై అవగాహన ఉన్న వారు కాకుండా కులం, డబ్బుకు ప్రాధాన్యత పెరుగుతోంది. అభ్యర్థుల ఖర్చుపై పరిమితి లేకపోవడంతో ఎంత ఖర్చు చేశారన్న లెక్కలు చూపించాల్సిన అవసరం లేకుండా పోయింది'' అని కరీంనగర్‌కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ ఒకరు బీబీసీతో అన్నారు.

లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల ఎన్నికల్లో అభ్యర్థుల ప్రచార ఖర్చులపై ఈసీ గరిష్ట పరిమితి విధించింది. అయితే అరుణాచల్ ప్రదేశ్, గోవా లాంటి చిన్న రాష్ట్రాలు, కొన్ని కేంద్రపాలిత ప్రాంతాలను మినహాయిస్తే దేశం మొత్తంమీద లోక్‌సభ ఎంపీ స్థానానికి గరిష్టంగా 95 లక్షలు, ఎమ్మెల్యే అభ్యర్థులకు 40 లక్షల పరిమితి ఉంది. అయితే, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చుపై ఎలాంటి పరిమితి లేదు.

ఖర్చుపై పరిమితి విధించే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర న్యాయ శాఖను భారత ఎన్నికల సంఘం గతంలోనే కోరింది.

సాధారణ ఎన్నికలతో పోలిస్తే గ్రాడ్యూయేట్స్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల తీరు వేరుగా ఉంటుందని ఉస్మానియా యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ (రిటైర్డ్) ఎస్. శ్రీనివాసులు బీబీసీతో అన్నారు.

''ఉద్యోగ వేటలో ఉండే పట్టభద్రులు స్థానికంగా ఉండకపోవడమే వారి ఓటరు నమోదు సంఖ్య తక్కువ ఉండటానికి ఒక కారణం. దేశాభివృద్ధిలో విద్యారంగం ప్రధానమైందని భావించి సామాజికచైతన్యం ఉన్న సమూహాలుగా వీరికి ప్రత్యేక ప్రాతినిధ్యం ఇచ్చారు. అయితే డబ్బు, పార్టీల ప్రాబల్యం పెరగడంతో వాటి అండ ఉన్నవారే ఈ స్థానాల నుంచి వస్తున్నారు. ఆ వర్గాలే పోటీలో లేనప్పుడు ఆ స్థానాలకు అర్థం లేకుండా పోతుంది'' అని శ్రీనివాసులు అన్నారు.

అయితే, విద్యార్ధులు, నిరుద్యోగులు, ఉద్యోగుల హక్కుల సాధనలో ఈ నియోజక వర్గాల ఎమ్మెల్సీల పాత్ర కీలకమని, వారి గొంతు వినిపించడానికి తాము కృషి చేస్తామని ఆంధ్రప్రదేశ్ నుంచి ఎమ్మెల్సీ‌గా పోటీ చేస్తున్న ఓ అభ్యర్ధి అన్నారు.

‘‘లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది పెద్దల సభ. అసెంబ్లీలు రూపొందించిన బిల్లులను ఎమ్మెల్సీలు క్షుణ్ణంగా పరిశీలించి అది ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా అన్నది చర్చించి ఆమోదమో, తిరస్కరణో చేస్తారు. ఎమ్మెల్సీలు ప్రజల సంక్షేమానికి అవసరమైన నిర్ణయాలు తీసుకోవడంలో కీలక పాత్ర పోషిస్తారు.’’ అని తెలంగాణకు చెందిన సీనియర్ గ్రాడ్యుయేట్ ఓటరు ఒకరు అభిప్రాయపడ్డారు.

ఎమ్మెల్సీ ఎన్నికలు

'ప్రత్యేక విమానాలు'

శాసన మండళ్లు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారుతున్నాయని, వాటి అవసరం లేదని హైదరాబాద్‌కు చెందిన ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్‌కు చెందిన పద్మనాభ రెడ్డి అన్నారు.

''ఈ స్థానాలకు ఎన్నికలు వచ్చిన ప్రతిసారి రిజిస్ట్రేషన్ చేయాల్సి రావడం అర్హతగల ఓటర్ల నమోదు సంఖ్య తగ్గడానికి కారణం అవుతోంది. ఈ ప్రక్రియ సులభతరం చేయాలి'' అని ఆయన అన్నారు.

"తమను ఎన్నుకున్న వర్గాల సమస్యలపై మండలిలో ప్రాతినిధ్యం వహించిందే లేదు. ఇదొక కలగూర గంప. అనవసర ఖర్చుగా మారింది. ప్రత్యేక స్థానాల ఎన్నికల్లోనూ విపరీతమైన రాజకీయ జోక్యం కనిపిస్తోంది. గెలుపును ప్రెస్టీజ్‌గా భావిస్తున్నారు. ప్రత్యేక విమానాల్లో ముఖ్యమంత్రి వచ్చి ప్రచారం చేస్తున్నారు. గతంలో అయితే గెలిపించండని రొటీన్‌గా అప్పీల్ మాత్రమే చేసేవారు'' అని పద్మనాభ రెడ్డి అన్నారు.

అయితే, కొందరు ఈ అభిప్రాయంతో విభేదిస్తున్నారు.

‘‘రాజకీయ పార్టీల్లో సద్విమర్శ ,ఆత్మ విమర్శల కోసం మేధావుల ప్రాతినిధ్యం ఉండే మండలి ఉండాలి. దీన్ని రద్దు చేయాలనడంలో అర్థం లేదు. అలాచేస్తె లాభం మాత్రం ఉండదు" - రిటైర్డ్ ప్రొఫెసర్ ఎస్. శ్రీనివాసులు అభిప్రాయపడ్డారు.

"మండలి ఉండాలని నేను వ్యక్తిగతంగా కోరుకుంటున్నా. పోలింగ్ పర్సంటేజ్ తక్కువ ఉంటుందనడం సరికాదు. అసెంబ్లీ ఎన్నికల్లో 40 శాతం పోలింగ్ అయిన నియోజకవర్గాలు కూడా చూశాం. అయితే గత స్పిరిట్ మాత్రం లోపించింది. గొంగళి మీద కూర్చుని తింటూ వెంట్రుకలు వస్తున్నాయంటే ఎలా? " అని ఏపీ మాజీ ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణ రాజు బీబీసీతో అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)